Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2021 అక్టోబర్ 24 వ తేదీ నాటి ‘మన్ కీ బాత్’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం 82 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


ప్రియమైన సహచరులారా, మీకందరికీ నమస్కారం | శతకోటి ప్రణామాలు | నేను మీకు శతకోటి ప్రణామాలు ఎందుకు చెబుతున్నానంటే వంద కోట్ల వాక్సీన్ డోసులు తీసుకున్న తర్వాత ఇవ్వాళ్ల దేశం కొత్త ఉత్సహంతో, కొత్త వేగంతో ముందుకు దూసుకెళ్తోంది. మన వాక్సినేషన్ కార్యక్రమం సఫలత భారతదేశపు సామర్ధ్యాన్ని చాటుతోంది, అది మన సామర్ధ్యానికి ప్రతీకగా నిలిచింది. 

మిత్రులారా వంద కోట్ల వాక్సీన్ డోసుల్ని వేయడం చాలా పెద్ద విషయం, కానీ దానికి సంబంధించిన లక్షలాది చిన్న చిన్న ప్రేరణలు, అలాగే గర్వంతో కూడుకున్న అనేక అనుభవాలు, అనేక ఉదాహరణలు దానికి ముడిపడి ఉన్నాయి | వాక్సినేషన్ మొదలుపెట్టిన రోజునే ఇంత పెద్ద కార్యక్రమం పూర్తిగా సఫలమవుతుందన్న విశ్వాసం నాకెలా కలిగిందని చాలామంది నాకు లేఖలు రాస్తున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు | నాకు అంతటి నమ్మకం ఎందుకు కలిగిందంటే, నాకు నా దేశంయొక్క, నా దేశ ప్రజలయొక్క శక్తి సామర్ధ్యాల గురించి చాలా బాగా తెలుసు కనుక | మన హెల్త్ వర్కర్లు దేశవాసులందరికీ టీకాలు వేసే ప్రయత్నంలో ఎలాంటి లోపం చెయ్యరన్న పూర్తి నమ్మకం నాకుంది. మన హెల్త్ వర్కర్లు పూర్తి స్థాయి అంకిత భావంతో, ఓ సత్సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. వాళ్లందరూ ఓ వినూత్నమైన సంకల్పంతో, అంకితభావంతో తమ శక్తికి మంచి చాలా కష్టపడ్డారు | ధృఢ నిశ్చయంతో మానవతా భావనతో సేవా దృక్పథంతో ముందుకు సాగి ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు | దానికి సంబంధించి ఎన్నో ఉదాహరణలున్నాయి | అనేక రకాలైన ఇబ్బందుల్ని సవాళ్లని అధిగమించి వాళ్లు ఏ విధంగా దేశ ప్రజలందరికీ ఓ సురక్షా కవచాన్ని ఏర్పాటు చేశారో కథలు కథలుగా చెబుతున్నారు | ఈ సఫలత సాధించడానికి వాళ్లు ఎంతగా కష్టపడ్డారో, ఎన్ని శ్రమలకోర్చారో మనం అనేక పత్రికల్లో వచ్చిన కథనాలు చూశాం, అనేక రకాల కథనాల్నికూడా విన్నాం | ఒకరిని మించి ఒకరుగా అనేక రకాలైన ప్రేరణలు మనకి కనిపించాయి | నేనివ్వాళ్టి మన్ కీ బాత్ లో ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ హెల్త్ వర్కర్ పూనమ్ నౌటియాలా ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను | మిత్రులారా ఆ బాగేశ్వర్ దేశంలోకెల్లా నూటికి నూరుశాతం వాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసిన ఉత్తరాఖండ్ ఖండ్ కి చెందినవారు కావడం విశేషం | ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్నికూడా మనం ఈ సందర్భంగా అభినందించి తీరాలి. ఎందుకంటే అది అత్యంత దుర్గమమైన, కఠినమైన ప్రదేశం కాబట్టి | అదే విధంగా అనేక విధాలైన అవాంతరాల్ని అధిగమించి హిమాచల్ ప్రదేశ్ కూడా నూటికి నూరుశాతం వాక్సినేషన్ ప్రక్రియలో సఫలత సాధించింది | నాకు తెలిసిన సమాచారం ప్రకారం పూనమ్ గారు తానున్న ప్రదేశంలో అందరికీ వాక్సీన్ ని అందించడానికి రాత్రింబవళ్లూ తీవ్రస్థాయిలో శ్రమించారు |

