ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో అక్టోబరు 5వ తేదీ నాడు హిమాచల్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. అక్కడ 3,650 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన ప్రాజెక్టుల లో కొన్నిటి ని ఆయన ప్రారంభించి, మరికొన్నిటి కి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం పూట ఇంచుమించు 11:30 గంటల వేళ లో ఎఐఐఎమ్ఎస్ బిలాస్ పుర్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. తదనంతరం, మధ్యాహ్నం సుమారు 12 గంటల 45 నిమిషాల వేళ లో బిలాస్ పుర్ లో లును గ్రౌండు కు చేరుకొని అనేక అభివృద్ధి పథకాల ను ప్రారంభించడం తో పాటు మరికొన్నిటి కి శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఒక జనసభ ను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు కూడాను. మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటల 15 నిమిషాల వేళ లో ప్రధాన మంత్రి కుల్లూ లోని ఢాల్ పుర్ గ్రౌండు కు చేరుకొని అక్కడ జరిగే కుల్లూ దసరా వేడుకల లో పాల్గొంటారు.
ఎఐఐఎమ్ఎస్ బిలాస్ పుర్
ఎఐఐఎమ్ఎస్ బిలాస్ పుర్ ప్రారంభ కార్యక్రమం దేశవ్యాప్తం గా ఆరోగ్య సేవల ను పటిష్టపరచాలనే ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణాన్ని మరియు వచనబద్ధత ను మరో సారి కళ్ల కు కట్టనుంది. ప్రధాన మంత్రి 2017వ సంవత్సరం అక్టోబరు లో శంకుస్థాపన చేసిన ఈ ఆసుపత్రి ని ‘ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన’ లో భాగం గా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.
ఎఐఐఎమ్ఎస్ బిలాస్ పుర్ నిర్మాణాని కి 1470 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు అయింది. ఈ అత్యాధునిక ఆసుపత్రి లో 18 స్పెశాలిటీ విభాగాలు, 17 సూపర్ స్పెశాలిటీ విభాగాలు, 18 శస్త్ర చికిత్స సదుపాయాలు, 64 ఐసియు పడకల తో సహా 750 పడక లు ఉన్నాయి. 247 ఎకరాల కు మించిన స్థలం లో నెలకొల్పిన ఈ ఆసుపత్రి లో అత్యవసర స్థితి లో ఉపయోగించవలసిన సదుపాయాలు మరియు డాయెలిసిస్ సదుపాయాలు, అల్ట్రసనోగ్రపి, సిటి స్కాన్, ఎమ్ఆర్ఐ వగైరా అధునాతన రోగ నిర్ధారణ యంత్రాలు, అమృత్ ఫార్మసీ ఎండ్ జన్ ఔషధీ కేంద్ర తో పాటు గా 30 పడకల తో కూడిన ఆయుష్ బ్లాక్ కూడా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని ఆదివాసీ ప్రాంతాల లోను, చేరుకోవడం కష్టమైన మారుమూల ప్రాంతాల లోను ఆరోగ్య సేవల ను అందించడానికి తోడ్పడే సెంటర్ ఫార్ డిజిటల్ హెల్థ్ ను కూడా ఈ ఆసుపత్రి కలిగివుంది. అంతేకాక కాజా, సలూణీ మరియు కేలాంగ్ ల వంటి ఉన్నత హిమాలయ ప్రాంతాలు మరియు దుర్గమమైన ఆదివాసీ ప్రాంతాల లో ఆరోగ్య శిబిరాల ను నిర్వహించడం ద్వారా ఈ ఆసుపత్రి స్పెశలిస్ట్ హెల్థ్ సర్వీసెజ్ ను అందజేయనుంది. ఈ ఆసుపత్రి లో ఎంబిబిఎస్ కోర్సు కోసం ఏటా వంద మంది విద్యార్థుల ను, నర్సింగ్ కోర్సుల కోసం ఏటా 60 మంది విద్యార్థుల ను చేర్చుకోవడం జరుగుతుంది.
