Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2021 నవంబర్ 28 వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ (‘ మనసు లో మాట ’)కార్యక్రమం 83 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగంపాఠం


నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం! ఈ రోజు మనం ‘మన్ కీ బాత్’ కోసం మరోసారి కలిశాం. రెండు రోజుల తర్వాత డిసెంబరు నెల కూడా మొదలవుతోంది. డిసెంబరు రాగానే సంవత్సరం గడిచిపోయినట్టే అనిపిస్తుంది. ఏడాదికి చివరి నెల కావడంతో కొత్త ఏడాదికి పునాదులు వేసుకుంటాం. దేశం అదే నెలలో నౌకా దళ దినోత్సవాన్ని,సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటుంది. డిసెంబర్ 16వ తేదీన దేశం 1971 యుద్ధ స్వర్ణోత్సవాన్ని కూడా జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భాలలోనేను దేశంలోని భద్రతా దళాలను గుర్తుకు తెచ్చుకుంటాను. మన వీరులను స్మరించుకుంటాను. అలాంటి వీరులకు జన్మనిచ్చిన ధైర్యవంతులైన తల్లులను గుర్తుకు తెచ్చుకుంటాను. ఎప్పటిలాగేఈసారి కూడా నమో యాప్ ద్వారానూ మీ గవ్ ద్వారానూ మీ అందరి నుండి నాకు చాలా సూచనలు వచ్చాయి.మీరు నన్ను మీ కుటుంబంలో ఒక భాగంగా భావించి మీ జీవితంలోని సంతోషాలను, బాధలను పంచుకున్నారు. ఇందులో చాలా మంది యువకులు ఉన్నారు. విద్యార్థులు ఉన్నారు. మన’మన్ కీ బాత్’ కుటుంబం నిరంతరం అభివృద్ధి చెందుతుండడం నాకు సంతోషంగా ఉంటోంది. ఈ కార్యక్రమం మనస్సులతో అనుసంధానమవుతోంది. లక్ష్యాలతో అనుసంధానమవుతోంది. మన మధ్య లోతైన సంబంధంతో మనలో సానుకూల దృక్పథం నిరంతరం ప్రవహిస్తోంది.

నా ప్రియమైన దేశప్రజలారా! అమృత మహోత్సవానికి సంబంధించిన చర్చలు తనకు బాగా నచ్చాయని సీతాపూర్‌ నుండి ఓజస్వీ నాకు రాశారు. ఆయన తన స్నేహితులతో కలిసి ‘మన్ కీ బాత్’ వింటారు. స్వాతంత్ర్య పోరాటం గురించి చాలా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. మిత్రులారా!అమృత మహోత్సవంనేర్చుకోవడంతో పాటు, దేశం కోసం ఏదైనా చేయాలనే స్ఫూర్తినిస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు అయినా ప్రభుత్వాలు అయినా, పంచాయితీ నుండి పార్లమెంట్ వరకు అమృత మహోత్సవ ప్రతిధ్వని వినిపిస్తోంది. ఈ మహోత్సవానితో అనుసంధానమైన కార్యక్రమాల పరంపర కొనసాగుతోంది. ఈ మధ్య ఢిల్లీలో అలాంటి ఆసక్తికరమైన కార్యక్రమం ఒకటి జరిగింది. ‘స్వాతంత్ర్య పోరాట కథలు-పిల్లల ప్రసంగాలు’ అనే కార్యక్రమంలోపిల్లలు పూర్తి ఉత్సాహంతో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన కథలను ప్రస్తావించారు. విశేషమేమిటంటే భారత్‌తో పాటు నేపాల్, మారిషస్, టాంజానియా, న్యూజిలాండ్, ఫిజీ దేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. మన దేశానికి చెందిన మహారత్న సంస్థ ఓ.ఎన్.జి.సి. కూడా అమృత మహోత్సవాన్ని విభిన్నంగా జరుపుకుంటోంది.ఈ మహోత్సవ రోజుల్లోవిద్యార్థుల కోసం చమురు క్షేత్రాలలో అధ్యయన యాత్రలను ఓ.ఎన్.జి.సి. నిర్వహిస్తోంది. ఈ అధ్యయనాలలోఓ.ఎన్.జి.సి. ఆయిల్ ఫీల్డ్ కార్యకలాపాల గురించి యువతకు తెలియజేస్తున్నారు. మన వర్ధమాన ఇంజనీర్లు దేశ నిర్మాణ ప్రయత్నాలలో పూర్తి ఉత్సాహంతో,అభిరుచితో చేతులు కలపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