ప్రధాన మంత్రి :- పూనమ్ గారు నమస్తే |

పూనమ్ నౌటియాలా :- నమస్కారం సర్ |

ప్రధాన మంత్రి :- పూనమ్ గారూ దేశ వాసులందరికీ కాస్త మీ 

గురించి చెబుతారా

పూనమ్ నౌటియాలా :- సార్ నా పేరు పూనమ్ నౌటియాలా | సార్ 

నేను ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ జిల్లాలోని చానీ కోరాలీ సెక్టర్ లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తని సర్. నేనో ANMని సర్. 

ప్రధాన మంత్రి :- పూనమ్ గారూ నాకు బాగేశ్వర్ కి వచ్చే 

అవకాశం కలగడం నిజంగా నా అదృష్టం. అది ఓ పుణ్య క్షేత్రం కావడం విశేషం. అక్కడ బాగేశ్వర్ మందిరం ఉంది, దాన్ని దర్శించుకుని నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎన్నో శతాబ్దాల క్రితం ఆ మందిరాన్ని అసలు ఎలా నిర్మించారోకదా అని. 

పూనమ్ నౌటియాల్ :- అవును సార్.  

ప్రధాన మంత్రి :- పూనమ్ గారూ మీరు మీ ప్రాంతంలో 

ఉన్నవారందరికీ వాక్సినేషన్ పూర్తి చేశారా?

పూనమ్ నౌటియాల్ :- అవును సర్, మొత్తం అందరికీ పూర్తైపోయింది.  

ప్రధానమంత్రి :- ఆ ప్రక్రియలో మీరేమైనా ఇబ్బందుల్ని 

ఎదుర్కోవాల్సొచ్చిందా?

పూనమ్ నౌటియాలా :- అవును సర్ | ఇక్కడ మాకు ఎక్కడైతే వర్షం 

పడుతుందో అక్కడ రోడ్డు పూర్తిగా బ్లాకైపోతుంది | సార్ మేం నదిని దాటుకుని వెళ్లాల్సొచ్చింది |

మేం ప్రతి ఒక్క ఇంటికీ వెళ్లాం సర్ |NHCVC కార్యక్రమంలో భాగంగా మేం ప్రతి ఇంటికీ వెళ్లాం | చాలామంది ఆరోగ్య కేంద్రానికి రాలేకపోయారండీ, ఎలాంటివాళ్లంటే వృద్ధులు, వికలాంగులులాంటి వాళ్లు, గర్భవతులైన మహిళలు, గృహిణులు చాలామంది |

ప్రధానమంత్రి :- పైగా అక్కడ కొండలమీద ఇళ్లు చాలా 

దూరంగా ఉంటాయికదా. 

పూనమ్ నౌటియాలా :- అవును |

ప్రధాన మంత్రి :- మరైతే మీరు ఒక్క రోజులో ఎంతదూరం 

ప్రయాణించాల్సొచ్చేది.  

పూనమ్ నౌటియాలా :- సార్ కిలోమీటర్ల ప్రకారం చూస్తే రోజుకి దాదాపు పది 

కిలోమీటర్లు, ఎనిమిది కిలోమీటర్లు.

ప్రధాన మంత్రి :- నిజానికి పట్టణాల్లో నివశించేవాళ్లకి 8-10 కిలోమీటర్లు 

కొండలెక్కి ప్రయాణించడమంటే ఏంటో తెలియదు. నాకు తెలిసి 8-10 కిలోమీటర్లు కొండలెక్కడమంటే మొత్తం రోజంతా పడుతుంది. 

పూనమ్ నౌటియాలా :- అవును సర్..