అభివృద్ధి పథకాలు
ఎన్ హెచ్ -105 లో పింజోర్ నుండి నాలాగఢ్ వరకు దాదాపు గా 31 కిలో మీటర్ ల జాతీయ రహదారి ని నాలుగు దోవ లు కలిగింది గా తీర్చిదిద్దే ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు విలువ 1690 కోట్ల రూపాయల కు పైబడి ఉంటుంది. ఈ ప్రాజెక్టు రోడ్డు అంబాలా, చండీగఢ్, పంచ్ కుల, సోలన్/శిమ్ లా ల నుండి సాగిపోయే వాహనాలు బిలాస్ పుర్ కు, మండీ కి మరియు మనాలీ కి సాగిపోయేందుకు ఒక ప్రధానమైన లంకె గా ఉంటుంది. ఈ నాలుగు దోవల జాతీయ రహదారి లో దాదాపు గా 18 కి. మీ. భాగం హిమాచల్ ప్రదేశ్ లోను, మిగిలిన భాగం హరియాణా లోను ఉంటుంది. ఈ హైవే హిమాచల్ ప్రదేశ్ లో పారిశ్రామిక కేంద్రం అయినటువంటి నాలాగఢ్-బద్దీ లో ఉత్తమమైన రవాణా సౌకర్యాల కు పూచీపడటం తో పాటు గా ఆ ప్రాంతం లో పారిశ్రామికాభివృద్ధి కి ఒక ఉత్తేజాన్ని కూడా అందించనుంది. ఇది రాష్ట్రం లో పర్యటన రంగాని కి కూడా దన్నుగా ఉంటుంది.
నాలాగఢ్ లో మెడికల్ డివైస్ పార్కు కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 350 కోట్ల రూపాయల ఖర్చు తో ఈ పార్కు ను నిర్మించడం జరుగుతుంది. ఈ మెడికల్ డివైస్ పార్కు లో పరిశ్రమల ను ఏర్పాటు చేయడం కోసం 800 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అవగాహనపూర్వక ఒప్పంద పత్రాల (ఎంఒయు) పై ఇప్పటికే సంతకాలు జరిగాయి. ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతం లో ఉపాధి అవకాశాల ను చెప్పుకోదగ్గ స్థాయి లో పెంపొందింపచేయనుంది.
బాండ్ లా లో గవర్నమెంట్ హైడ్రో ఇంజినీరింగ్ కాలేజీ ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కళాశాల నిర్మాణాని కి 140 కోట్ల రూపాయల ఖర్చు అయింది; జల విద్యుత్తు పథకాల కు శిక్షణ ను పొందినటువంటి శ్రమ శక్తి ని అందుబాటు లోకి తీసుకు రావడం లో ఈ కళాశాల దోహదం చేయనుంది. హిమాచల్ ప్రదేశ్ హైడ్రో పావర్ ప్రాజెక్టుల లో అగ్రగామి రాష్ట్రాల లో ఒక రాష్ట్రం గా ఉంది. ఈ కళాశాల యువత కు నైపుణ్యాల కు మెరుగు లు దిద్దుకోవడం లోను, జలవిద్యుత్తు రంగం లో కావలసినంత ఉద్యోగ అవకాశాల కల్పన కు సాయపడనుంది.
కుల్లూ దసరా
అంతర్జాతీయ కుల్లూ దసరా ఉత్సవాన్ని 2022 అక్టోబరు 5వ తేదీ మొదలుకొని 11వ తేదీ వరకు కుల్లూ లోని ధాల్ పుర్ గ్రౌండ్ లో నిర్వహించడం జరుగుతుంది. లోయ లోని 300 కు పైగా దేవత లు ఒక చోటు కు రావడం ఈ ఉత్సవం విశిష్టత. ఉత్సవం లో ఒకటో రోజు న, చక్కగా అలంకరించిన పల్లకీల లో బయలుదేరే దేవత లు ముఖ్య దైవం అయిన భగవాన్ రఘునాథ్ జీ ఆలయం లో వాటి వందనాన్ని ఆచరించి, అటు తరువాత ధాల్ పుర్ గ్రౌండు కు ఊరేగింపు గా బయలుదేరి వెళ్తాయి. దివ్యమైన రథయాత్ర ను మరి అలాగే చరిత్రాత్మకమైనటువంటి కుల్లూ దసరా ఉత్సవాల లో దేవతల మహా కూటమి ని ప్రధాన మంత్రి వీక్షించనున్నారు. దేశ ప్రధాన మంత్రి కుల్లూ దసరా ఉత్సవాల లో పాలుపంచుకోవడం ఇదే తొలిసారి కానున్నది.
***