న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెట్ వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ శ్రీ రాహుల్ జోషి కి ఇటీవల ఒక సమగ్రమైన ఇంటర్వ్యూను ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రాజకీయాలు, ఆర్థిక అంశాలు, ఇటీవల దళితులపై దాడుల కారణంగా ప్రభుత్వంపై వచ్చిన విమర్శలు, వోట్ బ్యాంకు రాజకీయాలు, కులతత్వం వంటి అనేక అంశాలతో పాటు తనను గురించి, తను పని చేసే శైలిని గురించి, తను బాగా విశ్వసించే అంశాలను గురించి ప్రధాన మంత్రి ముచ్చటించారు. ప్రధాన మంత్రి ఇంటర్వ్యూలోని అంశాలు హిందీ నుండి తెలుగులోకి..
ప్రశ్న : ముందుగా , నెట్ వర్క్ 18కి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. గత మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత నిర్ణయాత్మక రీతిలో రెండు సంవత్సరాల క్రితం మీరు చరిత్రాత్మక విజయం సాధించారు. ఈ రెండు సంవత్సరాలను మీరు ఎలా చూస్తారు ? దేనిని మీరు సాధించిన గొప్ప విజయంగా భావిస్తారు ?
ప్రధాన మంత్రి మోదీ : ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు సంత్సరాల మూడు నెలలు అవుతోంది. భారతదేశం ప్రజాస్వామిక దేశం. ప్రజలు ప్రభుత్వాలను క్రమం తప్పకుండా అంచనా వేస్తుంటారు. మీడియా కూడా అంచనా వేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రొఫెషనల్ సర్వే ఏజెన్సీలు కూడా ఈ పని చేస్తున్నాయి. ఇదొక మంచి విషయం అని నేను భావిస్తాను. అందువల్ల నా ప్రభుత్వం ఎలా పనిచేసిందన్న దానిని అంచనా వేయడాన్ని నేను ప్రజలకే వదలిపెడుతున్నాను. అయితే మా ప్రభుత్వ పనితీరును అంచనా వేసేటపుడు ఎప్పుడైనా ఒక విషయాన్ని తప్పక దృష్టిలో పెట్టుకోవాలి. అదేమిటంటే, మేం అధికారంలోకి రాక ముందు ప్రభుత్వ పరిస్థితి, దేశ పరిస్థితి ఎలా ఉంది ? మీడియా అప్పట్లో దేనిని గురించి చర్చిస్తూ ఉండేదనేది గమనించాలి. దీనిని మనం దృష్టిలో ఉంచుకున్నట్లయితే, ఆ రోజులలో పత్రికలన్నీ అవినీతిని, నిరాశను గురించిన వార్తలతో నిండిపోయి ఉండేవి. ప్రజలు ఆశను కోల్పోయారు. అంతా ముగిసిపోయిందని భావిస్తూ వచ్చారు..
వైద్యుడు ఎంత మంచివాడైనప్పటికీ రోగి నిరాశలో ఉంటే, మందులు రోగికి స్వస్థతను చేకూర్చలేవు. రోగి ఆశావహ దృక్పథంతో ఉంటే, సగటు వైద్యుడు కూడా అతడికి రోగాన్ని నయం చేయగలుగుతాడు. దీనికి కారణం, రోగికి అంతర్గతంగా ఉన్న విశ్వాసం. నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే, దేశంలోని నిరాశాభరిత వాతావరణాన్ని తొలగించి, విశ్వాసాన్ని కల్పించడాన్ని ప్రథమ ప్రాధాన్యంగా భావించాను. అది మాటలతో అయ్యేది కాదు. ఇందుకు పటిష్టమైన చర్యలు అవసరం. ఇది అమలు జరుగుతుందని చూపాలి. ఇప్పుడు రెండు సంవత్సరాలకు పైగా గడచిన తరువాత దేశ ప్రజలలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే భారతదేశం మీద విశ్వాసం పెరిగిందని నేను విస్పష్టంగా చెప్పగలను.
మనల్ని మునిగిపోతున్న నౌకగా చిత్రించి చూపిన రోజులు ఉన్నాయి. ‘బ్రిక్స్’ (బి ఆర్ ఐ సి ఎస్)లోని ‘ఐ’ అనే అక్షరం భారత దేశాన్ని సూచించేది. దీనిని ఊగిసలాటలో కొట్టుమిట్టాడుతున్నదానిగా చూసే వారు. కానీ, ప్రస్తుతం దీనిని ఉజ్జ్వలమైందిగా చూస్తున్నారు. అదీ భారతదేశం గొప్పతనం. మా పనితీరును అంచనా వేయడానికి ఇందులోనే చక్కటి మార్గం ఉందని నేను భావిస్తాను.
ప్రశ్న: మీరు అభివృద్ధి నినాదంతో అధికారంలోకి వచ్చారు. అందువల్ల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక ప్రశ్న. మీరు ఎంతో శ్ర మించి జి ఎస్ టి బిల్లు ఆమోదం పొందడంలో విజయం సాధించారు. ఎంత పెద్ద విజయంగా దీనిని మీరు చూస్తారు ?, దీనివల్ల సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది ?
ప్రధాన మంత్రి మోదీ : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన అతి పెద్ద పన్ను సంస్కరణగా దీనిని చెప్పుకోవచ్చు. ఈ సంస్కరణ దేశంలో గొప్ప మార్పును తీసుకురానుంది. దేశంలో చాలా కొద్ది మందే పన్నులు కడతారు. కొంతమంది ప్రజలు వారు దేశ భక్తి కలిగిన వారైనందున పన్నులు కడతారు; వారు దేశానికి ఏదైనా చేయాలనుకుంటారు. కొంతమంది చట్టాన్ని ధిక్కరించడం ఇష్టం లేక పన్నులు కడతారు. మరికొందరు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం పన్నులు కడతారు. అయితే ఎక్కువ మంది పన్నులు కట్టరు; దీనికి కారణం పన్ను ప్రక్రియ సంక్లిష్టంగా ఉండడమే.
ఈ ప్రక్రియలో చిక్కుకొని ఇక ఎప్పటికీ తాము బయటపడలేమేమోనని వారి భావన. కానీ, పన్ను చెల్లింపులను జి ఎస్ టి సులభతరం చేస్తుంది. దీనివల్ల దేశం కోసం పాటుపడే వారు పన్ను చెల్లింపునకు ముందుకు రావడానికి వీలు కలుగుతుంది. ఇక రెండవది, మీరు ఏదైనా హోటల్‌కు వెళ్ళి అక్కడ ఏమైనా తిని బిల్లును అందుకున్నారనుకోండి.. ఆ బిల్లులో సెస్ ఉంటుంది. ప్రజలు ఆ బిల్లులో పడిన సెస్ ను చూసి తాము ఎంతకు తింటే సెస్ ఎంత పడిందో చూడండి అంటూ బిల్లు , దానిపై పడిన సెస్‌కు సంబంధించిన వివరాలను వాట్సప్‌లో పంపుతుండడం చూస్తుంటాము.
ఇలాంటివన్నీ ఇక ఉండవు. అలాగే ఇక ఆక్ట్రాయ్, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద చూస్తే మైళ్ల కొద్దీ వాహనాలు బారులు తీరి ఉండడం గమనిస్తుంటాము. ఇలా వాహనాలు గంటల తరబడి చెక్‌పోస్టుల వద్ద నిలచిపోతే, అది దేశ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావాన్ని చూపుతుంది. ఇవన్నీ ఇక పోతాయి; ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి సరకులు సాఫీగా సాగడానికి వీలు కలుగుతుంది.
పన్ను విధానం కూడా సులభతరం అవుతుంది. ఇది సామాన్యుడికే కాదు, దేశాభివృద్ధికీ ఉపయోగపడుతుంది. రాష్ట్రాల మధ్య నమ్మకం లేని పరిస్థితులు అక్కడక్కడా గమనిస్తుంటాము. అలాంటి పరిస్థితులు ఇక ఉండవు. పారదర్శకతతో ఇది సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
ప్రశ్న: మీరు అధికారంలోకి వచ్చిన తరువాత మీ ముందు ఉన్న అతి పెద్ద సవాలు ఆర్థిక వ్యవస్థ. కేవలం ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే కాక, ప్రగతి వేగాన్ని పెంచాల్సిన లక్ష్యం కూడా మీ ముందు ఉండింది. ఈ లక్ష్యాన్ని మీరు సాధించగలిగారా?
ప్రధాన మంత్రి మోదీ: మీరు చెప్పింది నిజం. అప్పట్లో వ్యతిరేక వాతావరణం ఉండేది. దేశ వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఇతర ప్రాంతాల వైపు చూడడం మొదలుపెట్టారు . ప్రభుత్వంలో ప్రతిష్ఠంభన ఉండేది. ఒక వైపు ఇటువంటి పరిస్థితులు ఉంటే , మరొక వైపు మనం వరుసగా రెండు సంవత్సరాలు కరవు పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. ఇక మూడోది ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగమనం. అందువల్ల వరుస సవాళ్ళు వచ్చిపడ్డాయి. మేం అధికారం అందుకున్నప్పుడే కాదు, ఆ తరువాత కూడా మాకు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే మా సంకల్పం బలమైంది, మా విధానాలలో స్పష్టత ఉంది. స్వప్రయోజనాలు లేవు కనుక సమస్యల పరిష్కారంలో నిబద్ధత ఉంది. ఫలితంగా ఎంతో త్వరగా సానుకూల వాతావరణం ఏర్పడింది.
