Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఇటానగర్‌లో తొలి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ‘డోనీ పోలో’ ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధానమంత్రి

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఇటానగర్‌లో తొలి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ‘డోనీ పోలో’ ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధానమంత్రి


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో ‘డోనీ పోలో’ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతోపాటు 600 మెగావాట్ల ‘కమెంగ్‌’ జలవిద్యుత్‌ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రే శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రపంచ మహమ్మారి తీవ్రరూపం దాల్చి సవాళ్లు విసిరినా విమానాశ్రయ నిర్మాణం అత్యంత వేగంగా పూర్తయింది. ప్రారంభోత్సవం నేపథ్యంలో కార్యక్రమానికి హాజరైన ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ- అరుణాచల్‌ ప్రదేశ్‌ను తాను తరచూ సందర్శించడాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే ఇవాళ ఘనంగా నిర్వహించబడిన కార్యక్రమంతో రాష్ట్ర ప్రగతిపై అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రజల చిత్తశుద్ధిని ఆయన ప్రశంసించారు.

   రుణాచల్‌ ప్రజానీకం ఉల్లాస ప్రియులైనా ఎంతో క్రమశిక్షణ కలిగినవారని కొనియాడారు. ఒక ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేశాక దాన్ని తానే జాతికి అంకితం చేసే సంప్రదాయా ప్రస్తావిస్తూ- దేశంలో మారిన పనిసంస్కృతికి ఇది నిదర్శనమని ప్రధాని  పేర్కొన్నారు. డోనీ పోలో విమానాశ్రయానికి శంకుస్థాపనను ఎన్నికల ఎత్తుగడగా ఆరోపించ యత్నించిన విమర్శకులకు ఇవాళ దీని ప్రారంభోత్సవమే దీటైన జవాబని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రగతిని రాజకీయ ప్రయోజనాల కోణంలో కాకుండా కొత్త ఆలోచనల టోపీ ధరించి చూడాలని రాజకీయ ప్రత్యర్థులకు ప్రధాని సూచించారు. రాష్ట్రంలో సమీప భవిష్యత్తులో ఎన్నికలేవీ లేకపోవడమే తన వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. “ఉషోదయ రాష్ట్రం నుంచి ప్రారంభించిన ఈ రోజును దేశంలో సంధ్యాసమయ ప్రాంతమైన డామన్‌లో ముగిస్తాను… మధ్యలో కాశీని కూడా సందర్శిస్తాను” అని ఆయన వ్యాఖ్యానించారు.

   స్వాతంత్ర్యానంతరం ఈశాన్య ప్రాంతం ఉదాసీనత-నిర్లక్ష్యానికి గురైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలకు ప్రాధాన్యంతో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వమేనని ప్రధాని అన్నారు. ఆ తర్వాత ప్రగతి మందగించినా 2014 అనంతరం ముందంజలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పారు. “ఇంతకుముందు మారుమూల సరిహద్దు ప్రాంతాలను దేశానికి చివరి గ్రామాలుగా పరిగణించేవారు. కానీ, వాటిని దేశానికి తొలి గ్రామాలుగా భావిస్తూ మా ప్రభుత్వం అభివృద్ధికి కృషి చేసింది. ఆ విధంగా ఈశాన్య ప్రాంతం అభివృద్ధి ప్రభుత్వానికి ప్రాథ్యమంగా మారింది” అని ప్రధాని పేర్కొన్నారు. ఆ మేరకు “పర్యాటకం లేదా వాణిజ్యం.. టెలికాం లేదా జౌళి ఏదైనప్పటికీ ఈశాన్య ప్రాంతానికి ప్రాధాన్యం దక్కుతుంది” అని వివరించారు. అదేవిధంగా “డ్రోన్‌ సాంకేతిక కావచ్చు… విమానాల్లో వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కావచ్చు… విమానాశ్రయం లేదా రేవుల అనుసంధానం కావచ్చు.. ఈశాన్యంలో అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది” అని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మేరకు ఈ ప్రాంతంలో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ- దేశంలోనే అతి పొడవైన వారధి, అతి పొడవైన రైలు వంతెన, రైలుమార్గాల అనుసంధానం, రికార్డు స్థాయిలో జాతీయ రహదారుల నిర్మాణం తదితరాలను ఆయన ఉదాహరించారు. “ఇది అంచనాలు.. ఆకాంక్షల కొత్త శకం.. నేటి కార్యక్రమం భారతదేశపు సరికొత్త విధానాలకు నిజమైన నిదర్శనం” అని ప్రధాని వ్యాఖ్యానించారు.

