ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గంగానది (పునర్వైభవం, పరిరక్షణ, నిర్వహణ) అథారిటీస్ ఆర్డర్, 2016 కు ఆమోదం తెలిపింది. విధి విధానాలకు, వేగవంతమైన అమలుకు ఒక కొత్త సంస్థాగతమైన నిర్మాణాన్ని ఈ ఆర్డర్ అందిస్తుంది. స్వచ్ఛ గంగ జాతీయ మిషన్ (నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా.. ఎన్ ఎమ్ సి జి) తన విధులను స్వతంత్రంగా, బాధ్యతగా చేసుకునేందుకు సాధికారితను కల్పిస్తుంది. దీనితో పాటు అథారిటీకి పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986 ప్రకారం మిషన్ హోదా కల్పించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. దీని ద్వారా అథారిటీకి విచారణ అధికారం లభిస్తుంది. అదే విధంగా ఎన్ ఎమ్ సి జి ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక, పాలన అధికారాలున్న ప్రతినిధి బృందం ఉంది. వారే బాధ్యతాయుతమైన, జవాబుదారీ కేంద్రంగా ఉంటారు. గంగా పునర్వైభవం ప్రాజెక్టు అమలును వీరే వేగవంతం చేస్తారు.
ప్రధానాంశాలు :
ఆర్డర్‌లోని విషయాలు క్లుప్తంగా :
1. ఎన్ జి ఆర్ బి ఎ స్థానంలో గంగానది జాతీయ కౌన్సిల్ (పునర్వైభవం, పరిరక్షణ, నిర్వహణ)ను ప్రధాన మంత్రి చైర్‌పర్సన్‌గా ఓ అథారిటీగా ఏర్పాటు చేయాలి. దీని ద్వారా గంగా బేసిన్‌లో కాలుష్య నియంత్రణ, పునర్వైభవం కోసం పర్యవేక్షణ బాధ్యత నిర్వర్తించాలి.
2. కేంద్ర జల వనరులు, నది అభివృద్ధి, గంగా పునర్వైభవం మంత్రి నాయకత్వంలో ఓ సాధికార కమిటీ ఏర్పాటు. వివిధ మంత్రిత్వ, ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో భాగస్వామ్యం కావాలి.
• గంగానది పునర్వైభవం కోసం ప్రత్యేక కార్యక్రమాలు, మైలురాళ్లు, వీటి అమలుకు టైమ్‌లైన్, రూపొందించుకున్నలక్ష్యాలను చేరుకొనేందుకు కార్యాచరణ.
• కార్యాచరణ అమలును పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు.
దీని ద్వారా సమయానుగుణంగా కార్యాచరణ అమలులో మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఏర్పడుతుంది.
3. స్వచ్ఛ గంగ జాతీయ మిషన్‌కు పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986 ప్రకారం ప్రత్యేక అధికారాలతో అథారిటీ హోదాను ప్రకటించడం ద్వారా దీని ఆదేశాలను సమర్థంగా అమలయ్యేలా చూసేందుకు అవకాశం లభిస్తుంది.
• ఈ ఎన్ ఎమ్ సి జి రెండంచెల నిర్వహణ విధానంలో.. డి జి నాయకత్వంలో ఓ పాలక మండలి (జి సి), దీని కింద పాలక మండలి ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక కమిటీ (ఇసి) ఉంటుంది. దీనికి కూడా డి జి యే నాయకత్వం వహిస్తారు.
• జాతీయ గంగ మండలి ఆదేశాలు, నిర్ణయాలకు అనుగుణంగా ఎన్ ఎమ్ సి జి పనిచేస్తుంది. మండలి ఆమెదించిన గంగా బేసిన్ నిర్వహణ అమలును పర్యవేక్షిస్తుంది. గంగానది, దీని ఉపనదుల పరిరక్షణ, పునర్వైభవం కోసం అవసరమైన అన్ని కార్యక్రమాల సమన్వయాన్ని, అమలును చూసుకొంటుంది.
4. రాష్ట్ర స్థాయిలోనూ రాష్ట్ర గంగ కమిటీల ఏర్పాటు చేసి, వాటికి కూడా అథారిటీ హోదా ఇవ్వాలి. వీటి మార్గదర్శకత్వంలో, పరిధిలో పనిచేసేందుకు జిల్లా గంగ పరిరక్షణ కమిటీలను ఏర్పాటుచేయాలి.
5. ఇదే విధంగా, గంగ పరివాహక జిల్లాల్లో ఏర్పాటుచేసిన జిల్లా గంగ కమిటీలు జిల్లా స్థాయిలో అథారిటీగా పనిచేస్తాయి. ఇవి స్థానికంగా ఉన్న హెచ్చరికలపై విచారణ జరిపేందుకు, గంగానదిలో నీటి నాణ్యత కాపాడడంతో పాటు వివిధ ప్రాజెక్టులను అమలు చేస్తాయి.