స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం మున్నెన్నడూ లేనంత స్థాయిలో ప్రస్తుతం దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్నాయి. 7 శాతం వృద్ధితో మనది అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మొత్తం ప్రపంచం చెబుతోంది. అది ప్రపంచ బ్యాంక్ కానివ్వండి, లేదా ఐ ఎమ్ ఎఫ్, లేదా క్రెడిట్ రేటింగ్ సంస్థలు.. చివరకు ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు. అన్నీ కూడా భారతదేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నదని చెబుతున్నాయి.
ప్రగతికి ఉపయోగపడే విధానాలపై దృష్టిపెట్టడం జరిగింది. తగిన విధానాలు అనుసరించడం ద్వారా అన్ని రకాల అడ్డంకులను తొలగిస్తున్నాము. ఇటువంటివన్నీ ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఈసారి వర్షాలు బాగున్నాయి. ఇది వ్యవసాయ రంగానికి తోడ్పడుతుంది. ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా ఉపయోపడేది వ్యవసాయ రంగం. దీనితో రాగల రోజులు మరింత బాగుంటాయన్న విశ్వాసం కలుగుతోంది.
సాధారణంగా ఒకటి రెండు రంగాలలో పురోగతిని గురించి మాట్లాడుకుంటుంటారు. కానీ ఇవాళ అన్ని రంగాలలో పురోగతి గురించి చర్చించుకుంటున్నారు. విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. అలాగే డిమాండ్ కూడా పెరిగింది. మౌలిక సదుపాయాల కల్పన రంగం పనులు కూడా శరవేగంతో సాగుతున్నాయి.అది కూడా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ఉన్నప్పుడు సాగుతోంది. ఇవన్నీ గమనించినపుడు, మేము మంచి రోజులవైపు అడుగులు వేశామని చెప్పవచ్చు.
ప్రశ్న: మీరు చెప్పినట్టు రుతుపవనాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి, స్టాక్ మార్కెట్లు కూడా పురోగమిస్తున్నాయి. మరి ఇక తదుపరి దశ సంస్కరణలు ఎలా ఉంటాయో దయచేసి చెబుతారా ?
ప్రధాన మంత్రి మోదీ: అన్నింటి కంటే ముందు, భారతదేశంలో మాట్లాడే దానిని మాత్రమే సంస్కరణగా చూస్తుంటాము. దాని గురించి మాట్లాడకపోతే దానిని సంస్కరణగా చూడము. ఇది మన అమాయకత్వాన్నిసూచిస్తుంది. అందుకే రిఫామ్ నుండి ట్రాన్స్‌ఫాం కావాలంటాను. రిఫామ్, పెర్ఫామ్, ట్రాన్స్ఫామ్ అని నేను నా ప్రభుత్వంలో చెబుతుంటాను. నేను ఈ ఇంటర్వ్యూలో రిఫామ్, పెర్ఫామ్, ట్రాన్స్ఫామ్ కు ఇన్ఫామ్ అనే మాటను కూడా జోడిస్తాను.
ఇక వ్యాపార కార్యకలాపాల నిర్వహణను తీసుకోండి; మన ర్యాంకింగ్ త్వరగా మెరుగుపడుతోంది. సంస్కరణలు లేకుండా ఇది సాధ్యం కాదు. మన వ్యవస్థలు, మనం అనుసరించే ప్రక్రియలు ఎంతో సంక్లిష్టమైనవి. వీటిని సంస్కరించాము. అందువల్ల మన ర్యాంకింగ్ పెరుగుతోంది. ఐక్య రాజ్య సమితి ఏజెన్సీ ఒకటి మా ర్యాంకింగ్ మరో దశాబ్దంలో పదో స్థానం నుండి మూడో స్థానానికి చేరుకుంటుందని నొక్కిచెప్పింది. కొన్నిచిన్న చిన్నఅంశాలను మెరుగు పరచవలసి ఉంది. ఇప్పటికీ కొన్ని రంగాలలో లైసెన్స్‌రాజ్ ఉంది. ఇది పోవాలి. ప్రతి స్థాయిలో అంటే ప్రభుత్వ, పాలన, న్యాయ రంగాలలో ప్రధాన సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి.
ఉదాహరణకు 19, 20 శతాబ్దాల నుండి ఉన్న 1700 చట్టాలను మేము తొలగించాము. రాష్ట్రాలను కూడా ఇలాగే చేయమని కోరాము. ఇవి చాలా పెద్ద సంస్కరణలు. వీటి మీద ప్రజలకు సమాచారం లేకపోతే, ఇవి సంస్కరణలుగా కనిపించవు.
విద్యనే తీసుకోండి, మేము కీలక నిర్ణయం తీసుకున్నాము. కానీ దీనిపై ఎవరూ దృష్టి పెట్టలేదు. దేశంలోని పది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, పది ప్రైవేటు విశ్వవిద్యాలయాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలన్నింటి నుండి తప్పిస్తామని చెప్పాము. వాటికి మేము నిధులు ఇస్తాము, అవి ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయాలుగా ఎదగాలి. వారికి నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయనుకుంటే, నిబంధనలను మేము తొలగిస్తున్నాము. ఇక ఇప్పుడు చర్యలు తీసుకోండి- ఫలితాలు చూపండి అని అంటున్నాము. నిజానికి ఇదొక పెద్ద సంస్కరణ. కానీ, దీనిపై దృష్టి తక్కువగా ఉంటోంది.
ఇక ప్రత్యక్ష నగదు బదిలీ ఒక పెద్ద సంస్కరణ. గతంలో ఎమ్ ఎన్ ఆర్ ఇ జి ఎ నిధులు ఎక్కడికి వెళుతున్నాయో ఎవరికి తెలిసేది ? ప్రస్తుతం వీటిని డి బి టి ద్వారా పంపుతున్నారు. అలాగే గ్యాస్ సబ్సిడీ చెల్లింపులు, విద్యార్థులకు ఉపకార వేతనాల చెల్లింపులు కూడాను. ఇవన్నీ నా దృష్టిలో పాలనలో, పారదర్శకతలో తీసుకువచ్చిన సంస్కరణలు. మేము మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాము. వీటిని పెద్ద స్థాయిలో అమలు చేయవలసి ఉంది. దీనికి కేంద్ర బిందువు సామాన్యుడు. సామాన్యుడి జీవితాన్ని సులభతరం చేయడం ఎలా ?, వారి హక్కును వారు పొందడం ఎలా ? ఇటువంటి విషయాలపై మేము మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నాము.
ప్రశ్న: ఆర్థిక ప్రగతి ఉన్నప్పటికీ, ఆర్థిక రంగంలో ప్రైవేటు పెట్టుబడుల వాతావరణంలో పెద్ద ఉత్సాహం కన్పించడం లేదు. రియల్ ఎస్టేట్ వంటి కొన్ని రంగాలు ఇంకా సమస్యలలోనే ఉన్నాయి. స్టార్టప్‌లకు వెంచర్ కాపిటల్ ఫండింగ్ తక్కువగా ఉంది. ఈ దశలో ప్రైవేటు పారిశ్రామిక రంగానికి, విదేశీ పెట్టుబడిదారులకు మీరు ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలచారు ?
ప్రధాన మంత్రి మోదీ: మా ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు దేశ ఆర్థిక స్థితిగతులపై పార్లమెంట్లో ఒక శ్వేత పత్రం ప్రవేశపెట్టి ఉండవలసిందని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఇటువంటి ఆలోచన ఒకటి నా మదిలో అప్పట్లో ఉండేది. అయితే అప్పట్లో నా ముందు రెండు మార్గాలు ఉన్నాయి. రాజకీయం అన్ని వివరాలనూ బహిర్గతం చేయాలని చెబితే, మరొకవైపు దేశ ప్రయోజనాల దృష్టిలోంచి చూస్తే ఈ సమాచారం నిరాశా నిస్పృహలను ఇంకా పెంచుతుందని, మార్కెట్లు బాగా దెబ్బతింటాయని, ఆర్థిక వ్యవస్థకు ఇది కోలుకోలేని దెబ్బ అవుతుందని అనిపించింది.
