Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మధ్యప్రదేశ్‌ లోని కరాహల్‌ లో మహిళా స్వయం సహాయక బృందాల సదస్సులో ప్రసంగించిన – ప్రధానమంత్రి

మధ్యప్రదేశ్‌ లోని కరాహల్‌ లో మహిళా స్వయం సహాయక బృందాల సదస్సులో ప్రసంగించిన – ప్రధానమంత్రి


మధ్యప్రదేశ్‌ లోని షియోపూర్‌ లోని కరాహల్‌ లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక బృందాల సమ్మేళనంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ప్రత్యేకించి దుర్బల గిరిజన సమూహాలకు చెందిన (పి.వి.టి.జి) నాలుగు నైపుణ్య కేంద్రాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.  స్వయం సహాయక బృంద సభ్యులకు బ్యాంకు రుణాల మంజూరు లేఖలను ప్రధానమంత్రి అందజేశారు, జల్-జీవన్-మిషన్ కింద కిట్‌ లను కూడా ఆయన అందజేశారు.  స్వయం సహాయక బృంద సభ్యులుగా ఉన్న సుమారు లక్ష మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, వివిధ కేంద్రాల నుండి సుమారు 43 లక్షల మంది మహిళలు కూడా ఈ కార్యక్రమంతో అనుసంధానమయ్యారు. 

సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, స‌మ‌యం దొరికితే త‌న పుట్టిన రోజున త‌ల్లి నుండి ఆశీస్సులు తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌నీ, అయితే, ఈరోజు అమ్మను కలిసేందుకు వెళ్లలేకపోయినా, లక్షలాది మంది గిరిజన తల్లుల ఆశీస్సులు తనకు లభిస్తున్నందుకు అమ్మ సంతోషిస్తోందనీ, పేర్కొన్నారు.  “భారతదేశపు కుమార్తెలు, తల్లులు నా ‘రక్షా కవాచ్’ (రక్షణ కవచం)’” అని ఆయన అన్నారు.  విశ్వకర్మ జయంతి సందర్భంగా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఇంత పెద్ద సదస్సు నిర్వహించడం చాలా ప్రత్యేకమని ప్రధానమంత్రి పేర్కొంటూ, విశ్వకర్మ పూజా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 

డెబ్బై ఐదేళ్ల త‌ర్వాత చిరుత‌లు భార‌తదేశానికి తిరిగి వ‌చ్చినందుకు ప్ర‌ధానమంత్రి ఎంతో సంబ‌రం, సంతోషం వ్య‌క్తం చేశారు.  “ఇక్కడికి వచ్చే ముందు, కునో జాతీయ పార్కులో చిరుతలను విడుదల చేసే అవకాశం నాకు లభించింది” అని ఆయన గుర్తు చేసుకున్నారు.  గౌరవనీయ అతిథులైన చిరుతల కోసం నిలబడి చప్పట్లు కొట్టవలసిందిగా, అక్కడ హాజరైన ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి అభ్యర్ధించగా, అందరూ ఆ విధంగా చేశారు.   అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ,  “మీపై నమ్మకం ఉంది కాబట్టి చిరుతలను మీ సంరక్షణ లో ఉంచడం జరిగింది.  మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, చిరుతలకు ఎటువంటి హాని జరగనివ్వరని, నాకు నమ్మకం ఉంది. అందుకే, ఈ ఎనిమిది చిరుతల బాధ్యతను మీకు అప్పగించడానికి ఈరోజు వచ్చాను.”, అని చెప్పారు.  స్వయం సహాయక బృందాలు ఈరోజు 10 లక్షల మొక్కలు నాటిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ఇది భారత దేశ పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు కొత్త శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. 

భారతదేశంలో పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం గురించి, ప్రధానమంత్రి ప్రత్యేకంగా పేర్కొంటూ,  గత శతాబ్దపు భారతదేశానికి, ఈ శతాబ్దపు నూతన భారతదేశానికి మధ్య మహిళా శక్తి ఒక భిన్నమైన అంశంగా మారిందని అన్నారు.  “నేటి నూతన భారతదేశంలో, మహిళా శక్తి  పతాకం పంచాయతీ భవనం నుంచి రాష్ట్రపతి భవననం వరకు ఎగురుతోంది” అని శ్రీ మోదీ అభివర్ణించారు.   ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 17 వేల మంది మహిళలు పంచాయతీలకు ఎన్నికయ్యారని ఆయన పేర్కొన్నారు.  ఇది ఒక పెద్ద మార్పుకు సంకేతమని ఆయన అన్నారు.