ఈ ప్రతిపాదిత వ్యవస్థ.. పర్యావరణ (పరిరక్షణ) చట్టం, 1986లోని (29 ఆఫ్ 1986) నియమాల ఆధారంగా జారీ చేసిన అధీన చట్టాలకు అనుగుణంగా అనుకున్న లక్ష్యాలను చేరుకొనేందుకు వివిధ అథారిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఈ ప్రతిపాదనలోని ఇతర ముఖ్యమైన అంశాలు :
• ఇది గంగానది పునర్వైభవం, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ గంగ కోసం ఏర్పాటుచేసిన ఎన్ ఎమ్ సి జి కి మరిన్ని అధికారాలు కల్పిస్తుంది. గంగానదిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకోవడం, వారికి సరైన సూచనలు చేయవచ్చు.
• సి పి సి బి చర్యలు తీసుకోలేని అంశాల్లో మాత్రమే ఎన్ ఎమ్ సి జి సరైన చర్యలు తీసుకుంటుంది. పైన పేర్కొన్న చట్టం ప్రకారం ఎన్ ఎమ్ సి జి, సి పి సి బి సంయుక్తంగా చర్యలు తీసుకోవచ్చును.
• గంగానదిలో ప్రవాహానికి అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ, నీటి నాణ్యతతో పాటు పర్యావరణపరంగా సుస్థిర అభివృద్ధిపై దృష్టి పెట్టడం ఈ పునరుద్ధరించబడిన వ్యవస్థ ముఖ్య లక్ష్యం.
గంగా బేసిన్‌లో పారిశుద్ధ్యానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేసేందుకు హైబ్రిడ్ అన్యూయిటీ ఆధారంగా ఓ వినూత్నమైన నమూనాకు ఆమోదం లభించింది. సుస్థిరత ఆధారంగా రూపొందించిన మౌలిక వసతుల పనితీరును ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.
ఈ మొత్తం విధానంలో పారదర్శకత, వ్యయం నిర్థారణ కోసం ఏకకాలీన లెక్కల తనిఖీ, భద్రత లెక్కల తనిఖీ, పరిశోధన సంస్థలు, ఆర్థికపరమైన నిబంధనలు రూపొందించారు.
పూర్వ రంగం :
గంగా కార్యాచరణ ప్రణాళిక (జి ఎ పి) మొదటి దశ 1985లో ప్రారంభం కాగా, రెండో దశ 1993లో మొదలైంది. మొదట దీనిని గంగానది నీటి నాణ్యతను పెంచేందుకే ఉద్దేశించినా.. తరువాత గంగ ఉపనదులకు కూడా వర్తింపచేశారు. వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వ పథకంగా గంగానది, దాని ఉపనదుల పునర్వైభవం కోసం సమగ్ర కార్యక్రమంగా ‘నమామి గంగే’ కార్యక్రమాన్ని 2015 మేలో ప్రభుత్వం ఆమోదించింది. అమలు తీరులో పరిమితులు ఉన్నప్పటికీ.. ఈ కార్యక్రమం నీటి నాణ్యతను పెంచే ప్రయత్నంలో ఓ మోస్తరు అంచనాలను అందుకొంది.
2012 నుంచి రిజిస్టర్డ్ సొసైటీగా మాత్రమే విధులు నిర్వహిస్తున్న ఎన్ ఎమ్ సి జి.. అమలు చేస్తున్నసంస్థలకు నిధులివ్వడానికి మాత్రమే పరిమితమైంది. దీనికి గంగానదిలో కాలుష్యానికి కారణమవుతున్న వ్యక్తులు, సంస్థలపై విచారణ చేపట్టడం, లేదా.. వారికి ఆదేశాలు జారీ చేయడానికి అధికారాలు లేవు. ప్రజలు, న్యాయస్థానాల దృష్టిలో ఈ సంస్థ గంగానది విషయంలో సంరక్షకుడిగా ఉంది. ఇలాంటి అంచనాలను అందుకొనేందుకు మిషన్‌కు అవసరమైన అధికారాలు లేవు.
అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో (మిషన్‌ను అథారిటీ మార్చడం) కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు గంగానది పునర్వైభవానికి సమర్థమైన ప్రణాళికను సిద్ధం చేయవచ్చని భావిస్తున్నారు. అలాగే, నదిలో పర్యావరణ సమతౌల్యం సాధించడం, కాలుష్య కారకాలైన పరిశ్రమలపై కఠినమైన పరిమితులు విధించడం, నిబంధనలను అమలు చేసేలా తనిఖీలు చేపట్టడం వంటివి కూడా చేయవచ్చు. దీనితో పాటు, నది పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిశోధనలు జరపడం, సరైన వివరాలను నిర్వహించడం, ప్రచారం చేసేందుకు అవకాశం ఉంటుంది.