ప్రపంచం దృష్టిలో దేశం ప్రతిష్ఠ దెబ్బతింటుందని అనిపించింది. అదే జరిగితే, ఈ పరిస్థితి నుండి ఆర్థిక వ్యవస్థను బయటపడేయడం చాలా కష్టం. ఇటువంటి పరిస్థితులలో రాజకీయంగా నష్టం జరిగినా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మౌనంగా ఉండడానికే నిర్ణయించుకున్నాను. అదే దశలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి క్రమంగా అవగతం అవుతూ వచ్చింది. ఈ విషయాలను నేను బయటపెట్టలేదు. . ఇదంతా మా తప్పు అనిపించేలా మమ్మల్ని కొందరు విమర్శిస్తుంటారు. నాకు బాధేస్తుంటుంది. కానీ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా నష్టాన్ని భరించాను.
గతంలో జరిగిన ఈ సంఘటనలన్నీ బ్యాంకులలో నిరర్థక ఆస్తుల మాదిరి ప్రైవేటు పెట్టుబడులపైన ప్రభావాన్ని చూపాయి.. బ్యాంకర్లతో నేను సమావేశం ఏర్పాటు చేసి, ప్రభుత్వం నుండి మీకు ఎటువంటి ఫోన్ కాల్ రాదని చెప్పాను. ఈ చర్యలు పరిస్థితిని చక్కదిద్దడానికి ఉపయోగపడ్డాయి. ఇంతే కాదు, రహదారులను ఎంతో వేగంగా నిర్మిస్తున్నాము, రైల్వేలు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో 6 రెట్ల వృద్ధిని సాధించాము. వీటిని గమనించినప్పుడు మేము షార్ట్ కట్ పద్ధతులను అనుసరించలేదని తెలుస్తుంది. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ వద్ద రాసిన నినాదంలా ‘షార్ట్ కట్ విల్ కట్ యు షార్ట్’ అనేది నా నినాదం కూడా. మేము దగ్గరి దారులను వెతకడం లేదు. అందుకే ఫలితాలు బాగుంటున్నాయి.
మొత్తంమీద ప్రస్తుతం పరిస్థితి మెరుగైంది. వీటిని గురించి ఆందోళన చెందనక్కరలేదు. కానీ, 2014 మే నెల ఆరంభంలో మాత్రం నేను క్లిష్టమైన మార్గాన్నే ఎంచుకున్నాను. ప్రజలు పరిస్థితిని నిష్పాక్షికంగా విశ్లేషించినట్టయితే, వారు ఆశ్చర్యపడతారని నేను గట్టిగా విశ్వసిస్తాను.
ప్రశ్న: మీరు నల్లధనంపై కఠిన వైఖరిని అనుసరించారు. ఇలా మీరు కొరడాను ఝళిపించడంతో కొందరు వ్యాపారవేత్తలు దుబాయ్‌లోనో, లండన్లోనో రహస్యంగా తల దాచుకుంటున్నారని అంటున్నారు. మీరు రాజకీయ కుటుంబాలను కూడా వదలలేదని కూడా అంటున్నారు. ఈ ప్రక్రియను కొనసాగిస్తారా ?
ప్రధాన మంత్రి మోదీ: ముందుగా, నేను అసలు ఈ అంశాన్ని రాజకీయ దృష్టి కోణంలో నుండి చూడలేదు. భవిష్యత్తులో కూడా అలా చేయను. నేను 14 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను. నేను రాజకీయ కారణాలతో ఏ ఫైలూ తెరవలేదు. ఇందుకు చరిత్రే సాక్షి. ఈ కోణంలో నుండి నాపై ఎటువంటి ఆరోపణలూ రాలేదు. ఇక్కడ కూడా గత రెండేళ్ల లోనూ ఇదే పరిస్థితి. ఏ ఫైలూ తెరవవలసిందిగా ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదు. చట్టం తన పనిని తాను చేస్తుంది. దేనినీ మూసిపెట్టే అధికారం నాకు లేదు. రాజకీయ జీవులను కూడా మేం లెక్కచేయలేదని మీరు అంటున్నది సరైంది కాదు. దేశంలో నల్లధనం చెలామణిని నియంత్రించేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలను తీసుకున్నాము.
ఇందుకు సంబంధించిన ఒక పథకం సెప్టెంబర్ 30 వ తేదీ వరకు అమలులో ఉంటుంది. నల్లధనానికి సంబంధించి వివరాలు వెల్లడించి ప్రధాన స్రవంతిలో కలవాలనుకునే వారికి, మీకు సెప్టెంబర్ 30 తుది గడువు ఈ సంగతి గుర్తించండని నేను బహిరంగంగానే చెప్పాను. మీరు ఏవేవో కారణాలతో తప్పులు చేసి ఉండవచ్చు. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక తెలియకుండా జరిగిందా అనేది వేరే విషయం. ఇదే మీకు చివరి అవకాశం. ఇకనైనా ప్రధాన స్రవంతిలోకి రండి. నల్లధనాన్నివెల్లడించి ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పాను . ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలి. సెప్టెంబర్ 30 వ తేదీ తరువాత నేను కఠిన నిర్ణయాలు తీసుకుంటే నన్ను ఎవరూ నిందించకూడదు.ఇది పేద ప్రజల డబ్బు. వారి డబ్బును దోచుకునే అధికారం ఎవరికీ లేదు. ఇదీ నా నిబద్ధత. నేను సంపూర్ణ శక్తితో పని చేస్తున్నాను. ఇదే స్పూర్తిని కొనసాగిస్తాను.
ప్రశ్న: ప్రధాన మంత్రి గారూ, ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకుందాము. వచ్చే ఏడాది పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. సామాజిక వివక్ష, ఫండమెంటలిజమ్ పెరిగిపోతున్నాయి. దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు బి జె పి, ఆర్ ఎస్ ఎస్ లు దళిత వ్యతిరేకమని చెప్పడం మొదలుపెట్టారు. మరి ఇటువంటి పరిస్థితులలో మీ అజెండా అభివృద్ధి మాత్రమేనని ప్రజలకు ఎటువంటి హామీని ఇస్తారు ?
ప్రధాన మంత్రి మోదీ: మా అజెండా అభివృద్ధి మాత్రమేనన్న పూర్తి విశ్వాసం దేశ ప్రజలకు ఉంది. ప్రజలకు ఈ విషయంలో ఎటువంటి గందరగోళం లేదు. ఈ తరహా ప్రభుత్వం అధికారంలోకి రావడం గాని, గత ప్రభుత్వం పోవాలని గాని ఎన్నడూ కోరుకోని వారు కొందరు ఉన్నారు. వారి విషయంలోనే సమస్య. కనుక అభివృద్ధి ఒక్కటే మా ముందు ఉన్న అంశం. ఇక ముందు కూడా అదే మా విధానం. ఇది రాజకీయపరమైన అంశం కాదు. ఇది నా నిబద్ధత. మనం ఈ దేశాన్నిపేదరికం నుండి విముక్తి చేయాలంటే మనకు అభివృద్ధి అవసరం. మనం పేదలకు సాధికారతను కల్పించాలి.
ఇక జరగకూడని కొన్ని విషయాల గురించి, వాటిని తప్పకుండా ఖండించాలి. నాగరిక సమాజంలో అటువంటి వాటికి స్థానం లేదు. అయితే శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్రాల అంశం. కొంతమంది కొన్ని అంశాలను ఎంపిక చేసుకొని వాటికి మోదీని నిందిస్తున్నారు. ఇటువంటివి చేసే వారికి వచ్చే ప్రయోజనం ఏమిటో నాకు తెలియదు. ఇది కచ్చితంగా దేశ ప్రయోజనాలకు భంగకరం. అటువంటి ఘటనలు జరగకూడదు. గణాంకాల పరంగా చూసినా మతపరమైన హింస కానివ్వండి, దళితులు లేదా గిరిజనులపై అకృత్యాలు కానివ్వండి- ఇటువంటివన్నీ గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే బాగా తగ్గాయి.
అసలు ఇలాంటివి గత ప్రభుత్వంలో జరిగాయా లేక ఈ ప్రభుత్వ హయాంలో జరిగాయా అన్నది కాదు; అలాంటివి మన సమాజానికి ఎంతమాత్రం తగినవి కావు. మనకు వేల సంవత్సరాల సంస్కృతి ఉంది. మనం మన సమాజంలో కొన్ని అసమానతలను చూశాము. మనం తెలివిగా ఈ అసమానతల నుండి సమాజాన్ని బయట పడవేయాలి. ఇది సామాజిక సమస్య. ఇది బాగా వేళ్ళూనుకుని పోయింది. సామాజిక అసమానతలపై రాజకీయాలు చేయడం సమాజానికి చేటు చేయడమే. మీరు దళిత ఎంపీలు, దళిత ఎమ్మెల్యేలు, గిరిజన ఎంపీలు, గిరిజన ఎమ్మెల్యేలనే తీసుకోండి- వారి సంఖ్య బిజెపిలో గణనీయంగా ఉంది.