మిత్రులారా! స్వాతంత్య్ర సాధనలో గిరిజన సమాజం అందించిన సహకారాన్ని దృష్టిలో ఉంచుకునిదేశం కూడా గిరిజనులు గర్వించదగిన వారోత్సవాలను జరుపుకుంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగాయి. అండమాన్ నికోబార్ దీవులలోజారవా,ఒంగే వంటి గిరిజన వర్గాల ప్రజలు తమ సంస్కృతిని సజీవంగా ప్రదర్శించారు.హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాకు చెందిన సూక్ష్మ లేఖకులు రామ్ కుమార్ జోషి అద్భుతమైన పని చేశారు. ఆయన చాలా చిన్నవైన పోస్టల్ స్టాంపులపైనే నేతాజీ సుభాష్ చంద్రబోస్, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల ప్రత్యేకమైన చిత్రాలను రూపొందించారు. ఆయన హిందీలో రాసిన ‘రామ్’ అనే పదంపై చిత్రాలను రూపొందించారు. అందులో ఇద్దరు మహానీయుల జీవిత చరిత్రను కూడా క్లుప్తంగా చెక్కారు.మధ్యప్రదేశ్‌లోని కట్నీకి చెందిన కొంతమంది మిత్రులు కూడా ఒక చిరస్మరణీయమైన దాస్తాంగోయ్ కార్యక్రమం గురించి సమాచారాన్ని అందించారు. ఇందులో రాణి దుర్గావతి ఎనలేని ధైర్యసాహసాలు, త్యాగాల జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చారు. అలాంటి ఒక కార్యక్రమం కాశీలో జరిగింది. గోస్వామి తులసీదాస్, సంత్ కబీర్, సంత్ రవి దాస్, భారతేందు హరిశ్చంద్ర, మున్షీ ప్రేమ్‌చంద్, జయశంకర్ ప్రసాద్ వంటి మహానుభావుల గౌరవార్థం మూడు రోజుల పండుగను నిర్వహించారు.వివిధ కాలాలలోవీరంతా దేశ ప్రజల చైతన్యంలో పెద్ద పాత్ర పోషించారు. మీకు గుర్తు ఉండవచ్చు. ‘మన్ కీ బాత్’ ఇంతకుముందు భాగాలలో నేను మూడు పోటీలను ప్రస్తావించాను. దేశభక్తి గీతాలు రాయడం; దేశభక్తికి, స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన సంఘటనలకు చెందిన రంగవల్లికలను రూపుదిద్దడం;పిల్లల మనస్సులలో భవ్య భారతదేశ స్వప్నావిష్కరణ చేసేందుకుచిట్టిపాట లను రాయడం. ఈ పోటీల కోసం మీరు తప్పనిసరిగా ఎంట్రీని పంపారని నేను భావిస్తున్నాను. మీరు మీ మిత్రులతో కూడా ప్రణాళిక వేసుకుని, చర్చించి ఉండాలి. మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలోని ప్రతి మూలలో ఎంతో ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా!ఈ చర్చ నుండి నేను ఇప్పుడు మిమ్మల్ని నేరుగా బృందావనానికి తీసుకెళ్తాను. భగవంతుని ప్రేమకు ప్రత్యక్ష స్వరూపంగా బృందావనాన్ని చెప్తారు. మన యోగులు కూడా ఇలా చెప్పారు –

చిత్తంలో ఉందీ ఆశ -చిత్తంలో ఉందీ ఆశ

ఈ వైభవాన్ని వివరిస్తాను-

బృందావన వైభోగం, బృందావన వైభోగం

ఏవరికీ అంతుచిక్కలేదు-

దీని అర్థం ఏమిటంటే బృందావన మహిమనుమనందరం మన శక్తికి తగ్గట్టుగా చెప్పుకుంటాం. కానీ బృందావన ఆనందం, ఈ ప్రదేశం అందించే అనుభూతి, దాని తాదాత్మ్యత ఎవరూ కనుగొనలేరు. ఇది అపరిమితంగా ఉంటుంది. అందుకే బృందావనం ప్రపంచం నలుమూలల ప్రజలను ఆకర్షిస్తోంది.మీరు ప్రపంచంలోని ప్రతి మూలలో దాని ముద్రను కనుగొంటారు.

పెర్త్ పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఒక నగరం. క్రికెట్ ప్రేమికులు ఈ ప్రపంచంతో బాగా పరిచయం కలిగి ఉంటారు. ఎందుకంటే పెర్త్‌లో క్రికెట్ మ్యాచ్‌లు తరచుగా జరుగుతాయి. పెర్త్‌లో ‘సాక్రెడ్ ఇండియా గ్యాలరీ’ పేరుతో కళా ప్రదర్శన శాలకూడా ఉంది. ఈ గ్యాలరీని స్వాన్ వ్యాలీలోని ఒక అందమైన ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా నివాసి జగత్ తారిణి దాసి గారి కృషి ఫలితంగాఇది ఏర్పాటైంది. జగత్ తారిణి గారు ఆస్ట్రేలియాకు చెందినవారు. ఆమె అక్కడే పుట్టారు. అక్కడే పెరిగారు. అయితే ఆమె బృందావనం వచ్చిన తర్వాత 13 సంవత్సరాలకు పైగా కాలాన్ని ఇక్కడే గడిపారు. తాను ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళినా, తిరిగి తన దేశానికి వెళ్ళినాబృందావనాన్నిమరచిపోలేనని చెప్పారు. అందువల్లబృందావనంతో, దాని ఆధ్యాత్మిక స్ఫూర్తితో అనుసంధానమయ్యేందుకు ఆమె ఆస్ట్రేలియాలోనే బృందావనాన్ని ఏర్పాటు చేశారు. తన కళను మాధ్యమంగా చేసుకుని అద్భుతమైన బృందావనాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చే ప్రజలకు అనేక రకాల కళాఖండాలను చూసే అవకాశం లభిస్తుంది. వారు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ తీర్థయాత్ర కేంద్రాలు – బృందావనం, నవద్వీప్, జగన్నాథపూరీల సంప్రదాయం,సంస్కృతిల సంగ్రహావలోకనం పొందుతారు.శ్రీకృష్ణుని జీవితానికి సంబంధించిన అనేక కళాఖండాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు తన చిటికెన వేలితో ఎత్తిన ఒక కళాఖండం కూడా ఉంది. దాని కింద బృందావన ప్రజలు ఆశ్రయం పొందారు. జగత్ తారిణి గారి ఈ అద్భుతమైన ప్రయత్నంకృష్ణభక్తి లోని శక్తిని చూపిస్తుంది. ఈ ప్రయత్నానికి వారందరికీ శుభాకాంక్షలు.

నా ప్రియమైన దేశవాసులారా! నేను ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉన్న బృందావనం గురించి మాట్లాడుతున్నాను. మన బుందేల్‌ఖండ్‌కు చెందిన ఝాన్సీతో ఆస్ట్రేలియాకు కూడా సంబంధం ఉందనేది ఆసక్తికరమైన చరిత్ర. నిజానికిఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీబాయి ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తున్నప్పుడుఆమె న్యాయవాది జాన్ లాంగ్.జాన్ లాంగ్ నిజానికి ఆస్ట్రేలియా వాసి. భారతదేశంలో ఉండి ఆయన రాణి లక్ష్మీబాయి విషయంలో పోరాడాడు. మన స్వాతంత్ర్య పోరాటంలో ఝాన్సీ, బుందేల్‌ఖండ్‌ల భాగస్వామ్యం మనందరికీ తెలుసు.రాణి లక్ష్మీబాయి,ఝల్కారీ బాయి వంటి వీరనారీమణులు ఇక్కడివారే. మేజర్ ధ్యాన్ చంద్ వంటి ఖేల్ రత్నను కూడా ఈ ప్రాంతమే దేశానికి అందించింది.

