బెచరాజి అంటే బహుచారా మాత పవిత్ర పుణ్యక్షేత్రం. బెచరాజీ పవిత్ర ప్రదేశం ఎందరో దేశభక్తులను, సామాజిక కార్యకర్తలను,
దేశానికి అందించిన పుణ్యభూమి. అలాంటి ఈ పుణ్యభూమి నుంచి వచ్చిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త శ్రీ ప్రహ్లాద్జి హర్ గోవన్ దాస్పటేల్ 115 వ జయంతిని జరుపుకుంటున్నాం. వారిని స్మరించుకునే పవిత్రదినం ఈ నవరాత్రులలోనే వచ్చింది. బహుచారా మాత సన్నిధిలో మనం వారిని స్మరించుకుంటున్నాం. భారతీయులమైన మనం ఆజాది కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రహలాద్ భాయ్ వంటి గొప్ప దేశభక్తుడిని స్మరించుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
ప్రహ్లాద్‌భాయ్ వాస్తవానికి సితాపూర్ గ్రామానికి చెందిన వారు. అయితే వారు ఆతర్వాత బెచరాజి వచ్చి స్థిరపడ్డారు. ప్రహ్లాద్జి సేఠ్ లాటివాలా గా వారు రాష్ట్రమంతటా ఎంతోపేరు తెచ్చుకున్నారు. ఎందరో యువకుల మాదిరే ప్రహ్లాద్ భాయ్ , మహాత్మాగాంధీ జీ ప్రభావంతో స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. వారు సబర్మతి , ఎరవాడ జైళ్లలో జైలు జీవితం అనుభవించారు. ఇలాంటి ఒకానొకసారి వారు జైలులో ఉన్నప్పుడు వారి తండ్రిగారు మరణించారు. పెరోల్ పై విడుదల చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాభిక్ష దరఖాస్తు చేసుకోవడానికి ఆయన నిరాకరించారు. తల్లిదండ్రుల అంత్యక్రియలను వారి వరుసకు సోదరులే చేశారు. ఈ ర కంగా కుటుంబానికంటే మిన్నగా దేశ ప్రయోజనాల కోసం పాటుపడిన మహనీయులు వారు. దేశమే ముందు అన్న ఆలోచనకు కట్టుబడిజీవితం సాగించినవారు.స్వాతంత్ర్య పోరాటంలో పలు రహస్య కార్యకలాపాలలో వారు పాల్గొన్నారు.అలాగే బెచారజీలో పలువురు స్వాతంత్ర్య సమర యోధులను రహస్యంగా ఉంచడానికి పాటుపడ్డారు. స్వాతంత్ర్యానంతరం వారు దేశంలోని పలు చిన్న రాష్ట్రాలను కలపడంలో కీలకపాత్ర పోషించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆదేశాను సారం వారు ఈ బాధ్యత చేపట్టారు. దసద, వనోద్, జైనాబాద్లను దేశంతోఅనుసంధానం చేయడానికి కృషిచేశారు. కానీ దేశంలో చరిత్ర పుస్తకాలలో ఇలాంటి దేశభక్తుల చరిత్ర కనిపించకపోవడం బాధకలిగిస్తుంది.