నేను బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేడ్కర్ 125 వ జయంతిని నిర్వహించాను. ఐక్య రాజ్య సమితి , 102 దేశాలు బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతిని నిర్వహించాయి. బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవితంపై, ఆయన రచనలపై పార్లమెంటు రెండు రోజులు చర్చించింది. దీనితో చాలా మంది మోదీ అంబేద్కర్ భక్తుడని తెలుసుకున్నారు. వారికి ఇది సమస్య. దళితుల సంరక్షకులమని తమకు తాముగా ప్రకటించుకునే కొంతమందికి మోదీ దళితుల పక్షాన ఉండడం గాని, మోదీ గిరిజనుల పక్షాన ఉండడం గాని ఇష్టం లేదు. నేను దళితుల, అణగారిన వర్గాల, పేదల, మహిళల అభివృద్ధికి అంకితమై ఉన్నాను.
తమ రాజకీయాలకు ఇది అడ్డంకిగా భావించే వారు సమస్యలు సృష్టిస్తున్నారు. అందువల్లే వారు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. కుల విభజన అనే విషంతో దేశాన్ని పెంచి పోషించిన వారు దేశాన్ని నాశనం చేశారు. సామాజిక సమస్యలకు రాజకీయ స్వరం తగదు. మనం ఒక ప్రయోజనంతో ముందుకు సాగాలి. నేను సమాజాన్ని కూడా అడగదలచాను ఈ మాదిరి సంఘటనలు మన నాగరిక సమాజానికి తగినవా అని ?
నేను ఎర్రకోట బురుజుల మీది నుండి మాట్లాడుతూ, అత్యాచార ఘటనల గురించి ప్రస్తావించాను. ఆ సందర్భంలో ఒక మాట చెప్పాను. తల్లితండ్రులు వారి కుమారులు ఎక్కడికి వెళుతున్నారు ? ఏం చేస్తున్నారని అడగాలని చెప్పాను. మనం కుమార్తెల విషయంలో ఇటువంటి ప్రశ్నలు వేస్తుంటాము. అలాగే నేను రాజకీయ నాయకులకు ఒక విషయం చెప్పదలచాను. మా పార్టీ వారికి కూడా .. మీరు ఎవరి గురించైనా గాని లేదా ఏ వ్యక్తికి చెందిన కమ్యూనిటీని గురించైనా గాని మీడియా ముందు నిర్లక్ష్యంగా ప్రకటనలు చేస్తే, మీడియా మీ ముందుకు రావచ్చు, దానికి టి ఆర్ పి కావాలి. కానీ, మీరు దేశానికి జవాబుదారుతనంతో మెలగవలసి ఉంటుందని గుర్తించాలి. అందువల్ల ప్రజాజీవితంలో ఉన్నవారు, అంటే రాజకీయాల్లోని వారు గాని లేదా సామాజిక కార్యకర్తలు గాని లేదా మనం ఏదైనా కమ్యూనిటీకి ప్రతినిధులమైనా సరే.. దేశ ఐక్యత కోసం, సామాజిక ఐక్యత కోసం మరింత జాగరూకతతో ఉండాలి.
మనం గాయపడినపుడు ఒక చిన్న కాగితం ముక్క తగిలినా బాధ కలిగిస్తుంది. వేల సంవత్సరాలుగా జరిగిన అన్యాయం ఈ గాయాలను అలాగే ఉంచింది. అందువల్ల ఏదైనా సంఘటన అది చిన్నదా లేక పెద్దదా అన్నది కాదు విషయం. అటువంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని గుర్తించాలి. ఏ ప్రభుత్వ హయాంలో ఎక్కువ జరిగాయి ?, ఏ ప్రభుత్వ హయాంలో తక్కువ జరిగాయి ? అన్నది కాదు విషయం. మనందరం కలసి సమష్టిగా ఈ దేశ ఐక్యతను బలోపేతం చేయాలి.
ప్రశ్న : ఆర్థిక ప్రగతికి సామాజిక శాంతియుత సహజీవనం ఎంత ముఖ్యమంటారు ?
ప్రధాన మంత్రి మోదీ : ఆర్థిక ప్రగతి ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. శాంతి, సమైక్యత, శాంతియుత సామాజిక సహజీవనం సమాజానికి అవసరం. కుటుంబ విషయంలో కూడా , మీరు ఎంత సంపన్నులైనా కావచ్చు, మీరు డబ్బు కట్టలపై కూర్చోవచ్చు, కానీ, కుటుంబ ఐక్యత చాలా ముఖ్యం. సమాజం విషయంలో కూడా ఇది సత్యం. పేదరికంపై పోరుకు మాత్రమే కాదు ఐక్యత. మనం ఐక్యంగా సామరస్యంతో సహజీవనం చేయాలి. మనం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలి. అందువల్ల ఐక్యత ఆర్థిక ప్రగతి కోసం మాత్రమే కాదు, శాంతి, ఐక్యత, శాంతియుత సహజీవనం.. ఇవన్నీ కుటుంబం, జీవితం, సమాజం, చివరికి.. దేశానికి కూడా అవసరం. వసుదైక కుటుంబకం భావనను విశ్వసించే వారికి ఈ ప్రపంచం అంతా ఒక్కటే.
ప్రశ్న : అన్ని రాజకీయ పార్టీలూ పేదరికం రూపుమాపడం గురించి మాట్లాడుతుంటాయి. అయినా మన దేశంలో పేదరికం అనేది ఇంకా ఆందోళన కలిగించే అంశం. ఉద్యోగాల కల్పన అనేది మీకొక ప్రధాన సవాలు. ఇది మీ దృష్టిలో ఉంది కూడా. ఈ రెండు విషయాల్లో మీ వ్యూహం ఏమిటి ?
ప్రధాన మంత్రి మోదీ: మీరు చెప్పింది వాస్తవం. పేదరిక నిర్మూలన ఒక రాజకీయ నినాదమైంది. పేదరికంపై ఎన్నో రాజకీయాలు. పేదరిక నిర్మూలనకు సంబంధించిన చాలా పథకాలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆరంభించారు. అది మంచిదా లేక చెడ్డదా అన్న వివాదంలోకి నేను వెళ్లదలచుకోలేదు. కానీ, నా మార్గం కాస్త భిన్నమైంది. పేదరికాన్ని అంతం చేయడానికి మనం పేదలకు సాధికారత కల్పించాలి. పేదలకు సాధికారతను కల్పిస్తే పేదరికాన్ని తొలగించే అదనపు శక్తి వారికి కలుగుతుంది. పేదలను పేదలుగా ఉంచి, రాజకీయాలు చేయవచ్చు. కానీ పేదలకు సాధికారతను కల్పించడం ద్వారా మాత్రమే వారికి పేదరికం నుంచి విముక్తి లభిస్తుంది. సాధికారతకు పెద్ద ఉపకరణం విద్య. ఆ తరువాత ముఖ్యమైనది ఉపాధి. మనం ఆర్థిక సాధికారతను కల్పిస్తే అది తనంతట తానుగా పరిస్థితులు మార్చడానికి ఉపకరిస్తుంది.
గత కొన్ని సంవత్సాలుగా మనం తీసుకున్న చర్యలు గమనించండి. ఉదాహరణకు ముద్ర పథకం. మూడున్నర కోట్ల మంది ప్రజలు ఈ పథకం నుంచి లబ్ధిని పొందారు. సుమారు 1.25 లక్షల కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా వారు పొందారు. ఇందులో డబ్బు పొందిన వారు బ్యాంకుల నుండి తొలిసారిగా సహాయాన్ని అందుకొన్న వారే. వీరు ఏదో ఒకటి చేస్తారు. వారు కుట్టు మిషన్ లు కొనుక్కోవచ్చు, బట్టలు కుట్టవచ్చు; ఇలా ఏదో ఒకటి చేస్తారు. వారు మరికొందరికి ఉపాధి కల్పించవచ్చు. ఈ సాధికారత వీరికి ఎంతో శక్తిని ఇస్తుంది. వాళ్ల పిల్లలను వారు చదివించుకోవచ్చు.
ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి టాక్సీ కొన్నాడని అనుకొందాం. అప్పుడు వారు తమ పిల్లలను చదివించాలని అనుకుంటారు. వారు ఆ దిశగా ముందుకు వెళ్తారు. మనం ‘స్టాండప్ ఇండియా’ కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రతి బ్యాంకు శాఖ ఒక దళితుడు, ఒక గిరిజనుడు, ఒక మహిళకు ఆర్థిక సహాయాన్ని అందించాలని నేను బ్యాంకుల వారికి చెప్పాను. బ్యాంకులు తప్పకుండా వీరిని ఔత్సాహిక పారిశ్రామికులుగా మార్చాలి. దేశంలో లక్షా పాతిక వేల బ్యాంకు శాఖలు ఉన్నాయి. వీరు కనీసం ముగ్గురికి సాధికారతను కల్పించినా నాలుగు నుంచి ఐదు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఇంతవరకు ఆర్థిక సాధికారతకు నోచుకోని వారు సాధికారతను పొందుతారు. వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. ‘స్టార్టప్ ఇండియా’ పథకాన్ని యువతకు ఉపాధిని కల్పించేందుకు నేను ప్రారంభించాను. ఇవన్నీ చిన్న నిర్ణయాలు. నేను రాష్ట్రాలకు కొన్ని సూచనలు కూడా చేశాను. ఈ దిశగా రాష్ట్రాలు పురోగమించాలి.