స్వాతంత్య్ర పోరాటంలో, దేశ భద్రతలో మహిళల సహకారాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు.  ఇటీవలి హర్-ఘర్-తిరంగా ప్రచారంలో మహిళలు, ఎస్.హెచ్.జి. ల పాత్రను, అదేవిధంగా, కరోనా సమయంలో వారి ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.  కాలక్రమేణా, ‘స్వయం సహాయక బృందాలు’ ‘దేశ సహాయక బృందాలు’ గా మారతాయని, ఆయన పేర్కొన్నారు.   ఏ రంగం విజయం అయినా మహిళా ప్రాతినిధ్యం పెరుగుదలతో నేరుగా ముడిపడి ఉంటుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  మహిళల నేతృత్వంలోని స్వచ్ఛ-భారత్-అభియాన్ విజయవంతం కావడమే ఈ నమూనాకు చక్కటి ఉదాహరణ.  అదేవిధంగా, భారతదేశంలో గత మూడేళ్లలో 7 కోట్ల కుటుంబాలు పైపుల ద్వారా నీటి కనెక్షన్లు పొందాయి, వాటిలో 40 లక్షల కుటుంబాలు మధ్యప్రదేశ్‌ కు చెందినవి ఉన్నాయి.   ఈ విజ‌యం సాధించినందుకు భారతీయ మహిళలకు ప్ర‌ధానమంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  

గ‌త 8 సంవ‌త్స‌రాల‌లో స్వ‌యం స‌హాయ‌క బృందాల‌కు సాధికార‌త క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంద‌ని ప్ర‌ధానమంత్రి పేర్కొన్నారు.   “ఈ రోజు దేశవ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా సోదరీమణులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.  ప్రతి గ్రామీణ కుటుంబం నుండి కనీసం ఒక సోదరి అయినా ఈ ప్రచారంలో పాల్గొనాలన్నదే మా లక్ష్యం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’ కార్యక్రమం గురించి ప్రధానమంత్రి వివరిస్తూ, ఇది, ప్రతి జిల్లా నుండి స్థానిక ఉత్పత్తులను పెద్ద మార్కెట్లకు తీసుకెళ్లే ప్రయత్నమని తెలియజేశారు.   గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని శ్రీ మోదీ చెప్పారు.  స్వయం సహాయక బృందాలు తమ ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మార్కెట్లలో 500 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను విక్రయించాయని ఆయన తెలియజేశారు.  ప్రధానమంత్రి వన్-ధన్-యోజన, ప్రధానమంత్రి కౌశల్-వికాస్-యోజన ప్రయోజనాలు కూడా మహిళలకు అందుతున్నాయని, ఆయన చెప్పారు.   జి.ఈ.ఎం. పోర్టల్‌ లో ఎస్.హెచ్.జి. ఉత్పత్తుల కోసం ‘సరస్’ స్థలం గురించి కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. 

2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని ఒప్పించడంలో భారతదేశం అద్భుతమైన ప్రయత్నాలు చేసిన విషయాన్ని, ప్రధానమంత్రి ప్రత్యేకంగా పేర్కొన్నారు.   దేశంలో సెప్టెంబ‌ర్ నెల‌ను పౌష్టికాహార మాసంగా నిర్వ‌హిస్తున్న విష‌యాన్ని కూడా ప్ర‌ధానమంత్రి గుర్తు చేశారు.   మన దేశంలో పర్యటించే విదేశీ ప్రముఖులకు అందించే ఆహార పదార్ధాల్లో చిరు ధాన్యాలతో తయారు చేసిన కనీసం ఒక పదార్థం ఉండేలా తాను నిర్ధారిస్తున్నానని ప్రధానమంత్రి తెలియజేశారు.

2014 నుంచి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి గుర్తుచేస్తూ, మహిళల గౌరవాన్ని పెంపొందించడానికి, రోజువారీగా వారు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి దేశం నిరంతరం శ్రమిస్తోందని అన్నారు.  మరుగుదొడ్లు లేకపోవడం, వంటగదిలోని కలప నుండి వచ్చే పొగ వల్ల కలిగే ఇబ్బందులు వంటి సమస్యలతో మహిళలు ఎలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారో శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు.  దేశంలో 11 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం, 9 కోట్లకు పైగా కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించడంతో పాటు, భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లోని కోట్లాది కుటుంబాలకు కుళాయి ద్వారా నీటిని అందించడం ద్వారా వారి జీవితాలు సులభతరమయ్యాయని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.  మాతృ వందన యోజన కింద 11,000 కోట్ల రూపాయలను నేరుగా కాబోయే తల్లుల ఖాతాలకు బదిలీ చేసినట్లు ఆయన తెలియజేశారు.  మధ్యప్రదేశ్‌ లోని తల్లులకు కూడా ఈ పథకం కింద 1,300 కోట్ల రూపాయలు వచ్చాయని, ఆయన చెప్పారు.   కుటుంబాల ఆర్థిక నిర్ణయాధికారంలో మహిళల పాత్ర పెరుగుతోందని కూడా ఆయన తెలియజేశారు. 