మిత్రులారా!శౌర్యాన్ని యుద్ధరంగంలో మాత్రమే ప్రదర్శించాల్సిన అవసరం లేదు. శౌర్యం వ్రతంగా మారినప్పుడు అది విస్తరిస్తుంది. అప్పుడు ప్రతి రంగంలోనూ అనేక కార్యాల సాధన ప్రారంభమవుతుంది. అలాంటి పరాక్రమం గురించి శ్రీమతి జ్యోత్స్నగారు నాకు లేఖ రాశారు. జాలౌన్‌లో ఒక నది ఉండేది – నూన్ నది. ఇక్కడి రైతులకు ఇది ప్రధాన నీటి వనరుగా ఉండేది. కానీక్రమంగా నూన్ నది అంతరించిపోయే దశకు చేరుకుంది. ఈ నదికి మిగిలి ఉన్న కొద్దిపాటి అస్తిత్వంగా ఇది కాలువగా మారింది. దీని కారణంగా రైతులకు సాగునీటికి కూడా ఇక్కట్లు ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మార్చేందుకు జాలౌన్ ప్రజలు చొరవ తీసుకున్నారు. ఇందుకోసం ఈ ఏడాది మార్చిలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమంలో వేలాది మంది గ్రామస్తులు, స్థానికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఇక్కడి పంచాయతీలు గ్రామస్తుల సహకారంతో పనులు ప్రారంభించాయి. నేడు అతి తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో నదికి జీవం పోశాయి. దీని వల్ల ఎంతో మంది రైతులకులబ్ది కలుగుతోంది. యుద్ధభూమిలో కాకుండా ఇతర క్షేత్రాలలో ధైర్యసాహసాలకు ఇది ఒక ఉదాహరణ. ఇది మన దేశవాసుల సంకల్ప శక్తిని చూపుతుంది. మనం దృఢ సంకల్పంతో ఉంటేఅసాధ్యమైనదిఏదీ ఉండదని ఈ ఉదాహరణ చెప్తోంది. సామూహిక కృషి ఉండాలని ఇది చెబుతుంది.

నా ప్రియమైన దేశవాసులారా!మనం ప్రకృతిని సంరక్షించినప్పుడు, ప్రకృతి కూడా మనకు రక్షణను, భద్రతను ఇస్తుంది. మనం వ్యక్తిగత జీవితంలో కూడా దీన్ని అనుభవిస్తాం.అలాంటి ఒక ఉదాహరణను తమిళనాడు ప్రజలు అందించారు. ఈ ఉదాహరణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు సంబంధించింది. తీర ప్రాంతాలలో కొన్నిసార్లు భూమి మునిగిపోయే ప్రమాదం ఉందని మనకు తెలుసు. తూత్తుకుడిలో కూడా చాలా చిన్నచిన్న ద్వీపాలుఉన్నాయి. అవి సముద్రంలో మునిగిపోయే ప్రమాదం పెరుగుతోంది.ఇక్కడి ప్రజలు,నిపుణులు ప్రకృతి ద్వారానే ఈ ప్రకృతి వైపరీత్యాన్ని రక్షించగలిగారు. ఈ ప్రజలు ఇప్పుడు ఈ దీవుల్లో తాటి చెట్లను నాటుతున్నారు. ఈ చెట్లు తుఫాన్లలో కూడా భూమికి రక్షణ ఇస్తాయి. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడంలో కొత్త విశ్వాసం ఏర్పడింది.

మిత్రులారా!మనం ప్రకృతి సమతుల్యతను భంగపరిచినప్పుడు లేదా దాని స్వచ్ఛతను నాశనం చేసినప్పుడు మాత్రమే ప్రకృతి మనకు ముప్పు కలిగిస్తుంది. ప్రకృతి కూడా మనల్ని తల్లిలా ఆదరిస్తుంది. మన ప్రపంచాన్ని కొత్త రంగులతో నింపుతుంది.

ప్రస్తుతం నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను- మేఘాలయలో ఎగురుతున్న పడవ ఫోటో చాలా వైరల్ అవుతోంది. ఈ చిత్రం తొలిచూపులోనే మనల్ని ఆకర్షిస్తుంది. మీలో చాలామంది దీన్ని ఆన్‌లైన్‌లో చూసి ఉంటారు. గాలిలో తేలుతున్న ఈ పడవను నిశితంగా పరిశీలిస్తే అది నది నీటిలో కదులుతున్నట్లు తెలుస్తుంది. నది నీరు ఎంత శుభ్రంగా ఉందంటే నది కింది ప్రాంతం పారదర్శకంగా కనిపిస్తుంది. పడవ గాలిలో తేలుతున్నట్టు కనిపిస్తుంది. మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ప్రజలు తమ సహజ వారసత్వాన్ని సంరక్షించిన అనేక ప్రాంతాలు ఉన్నాయి.ప్రకృతితో మమేకమై కాలం గడిపే జీవనశైలిని ఈ ప్రజలు నేటికీ సజీవంగా ఉంచారు. ఇది మనందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది. మన చుట్టూ ఉన్న సహజ వనరులను కాపాడి, వాటి అసలు రూపానికి తీసుకురావాలి. ఇందులోనే మనందరి క్షేమం ఉంది. ప్రజా ప్రయోజనం ఉంది.