మన దేశంలో పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు వాటి నిర్మాణంపై ఖర్చు చేశారు. వారు ఎన్ని గంటల వరకైనా వ్యాపారం చేయడానికి పరిమితులు లేవు. వారు రాత్రి 10 గంటలు, 12 గంటలు లేదా వేకువజాము 4 గంటల వరకైనా వాటిని నడపవచ్చు. కానీ చిన్న వ్యాపారుల విషయంలో మాత్రం వారిని షాపు మూసివేయమని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు చేతిలో కర్ర పట్టుకొని చెబుతుంటారు. ఎందుకు ? ఈ చిన్న వ్యాపారులది చిన్న వాణిజ్యం. వారు 365 రోజులూ, 24 గంటలూ షాపులు తెరిచి వ్యాపారం చేసుకునేలా ఉండాలని చెప్పాము. దీనివల్ల వారు వారి వ్యాపారం చేసుకోవడమే కాక మరికొంత మందికి ఉపాధిని కల్పించవచ్చు. మన దేశంలో ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళుతున్నది ఇటువంటి వారే. ఇలా సాధికారతను కల్పించడానికి కృషి చేస్తున్నాము.
నైపుణ్యాభివృద్ధిపై మేం ప్రత్యేక దృష్టి పెడుతున్నాము. నైపుణ్యాభివృద్ధి ఇప్పుడు తక్షణావసరం. మేం వ్యవస్థలను మార్చాము. నైపుణ్యాభివృద్ధికి ఒక మంత్రిత్వ శాఖ, దానికి వేరుగా బడ్జెట్. ఈ విషయంలో పెద్ద ఎత్తున పని జరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాము. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో నైపుణ్యాభివృద్ధి జరుగుతోంది. అలాగే నైపుణ్యాభివృద్ధి రంగంలో మంచి కృషి చేసిన ఇతర దేశాల విశ్వవిద్యాలయాలతో కలసి నైపుణ్య విశ్వవిద్యాలయాల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. దేశంలో 80 కోట్ల మంది యువతీయువకులు ఉన్నారు. వారంతా 30 ఏళ్ల లోపు వయస్సు వారే.
యువతకు నైపుణ్యం ఉంటే ఈ దేశపు దశను మార్చగలరు. దీనిపై మేం దృష్టి పెట్టాము. అన్నిఆర్థిక కార్యకలాపాలకు దేశ యువత, ఉపాధి అవకాశాలు కేంద్రకం. వ్యవసాయ రంగంలో కూడా అదనపు విలువను జోడిస్తే అది ఉపాధిని కల్పించడానికి అనువైన మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది. తప్పని పరిస్థితులలో పెద్ద పట్టణాలకు వలసి పోవలసి వస్తున్న గ్రామీణ యువతకు విలువను జోడిస్తే, వ్యవసాయ కేంద్రిత గ్రామీణాభివృద్ధి కల్పిస్తే, సాధికారతను సమకూర్చితే ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. మేం దీని మీద దృష్టి సారిస్తున్నాము. ఫలితంగా మనం కొన్ని మంచి ఫలితాలు
చూడవచ్చు.
ప్రశ్న : విదేశాలలోని భారతీయులతో నేరుగా సంబంధాలుగల తొలి ప్రధాన మంత్రి మీరు. ఇది దేశానికి ఏ రకంగా లబ్ధిని చేకూర్చింది ?
ప్రధాన మంత్రి మోదీ : ప్రతి ఒక్క దానిని లాభ నష్టాల స్కేలుపై ఉంచి కొలవకూడదు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారైనా, భారతీయులు ఎవరైనా , వారు ఏ హోదాలో ఉన్న వారైనా నా దేశం ప్రగతిని సాధించాలి అన్న ఆకాంక్ష వారిలో ఉంటుంది. తమ దేశాన్ని గురించి వ్యతిరేక వార్తలు వస్తే వారు ఎంతో నిరాశకు గురౌతారు. ఎందుకంటే వారు ఎంతో దూరంలో ఉంటారు. ఇది వారిని మరింత బాధిస్తుంది. మనం వారి నుండి చాలా పొందుతుంటాము. వాటిపైన ప్రభావం పడుతుంది. భారతదేశంపై వారికి ఎంతో అభిమానం ఉంది. అయితే, వారికి సరైన మార్గం, అవకాశం లభించడం లేదు.
మేం నీతి ఆయోగ్ లో ప్రవాస భారతీయుల శక్తిని గుర్తించాము. ఇది గొప్ప అంతర్జాతీయ శక్తి. వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారికి మంచి చదువు, మంచి విద్యార్హతలు ఉన్నాయి. దేశం కోసం పనిచేయాలన్న తపన వారిలో ఉంది. వారు ఎక్కడ ఉన్నా తమ దేశం పట్ల వారి ప్రేమ ఎంతమాత్రం తగ్గలేదు. మనం వాళ్లతో కలవకుండా ఎందుకుండాలి ? మనం వాళ్లతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. వారు ఈ దేశ నిజమైన రాయబారులుగా వ్యవహరించే సమయం రావచ్చు. నిజానికి భారతదేశ శక్తి, ప్రవాస భారతీయుల వైఖరి వారికి గల సంబంధాలపై ఆధారపడి ఉందని నేను భావిస్తాను. ప్రభుత్వ చర్యల కంటె ఇది మిన్న. ప్రభుత్వ కృషి, ప్రధానంగా ప్రవాస భారతీయుల కృషి.. ఈ రెండూ జత అయితే మన శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఇదీ నా పాత్ర. ఈ దిశగా మేం మంచి ఫలితాలు సాధిస్తున్నాము.
ప్రశ్న ..
ప్రధాన మంత్రి మోదీ : ముందుగా, మన దేశంలో మనం చేసిన ప్రతి దానినీ వెంటనే ఎన్నికలకు ముడిపెడుతుంటారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దూరంలో ఉన్నాయి. అయినా మా నిర్ణయాలన్నింటినీ దానితో ముడి పెడుతున్నారు. రాజకీయ విశేష పండితులు తమ ఆలోచనలలో నుండి రాజకీయాలను పక్కన పెట్టలేరు. ఎ సి గదులలో వారి ఆలోచనలు రాజకీయాల చుట్టూ మరింత వేగంగా తిరుగుతాయి. అయినా మన దేశంలో తరచూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకసారి ఇక్కడ ఎన్నికలు జరిగితే, మరొకసారి మరొక చోట ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు.. ఎన్నికలు.
ఇలా ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక చోట ఎన్నికలు. ప్రతి నిర్ణయాన్ని ఎన్నికల త్రాసులో వేసి చూస్తున్నారు. వివిధ నిర్ణయాలను ,వివిధ అంశాలను మనం ఎన్నికలతో ముడిపెడుతూ పోతున్నంత కాలం దేశంపై వ్యతిరేక ప్రభావమే పడుతుంది. ఇప్పటికైనా మనం ఈ రెండింటిని వేరు చేయాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల ప్రకటన వచ్చిన తరువాత రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వాగ్దాన పత్రంతో వస్తాయి. వాటిని మనం ఇప్పడే ఎందుకు కలపాలి ? రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు నన్ను కలసినపుడు దయచేసి ఎన్నికల ప్రయోజనాలను పక్కన పెడదాం అని గట్టిగా చెబుతుంటారు. శాసన సభ ఎన్నికలను లోక్ సభ ఎన్నికలతో ఎందుకు ముడిపెట్టకూడదని వారు నన్ను అడుగుతుంటారు.
అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాటితో పాటే ఎందుకు జరపకూడదు ? దీనివల్ల మొత్తం ఎన్నికలు వారం పది రోజులలో పూర్తి అయ్యి, ఆ తరువాత ఐదు సంవత్సరాల పాటు దేశం నిరంతరాయంగా పాలన సాగించడానికి వీలు కలుగుతుంది కదా. ఇలా అయితే అధికార యంత్రాంగం మరింత సమర్థంగా పనిచేస్తుంది. నిర్ణయాలలో వేగం వస్తుంది. ప్రతి పార్టీ దీని గురించి చెబుతోంది. కానీ ఏ ఒక్క పార్టీ దీనిని నిర్ణయించలేదు. అన్ని పార్టీలూ కలసి దీనిని ఉమ్మడిగా చేయాలి. ఎన్నికల కమిషన్ దీనికి నాయకత్వం వహించాలి. అన్ని పార్టీలూ దీనికి అంగీకరించాలి.
నాకు కొన్ని ఆలోచనలు ఉండవచ్చు. వాటి విషయంలో నేను ఏమీ చేయలేను. దీనిని ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి. ఏదో ఒక రోజు దీనిపై సమగ్ర చర్చ జరుగుతుందని నేను అనుకొంటున్నాను.