జ‌న్-ధ‌న్-బ్యాంకు ఖాతాల గురించి ప్ర‌ధానమంత్రి ప్ర‌స్తావిస్తూ, ఇది దేశంలో మ‌హిళా సాధికార‌త‌కు అతిపెద్ద మాధ్యమంగా మారిందని అన్నారు.  కరోనా కాలంలో, జన్-ధన్-బ్యాంకు ఖాతాల వల్ల ప్రభుత్వం మహిళల బ్యాంకు ఖాతాల్లోకి సురక్షితంగా మరియు నేరుగా డబ్బు బదిలీ చేయడానికి వీలు కలిగిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు.   “ఈ రోజు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మహిళల పేరు మీద ఇళ్ళు ఇవ్వడం జరుగుతోంది.  మా ప్రభుత్వం దేశంలో 2 కోట్ల మందికి పైగా మహిళలు ఇంటి యజమానులుగా మారేలా చేసింది.  ముద్రా పథకం కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలకు 19 లక్షల కోట్ల రూపాయల మేర రుణాలు అందించడం జరిగింది.  ఇందులో 70 శాతం డబ్బు మహిళా పారిశ్రామికవేత్తలకే అందింది.  ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి ప్రయత్నాల వల్ల ఈ రోజు కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో మహిళల పాత్ర పెరుగుతుండటం సంతోషంగా ఉంది.” అని ఆయన పేర్కొన్నారు. 

“మహిళల ఆర్థిక సాధికారత సమాజంలో వారిని సమానంగా శక్తివంతం చేస్తుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  భారతదేశపు కుమార్తెలు ఇప్పుడు సైనిక పాఠశాలల్లో ఎలా చేరుతున్నారు, పోలీస్ కమాండోలుగా ఎలా మారుతున్నారు, సైన్యంలో ఎలా చేరుతున్నారు అనే విషయాన్ని నొక్కి చెప్పిన ప్రధాన మంత్రి, మూసి ఉన్న తలుపులను తెరిచి, వారికి కొత్త అవకాశాలను సృష్టించినందుకు ప్రభుత్వాన్ని ప్రశంసించారు.  గత 8 సంవత్సరాలలో ప్రతి రంగంలోనూ గుర్తించదగిన మార్పుల పట్ల అందరి దృష్టిని ఆకర్షిస్తూ, దేశవ్యాప్తంగా పోలీసు శాఖలో మహిళల సంఖ్య ఒక లక్ష నుండి రెట్టింపై, 2 లక్షలకు పైగా అయ్యిందని ప్రతి ఒక్కరికీ తెలియజేయడం పట్ల ప్రధానమంత్రి గొప్ప గర్వాన్ని వ్యక్తం చేశారు.  35 వేల మందికి పైగా మన కుమార్తెలు ఇప్పుడు కేంద్ర బలగాలలో భాగమై దేశ శత్రువులతో పోరాడుతున్నారని ప్రధానమంత్రి ప్రత్యేకంగా పేర్కొన్నారు.   “ఈ సంఖ్య 8 సంవత్సరాల క్రితం ఉన్న దానికంటే దాదాపు రెట్టింపు” అని ప్రధానమంత్రి తెలిపారు.  “మీ శక్తిపై నాకు పూర్తి నమ్మకం ఉంది.  సబ్‌-కా-ప్రయాస్‌-తో, మెరుగైన సమాజాన్ని, బలమైన దేశాన్ని తయారు చేయడంలో మనం తప్పకుండా విజయం సాధిస్తాము.” అని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్,  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్,  కేంద్ర మంత్రులు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, డాక్టర్ వీరేంద్ర కుమార్,  కేంద్ర సహాయ మంత్రులు, శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, శ్రీ ప్రహ్లాద్ పటేల్ ప్రభృతులు పాల్గొన్నారు.

నేపథ్యం 

దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం) కింద ప్రోత్సహించబడుతున్న వేలాది మంది మహిళా స్వయం సహాయక బృందం (ఎస్.హెచ్.జి) సభ్యులు / కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ప్ర‌ధానమంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న కింద ప్ర‌త్యేకించి దుర్బ‌ల గిరిజన సమూహాల (పి.వి.టి.జి) కు చెందిన నాలుగు నైపుణ్య కేంద్రాల‌ను కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు.

గ్రామీణ పేద కుటుంబాలను దశలవారీగా స్వయం సహాయక బృందాలుగా సమీకరించడం, వారి జీవనోపాధిని వైవిధ్య పరచడానికి, వారి ఆదాయాలు, జీవన నాణ్యత ను మెరుగుపరచడానికి దీర్ఘకాలిక మద్దతును అందించడం డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం. లక్ష్యంగా పెట్టుకుంది.  గృహ హింస, మహిళల విద్య, ఇతర లింగ సంబంధిత సమస్యలు, పోషకాహారం, పారిశుద్ధ్యం, ఆరోగ్యం మొదలైన సమస్యలపై అవగాహన కల్పించడం, ప్రవర్తన మార్పు కమ్యూనికేషన్ ద్వారా మహిళా స్వయం సహాయక బృంద సభ్యులను శక్తివంతం చేయడానికి కూడా ఈ మిషన్ పని చేస్తోంది.