ప్రధాన మంత్రి :- కానీ ఒక్కరోజులో ఇంతంటే, పైగా ఇది చాలా 

ముఖ్యమైన వాక్సినేషన్ కార్యక్రమం కాబట్టి మొత్తం సామానంతా కూడా మోసుకెళ్లాల్సొస్తుంది. మీతోపాటుగా ఎవరైనా సహాయకులు కూడా వచ్చేవారా లేదా ?

పూనమ్ నౌటియాలా :- అవును సర్.. మేం ఐదుగురం టీమ్ మెంబర్లం 

ఉంటాం సర్. 

పూనమ్ నౌటియాలా :- ఆ.. 

పూనమ్ నౌటియాలా :- ఆ బృందంలో ఓ డాక్టర్, ఓ ANM, ఇంకా ఓ 

ఫార్మసిస్ట్, ఆశా అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఉన్నారు సర్. 

ప్రధానమంత్రి :- అవునా.. అయితే ఆ డేటా ఎంట్రీకోసం అక్కడ 

కనెక్టివిటీ దొరికేదా లేకపోతే బాగేశ్వర్ కి తిరిగొచ్చాక చేసేవాళ్లా?

పూనమ్ నౌటియాలా :- సర్.. అక్కడక్కడా నెట్వర్క్ ఉండేది, మిగతావన్నీ 

బాగేశ్వర్ కి తిరిగొచ్చాక ఎంట్రీ చేసేవాళ్లం మేము. 

ప్రధాన మంత్రి :- అవును. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే 

పూనమ్ గారు ఔటాఫ్ ది వే వెళ్లి జనానికి టీకాలు వేసేవాళ్లట. అసలు మీకా ఆలోచన ఎలా వచ్చింది, మీరప్పుడేమనుకున్నారు, మీరు ఎలా ముందుకెళ్లారు?

పూనమ్ నౌటియాలా :- మేమంతా, మొత్తం టీమ్ కలిసి మావల్ల ఒక్క డోస్ 

వాక్సీన్ కూడా మిస్ కాకూడదని బలంగా

సంకల్పించుకున్నాం. మన దేశం నుంచి కరోనా మహమ్మారిని దూరంగా తరిమి వెయ్యాలనుకున్నాం. నేను ఆశ కలిసి గ్రామాల వారీగా ఓ డ్యూ లిస్ట్ ని తయారు చేసుకున్నాం. ఆ జాబితా ప్రకారం చూసుకుని సెంటర్ కి వచ్చినవాళ్లకి అక్కడే టీకాలు వేసేశాం. తర్వాత మేం ఇంటింటికీ వెళ్లాం. సార్ ఆ తర్వాత మిగిలిపోయినవాళ్లు, సెంటర్ కి రాలేని వాళ్లని గుర్తించాం. 

ప్రధాన మంత్రి :- మీరు అందరికీ నచ్చజెప్పాల్సొచ్చేదా?

పూనమ్ నౌటియాలా :- అవును సర్.. నచ్చజెప్పాం.. అవును.. 

ప్రధాన మంత్రి :- ఇప్పుడు కూడా అందరూ వాక్సీన్ తీసుకోవడానికి 

ఉత్సాహం చూపిస్తున్నారా?

పూనమ్ నౌటియాలా :- అవును సర్.. అవును.. ఇప్పుడు అందరికీ 

అర్థమైపోయింది. మొదట్లో మాకు చాలా కష్టంగా అనిపించింది. ఈ వాక్సీన్ సురక్షితమైనదని, మేం కూడా వేసుకున్నామని, మేం బాగానే ఉన్నాంకదా అని జనానికి నచ్చజెప్పాల్సొచ్చేది. మా స్టాఫ్ అంతా వేసుకున్నామని మేం బాగున్నామని చెప్పాల్సొచ్చేది. 

ప్రధాన మంత్రి :- ఎక్కడైనా వాక్సీన్ వేసిన తర్వాత ఏమైనా 

ఇబ్బందులొచ్చాయా తర్వాత.. పూనమ్ నౌటియాలా :- లేదు లేదు సర్.. అలాంటిదేం లేదు.. 

పూనమ్ నౌటియాలా :- ఏం కాలేదా.. 

పూనమ్ నౌటియాలా :- అవును.. 