నా ప్రియమైన దేశవాసులారా!ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినప్పుడు, బడ్జెట్‌ను ఖర్చు చేసినప్పుడు, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసినప్పుడుఅది పని చేస్తుందని ప్రజలు భావిస్తారు. కానీ ప్రభుత్వం రూపొందించే అనేక అభివృద్ధి పథకాలలోమానవీయ సంవేదనలకు సంబంధించిన విషయాలు ఎల్లప్పుడూ భిన్నమైన ఆనందాన్ని ఇస్తాయి. ప్రభుత్వ కృషితో, ప్రభుత్వ పథకాలతో ఏ జీవితం ఎలా మారిపోయిందో, ఆ మారిన జీవితాల అనుభవాలేమిటో విన్నప్పుడు మనలో కూడా సంవేదనలు కలుగుతాయి.మనసుకు సంతృప్తిని ఇవ్వడంతోపాటు ఆ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్ఫూర్తిని కూడా ఇస్తాయి. ఒక రకంగా చెప్పాలంటేఇది కేవలం స్వీయ ఆనందం మాత్రమే. అందుకే ఈ రోజు ‘మన్ కీ బాత్’ లో తమ మానసిక శక్తితో కొత్త జీవితాన్ని గెలిచిన అలాంటి ఇద్దరు మిత్రులు మనతో కలుస్తున్నారు. వారు ఆయుష్మాన్ భారత్ పథకం సహాయంతో తమ చికిత్సను పూర్తి చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరిలో మొదటి మిత్రుడు రాజేష్ కుమార్ ప్రజాపతి. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉండేవి.

రండి.. రాజేష్ గారితో మాట్లాడదాం –

ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. నమస్తే.

రాజేష్ ప్రజాపతి: నమస్తేసార్.. నమస్తే

ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. మీకు వచ్చిన వ్యాధి ఏమిటి? అప్పుడు

ఎవరో డాక్టర్ దగ్గరకు వెళ్లి ఉండాలి. నాకు చెప్పండి. స్థానిక వైద్యుడు తప్పనిసరిగా చెప్పిన తర్వాత మీరు వేరే వైద్యుడి వద్దకు వెళ్లి ఉండాలి. అప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నారా? లేదా? ఏం జరిగింది?

రాజేష్ ప్రజాపతి: నా గుండెలో ఒక సమస్య వచ్చింది సార్. నా

ఛాతీలో మంటగా అనిపించింది సార్. అప్పుడు డాక్టర్‌కి చూపించాను. అసిడిటీ ఉండవచ్చని డాక్టర్ చెప్పారు సార్. అందుకే చాలా రోజులు అసిడిటీ కి మందులు వాడాను. లాభం లేకపోవడంతో అప్పుడు నేను డాక్టర్‌ కపూర్ గారికి చూపించాను. “నీకు ఉన్న లక్షణాలు యాంజియోగ్రఫీ ద్వారా తెలుస్తాయి” అని డాక్టర్ గారుచెప్పారు. అప్పుడు ఆయన నన్ను శ్రీరామ్ మూర్తి గారికి రిఫర్ చేశారు. అప్పుడు మేం అమ్రేష్ అగర్వాల్ గారిని కలిశాం. ఆయన నా యాంజియోగ్రఫీ చేశారు. అప్పుడు ఆయన చెప్పారు. “ఇది మీ సిర బ్లాక్ కావడం వల్ల జరిగింది” అని. ఎంత ఖర్చవుతుందని మేం అడిగాం. దాంతో ఆయుష్మాన్ కార్డు ఉంటుందని, దాన్ని ప్రధానమంత్రి గారు తయారు చేశారని ఆయన చెప్పారు. ఆ కార్డు మా దగ్గర ఉందని మేం చెప్పాం. దాంతో ఆయన నా కార్డు తీసుకున్నారు. నా చికిత్స మొత్తం ఆ కార్డుతోనే జరిగింది సార్. మీరు ఈ కార్డ్‌ని చాలా మంచి పద్ధతిలో తయారు చేశారు. ఇది పేద ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంది. నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను!

ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. మీరేం చేస్తారు?

రాజేష్ ప్రజాపతి: సార్.. ఇప్పుడు నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను సార్

ప్రధానమంత్రి: మీ వయసెంత ?

రాజేష్ ప్రజాపతి: నా వయసు నలభై తొమ్మిదేళ్లు సార్

ప్రధానమంత్రి: మీకు ఇంత చిన్న వయసులోనే గుండె జబ్బు వచ్చింది.

రాజేష్ ప్రజాపతి – అవును సార్…

ప్రధానమంత్రి: మీ కుటుంబంలో ఇంతకు ముందు మీ కుటుంబంలో మీ అమ్మకు గానీ నాన్నకు గానీ ఇంకా ఎవరికైనా ఇలా ఉందా? మీకే వచ్చిందా?

రాజేష్ ప్రజాపతి: లేదు సార్, ఎవరూ లేరు సార్. ఇది నాకే వచ్చింది.

ప్రధాన మంత్రి: ఈ ఆయుష్మాన్ కార్డును భారత ప్రభుత్వం ఇస్తుంది. ఈ కార్డు పేదల కోసం ఒక పెద్ద పథకం. దీని గురించి మీకెలా తెలిసింది?

రాజేష్ ప్రజాపతి: సార్!ఇది చాలా పెద్ద పథకం. దీని ద్వారా పేద ప్రజలు చాలా ప్రయోజనం పొందుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఈ కార్డు ద్వారా ప్రజలు ఎంత ప్రయోజనం పొందారో ఆసుపత్రిలో చూశాం సార్. ఈ కార్డు మాదగ్గర ఉందని చెప్పినప్పుడు“సరే ఆ కార్డు తీసుకురండి.. అదే కార్డుతో మీకు వైద్యం చేస్తాన”ని డాక్టర్ చెప్పారు.

ప్రధానమంత్రి: మీ దగ్గర కార్డు లేకపోతేఎంత ఖర్చవుతుందో డాక్టర్ గారు చెప్పారా?

రాజేష్ ప్రజాపతి: కార్డు లేకపోతే చాలా ఖర్చవుతుందని డాక్టర్ చెప్పారు సార్. “సార్ నా దగ్గర కార్డ్ ఉంది” అని చెప్పాను. ఆ కార్డు వెంటనే చూపించమన్నారు డాక్టర్. ఆ కార్డు చూపిస్తే అదే కార్డ్ తో మొత్తం చికిత్స అంతా జరిగింది. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు, మందులు కూడా ఆ కార్డు ద్వారానే వచ్చాయి.

