Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండోర్‌లో పురపాలక ఘన వ్యర్థాధారిత ‘గోబర్-ధన్’ ప్లాంటును ప్రారంభించిన ప్రధానమంత్రి

ఇండోర్‌లో పురపాలక ఘన వ్యర్థాధారిత ‘గోబర్-ధన్’ ప్లాంటును ప్రారంభించిన ప్రధానమంత్రి


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఇండోర్ నగరంలో ‘‘గోబర్-ధన్’’ (బయో సీఎన్జీ) ప్లాంటును వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించారు. మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు శ్రీ హర్దీప్ సింగ్ పూరి, డాక్టర్ శ్రీ వీరేంద్ర కుమార్, శ్రీ కౌశల్ కిషోర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి తొలుత ఇండోర్ నగరం చరిత్రతో ముడిపడిన రాణి అహిలియాబాయికి నివాళి అర్పించి తన ప్రసంగం ప్రారంభించారు. ఇండోర్ ప్రస్తావన వచ్చినపుడల్లా దేవి అహిలియాబాయి హోల్కర్, ఆమె సేవాభావం గుర్తుకొస్తాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కాలక్రమంలో ఇండోర్ మెరుగుపడుతూ వచ్చినా… దేవి అహిలియాబాయి స్ఫూర్తిని ఎన్నడూ కోల్పోలేదని ప్రధాని కొనియాడారు. అంతేకాకుండా నేడు ఇండోర్ స్వచ్ఛత-పౌర కర్తవ్యాలను కూడా గుర్తుచేస్తోందని వ్యాఖ్యానించారు. కాశీ విశ్వనాథ్ ధామ్‌లో దేవి అహిలియాబాయి సుందర విగ్రహం గురించి కూడా శ్రీ మోదీ ప్రస్తావించారు.

   గోబర్-ధన్ ప్రాముఖ్యం గురించి ప్రధానమంత్రి తన ప్రసంగంలో నొక్కిచెప్పారు. గోబర్-ధన్  అంటే పట్టణ నివాసాల్లోని తడి వ్యర్థాలతోపాటు పశువులనుంచి, పొలాల నుంచి వచ్చే వ్యర్థాల మిశ్రమమేనని ఆయన అన్నారు. వ్యర్థాల నుంచి గోబర్-ధన్.. గోబర్-ధన్ నుంచి స్వచ్ఛ ఇంధనం.. స్వచ్ఛ ఇంధనం నుంచి విద్యుత్… ఇదొక జీవితోద్ధరణ శృంఖలమని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో 75 పెద్ద పురపాలక సంస్థలలో గోబర్-ధన్’ (బయో సీఎన్జీ) ప్లాంట్లు ఏర్పాటవుతాయని ప్రధానమంత్రి వెల్లడించారు. “భారత నగరాలను పరిశుభ్రంగా, కాలుష్య రహితంగా, స్వచ్ఛ ఇంధన సహితంగా రూపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది’’ అని ఆయన ప్రకటించారు. పట్టణాల్లోనేగాక గ్రామాల్లోనూ గోబర్‌-ధన్‌ ప్లాంట్ల ఏర్పాటుద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తోందని ప్రధాని చెప్పారు. ఇది భారతదేశ వాతావరణ మార్పు హామీలను నెరవేర్చడంతోపాటు పోషణలేని, వీధి పశువుల సమస్యను పరిష్కరించడంలోనూ తోడ్పడుతుందని ఆయన అన్నారు.

   దేశంలో గడచిన ఏడేళ్లుగా సమస్యలకు తాత్కాలిక ఉపశమనాలు కాకుండా శాశ్వత పరిష్కారాల దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. వేలాది ఎకరాల భూమిలో లక్షలాది టన్నుల వ్యర్థాలు గుట్టలు పడుతూ జల, వాయు కాలుష్యంతోపాటు వ్యాధుల వ్యాప్తికి  కారణం అవుతుండటాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛభారత్ మిషన్ రెండోదశ అమలు కింద సదరు వ్యర్థాలను తొలగించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడానికే కాకుండా నగరాలు, గ్రామాలను సుందరీకరణకు దోహదం చేసిందన్నారు. ఇప్పుడిక తడిచెత్త నిర్మూలనపై దృష్టి సారించామని ఆయన చెప్పారు. వ్యర్థాల కొండల్లా తయారైన ప్రదేశాలను రాబోయే రెండుమూడేళ్లలో హరిత మండళ్లుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. దేశంలో దేశంలో 2014 నుంచి చెత్త నిర్మూలన సామర్థ్యం 4 రెట్లు పెరగడంపై ఆయన హర్షం వెలిబుచ్చారు. అలాగే ఒకసారి వాడే ప్లాస్టిక్‌ను వదిలించుకునే దిశగా 1600కుపైగా స్థానిక సంస్థలు వస్తు పునఃప్రాప్తి సౌకర్యాలను  పొందుతున్నాయని తెలిపారు.

