Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్వాడ్ నాయ‌కుల శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నంలో పాల్గొన్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

క్వాడ్ నాయ‌కుల శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నంలో పాల్గొన్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జ‌పాన్ లోని టోక్యోలు  2022 మే 24న జ‌రిగిన క్వాడ్ నేత‌ల రెండో ముఖా ముఖి శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నంలో  పాల్గొన్నారు. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో పాటు ఈ స‌మావేశంలో జ‌పాన్ ప్ర‌ధాన‌మంత్రి ఫుమిఒఒ కిషిద‌, అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్‌, ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రి ఆంథోనీ అల్‌బ‌నెసెలు పాల్గొన్నారు. 2021 మార్చిలో  తొలి వ‌ర్చువ‌ల్ స‌మావేశం , ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 2021 లో అమెరికాలోని వాషింగ్ట‌న్ డిసిలో జ‌రిగిన స‌మావేశం, 2022 మార్చిలో జ‌రిగిన వ‌ర్చువ‌ల్ స‌మావేశం త‌ర్వాత జ‌రిగిన నాలుగ‌వ‌ శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం ఇది. 

స్వేచ్ఛాయుత‌, బాహాట‌త‌తో కూడిన‌, స‌మ్మిళిత ఇండో -ప‌సిఫిక్ కోసం ఉమ్మ‌డి నిబద్ధ‌త‌ను క్వాడ్ నాయ‌కులు పునురుద్ఘాటించారు. అలాగే సార్వ‌భౌమ‌త్వం, ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌, వివాదాల‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించుకోవాల‌న్న దానిని వారు పున‌రుద్ఘాటించారు. ఇండొ- పసిఫిక్ లో అభివృద్ధి, యూర‌ప్ లో ఘ‌ర్ష‌ణ పూరిత వాతావ‌ర‌ణంపై  వారు త‌మ దృక్ఫ‌థాన్ని పున‌రుద్ఘాటించారు. శ‌త్రుత్వాలు వ‌దిలిపెట్టి , చ‌ర్చ‌లు దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్య‌లు పున‌రుద్ధ‌రించుకోవాల్సిన అవ‌స‌రంపై భార‌త‌దేశ‌పు సూత్ర‌బ‌ధ్ద స్థితిని ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న క్వాడ్ కొలాబ‌రేష‌న్‌, భ‌విష్య‌త్‌కు  దార్శ‌నిక‌త త‌దిత‌రాల‌పై నాయ‌కులు స‌మీక్ష జ‌రిపారు.

ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కొవాల‌న్న‌త‌మ ఆకాంక్ష‌ను క్వాడ్ నాయకులు పున‌రుద్ఘాటించారు. టెర్రరిస్ట్ ప్రాక్సీలను వాడుకోవ‌డాన్ని ఖండించారు .సరిహద్దు దాడులతో సహా ఉగ్రవాద దాడులకు పాల్ప‌డ‌డానికి
 లేదా ప్లాన్ చేయడానికి ఉపయోగించే ఉగ్రవాద సమూహాలకు ఏ రూపంలోనూ రవాణా, ఆర్థిక లేదా సైనిక మద్దతును అంద‌కుండా చూడాల్సిన అంశానికి గ‌ల  ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

కోవిడ్ -19 మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు క్వాడ్ కొన‌సాగిస్తున్న కృషిని  నాయ‌కులు స‌మీక్షించారు. ఇండియాలో బ‌యోలాజిక‌ల్ ఇ ఫెసిలిటీ త‌యారీ సామ‌ర్ధ్యాన్ని పెంచ‌డాన్ని నాయ‌కులు స్వాగ‌తించారు.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇయుఎల్ ఆమోదం స‌త్వ‌రం వ‌చ్చేలా చూడాల‌ని త‌ద్వారా వాక్సిన్ పంపిణీకి వీలు క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు.  క్వాడ్ వాక్సిన్ భాగ‌స్వామ్యం కింద ఏప్రిల్ 2022 లో థాయిలాండ్ , కాంబోడియాలకు  ఇండియాలో త‌యారైన 5,25,000 డోస్‌ల వాక్సిన్ ను బ‌హుమ‌తిగా ఇవ్వ‌డాన్ని క్వాడ్ నాయ‌కులు స్వాగ‌తించారు.
చిట్ట‌చివ‌రి వ్య‌క్తి వ‌ర‌కు వాక్సిన్ అందేలా కోవిడ్ మ‌హ‌మ్మారి ని నియంత్రించేందుకు స‌మ‌గ్ర విధానాన్ని అనుస‌రించ‌డాన్ని వారు కొన‌సాగించ‌నున్నారు. జెనోమిక్ నిఘా, క్లినిక‌ల్ ప‌రీక్ష‌లు, పెద్ద ఎత్తున అంతర్జాతీయ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల నిర్మాణం త‌దిత‌రాల ద్వారా ప్రాంతీయంగా ఆరోగ్య భ‌ద్ర‌త‌ను విస్తృతం చేయ‌డం, వాక్సిన్ పంపిణీ స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు స‌మ‌గ్ర విధానాన్ని అనుస‌రించ‌నున్నారు.