రాగల రోజులలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఉత్తర ప్రదేశ్ ఒకటి. బిజెపి విషయానికి వస్తే, మేం అభివృద్ధి అంశాలపైనే పోరాడుతాము. మా దృష్టి రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, యువతకు ఉపాధి వంటి వాటిపైన ఉంటుంది. మేం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాము. దేశంలో శాంతిని, ఐక్యతను, సోదరభావాన్ని కాపాడడంపైనే మా దృష్టి. ఈ దిశగా చర్యలు తీసుకుంటూ ముందుకు సాగిపోతాము.
ప్రధాన మంత్రి మోదీ : కులతత్వం, మతపరమైన వోట్ బ్యాంకు ల వంటివి మన దేశంలో తీరని నష్టాన్ని కలిగించాయి. వోట్ బ్యాంకు రాజకీయాలే మన ప్రజాస్వామ్యం బలోపేతానికి అడ్డంకిగా నిలుస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో వోట్ బ్యాంకు రాజకీయాల వాతావరణం లేదు. అభివృద్ధి రాజకీయాల వాతావరణం ఉంది. 30 సంవత్సరాల తరువాత సమాజంలోని అన్ని వర్గాలు కలసికట్టుగా సంఖ్యాధిక్యం గల ప్రభుత్వానికి వోటు వేశారు. సమాజంలోని అన్ని వర్గాలూ మార్పు దిశగా చూశాయి. ఉత్తర ప్రదేశ్ ప్రజలు కూడా ఆ రాష్ట్ర పురోగతి కోసం అలాంటి పనే చేస్తారు. వారు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వోటు వేయనున్నారు.
ప్రధాన మంత్రి మోదీ : మనం జమ్ము & కశ్మీర్ ను గురించి ఎప్పుడు మాట్లాడినా, జమ్ము, కశ్మీర్ లోయ, లద్దాక్‌లో మొత్తం పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. దేశ విభజన, స్వాతంత్ర్యం అనంతరం అక్కడ సమస్యకు బీజాలు పడ్డాయి. ప్రతి ప్రభుత్వమూ ఈ సమస్యతో పోరాడాల్సి వచ్చింది. ఇది కొత్త సమస్య కాదు. ఇది పాత సమస్య. కశ్మీర్ యువత దారి తప్పబోదని నేను విశ్వసిస్తున్నాను. శాంతిని, ఐక్యతను కాపాడేందుకు మేం కలసి ముందుకు సాగిపోతాము.
స్వర్గధామం వంటి కశ్మీర్ స్వర్గధామంగానే ఉంటుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. కశ్మీర్ ప్రజలకు అభివృద్ధి, విశ్వాసం- ఈ రెండూ కల్పించాలని నేనంటాను. వంద కోట్ల మందికి పైగా భారతీయులు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. అలాగే విశ్వాస నిబద్ధత నుండి ఏనాడూ దూరం జరగ లేదు. ఈ నమ్మకం ఇప్పటికీ అక్కడ ఉంది. ఇకముందు కూడా ఉంటుంది.మేం అభివృద్ధి, విశ్వాసం బాటలో ముందుకు సాగుతాము. విజయాన్ని సాధిస్తాము.
ప్రశ్న : మీ పరిపాలనలో ఉన్నత స్థాయిలో అవినీతి గణనీయంగా తగ్గిందని అంటారు. కానీ కింది స్థాయిలో అవినీతి చాలా ఎక్కువగా ఉంది. మీరు దానిని ఎ లా కట్టడి చేస్తారు ?
ప్రధాన మంత్రి మోదీ : ఉన్నత స్థాయిలో అవినీతి లేదని మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతలు. గోముఖ్ వద్ద గంగా నది పరిశుభ్రంగా ఉంటే కిందికి ప్రవహించే కొద్ది నీరు పరిశుభ్రమౌతుంది. అవినీతికి అవకాశం లేకుండా చూసేందుకు మేం ఎన్నో చర్యలు చేపట్టడాన్ని మీరు గమనించే ఉంటారు. ఉదాహరణకు గ్యాస్ సబ్సిడీ వ్యవస్థను ప్రత్యక్ష లాభసాటి పథకంగా మార్చాం. ఒకరి పేరుతో మరొకరు గ్యాస్ సబ్సిడీ ద్వారా లబ్ధి పొందకుండా చూశాం. చండీగఢ్ కు 30 లక్షల లీటర్ల కిరోసిన్ సరఫరా అవుతుండేది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గ్యాస్ కనెక్షన్, కరెంటు సదుపాయం ఉన్న ఇళ్లకు కిరోసిన్ సరఫరాను ఆపివేశాము. గతంలో గ్యాస్ కనెక్షన్ లేని వారికి గ్యాస్ కనెక్షన్ ను మంజూరు చేశాము. ఆ రకంగా చండీగఢ్ ను కిరోసిన్ అవసరం లేని నగరంగా మార్చాం.
దీనితో 30 లక్షల లీటర్ల కిరోసిన్ నల్లబజారులో అమ్ముడు కాకుండా చూడడం ద్వారా ఆమేరకు పొదుపు చేయగలిగాము. అలాగే హర్యానా ముఖ్యమంత్రి నవంబర్ నాటికి తమ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలను కిరోసిన్ అవసరం లేని జిల్లాలుగా మార్చనున్నట్టు చెప్పారు. మన రైతులు యూరియా వాడకానికి ఆతృత పడుతుంటారు. వీటిని నల్లబజారులో నుండి కూడా కొనుగోలు చేస్తుంటారు. నల్లబజారు శక్తులది ఇష్టారాజ్యం. గతంలో కొన్ని రాష్ట్రాలలో రైతులు నల్లబజారు నుండి యూరియాను కొనుగోలు చేసే సమయంలో లాఠీఛార్జిలు కూడా జరిగాయి. కానీ ప్రస్తుతం మార్కెట్లో యూరియా కొరత ఉన్నట్టు వార్తలేవీ చూసి ఉండరు. యూరియా కోసం బారులు తీరడం అనేది లేదు, లాఠీఛార్జిలు లేవు. బ్లాక్ మార్కెటింగ్ లేదు. గతంలోలా ఇప్పుడు ఎందుకు లేదు ? గతంలో రైతుల కోసం కేటాయించిన యూరియా రసాయన కర్మాగారాలకు చేరేది. రసాయన కర్మాగారాలు దీనిని ముడి సరుకుగా చేసుకొని వివిధ ఉత్పత్తులను తయారు చేసేవి. రసాయన కర్మాగారాల వారు , మధ్యవర్తులు బాగుపడ్డారు. దీనితో మేం యూరియాకు వేప పూత వేశాము.
దీనితో రైతుల కోసం కేటాయించిన ఒక్క గ్రాము యూరియా అయినా ఇప్పుడు రసాయన కర్మాగారాలకు పనికిరాదు. అందువల్ల మొత్తం నూరు శాతం యూరియా వ్యవసాయ రంగానికే చేరుతోంది. దీనికి తోడు అదనంగా మేం యూరియా ఉత్పత్తిని 20 లక్షల టన్నులకు పెంచాము. దిగుమతి చేసుకున్న యూరియాకు కూడా వేప పూత వేస్తున్నాము. అంతేకాదు, గుజరాత్లో వేప విత్తనాల సేకరణలో ఉన్న గిరిజనులు వేప పూత సమయంలో వేప నూనెను తీస్తున్నారు.దీనివల్ల వారికి 10 కోట్ల నుండి 12 కోట్ల రూపాయల రాబడి వచ్చింది. ఇది ఉభయులకూ ప్రయోజనకరమైంది. అవినీతి, కష్టాలు తొలగిపోయాయి. ఇలా తగిన విధాన నిర్ణయాల ద్వారా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా కింది స్థాయి అవినీతిని అంతం చేయవచ్చు. ఉన్నత స్థాయిలో మీరు దేనిని ఇష్టపడుతున్నారో కింది స్థాయిలో కూడా అలాంటి ఫలితాలే చూడనున్నారు.
ప్రశ్న : ప్రధాన మంత్రి గారూ, లుటియన్స్ ఢిల్లీ మిమ్మల్ని ఇష్టపడదంటారు, మరి మీరు ఢిల్లీని ఇష్టపడడం మొదలుపెట్టారా ?
ప్రధాన మంత్రి మోదీ : ప్రధాన మంత్రి హోదాలో ఉన్నప్పుడు లుటియన్స్ ఢిల్లీని ఇష్టపడడం లేదా ఇష్టపడకపోవడం అంటూ ఉండదు. అయితే దీనిపై ఆలోచన చేయవలసి ఉంది. ఢిల్లీ అధికార కారిడర్ లలో ఒక బృందం కొద్దిమందికి అంకితమైన వారు ఉన్నారు. బహుశా ఇది వారి సొంత కారణాలు గాని, వ్యక్తిగత లబ్ది కోసమై గాని ఉండవచ్చు. ఇది మోదీ గురించిన ప్రశ్న కాదు. ఒకసారి చరిత్రలోకి వెనుకకు చూడండి. సర్దార్ పటేల్ గారిని చూడండి.. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన సాధారణ వ్యక్తిగా చూపారు. మొరార్జీ దేశాయ్ గారి పట్ల ఎలా వ్యవహరించారో చూడండి.
