తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా చెంగల్పట్టు లో మెస్సర్స్ హెచ్ ఎల్ ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ కు 2009లో లీజుకు ఇచ్చిన 330.10 ఎకరాల ప్రభుత్వ భూమిని మెడిపార్క్ ఏర్పాటు చేయడానికిగాను సబ్- లీజుకు ఇవ్వడానికి హెచ్ ఎల్ ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ కు మంత్రివర్గం తన సమ్మతిని తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఈ మేరకు ఆమోదం తెలిపింది. చెన్నై నగర శివార్లలోని చెంగల్పట్టులో 330.10 ఎకరాల భూమిలో వైద్య పరికరాల తయారీ పార్కు (మెడిపార్క్) ను ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా నెలకొల్పడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని మినీరత్న పి ఎస్ యు మెస్సర్స్ హెచ్ ఎల్ ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ (ఆ భూమిని) సబ్ లీజుకు ఇచ్చేందుకు మంత్రివర్గం సమ్మతిని వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులో 50 శాతానికి పైగా షేర్ హోల్డింగ్ హెచ్ ఎల్ ఎల్ కు ఉంటుంది.
మెడిపార్క్ ప్రాజెక్టు దేశ వైద్య సంబంధ సాంకేతిక విజ్ఞాన రంగంలో ఏర్పాటు అవుతున్న మొట్టమొదటి తయారీ సముదాయం కాగలదు. అతి ఖరీదైన ఉత్పత్తులను బాగా తక్కువ ఖర్చులో స్థానికంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించేందుకు, తద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, మరీ ముఖ్యంగా రోగ నిర్ణయకారి సేవలను ప్రజలలో పెద్ద వర్గానికి అందించాలనేది దీని లక్ష్యం. ఈ ప్రతిపాదిత మెడిపార్క్ దేశంలో వైద్య పరికరాలు మరియు వైద్య సంబంధ సాంకేతిక విజ్ఞాన రంగం, ఇంకా సంబంధిత విభాగాల అభివృద్ధికి దోహదం చేయనున్నది. ప్రస్తుతం ఈ రంగాలు ఆరంభ దశలోనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఊతమిస్తుంది కూడాను.
మెడి పార్క్ ను దశలవారీగా ఏడు సంవత్సరాల లోపల అభివృద్ధి చేస్తారు. మొదటి దశలో భాగంగా భౌతిక అవస్థాపనను చేపడుతారు. రెండో దశలో విజ్ఞాన నిర్వహణ కేంద్రాన్ని సిద్ధం చేస్తారు. మూడో సంవత్సరం నుండి ప్లాట్ లను లీజుకు ఇవ్వడం జరుగుతుంది. ఇందుకుగాను నిధులను, సహకారాన్ని ఇటువంటి కార్యక్రమాలకు నిధులను అందించే విభాగాల నుండి స్వీకరిస్తారు. వైద్య పరికరాలు తయారు చేయడానికి ముందుకు వచ్చే ఇన్ వెస్టర్లకు పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియలో భూమిని హెచ్ ఎల్ ఎల్ సబ్ లీజుకు ఇస్తుంది. వైద్య పరికరాలు, సామగ్రి తయారీ రంగానికి చెందిన వ్యాపారవేత్తలకు అర్హత ఉందని తేలగానే మొదటి దశలో రాయితీ కింద భూమిని లీజుకు ఇస్తారు. చాలా మందిని ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయడానికి ఈ పద్ధతిని అనుసరించనున్నారు. డిమాండ్ పెరగడం మొదలవ్వగానే లీజు రేట్లను క్రమక్రమంగా పెంచుతారు. ఆ విధంగా ఈ మెడిపార్క్ ప్రాజెక్టు భారతదేశంలోని ఆరోగ్య భద్రత సంబంధ నాణ్యతను మెరుగుపరుస్తుంది.
ఈ ప్రాజెక్టు దిగమతుల పైన ఆధారపడడాన్ని తగ్గిస్తుంది; అధునాతన అవస్థాపన అండదండలను, నవీన సాంకేతిక విజ్ఞానాన్ని సమకూర్చడం ద్వారా స్వదేశీ పరిశ్రమ వృద్ధికి బలమైన పునాదిని ఏర్పరుస్తుంది; వైద్య పరికరాలను, సామగ్రిని దేశీయంగా తయారు చేసుకోవడం దేశానికి అవసరమయ్యే, అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ సేవల లభ్యతకు భరోసాను అందించడమే కాకుండా నాణ్యమైన ఆరోగ్యసంరక్షణ సేవలు మరింత విస్తృతం కావడానికి కూడా తోడ్పడగలుగుతుంది.