ప్రధానమంత్రి: కాబట్టి రాజేష్ గారూ.. మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. మీ ఆరోగ్యం బాగుంది.

రాజేష్ ప్రజాపతి: సార్! చాలా కృతజ్ఞతలు సార్!మీ ఆయుష్షు దీర్ఘకాలం ఉండాలి సార్. మీరు ఎల్లప్పుడూ అధికారంలో ఉండాలి. మా కుటుంబ సభ్యులు కూడా మీ కారణంగా చాలా సంతోషంగా ఉన్నారు.

ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. నేను అధికారంలో ఉండాలని కోరుకోకండి. నేను ఈ రోజు కూడా అధికారంలో లేను. భవిష్యత్తులో కూడా అధికారంలోకి వెళ్లాలనుకోను. నేను సేవలో మాత్రమే ఉండాలనుకుంటున్నాను. నాకు ఈ పదవి-ఈ ప్రధానమంత్రి పదవి.. ఇవన్నీ అధికారం కోసం కాదు సోదరా, సేవ కోసమే.

రాజేష్ ప్రజాపతి: మాకు కావలసింది సేవే సార్.. ఇంకేం కావాలి!

ప్రధానమంత్రి: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం పేదల కోసం.

రాజేష్ ప్రజాపతి: సార్ .. చాలా గొప్ప విషయం

ప్రధానమంత్రి: అయితే చూడండి రాజేష్ గారూ.. మీరు మా కోసం ఒక పని చేయండి. చేస్తారా?

రాజేష్ ప్రజాపతి: అవును.. ఖచ్చితంగా చేస్తాసార్

ప్రధానమంత్రి: ప్రజలకు దీని గురించి తెలియడం లేదు. మీరు బాధ్యత వహించాలి. మీకు దీని వల్ల కలిగిన ఉపయోగాన్ని మీకు ఎలా ప్రయోజనం కలిగిందో మీ చుట్టూ ఉన్న పేద కుటుంబాలకు చెప్పాలి.

రాజేష్ ప్రజాపతి: తప్పకుండాచెప్తాను సార్

ప్రధానమంత్రి: ఎప్పుడు కష్టాలు వస్తాయో తెలియదని, అందుకే ఇలాంటి కార్డును వారు కూడా తయారు చేసుకోవాలని వారికి చెప్పండి. డబ్బు లేకపోవడం వల్ల వారు మందు తీసుకోరు. వ్యాధికి మందు తీసుకోరు. అది కూడా చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ గుండె సమస్య ఉంటే పేదలకు ఏం జరుగుతుంది? అప్పుడు మీరు ఎన్ని నెలలు పని చేయకుండా ఉండాల్సి వస్తుంది?

రాజేష్ ప్రజాపతి: నేను పది అడుగులు కూడా నడవలేకపోయేవాడిని. మెట్లు ఎక్కలేకపోయే వాడిని సార్

ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. మీరు నాకు మంచి మిత్రునిగా మారడం ద్వారా, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మీకు వీలైనంత మంది పేదలకు వివరించడం ద్వారా మీరు అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయవచ్చు. మీరు కూడా సంతోషపడుతారు. రాజేష్ గారి ఆరోగ్యం బాగుపడడంతో పాటు రాజేష్ గారు వందలాది మందికి ఆరోగ్యం చేకూర్చారని నేను కూడా సంతోషిస్తాను. ఈ ఆయుష్మాన్ భారత్ పథకంపేదల కోసం. మధ్యతరగతి వారి కోసం. ఇది సాధారణ కుటుంబాల కోసం, కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఇంటికి మీరు చేర్చాలి.

రాజేష్ ప్రజాపతి: ఖచ్చితంగా చేరుస్తాను సార్. మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉన్నాం సార్. ఆసుపత్రికి వచ్చిన చాలా మంది పేదలకు కార్డు ఉంటే కలిగే ప్రయోజనాలు చెప్పాం సార్. కార్డు ఉంటే ఉచితంగా చేస్తారని చెప్పాం సార్.

ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి. మీ శరీరాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. చాలా అభివృద్ధి చెందండి. నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా! మనం రాజేష్ గారి మాటలు విన్నాం. ఇప్పుడు సుఖ్ దేవి గారు మనతో చేరుతున్నారు. మోకాళ్ల సమస్య ఆమెని చాలా బాధపెట్టింది. సుఖ్‌దేవి గారి బాధను విందాం. ఆమెకు ఆనందం ఎలా వచ్చిందో అర్థం చేసుకుందాం.

మోదీ గారు: సుఖదేవి గారూ.. నమస్తే! మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?

సుఖ దేవి గారు:దాన్ దపరా నుండి సార్.

మోదీ గారు: ఇది ఎక్కడ ఉంది?

సుఖ దేవి గారు: మధురలో.

మోదీ గారు: మధురలోనా! సుఖదేవి గారూ.. అయితేమీరు నమస్తే చెప్పడంతో పాటు రాధే-రాధే అని కూడా చెప్పాలి.

సుఖదేవి గారు: అవును సార్. రాధే-రాధే.

మోదీ గారు: మీరు ఇబ్బందుల్లో ఉన్నారని మేము విన్నాము. మీకు ఏదైనా ఆపరేషన్ జరిగిందా? విషయమేమిటో చెప్పగలరా?

సుఖ దేవి గారు: అవును. నా మోకాలు దెబ్బతింది. కాబట్టి నాకు ఆపరేషన్ జరిగింది. ప్రయాగ్ హాస్పిటల్ లో.

మోదీ గారు: సుఖదేవి గారూ.. మీ వయస్సు ఎంత?

సుఖ దేవి గారు: వయస్సు 40 సంవత్సరాలు సార్ .