ఇదే వర్గం ఆయన సాధించిన విజయాల గురించి గాని, ఆయన సామర్ధ్యాలను గురించి గాని మాట్లాడలేదు. ఆయన ఏం సేవించారన్న దాని గురించే ఎక్కువ మాట్లాడారు. దేవె గౌడ గారి విషయాన్నే చూడండి, ఒక రైతు బిడ్డ ప్రధాన మంత్రి అయ్యారు. అయినా ఆయన కేవలం నిద్ర పోతారని ప్రచారం చేస్తూ వచ్చారు. ఇక, అధ్బుత ప్రజ్ఞావంతుడైన అంబేడ్కర్ గారి పట్ల వారు ఎలా వ్యవహరించారు ? చౌదరి చరణ్‌సింగ్ గారి పట్ల ఎలా వ్యవహరించారు ? ఇలాంటివి నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. ఎందుకంటే ఇలా వ్యవహరించే వారంతా ఈ దేశ మూలాల నుండి వచ్చిన వారిని ఎవరినీ అంగీకరించరు.
అందువల్ల ఇటువంటి వర్గాల గురించి అనవసరంగా ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోదలచుకోలేదు. కోట్లాది మంది ప్రజల సంక్షేమమే నా ముందున్న లక్ష్యం. లుటియన్స్ ఢిల్లీ వర్గాలతో నేను కలవకపోయినంతమాత్రాన నాకు పోయేదేమీ లేదు. ఈ దేశంలోని పేద ప్రజలతో నేను కలసి ఉండడమే మంచిది.
ప్రశ్న : టి ఆర్ పి రేటింగ్‌లు తగ్గినప్పుడల్లా వెంటనే మోదీ ర్యాలీల వైపు మళ్ళాలని అప్పుడప్పుడూ మీడియా వర్గాలు అంటుంటాయి. ఇప్పటికీ మీకు మీడియాతో తీపి చేదు అనుభవాలు ఉన్నాయి. మీడియా గురించి మీరేం చెబుతారు ?
ప్రధాన మంత్రి మోదీ : నేను ఈ దశలో ఉన్నానంటే, అందులో మీడియా పాత్ర చాలా కీలకం. నేను తరచూ సౌండ్ బైట్స్ ఏమీ ఇవ్వను. మోదీ జీ వివాదాస్పద, స్పైసీ వ్యాఖ్యలు చేయరని మీడియాకు నా మీద ఫిర్యాదు ఉండవచ్చు. ఈ ఫిర్యాదులో నిజం ఉంది. నేను నా పనిలో నిమగ్నమై ఉంటాను. నా పనే నా గురించి చెబుతుంది. చాలా కాలం నేను సంస్థాగత కార్యకలాపాలలో పనిచేశాను. కనుక నాకు మీడియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. నేను కలసి చాయ్ తాగని, సరదాగా సంభాషించని మీడియా ప్రముఖులు లేరు. వారి పేర్లతో సహా చాలా మంది తెలుసు. అందువల్ల వారికి నాపై ఎక్కువ అంచనాలు ఉండడం సహజం. పెద్ద వ్యక్తులు ప్రధానులు కావడం మీడియా చూసి ఉంటుంది, కాని నాలాగా తమతో కలిసిమెలిసి తిరిగిన స్నేహితుడి వంటి వ్యక్తి ప్రధాన మంత్రి కావడం చూసి ఉండదు.
మీడియా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తోంది. నిర్వహించాలి కూడా. ప్రభుత్వ కార్యకలాపాలను ప్రసార మాధ్యమాలు గట్టిగా విమర్శించాలని నేను కోరుకుంటాను. లేకుంటే ప్రజాస్వామ్యం పనిచేయదు. అయితే దురదృష్టవశాత్తు టి ఆర్ పిల కోసం పరుగులో ప్రసార మాధ్యమాలకు ఆయా అంశాలపై అధ్యయనం చేయడానికి తగిన సమయం ఉండడం లేదు. అధ్యయనం చేయకుండా విమర్శించడం సాధ్యం కాదు. పది నిమిషాల విమర్శకు పది గంటల అధ్యయనం అవసరం. విమర్శించడానికి బదులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఫలితంగా ప్రజాస్వామ్యం బలహీనపడుతోంది.
మీడియా విమర్శలకు ప్రభుత్వాలు భయపడాలి. అటువంటి పరిస్థితి ఉండడం లేదు. వాస్తవాల ఆధారంగా మీడియా విమర్శనాత్మకంగా ఉండాలని అంటాను. దీనివల్ల దేశం లబ్ధి పొందుతుంది. మీడియాకు కొన్నిఅనివార్యతలు ఉండవచ్చు. అది టి ఆర్ పి రేసులో విజయం సాధించాల్సి ఉంది. వారికి నేను కనీసం ఈరకంగా ఉపయోగపడినా అది నాకు సంతోషమే. నా ర్యాలీల కన్నా, టి ఆర్ పి రేటింగ్‌లు సాధించడానికి నన్ను నిందించే వారిని సాధనాలుగా చేసుకుంటున్నారు.
ప్రశ్న : మీడియాతో లాగే న్యాయ వ్యవస్థతో మీ సంబంధాలు సరిగా లేనట్టు కనపడుతోంది. ఎందువల్ల ?
ప్రధాన మంత్రి మోదీ : ఈ ఆలోచన సరైంది కాదు. ఈ ప్రభుత్వం నిబంధనలు, చట్టం, రాజ్యాంగం ప్రకారం నడుచుకొంటుంది. ఇందులో ఏ రాజ్యాంగ వ్యవస్థతో ఎటువంటి ఘర్షణకు గాని, ఉద్రిక్తతలకు గాని తావు లేదు. రాజ్యాంగపరమైన గౌరవానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థతో సుహృద్భావభరిత వాతావరణం ఉండాలి. వీలైనంత ఎక్కువ సుహృద్భావంతో ఉండేందుకు నా శక్తి మేరకు కృషి చేస్తాను.
ప్రశ్న : నేను మిమ్మల్ని కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. బలమైన నాయకుడిగా మీకు ఇమేజ్ ఉంది. అయితే కొన్ని సందర్భాలలో మీలోని భావోద్వేగాలు బయటకు వస్తుంటాయి. మీరు ఎటువంటి వ్యక్తి అనేది ప్రజలు తెలుసుకోవాలనుకుంటుండవచ్చు. అసలు నరేంద్ర మోదీ ఎలా ఉంటారు ? లేదా మోదీ వ్యక్తిత్వానికి భిన్న స్థాయిలున్నాయా ?
ప్రధాన మంత్రి మోదీ : సరిహద్దులలో అసమాన ధైర్య సాహసాలతో పోరాడే వ్యక్తి సైనికుడు. అతడు తన కుమార్తెతో ఆడుకొనేటపుడు, సైనికుడిగా ఉన్నప్పుడు ఒకే రీతిలో వ్యవహరించడు. నరేంద్ర మోదీ ఎవరైనా కావచ్చు, అతడు కూడా ఒక మానవమాత్రుడే. నా లోపల ఉన్న భావాలను నేను ఎందుకు అణుచుకోవాలి ? నేను ఎవరో, అలాగే ఉన్నాను. ప్రజలు నాలో ఏం చూస్తున్నారో, అలాగే చూడనివ్వండి. ఇక నా బాధ్యతలు, విధుల విషయానికి వస్తే, నా శక్తి సామర్ధ్యాల మేరకు నేను వాటిని నెరవేర్చ వలసి ఉంది.
నేను దేశం కోసం బలమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటే నేను అటువంటి నిర్ణయాలను తీసుకోవాలి. నేను అందుకోసం కష్టపడాల్సి ఉంటే కష్టపడతాను. నేను తలవంచవలసి ఉంటే తల వంచుతాను. నేను త్వరత్వరగా ముందుకు నడవాల్సి ఉంటే అలాగే నడుస్తాను. అయితే ఇవి నా వ్యక్తిత్వపు పార్శ్వాలు కావు. ఇవి నా బాధ్యతలో భాగం. నిజానికి అసలు మోదీ, నకిలీ మోదీ అని లేరు. మానవమాత్రుడు మానవ మాత్రుడే. మీరు మీ రాజకీయ కళ్లద్దాలు తీసి చూస్తే, అసలైన మోదీని మీరు చూస్తారు. కానీ మీరు ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయాలలో నుండి మోదీని చూసి ఒక నిర్ణయానికి వస్తూ ఉంటే మీరు పొరపాటు పడినట్లే.