   డోనీ పోలో ఎయిర్‌పోర్ట్ అరుణాచల్ ప్రదేశ్‌కి కార్యకలాపాలు సాగుతున్న నాలుగో విమానాశ్రయం అవుతుందని ప్రధాని చెప్పారు. దీంతో ఈశాన్య ప్రాంతంలో మొత్తం విమానాశ్రయాల సంఖ్య 16కు చేరిందని గుర్తుచేశారు. ఈశాన్య ప్రాంతంలో 1947 నుంచి 2014 వరకూ కేవలం 9 విమానాశ్రయాలు మాత్రమే నిర్మించగా ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే 7 కొత్త విమానాశ్రయాలు వచ్చాయని వివరించారు. ఫలితంగా ఈశాన్య భారతాన్ని ఇతర ప్రాంతాలతో కలిపే విమానాల సంఖ్య రెట్టింపు అయిందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో విమానాశ్రయాల నిర్మాణ వేగమే ఈశాన్యంలో అనుసంధానం పెంపుపై ప్రధానమంత్రి ప్రత్యేక దూరదృష్టిని స్పష్టం చేస్తోంది. “అరుణాచల్ ప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి డోనీ పోలో విమానాశ్రయం సాక్షిగా మారుతుంది” అని శ్రీ మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ విమానాశ్రయ పేరులో- ‘డోనీ’ అంటే సూర్యుడు.. ‘పోలో’ అంటే చంద్రుడని ఆయన వివ‌రించారు. రాష్ట్రాభివృద్ధికి సూర్యచంద్రుల ప్రకాశంతోగల సారూప్యాన్ని చూపుతూ పేద‌ల అభివృద్ధి ఎంత ముఖ్య‌మో విమానాశ్రయ అభివృద్ధి కూడా అంతే ముఖ్య‌మ‌ని ప్రధాని అన్నారు.

   రుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో మౌలిక స‌దుపాయాల అభివృద్ధిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- దుర్గమ, మారుమూల ప్రాంతాల‌లో హైవే నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఉదాహ‌రించారు. కేంద్ర ప్ర‌భుత్వం త్వరలోనే మ‌రో రూ.50,000 కోట్ల మేర ఇందుకోసం ఖర్చు చేయనుందని ప్రకటించారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌కృతి అందాల‌ను ప్రస్తుతిస్తూ- ఈ రాష్ట్ర ప‌ర్యాట‌క రంగం ప్రగతికి అపార అవ‌కాశాలున్నాయ‌ని ప్రధాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సరైన అనుసంధానం అవసరమని ఆయన నొక్కిచెప్పారు. తదనుగుణంగా అరుణాచల్‌లోని 85 శాతం గ్రామాలు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనతో అనుసంధానించబడ్డాయని గుర్తుచేశారు. కొత్త విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సరుకు రవాణా సేవల రంగంలో అపార అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాని తెలిపారు. తద్వారా రాష్ట్ర రైతులు ఇకపై తమ ఉత్పత్తులను భారీ మార్కెట్లలో విక్రయించుకునే వెసులుబాటు లభిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి కిసాన్ నిధి ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారని ఆయన తెలిపారు.

   రుణాచల్ ప్రదేశ్ ప్రజలు వెదురు సాగు చేయడంపై నిషేధం విధించిన వలసపాలన నాటి చట్టం గురించి ప్రధాని గుర్తుచేశారు. అయితే, కాలంచెల్లిన ఆ చట్టాన్ని రద్దుకు ప్రభుత్వం చొరవ చూపిందని తెలిపారు. ఈ రాష్ట్ర జీవనశైలిలో వెదురు ఒక భాగమని, దీని పెంపకంతో ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనంతోపాటు దేశవ్యాప్తంగా రవాణా, విదేశాలకు ఎగుమతులకు అవకాశం కలుగుతుందన్నారు. “ఇకపై మీరు ఇతర పంటల తరహాలోనే వెదురు సాగు చేయవచ్చు… కోత, విక్రయాలు కూడా స్వేచ్ఛగా చేసుకోవచ్చు” అని ఆయన చెప్పారు. అలాగే “పేదలు సగౌరవంగా జీవించేలా చూడటమే ప్రభుత్వ ప్రాథమ్యం” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పర్వత ప్రాంతాల ప్రజలకు విద్య, వైద్య సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వాల మొక్కుబడి చర్యలపై విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద రూ.5 లక్షల వరకూ పేదలకు ఆరోగ్య బీమా రక్షణ కల్పిస్తోందని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు, అరుణాచల్ అంకుర సంస్థల విధానం తదితరాలను ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. అందరికీ విద్యుత్తునందించే సౌభాగ్య యోజన గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ- 2014లో ప్రారంభమైన ఈ పథకంతో అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక గ్రామాలకు స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి విద్యుత్తు వెలుగులు వికసించాయని ప్రధానమంత్రి తెలిపారు.