మోదీ గారు: సుఖదేవి అనే పేరు. 40 సంవత్సరాలు. సుఖదేవి అనారోగ్యం పాలయ్యారు.

సుఖ దేవి గారు: 15-16 సంవత్సరాల వయస్సు నుండేనేను అనారోగ్యంతో ఉన్నాను.

మోదీ గారు: ఇంత చిన్న వయస్సులో మీ మోకాలు

చెడిపోయిందా!

సుఖ దేవి గారు: కీళ్లనొప్పుల వల్ల మోకాలు చెడిపోయింది సార్.

మోదీ గారు: 16 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు మీరు చికిత్స కూడా చేయించలేదా?

సుఖ దేవి గారు: లేదు. .. చేయించాను. పెయిన్ మెడిసిన్ తీసుకుంటూనే ఉన్న చిన్నా చితకా డాక్టర్లకు చూపించాను. స్థానికంగా దొరికే మందులు వాడాను. దాంతో మోకాలు మరింత పాడైపోయింది.

మోదీ గారు: సుఖదేవి గారూ.. ఆపరేషన్ ఆలోచన ఎలా వచ్చింది? దానికోసం డబ్బుఎలా ఏర్పాటు చేసుకున్నారు? ఇదంతా ఎలా జరిగింది?

సుఖ దేవి గారు: నేను ఆయుష్మాన్ కార్డ్‌తో ఆ చికిత్సను పూర్తి చేశాను.

మోదీ గారు: మీకు ఆయుష్మాన్ కార్డు వచ్చిందా?

సుఖ దేవి గారు: అవును.

మోదీ గారు: ఆయుష్మాన్ కార్డుతో పేదలకు ఉచిత చికిత్సజరుగుతుంది. ఇది మీకు తెలుసా?

సుఖ దేవి గారు: స్కూల్‌లో ఒక మీటింగ్ ద్వారా మా భర్తకు తెలిసింది. నా పేరు మీద కార్డు చేయించారు.

మోదీ గారు: ఓహ్..

సుఖ దేవి గారు: అప్పుడు కార్డు ద్వారా ట్రీట్‌మెంట్ చేయించాను. నేను డబ్బు పెట్టుబడి పెట్టలేదు. నేను కార్డు ద్వారానే చికిత్స పొందాను. మంచి చికిత్స జరిగింది.

మోదీ గారు: కార్డు లేకపోతే ఎంత ఖర్చవుతుందని డాక్టర్ చెప్పేవారు?

సుఖ దేవి గారు: రెండున్నర లక్షల రూపాయలు, మూడు లక్షల రూపాయలు. ఆరేడేళ్ల నుంచి మంచంలో ఉన్నాను. “దేవుడా! నన్ను తీసుకెళ్లు. నాకు బతకాలని లేదు” అని అనుకునేదాన్ని.

మోదీ గారు: 6-7 సంవత్సరాలు మంచం మీద ఉన్నారు. అమ్మో!

సుఖ దేవి గారు: అవును.

మోదీ గారు: ఓ!

సుఖ దేవి గారు: అస్సలు లేవడం, కూచోవడం ఉండేది కాదు.

మోదీ గారు: ఇప్పుడు మీ మోకాలి మునుపటి కంటే మెరుగ్గా ఉందా?

సుఖ దేవి గారు: నేను చాలా ప్రయాణం చేస్తాను. నేను తిరుగుతున్నాను వంటగది పనిచేస్తాను. ఇంటి పనులు చేస్తాను. నేనే వండి పిల్లలకు భోజనం పెడతాను.

మోదీ గారు: కాబట్టి ఆయుష్మాన్ భారత్ కార్డు నిజంగా మిమ్మల్ని ఆయుష్మంతులుగా మార్చింది.

సుఖ దేవి గారు: ఈ పథకానికి చాలా ధన్యవాదాలు. కోలుకున్నాను. నా కాళ్ళపై నేను నిలబడగలుగుతున్నాను.

మోదీ గారు: కాబట్టి ఇప్పుడు పిల్లలు కూడా ఆనందిస్తున్నారు.

సుఖ దేవి గారు: అవును. పిల్లలు చాలా ఇబ్బందులు పడేవారు. తల్లి బాధపడితే బిడ్డలు కూడా బాధపడేవారు.

మోదీ గారు: చూడండి.. మన ఆరోగ్యం మన జీవితంలో అతిపెద్ద ఆనందం. ఇది ఆయుష్మాన్ భారత్ భావన. ప్రతి ఒక్కరూ ఈ సంతోషకరమైన జీవితాన్ని పొందాలి. సుఖదేవి గారూ.. మీకు మరోసారి శుభాకాంక్షలు. రాధే-రాధే.

సుఖ దేవి గారు: రాధే – రాధే.. నమస్తే!

నా ప్రియమైన దేశప్రజలారా! యువత అధికంగా ఉన్న ప్రతి దేశంలో మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు అవే కొన్నిసార్లు యువత నిజమైన గుర్తింపుగా మారతాయి. మొదటి విషయం – ఆలోచనలు,ఆవిష్కరణ. రెండవది రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండే మనస్తత్వం. మూడవది ఏదైనా చేయగలననే ఆత్మ విశ్వాసం-అంటే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఏ పనినైనా సాధించాలనే సంకల్పం. ఈ మూడు అంశాలు కలిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజుల్లో మనం స్టార్ట్-అప్, స్టార్ట్-అప్, స్టార్ట్-అప్ అని అన్ని వైపులా వింటున్నాం. నిజమే.. ఇది స్టార్టప్ యుగం, అలాగే స్టార్ట్-అప్ ప్రపంచంలోఈ రోజు భారతదేశం ప్రపంచానికే ఒకరకంగా మార్గదర్శిగా నేతృత్వం వహిస్తుందన్నది కూడా నిజం. స్టార్టప్‌లు ఏడాదికేడాది రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.దేశంలోని చిన్న పట్టణాల్లో కూడా స్టార్టప్‌ల పరిధి పెరిగింది. ఈ రోజుల్లో ‘యూనికార్న్’ అనే పదం చాలా చర్చలో ఉంది. మీరందరూ తప్పక విని ఉంటారు. ‘యూనికార్న్’ అటువంటి స్టార్టప్. దీని విలువ కనీసం 1 బిలియన్ డాలర్లు అంటే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ.