ప్రహ్లాద్‌భాయ్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల మహాద్భుత శకం గురించి కొత్త తరానికి తెలియజెప్పడం మన బాధ్యత. దీని ద్వారా వారు ఈ మహనీయులనుంచి స్పూర్తి పొందడానికి వీలుంటుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా వారు ఏమాత్రం విశ్రాంతి తీసుకోలేదు. వారు సామాజిక కార్యకలాపాలలో నిరంతరం ఉంటూ వచ్చారు. 1951లో వారు వినోబా భావే గారి భూదానోద్యమంలో పాల్గొన్నారు. వారుతనకు గల 200 భీగాల భూమిని దానం చేశారు. ఎంతో మంది భూమి లేని నిరుపేదల కోసం ఈ భూమి పుత్రుడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది. ముంబాయినుంచి వేరుపడి, 1962లో గుజరాత్‌కు తొలి ఎన్నికలు జరిగినపుడు, చనాస్మ స్థానం నుంచి పోటీచేసి ప్రజా ప్రతినిధిగా గెలుపొంది, ప్రజల గొంతుకగా ఉంటూవచ్చారు. వారు రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా చేశారు. ఆరోజులలో నేను సంఘ్ కోసం పనిచేస్తూ వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉండడం నాకు గుర్తు. ప్రజలు ఎప్పుడైనా బెచరాజి వెళ్లాలని అనుకున్నపుడు వారికి ప్రహ్లాద్‌భాయ్ ప్రాంతం ప్రజా సంక్షేమ ప్రాంతంగా ఉండేది. ట్రస్టీషిప్ స్పూర్తితో పనిచేసిన ప్రహ్లాద్‌భాయ్ గుజరాత్ లోని మహాజన్ సంప్రదాయానికి వారధి వంటివారు. ప్రహ్లాద్ భాయ్ శ్రీ మతి కాశీ బా గురించి ప్రస్తావించుకోకుండా ప్రహ్లాద్‌భాయ్ గురించి చెప్పుకోవడం అసంపూర్ణమే అవుతుంది. కాశీబా ఆదర్శ గృహిణి మాత్రమే కాకుండా ఆమెఎన్నో పౌరబాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా భర్తకు అన్నివిధాలా అండగా ఉన్నారు.
ప్రహ్లాద్‌భాయ్ మొత్తం జీవితం,ఆయన పని సంస్కృతి, ఎలాంటి పరిస్థితులలో అయినా పనిచేయగల స్థితి, ఇలా వారి గురించిన ప్రతి చిన్న విషయం స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించి విలువైన భద్రపరచదగ్గ సమాచారమే. వారు చేపట్టిన సామాజికసేవా కార్యక్రమాలను గ్రంధస్థం చేయవలసి ఉంది. ఇది కొత్త తరానికిసరికొత్త సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాదు, రాగల తరాలకు వారు స్పూర్తిదాయకంగా నిలుస్తారు. వారి జీవిత కాలంలో వారు ఎన్నో ప్రజా సేవాకార్యక్రమాలు చేపట్టారు.వారు తన మరణానంతరం కూడా తమ కళ్లను దానం చేస్తూ ముందే నిర్ణయం తీసుకున్నారు. దీనిని బట్టి ఊహించండి, అసలు నేత్ర దానం గురించిపెద్దగా అవగాహన లేని రోజులలోనే వారు తమ నేత్రాలు దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయం ఎంత గొప్పదో, ఎంతటి ప్రేరణాత్మక నిర్ణయమో అది !
గుజరాత్ లోని అన్ని విశ్వవిద్యాలయాలూ, ఇలాంటి గొప్ప వ్యక్తులగురించి రాష్ట్రం నలుమూలల నుంచి సేకరించి వారి గురించి , వారి అద్భుత చరిత్ర గురించి అందరికీ తెలియజెప్పేలా పుస్తక రూపంలో తీసుకురావలసి ఉంది. అప్పుడే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు సరైన అర్థం. శ్రీ ప్రహ్లాద్ భాయ్ త్రివేణి సంగమం వంటివారు. దేశభక్తి, కర్తవ్యనిష్ఠ, సేవ ల సంగమం.
ఈ రోజు, ఆ మహనీయుని అంకితభావం గురించి గుర్తుచేసుకోండి, నవ భారతదేశాన్ని నిర్మిండంలో దేశాన్ని మరింత అభివృద్ధి చేసే దిశలో స్ఫూర్తిని పొందండి.
వాస్తవానికి ఇదే ఆ మహనీయుడికి సరైన నివాళి అవుతుంది. ప్రహ్లాద్భాయికి , వాకి అద్భుత కృషికి నా గౌరవపూర్వక ప్రణామాలు . బహుచార మాత సన్నిధిలో, బహుచార మాతకు .భారత మాతను సేవించే వారికి నమస్కరిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
భారత్ మాతా కీ జై!
జై జై గర్వి గుజరాత్ !
***