ప్రశ్న : మోదీ గారు. మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాంధీనగర్ లోను, అలాగే ప్రధాన మంత్రి కార్యాలయంలోనూ మిమ్మల్ని అనేక సార్లు కలుసుకొన్నాను. మీ టేబుల్‌పై ఫైలు గాని, పేపర్ గాని కనీసం ఫోన్ ఉండగా నేను ఎప్పుడూ చూడలేదు. మన సంభాషణల మధ్య ఎవరూ జోక్యం చేసుకున్న దాఖలా లేదు. మీ పనితీరు సి ఇ ఒ ను తలపిస్తూ ఉంటుంది. మీరు ఎక్కువ వింటారని, తక్కువ మాట్లాడుతారని కొందరు చెబుతారు. మీరు పని చేసే విధానం ఎలా ఉంటుంది ?
ప్రధాన మంత్రి మోదీ : మీరు వాస్తవం చెప్పారు. కానీ, నేను ఏదీ విననని, మాటలు చెబుతుంటానని కొందరు నా మీద ముద్ర వేశారు. నిజానికి ఎంతో వింటుంటాను, పరిశీలిస్తుంటాను. అలా ఒక వ్యక్తిగా ఎదిగాను. దీనితో నేను చాలా లబ్ధిని పొందాను. నేను పనిపై మక్కువ కలవాడిని . అయితే నేను ప్రధానంగా వర్తమానంలో జీవించడానికే ఇష్టపడతాను. మీరు నన్ను కలవడానికి వస్తే నేను ఇక మీతో సంభాషణల్లో లీనమౌతాను. నేను ఆ సమయంలో ఫోన్ ను ముట్టుకోను. లేదా పత్రికను చూడను. నా దృష్టిని మరల్చే పని చేయను. అలాగే నేను ఫైల్స్ చూస్తుంటే గనక ఇక వాటిలో లీనమౌతాను. నేను ప్రతి క్షణం వర్తమానంలోనే గడుపుతాను. నన్ను కలసిన వారంతా తమకు విలువైన సమయం కేటాయించానని సంతృప్తి పడుతుంటారు.
ఇక రెండోది, ఎవరైనా వారు చేసే పనికి న్యాయం చేయాలి. నేను దీనిని ఎప్పుడూ పాటిస్తూ ఉంటాను. ఎప్పుడూ నేర్చుకుంటూ, అవగాహన పెంచుకుంటూ ఉండాలి. గత కాలంలో మాత్రమే పనికి వచ్చి, ఇప్పుటి కాలానికి ఎంతమాత్రం తగని ఆలోచనలను వదిలించుకొనే ధైర్యం ఉండాలి. తనను తాను మార్చుకునే ధైర్యం ఉండాలి. ఈ విధంగా నా పనితీరును అభివృద్ధి చేసుకున్నాను.
ప్రశ్న : మీరు 16 నుంచి 18 గంటలు పనిచేస్తున్నారు, మరి మీరు ఎలా విశ్రాంతి పొందుతారు ?
ప్రధాన మంత్రి మోదీ : నేను పనిలోనే సేదతీరుతాను. పనిచేస్తుంటే నేను ఎన్నటికీ అలసిపోను. ఇందుకు భిన్నంగా ఉంటేనే నేను అలసిపోతాను. మీరు పది ఉత్తరాలు రాయాల్సి ఉంటే రెండు ఉత్తరాలు రాసిన తరువాత అలసిపోయినట్టు అనిపిస్తారు. అయితే మీరు భోజనం మానేసైనా పది ఉత్తరాలు పూర్తి చేశారనుకోండి, అందులో మీకు ఎంతో సంతృప్తి ఉంటుంది. కారణం మీరు చేయాల్సిన పని పూర్తయిందన్న సంతృప్తి ఉంటుంది కనుక. నిజానికి పనిచేయకుండా ఉంటేనే అలసిపోతాం, పని మీకు సంతృప్తిని ఇస్తుంది.
ఆ సంతృప్తి మీకు శక్తిని ఇస్తుంది. నాకు ఇది అనుభవమే. నేను ఎప్పుడూ దీనిని మా యువ మిత్రులకు చెబుతుంటాను. అలసిపోవటం అనేది కేవలం మానసికమైంది. ఏదైనా పనిని బట్టి దానిని చేయడానికి అవసరమైన మేరకు ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన సామర్ధ్యం ఉంటుంది. కొత్త సవాళ్లను స్వీకరిస్తూ ఉంటే మీ అంతశ్చేతన ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది. ఇది మీలోనే ఉంటుంది.
ప్రశ్న : జీవితంలో మీపై ఎవరి ప్రభావాలు ఉన్నాయి ?
ప్రధాన మంత్రి మోదీ : నేను గైక్వాడ్ ఎస్టేట్ గ్రామానికి చెందిన వాడిని. బాల్యంలో నేను నా పరిసరాల నుండి ఎంతో నేర్చుకున్నాను. గైక్వాడ్ రాజు గారి ప్రత్యేకత ఏమంటే ఆయన ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు, ప్రాథమిక పాఠశాలలు కట్టించే వారు. నేను అటువంటి పాఠశాలలో చదువుకున్నాను. నేను పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు చదవడానికి పెద్దగా సమయం దొరకడం లేదు. ఆ పుస్తకాలు నాపై ప్రభావాన్ని చూపెట్టాయి. 12 సంవత్సరాల వయసు నుండి నేను వక్తృత్వ పోటీలలోపాల్గొనే వాడిని . వివేకానందుడి కొటేషన్లు, వారు వెల్లడించే తీరు నాకు నచ్చేది. నేను హిందీ భాష పట్ల అభిమానాన్ని పెంచుకున్నాను. వివేకానందుడి ఆలోచనలు నాపై చాలా ప్రభావాన్ని చూపించాయని చెప్పగలను
ప్రశ్న : భారత చరిత్రలో నరేంద్ర మోదీ ఎక్కడ ఉండాలనుకుంటున్నారు ?
ప్రధాన మంత్రి మోదీ : వర్తమానంలో జీవించడాన్ని ప్రేమించే వ్యక్తి చరిత్ర గురించి ఎందుకు ఆందోళన చెందాలి ? ఎవరూ ఇటువంటి పొరపాటును వారి జీవన కాలంలో చేయనేకూడదు. దురదృష్టవశాత్తు మన దేశంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు,నాయకులు వారి స్వీయ ప్రతిష్ఠను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మన వ్యక్తిగత ప్రతిష్ఠ కంటె మన దేశ ప్రతిష్ఠను పెంచడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో చూడండి. ఈ దేశ ప్రతిష్ట 125 కోట్ల మంది ప్రజల నిరంతరాయ వారసత్వానికి ప్రతీక. మోదీ ఈ 125 కోట్ల మంది ప్రజలలో ఒకరు. అంతకు మించి ఏమీ లేదు.
మోదీ గారు. మీరు మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఇది టెలివిజన్‌లో నా తొలి ఇంటర్వ్యూ. అందులోనూ ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తితో ఇంటర్వ్యూ చేసే అవకాశం కలగడం మహద్భాగ్యంగా భావిస్తాను.
ప్రధాన మంత్రి మోదీ : మీరు ఆర్థిక రంగానికి చెందిన వారు. అయినా మీరు రాజకీయ ఇంటర్వ్యూ చేశారు. నాకు మీ ఆత్మవిశ్వాసం నచ్చింది. మీకు నా అభినందనలు. మంచి పనులు కొనసాగిస్తూ ఉండండి.
మీరు మాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండండి..
ప్రధాన మంత్రి మోదీ : రాజకీయ నాయకులను మాత్రమే ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు ? ఇంటర్వ్యూ చేయడానికి ఇతర జీవన రంగాలకు చెందిన వారు ఎందరో ఉన్నారు. ఎన్నికల సమయంలో విలేకరులు ఉదయాన్నే షూటింగ్ ప్రారంభించి, అల్పాహారం గురించి, ఇతర విషయాలను గురించి అడగడం మొదలుపెడుతుంటారు. కానీ మన క్రీడాకారులు చేసే త్యాగాలు చాలా మందికి తెలియవు. రాజకీయ నాయకులపై సమయాన్ని వృథా చేయడం కన్నా క్రీడాకారులకు ఎక్కువ సమయాన్ని కేటాయించవచ్చు.
వారు వారి ఆహారాన్ని, నిద్రని ఎలా నియంత్రిస్తారో, అలాగే పరాజయం పాలైనా సరే క్రీడల పట్ల నిబద్ధులై ఎలా ఉంటారో ప్రజలకు తెలియజేయవచ్చు. క్రీడాకారులు చేసే త్యాగాలను గురించి మన యువతకు తెలియజేయాలి. రియో ఒలింపిక్స్ లో పాల్గొన్న 30 మంది క్రీడాకారుల జీవిత విశేషాలను మీ ఛానల్ ప్రజలకు చూపించాలన్నది నా ఆకాంక్ష. ఆ రకంగా మనం మన క్రీడాకారులను చూసే ధోరణిలో మార్పును తీసుకురావచ్చు. అదే విధంగా రాజకీయాలు కాకుండా ఇంటర్వ్యూ చేయదగిన వారు ఎంతో మంది వ్యక్తులు ఉన్నారని నేను భావిస్తున్నాను.