మిత్రులారా! 2015 సంవత్సరం వరకు దేశంలో దాదాపు తొమ్మిది లేదా పది యూనికార్న్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు భారతదేశం యునికార్న్స్ ప్రపంచంలో కూడా వేగంగా పురోగమిస్తుందని తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఒక నివేదిక ప్రకారంఈ సంవత్సరం పెద్ద మార్పు వచ్చింది. కేవలం 10 నెలల్లోప్రతి 10 రోజులకు ఒక యూనికార్న్ భారతదేశంలో తయారవుతోంది. కరోనా మహమ్మారి మధ్య మన యువత ఈ విజయాన్ని సాధించడం కూడా పెద్ద విషయం. ప్రస్తుతం భారతదేశంలో 70 కంటే ఎక్కువ యూనికార్న్‌లు ఉన్నాయి. అంటే 1 బిలియన్ కంటే ఎక్కువ విలువను దాటిన 70 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఉన్నాయి. మిత్రులారా!స్టార్ట్-అప్ విజయం కారణంగాప్రతి ఒక్కరి దృష్టి దీనిపై పడింది. దేశం నలుమూలల నుండి, విదేశాల నుండి పెట్టుబడిదారుల సహకారం లభిస్తున్న విధానాన్ని అందరూ గమనిస్తున్నారు. బహుశా కొన్ని సంవత్సరాల కిందట ఇది ఎవరూ ఊహించలేదు.

మిత్రులారా!భారతీయ యువత స్టార్టప్‌ల ద్వారా ప్రపంచ సమస్యల పరిష్కారంలోకూడా సహకరిస్తోంది. ఈ రోజు మనం ఒక యువకుడు మయూర్ పాటిల్‌తో మాట్లాడదాం. ఆయన తన స్నేహితులతో కలిసి కాలుష్య సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నించారు.

మోదీ గారు: మయూర్ గారూ.. నమస్తే.

మయూర్ పాటిల్ గారు: నమస్కారం సార్.

మోదీ గారు: మయూర్ గారూ.. మీరెలా ఉన్నారు?

మయూర్ పాటిల్ గారు: చాలా బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు ?

మోదీ గారు: నేను చాలా సంతోషంగా ఉన్నాను. సరే చెప్పండి. ప్రస్తుతం మీరేదో స్టార్టప్ ప్రపంచంలో ఉన్నారు.

మయూర్ పాటిల్ గారు: అవును సార్!

మోదీ గారు: వ్యర్థాలను ఉత్తమంగా పరివర్తన చేస్తున్నారు.

మయూర్ పాటిల్ గారు: అవును సార్!

మోదీ గారు: పర్యావరణ రంగంలో కూడా మీరు పని చేస్తున్నారు. మీ గురించి చెప్పండి. మీ పని గురించి మాకు చెప్పండి. ఈ పనికి మీకు ఎలా ఆలోచన వచ్చింది?

మయూర్ పాటిల్ గారు: సార్!నేను కాలేజీలో ఉన్నప్పుడు నాకు మోటార్ సైకిల్ ఉండేది. దాని మైలేజ్ చాలా తక్కువగా ఉండేది. ఎమిషన్ చాలా ఎక్కువగా ఉండేది. అది టూ స్ట్రోక్ మోటార్ సైకిల్. కాబట్టి ఉద్గారాలను తగ్గించి, దాని మైలేజీని కొద్దిగా పెంచడానికినేను ప్రయత్నించడం ప్రారంభించాను.ఎప్పుడో 2011-12లో నేను మైలేజీని లీటరుకు 62 కిలోమీటర్ల మేరకు పెంచాను. కాబట్టి అక్కడి నుండి నేను ప్రజల కోసం పెద్ద ఎత్తున తయారు చేయాలనే ప్రేరణ పొందాను. అప్పుడు చాలా మంది దాని నుండి ప్రయోజనం పొందుతారుకాబట్టి. 2017-18లో మేం దాని సాంకేతికతను అభివృద్ధి చేశాం. ప్రాంతీయ రవాణా సంస్థలో 10 బస్సులలో ఉపయోగించాం. దాని ఫలితాన్ని తనిఖీ చేయడానికి దాదాపు మేం ఉద్గారాలను నలభై శాతం తగ్గించాం- బస్సులలో ..

మోదీ గారు: ఓహ్! మీరు కనుగొన్న ఈ సాంకేతికతకు పేటెంట్ మొదలైనవి పొందారా?

మయూర్ పాటిల్ గారు: అవును సార్! పేటెంట్ పూర్తయింది. ఈ సంవత్సరంలో మాకు పేటెంట్ వచ్చింది.

మోదీ గారు: మరి దీన్ని మరింత పెంచే ప్రణాళిక ఏమిటి? ఎలా చేస్తున్నారు? బస్సు ఫలితం వచ్చేసింది. ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే ఉంటాయి. కాబట్టి మీరు తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నారు?

మయూర్ పాటిల్ గారు: సార్!స్టార్ట్-అప్ ఇండియాలో NITI ఆయోగ్ నుండి అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్ నుండి మాకు గ్రాంట్ వచ్చింది. ఆ గ్రాంట్ ఆధారంగామేం ఎయిర్ ఫిల్టర్‌లను తయారు చేసే ఫ్యాక్టరీని ప్రారంభించాం.

మోదీ గారు: మీరు భారత ప్రభుత్వం నుండి ఎంత గ్రాంట్ పొందారు?

మయూర్ పాటిల్ గారు: 90 లక్షలు

మోదీ గారు: 90 లక్షలా!

మయూర్ పాటిల్ గారు: అవును సార్!

మోదీ గారు: మీ పని దానితో పూర్తయిందా !