క్వాడ్ క్లైమేట్ ఛేంజ్ యాక్ష‌న్ , మిటిగేష‌న్ ప్యాకేజ్ (క్యు-చాంప్‌)ను హ‌రిత షిప్పింగ్‌, ప‌రిశుభ్ర‌మైన ఇంధ‌నానికి, గ్రీన్ హైడ్రోజ‌న్‌, వాతావ‌ర‌ణ‌, విప‌త్తుల‌నుంచి త‌ట్టుకునే మౌలిక సదుపాయాల నిర్మాణానికి జ‌రిగే కృషిని బ‌లోపేతం చేసేందు కు ప్ర‌క‌టించారు. క్లైమేట్ ఫైనాన్స్ , టెక్నాలజీ బదిలీ వంటి వాటి ద్వారా  COP26 కట్టుబాటుతో ఈ ప్రాంతంలోని దేశాలకు సహాయం చేయడానికి గ‌ల  ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న కీల‌క‌, ఆధునిక సాంకేతిక‌త‌ల‌కు సంబంధించిన ప‌నిలో భాగంగా  కీల‌క సాంకేతిక స‌ర‌ఫ‌రా చెయిన్ కు సంబంధించి క్వాడ్ ఉమ్మ‌డి సూత్రాల ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేయ‌డం  జ‌రిగింది.
  ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని కీలకమైన సైబర్ సెక్యూరిటీ మౌలిక స‌దుపాయాల‌ను  బలోపేతం చేయడానికి సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలను ఈ నాలుగు దేశాలు సమన్వయం చేస్తాయి. న‌మ్మ‌క‌మైన‌ ప్రపంచ స‌ప్ల‌య్ చెయిన్ ను నిర్మించడానికి మ‌రింత  క్వాడ్ సహకారం కోసం ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. భారతదేశంలో సెమీకండక్టర్ల‌కు సంబంధించిన సానుకూల‌ వ్యవస్థను రూపొందించడానికి  జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను చేప‌ట్ట‌నున్న విష‌యం  గురించి కూడా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు.

క్వాడ్ నాయ‌కులు ఇండొ ప‌సిఫిక్ కోసం మాన‌వీయ స‌హాయం, విప‌త్తు ప‌రిహారానికి సంబంధించి (హెచ్ ఎ డిఆర్‌) క్వాడ్ భాగ‌స్వామ్యాన్ని ప్ర‌క‌టించారు. ఈ ప్రాంతంలో విప‌త్తుల‌ను ఎదుర్కొనేందుకు మ‌రింత మేలైన స‌త్వ‌ర స‌హాయం అందించ‌డానికి ఇది ఉప‌క‌రిస్తుంది.
క్వాడ్ శాటిలైట్ డాటా పోర్ట‌ల్ ద్వారా భూ ప‌రిశీల‌న స‌మాచారాన్ని

వాతావరణానికి సంబంధించిన ఘ‌ట‌న‌లు, విపత్తు సంసిద్ధత , సముద్ర వనరుల సుస్థిర‌ వినియోగాన్ని గుర్తించ‌డంలో  సహాయపడటానికి, క్వాడ్ శాటిలైట్ డేటా పోర్టల్ ద్వారా భూ పరిశీలన డేటా ఆధారంగా ఈ ప్రాంతంలోని దేశాలకు స‌మాచారాన్ని అందించడానికి  క్వాడ్‌నాయకులు అంగీకరించారు. సమ్మిళిత అభివృద్ధి కోసం అంతరిక్ష ఆధారిత డేటా , సాంకేతికతలను ఉపయోగించడంలో త‌న‌కుగ‌ల‌ దీర్ఘకాల సామర్థ్యాలను బట్టి భారతదేశం ఈ ప్రయత్నంలో చురుకైన పాత్ర పోషిస్తోంది..
 కొత్త ఇండో-పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్ ఇనిషియేటివ్‌ను  క్వాడ్ నాయ‌కులు స్వాగ‌తించారు. ఇది ఆయా , దేశాలు  హెచ్ ఎ డి ఆర్‌ ఘటనలకు ప్రతిస్పందించడానికి , చట్టవిరుద్ధమైన ఫిషింగ్‌ను నియంత్రించ‌డంలో తమ సామర్థ్యాలను పెంచుకోవడానికి స‌హాయ‌ప‌డుతుంది..

క్వాడ్ నాయ‌కులు ఏసియాన్ ఐక్య‌త‌కు త‌మ తిరుగులేని మ‌ద్ద‌తును పున‌రుద్ఘాటించారు. అలాగే ఈ ప్రాంతంలో భాగ‌స్వాముల‌తో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసుకునేందుకు ఎదురు చూస్తున్న‌ట్టు తెలిపారు.
 సానుకూల , నిర్మాణాత్మక ఎజెండాను అందించడం , ఈ ప్రాంతానికి స్పష్టమైన ప్రయోజనాలను చేకూర్చ‌డంలో క్వాడ్  ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. క్వాడ్  నాయకులు తమ సంభాషణలు  సంప్రదింపులను మ‌రింత ముందుకు తీసుకువెళ్లేందుకు  అంగీకరించడంతో పాటు, 2023లో ఆస్ట్రేలియా నిర్వహించే తదుపరి సమ్మిట్ కోసం ఎదురుచూస్తున్నట్టు వారు  ప్ర‌క‌టించారు..

***