Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సాధారణ బడ్జెటు లో రైల్వే బడ్జెటు విలీనాన్ని ఆమెదించిన మంత్రివర్గం; బడ్జెట్ సమర్పణ తేదీని ముందుకు మార్చారు; ఇంకా- బడ్జెటులోను, ఖాతాలలోను ప్రణాళిక -ప్రణాళికేతర వర్గీకరణ యొక్క విలీనం


బడ్జెటు సంస్కరణలలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన (1) సాధారణ బడ్జెటు లో రైల్వే బడ్జెటు విలీనం (2) బడ్జెటును ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి చివరి రోజు నుండి ఫిబ్రవరి 1కి మార్చడం (3) బడ్జెటు మరియు అకౌంట్ లలో ప్రణాళిక, ప్రణాళికేతర వర్గీకరణ యొక్క విలీనంపై చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఈ మార్పులన్నీ 2017-18 బడ్జెటు నుండి ఏకకాలంలో అమలులోకి రానున్నాయి.

సాధారణ బడ్జెటులో రైల్వే బడ్జెటు విలీనం :
 
మంత్రివర్గం ఆమోదించిన ‘సాధారణ బడ్జెటులో రైల్వే బడ్జెటు విలీనం’కు సంబంధించిన పాలనాపరమైన, ఆర్థిక పరమైన అంశాలు కింది విధంగా ఉన్నాయి :

(1)    రైల్వే శాఖ తనదైన ప్రత్యేక ప్రతిపత్తి హోదాను నిలబెట్టుకొంటుంది- ప్రస్తుతానికి ఒక విభాగం ద్వారా నడిచే వాణిజ్య సంస్థలాగే ఉంటుంది;

(2)    నిర్వహణ స్వయంప్రతిపత్తి, ఆర్థిక అధికారాల విషయంలో ప్రస్తుత నిబంధనలనే రైల్వే శాఖ కొనసాగిస్తుంది.

(3)    ప్రస్తుత ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నట్లే.. శాఖ ఆదాయ వ్యయాలు (సాధారణంగా పనిచేసేందుకు అవసరమైన ఖర్చులు, వేతనాలు, అలవెన్సులు, పింఛన్లు మొదలైనవి) కూడా రైల్వే ఆదాయం వసూళ్ల నుండే జరుగుతాయి.

(4)    రైల్వేల మూలధన అంచనా రూ.2.27 లక్షల కోట్లు కాగా, రైల్వేలు చెల్లించాల్సిన వార్షిక డివిడెండ్ లను రద్దు చేయాలని నిర్ణయించారు. పర్యవసానంగా, 2017-18 నుండి రైల్వేలపై డివిడెండ్ భారం పడదు. రైల్వే మంత్రిత్వ శాఖకు స్థూల బడ్జెటరీ మద్దతు లభిస్తుంది. దీనితో పాటు, కేంద్ర ప్రభుత్వానికి ఏటా చెల్లించాల్సిన సుమారు రూ. 9,700 కోట్ల వార్షిక డివిడెండ్ రైల్వే శాఖకు మిగిలినట్లే.

రైల్వే బడ్జెటు ను విడిగా ప్రవేశపెట్టడం అనేది 1924లో ఆరంభమైంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగ నిబంధనల కన్నా ఓ ఆచారంలా దీనిని కొనసాగిస్తూ వచ్చారు.

ఈ విలీనం ద్వారా కింది లాభాలు ఉన్నాయి :

•    ఏకీకృత‌ బడ్జెటును ప్రవేశపెట్టడం వల్ల రైల్వే శాఖ వ్యవహారాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. దేశ ఆర్థిక సంపూర్ణ ముఖచిత్రం ఆవిష్కృతం అవుతుంది.

•    విలీనం ద్వారా విధానపరమైన అవసరాలు తగ్గేందుకు అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు. దీనికి బదులుగా సేవలు, సుపరిపాలన విషయాలపై దృష్టి పెట్టవచ్చు.

•    దీని ద్వారా రైల్వేల నిధులు.. ప్రధాన వినిమయ బిల్లులో భాగమవుతాయి.

బడ్జెటు ప్రవేశపెట్టే తేదీ ముందుకు మార్పు :

బడ్జెటుకు సంబంధించిన సంస్కరణలలో భాగంగా సాధారణ బడ్జెటు ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి చివరి రోజు నుండి ఫిబ్రవరి 1వ తేదీకి మార్చే ఆలోచనకు కూడా మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే, వచ్చే సంవత్సరం వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆ తేదీల ఆధారంగా 2017-18 బడ్జెటు తేదీని త్వరలో నిర్ణయిస్తారు.

ఇది ఈ కింది విధంగా తోడ్పడే అవకాశం ఉంది :

•    బడ్జెటు ప్రవేశపెట్టే తేదీని ఒక నెల ముందుకు జరపడం, బడ్జెటు సంబంధింత చట్టపరమైన అంశాలను మార్చి 31 లోగా పూర్తి చేయడం వల్ల బడ్జెటు సైకిల్ త్వరగా పూర్తయి.. మంత్రిత్వ శాఖలు, విభాగాలు తొలి త్రైమాసికంతో పాటు కొత్త ఆర్థిక సంవత్సరం అంతా పథకాల అమలుకు, నిధుల వినియోగానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకొనేందుకు అనుకూలంగా ఉంటుంది.

•    బడ్జెటు పై పార్లమెంటు ఆమోదం పొందడాన్ని కూడా ఈ విధానం ద్వారా తప్పించవచ్చు. దీంతోపాటు కొత్త ఆర్థిక సంవత్సరం నుండి అమలుచేసే కొత్త పన్నుల విధానాల్లో చట్టపరమైన మార్పుల అమలుకు అవకాశం కలుగుతుంది.

బడ్జెటు, అకౌంట్ లలో ప్రణాళిక, ప్రణాళికేతర వర్గీకరణ విలీనం :

2017-18 నుండి బడ్జెటు, అకౌంట్ లలో ప్రణాళిక, ప్రణాళికేతర అనే వర్గీకరణను విలీనం చేయాలన్న మూడో ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. షెడ్యూల్డ్ కాస్ట్ స్ సబ్- ప్లాన్/ట్రైబల్ సబ్- ప్లాన్ లకు, ఈశాన్య రాష్ట్రాలకు నిధుల కేటాయింపు సైతం కొనసాగనున్నాయి.

దీని వల్ల ఈ కింది సమస్యలు పరిష్కారం కానున్నాయి :

•    వ్యయాలలో ప్రణాళిక, ప్రణాళికేతర వర్గీకరణ వల్ల వివిధ పథకాలకు వనరుల విడుదల అస్తవ్యస్తంగా ఉండేది. దీని వల్ల పథకాల వ్యయం పెరగడంతో పాటు ఫలితాలు కూడా గొప్పగా ఉండేవి కావు.

•    కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికా వ్యయంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఆస్తుల నిర్వహణ, సామాజిక సేవలకు సంబంధించిన వ్యవస్థాపక సంబంధిత ఖర్చుల వంటి అత్యవసర ఖర్చులపై శ్రద్ధ తగ్గేది.

•    ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల విలీనం ఆదాయం, మూలధన వ్యయంపై శ్రద్ధతో కూడిన సరైన బడ్జెటు రూపకల్పనకు బాట పరచగలదని భావిస్తున్నారు.