మయూర్ పాటిల్ గారు: అవును.. ఇప్పుడే మొదలైంది. ఇంకా ప్రాసెస్ లో ఉన్నాం.

మోదీ గారు: మీరు ఎంత మంది స్నేహితులు కలిసి చేస్తున్నారు ఇదంతా?

మయూర్ పాటిల్ గారు: మేం నలుగురం సార్.

మోదీ గారు: నలుగురూ ఇంతకుముందు కలిసి చదువుకునేవారు. దాని నుండి మీకు ముందుకు వెళ్లాలనే ఆలోచన వచ్చింది.

మయూర్ పాటిల్ గారు: అవును సార్! అవును! మేము ఇంకా కాలేజీలోనే ఉన్నాం అప్పుడు. కాలేజీలో మేం ఇదంతా ఆలోచించాం. కనీసం నా మోటార్‌సైకిల్ కాలుష్యాన్ని తగ్గించి మైలేజీని పెంచాలని నా ఆలోచన.

మోదీ గారు: కాలుష్యాన్ని తగ్గించారు.. మైలేజీని పెంచారు.. అప్పుడు సగటు ఖర్చు ఎంత ఆదా అవుతుంది?

మయూర్ పాటిల్ గారు: సార్!మోటార్ సైకిల్ మైలేజీని పరీక్షించాం. లీటరుకు 25 కిలోమీటర్లు ఇచ్చే దాన్ని లీటర్‌కు 39 కిలోమీటర్లకు పెంచాం. అప్పుడు దాదాపు 14 కిలోమీటర్ల ప్రయోజనం. అందులో 40 శాతం కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. ప్రాంతీయ రవాణా సంస్థ బస్సులను ప్రారంభించినప్పుడుఇంధన సామర్థ్యం 10 శాతం పెరిగింది. దానిలో ఉద్గారాలు 35-40 శాతం తగ్గాయి.

మోదీ గారు: మయూర్ గారూ.. మీతో మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. మీకు మిత్రులను కూడా అభినందిస్తున్నాను. కళాశాల జీవితంలో మీరు ఎదుర్కొన్న సమస్యకు మీరు ఒక పరిష్కారం కనుగొనడంతో పాటు ఆ పరిష్కారం ఎంచుకున్న మార్గం పర్యావరణ సమస్యను పరిష్కరించింది. మీరు చొరవ తీసుకున్నారు. మన దేశ యువతఏదైనా పెద్ద సవాలును స్వీకరించి, మార్గాలను అన్వేషిస్తుంది. అదే మన యువత శక్తి. మీకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను. నా తరఫున మీకు చాలా చాలా ధన్యవాదాలు

మయూర్ పాటిల్ గారు: ధన్యవాదాలు సార్! ధన్యవాదాలు!

మిత్రులారా! కొన్నేళ్ల క్రితం ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటున్నానని, కొత్త కంపెనీ పెట్టాలనుకుంటున్నానని చెబితే“నీకు ఉద్యోగం ఎందుకు వద్దు? ఉద్యోగంలో భద్రత ఉంటుంది. జీతం వస్తుంది. ఇబ్బంది కూడా తక్కువే.” అని కుటుంబ పెద్దలు సమాధానమిచ్చేవారు. కానీ, ఎవరైనా ఈరోజు తన స్వంత కంపెనీని ప్రారంభించాలనుకుంటేచుట్టూ ఉన్న వారందరూ చాలా ఉత్సాహపరుస్తారు. అతనికి పూర్తిగా మద్దతు ఇస్తారు. మిత్రులారా!ఇది భారతదేశ వృద్ధి కథ మలుపు. ఇక్కడ ఇప్పుడు ప్రజలు ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలని కలలు కంటున్నారు. ఇది ప్రపంచ వేదికపై భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

నా ప్రియమైన దేశప్రజలారా!ఈరోజు మనం ‘మన్ కీ బాత్’లో అమృత మహోత్సవం గురించి మాట్లాడుకున్నాం. అమృత కాలంలో మన దేశప్రజలు కొత్త సంకల్పాలను ఎలా నెరవేరుస్తున్నారో చర్చించాం. డిసెంబర్ నెలలో సైన్యం ధైర్యసాహసాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించాం. డిసెంబరు నెలలోమనం స్ఫూర్తి పొందే మరో పెద్ద రోజు మన ముందుకు వస్తుంది. అది డిసెంబర్ 6వ తేదీన వచ్చే బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి. బాబా సాహెబ్ తన జీవితమంతా దేశం కోసం,సమాజం కోసం తన విధులను నిర్వర్తించడానికి అంకితం చేశారు. మనమందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలనిమన రాజ్యాంగం ఆశిస్తున్నదని, అదే మన రాజ్యాంగంలోని ప్రాథమిక భావన అని దేశప్రజలమైన మనం ఎప్పటికీ మరచిపోకూడదు. కాబట్టి మన కర్తవ్యాలను పూర్తి నిజాయితీతో నిర్వహిస్తామనిఅమృత మహోత్సవంలో ప్రతిజ్ఞ చేద్దాం. ఇదే బాబా సాహెబ్‌కి మనం ఇచ్చే నిజమైన నివాళి.

మిత్రులారా! ఇప్పుడు మనం డిసెంబర్ నెలలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 2021లో తర్వాతి ‘మన్ కీ బాత్’ ఈ సంవత్సరంలో చివరి ‘మన్ కీ బాత్’ కావడం సహజం. 2022లో మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. అవును.. నేను మీ నుండి చాలా సూచనలను ఆశిస్తూనే ఉన్నాను. దాన్ని కొనసాగిస్తాను. మీరు ఈ సంవత్సరానికి ఎలా వీడ్కోలు పలుకుతున్నారు, కొత్త సంవత్సరంలో మీరు ఏమి చేయబోతున్నారు- దయచేసి ఈ విషయాలు కూడా చెప్పండి. కరోనా ఇంకా పోలేదని మర్చిపోకండి. జాగ్రత్తలు తీసుకోవడం మనందరి బాధ్యత.

చాలా చాలా ధన్యవాదాలు!