ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు బిలాస్ పూర్ ఎయిమ్స్‌ను సందర్శించారు.
ప్రధానమంత్రి ఎయిమ్స్ ఆస్పత్రిలోని సి- బ్లాక్‌కు విచ్చేశారు. అక్కడ వారు ఎయిమ్స్ బిలాస్‌పూర్ కు సంబంధించిన 3డి నమూనాను తిలకించి, అక్కడి నుంచి ఎయిమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిబ్బన్ కత్తిరించి సంస్థను ప్రారంభించారు. ప్రధానమంత్రి సిటిస్కాన్ సెంటర్, ఎమర్జెన్సీ, ట్రామా ఏరియాల మీదుగా వెళ్లి ఆస్పత్రిని చూశారు.
ఎయిమ్స్ బిలాస్ పూర్‌ను జాతికి అంకితం చేయడం ద్వారా దేశంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో ప్రధానమంత్రి దార్శనికత ప్రదర్శితమైంది. బిలాస్‌పూర్ ఎయిమ్స్‌కు శంకుస్థాపన కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నే 2017 అక్టోబర్‌లో చేశారు. ప్రధానమంత్రి స్వాస్త్య సురక్ష యోజన కేంద్ర ప్రభుత్వ పథకం కింద దీనిని చేపట్టారు.
బిలాస్‌పూర్ ఎయిమ్స్‌ను 1470 కోట్లరూపాయలకు పైగా వ్యయంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆస్పత్రిగా నిర్మించారు. ఇందులో 18 ప్రత్యేక, 17 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 18 మాడ్యులార్ ఆపరేషన్ థియేటర్లు, 750 పడకలు, 64 ఐసియు బెడ్లు ఉన్నాయి. ఇది 247 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయింది. ఈ ఆస్పత్రిలో 24 గంటల అత్యవసర సేవలు, డయాలసిస్ సదుపాయాలు, ఆధునిక డయాగ్నస్టిక్ యంత్రాలైన అల్ట్రా సోనోగ్రఫి, సిటిస్కాన్, ఎంఆర్ ఐ వంటి వి ఉన్నాయి. అమృత్ ఫార్మసీ, జన్ ఔషధి కేంద్రాలనూ ఏర్పాటు చేశారు. 30 పడకల ఆయుష్ బ్లాక్ ను కూడా ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో, సుదూర గిరిజన ప్రాంతాలకు ఆరోగ్య సేవలు అందించేందుకు సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ ను కూడా ఏర్పాటు చేశారు. వైద్య సదుపాయాలు అందుబాటులో లేని కాజా, సలూని, కీలాంగ్ వంటి గిరిజన ప్రాంతాలలో ప్రత్యేక ఆరోగ్య సేవలు అందిచేందుకు హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ ఆస్పత్రి ప్రతి ఏటా వంద మంది ఎంబిబిఎస్ విద్యార్ధులను, 60 మంది నర్సింగ్ విద్యార్ధులను చేర్చుకుంటుంది.
ప్రధానమంత్రి వెంట హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జైరామ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, పలువురు పార్లమెంటు సభ్యులు, బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***