   “రాష్ట్రంలో ప్రతి ఇంటికీ, ప్రతి గ్రామానికీ ప్రగతి ఫలాలను చేర్చేందుకు మేము ఉద్యమ స్థాయిలో కృషి చేస్తున్నాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. అలాగే ఉజ్వల సరిహద్దు గ్రామాల కార్యక్రమం కింద దేశ సరిహద్దుల్లోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. దీంతో పర్యాటకానికి ప్రోత్సాహం లభించడంతోపాటు ఆయా ప్రాంతాల నుంచి వలసలు తగ్గుతాయని పేర్కొన్నారు. దేశంలోని యువతను ఎన్‌సీసీతో అనుసంధానించే దిశగా రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని, రక్షణ రంగంలో యువతకు శిక్షణ ద్వారా వారిలో దేశసేవ భావన పెంపొందుతుందని తెలిపారు. చివరగా “ఈ రాష్ట్రంలోని రెండు ఇంజన్ల ప్రభుత్వం ‘సబ్ కా ప్రయాస్‌’ సూత్రం తోడుగా అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడింది” అని ప్రధానమంత్రి ప్రకటించారు.

   ఈ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌ శ్రీ బి.డి.మిశ్రా, ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ,  కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం – డోనీ పోలో విమానాశ్రయం, ఇటానగర్‌

   శాన్య ప్రాంతంలో అనుసంధానం పెంచే కీలక చర్యల్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో తొలి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం- ‘డోనీ పోలో’ ఎయిర్‌పోర్టును ప్రధాని ప్రారంభించారు. ఈ పేరు అరుణాచల్ ప్రదేశ్ సంప్రదాయాలను, సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా సూర్యుడు (‘డోనీ’), చంద్రుడు (‘పోలో’) పట్ల రాష్ట్ర ప్రజల ప్రాచీన దేశీయ ఆరాధన భావాన్ని ప్రతిబింబిస్తుంది. మొత్తం 690 ఎకరాల్లో విస్తరించిన ఈ విమానాశ్రయం రూ.640 కోట్లతో అభివృద్ధి చేయబడింది. ఇక్కడి 2300 మీటర్ల రన్‌వేపై ఎలాంటి వాతావరణ స్థితిలోనైనా విమాన రాకపోకలకు వీలుంటుంది. విమానాశ్రయ టెర్మినల్ ఒక ఆధునిక భవనం కాగా, ఇది ఇంధన పొదుపుతోపాటు ​​పునరుత్పాదక ఇంధనం, వనరుల పునరుపయోగం వగైరాలకు అనువైనదిగా ఉంటుంది. ఇటానగర్‌లో కొత్త విమానాశ్రయం వల్ల ఈ ప్రాంతంలో అనుసంధానం మెరుగుపడటమేగాక వాణిజ్య, పర్యాటక రంగాల వృద్ధికి ప్రేరణతోపాటు ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి చేయూత లభిస్తుంది. ఐదు ఈశాన్య రాష్ట్రాలు మిజోరం, మేఘాలయ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లోని విమానాశ్రయాలు తమ నేలనుంచి గడచిన 75 ఏళ్లలో తొలిసారిగా విమానాలు ఆకాశంలోకి దూసుకెళ్లే దృశ్యాన్ని చూశాయి. మొత్తంమీద ఈశాన్య ప్రాంతంలో విమానాల రాకపోకలు 2014 నుంచి 113 శాతం పెరిగాయి. ఈ మేరకు 2014లో వారానికి 852 నుంచి 2022లో వారానికి 1817 స్థాయికి చేరాయి.

600 మెగావాట్ల జలవిద్యుత్‌ కేంద్రం

   రుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లాలో 80 కిలోమీటర్లకుపైగా విస్తీర్ణంగల ఈ జలవిద్యుత్‌ కేంద్రం రూ.8450 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించబడింది. దీంతో అరుణచాల్‌ విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా రూపొందడమేగాక జాతీయ గ్రిడ్‌ స్థిరత్వం, ఏకీకరణకు దోహదం చేస్తుంది. హరిత ఇంధన వినియోగం దిశగా దేశం నిబద్ధతను చాటుకునే ప్రధాన చోదకంగా ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది.

*****

DS/TS