   ర్యాటకం-పరిశుభ్రతల మధ్య అవినాభావ సంబంధం గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. పరిశుభ్రత ఫలితంగా పర్యాటకరంగం విస్తరణకు దారితీసి, సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావానికి తోడ్పడుతుందని తెలిపారు. దీనికి సంబంధించి సజీవ ఉదాహరణగా నిలిచి, పరిశుభ్ర నగరంగా రూపొందడంలో ఇండోర్ విజయగాథను తెలుసుకునేందుకు ఆయన ఆసక్తి చూపారు. ‘‘దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో జల సమృద్ధికి ప్రభుత్వం కృషిచేయాలి.  స్వచ్ఛభారత్ మిషన్ రెండో దశలో దీనికి ప్రాధాన్యమిస్తున్నాం’’ అని ఆయన ప్రకటించారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే ప్రక్రియ గడచిన 7-8 ఏళ్ల వ్యవధిలో 1 శాతం నుంచి 8 శాతానికి పెరిగిందని ప్రధాని గుర్తుచేశారు. ఇదే సమయంలో ఇథనాల్ సరఫరా 40 కోట్ల లీటర్ల నుంచి  300 కోట్ల లీటర్లకు గణనీయంగా పెరిగి చక్కెర మిల్లులకు, రైతులకు ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.

   డ్జెట్లో ప్రకటించిన ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ మేరకు బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదన ప్లాంట్లలో వరి దుబ్బు లేదా పంట వ్యర్థాన్ని కూడా వినియోగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ‘‘రైతులకు దుబ్బు సమస్యనుంచి ఊరటసహా వ్యవసాయ వ్యర్థాల ద్వారా వారికి అదనపు ఆదాయం కూడా లభిస్తుంది’’ అని ఆయన అన్నారు. పరిశుభ్రత కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న లక్షలాది పారిశుధ్య కార్మికులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మహమ్మారి విజృంభించిన సమయంలో వారి సేవా నిబద్ధతకు ప్రధాని ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు కృతజ్ఞతా సూచకంగా కుంభమేళా సమయంలో ప్రయార్ రాజ్ వద్ద తాను పారిశుధ్య కార్మికుల కాళ్లు కడగడాన్ని ఆయన గుర్తుచేశారు.

నేపథ్యం

   ప్రధానమంత్రి ఇటీవల ‘‘చెత్తరహిత నగరాలు’’ సృష్టించే లక్ష్యంతో ‘పట్టణ స్వచ్ఛభారత్ మిషన్ 2.0’కు శ్రీకారం చుట్టారు. వనరుల పునఃప్రాప్తిని ఇనుమడింపజేసే దిశగా ‘‘వ్యర్థం నుంచి అర్థం’’ (సంపద), ‘‘వృత్తాకార ఆర్థిక వ్యవస్థ’’ అనే విస్తృత సూత్రాల ప్రాతిపదికన ఈ కార్యక్రమం అమలవుతోంది. ఇండోర్ బయో-సీఎన్జీ ప్లాంట్‌ ఈ రెండింటికీ ఉదాహరణగా నిలిచింది. ఈ మేరకు ఇవాళ ఆయన ప్రారంభించిన ప్లాంట్ రోజుకు వేరుపరచిన 550 టన్నుల సేంద్రియ తడి చెత్తను శుద్ధి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. తద్వారా రోజుకు 17,000 టన్నుల సీఎన్జీతోపాటు 100 టన్నుల సేంద్రియ కంపోస్టును తయారు చేయగలదని అంచనా. శుద్ధి అనంతర వ్యర్థాలకు ఆస్కారం లేని రీతిలో ఈ ప్లాంటు పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుతో హరితవాయు ఉద్గారాల తగ్గింపు, హరిత ఇంధన ఉత్పత్తి, సేంద్రియ కంపోస్టు ఎరువు లభ్యత వగైరా పర్యావరణపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

   ప్రాజెక్టు అమలు కోసం ‘ఇండోర్ క్లీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట ఓ ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్పీవీ)ని ఇండోర్ పురపాలక సంస్థ (ఐఎంసీ), ఇండో ఎన్విరో ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఐఈఐఎస్ఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇది ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య నమూనాలో పనిచేస్తూ రూ.150 కోట్ల మేర పూర్తి మూలధన పెట్టుబడిని ‘ఐఈఐఎస్ఎల్’ సమకూర్చింది. ఈ ప్లాంటులో ఉత్పత్తి చేసే సీఎన్జీలో కనీసం 50 శాతాన్ని ‘ఐఎంసీ’ కొనుగోలు చేయడమే కాకుండా దేశంలో ఎక్కడా లేనిరీతిలో సదరు సీఎన్జీతో 400 సిటీ బస్సులను నిర్వహిస్తుంది. మిగిలిన సీఎన్జీని బహిరంగ విపణిలో విక్రయిస్తారు. ఇక వ్యవసాయం, ఉద్యాన పంటల సాగులో రసాయన ఎరువులకు బదులు సేంద్రియ కంపోస్టు వాడకం పెరుగుతుంది.