ప్రధాన మంత్రి :- అందరూ సంతోషంగానే ఉన్నారా

పూనమ్ నౌటియాలా :- అవును సర్.. 

ప్రధానమంత్రి :- అంతా బాగానే ఉందికదా.. 

పూనమ్ నౌటియాలా :- అవును సర్.. 

ప్రధాన మంత్రి :- అవును.. మీరు చాలా కష్టపడి పనిచేశారు.. ఆ 

ప్రాంతం ఎలా ఉంటుందో, అక్కడ కొండలెక్కడం ఎంత కఠినంగా ఉంటుందో నాకు తెలుసు. ఓ కొండ ఎక్కడం మళ్లీ కిందికి దిగడం, మళ్లీ ఇంకో కొండెక్కడం, ఇళ్లుకూడా చాలా దూరంగా ఉంటాయి, మీరు చాలా చాలా కష్టపడి పనిచేశారు. 

పూనమ్ నైటియాల్ :- ధన్యవాదాలు సర్, మీతో మాట్లాడ్డం నిజంగా నా 

అదృష్టం.

 

ప్రధానమంత్రి :- మీలాంటి లక్షలాది మంది హెల్త్ వర్కర్లు 

కఠినమైన పరిశ్రమతో భారత దేశంలో కోట్లాది వాక్సీన్ డోసుల లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఇవ్వాళ్ల దానికి నేను కేవలం మీకు మాత్రమే కాక ఉచిత టీకాకరణ ప్రక్రియని ఇంత పెద్ద ఎత్తున పూర్తి చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క భారతీయుడికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరివల్లే మన దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ ఇంతగా సఫలమయ్యింది. మీకు మీ కుటుంబాలకు నేను అభినందనలు తెలుపుతున్నాను. 

ప్రియమైన దేశవాసులారా, మీకు తెలిసిందేకదా వచ్చే ఆదివారం, అక్టోబర్ 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పండుగ. మనసులో మాట శ్రోతలందరి తరఫునా, నా తరఫునా, నేనా ఉక్కుమనిషికి నమస్కరిస్తున్నాను. 

 

మిత్రులారా, అక్టోబర్ 31వ తేదీని మనం రాష్ట్రీయ సమైక్య దినంగా జరుపుకుంటున్నాం. ఏకత్వానికి సంబంధించిన ఏ విధానం లేదా ప్రక్రియతో అయినా సరే మనందరం అనుబంధాన్ని పెంచుకోవడం మన ధర్మం. మీరు చూసే ఉంటారు గుజరాత్ పోలీసులు కచ్ లోని లఖ్ పత్ కోటనుండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకూ బైక్ ర్యాలీని నిర్వహించారు. త్రిపుర పోలీసులు ఏకతా దివస్ ని జరుపుకునే సందర్భంలో త్రిపుర నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకూ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. అంటే తూర్పు నుంచి పశ్చిమ దిశ వరకూ దేశాన్ని ఏకం చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్ పోలీసులుకూడా ఉరీనుంచి పఠాన్ కోట్ వరకూ అలాంటి బైక్ ర్యాలీని నిర్వహించి దేశంలో ఏకత్వ సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. నేనా జవానులందరికీ సెల్యూట్ చేస్తున్నాను. జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని అనేక మంది ఆడపడుచుల గురించి కూడా నాకు తెలిసింది. ఆ ఆడపడుచులందరూ కాశ్మీర్ లోని సైన్యానికి సంబంధించిన కార్యాలయాలకోసం, ప్రభుత్వ కార్యాలయాలకోసం మువ్వన్నెల జెండాలను కుడుతున్నారు. పరిపూర్ణమైన దేశ భక్తితో చేస్తున్న పని అది. నేను ఆ ఆడపడుచులు పడుతున్న శ్రమని అభినందిస్తున్నాను. మీరుకూడా భారతదేశంలో ఏకత్వం కోసం, భారత దేశ ఔన్నత్యం కోసం, ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు మీ మనసుకు ఎంతటి సంతోషం కలుగుతుందో మీరే చూడండి. 

మిత్రులారా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమనేవారంటే – మనందరం కలిసికట్టుగా  ఉన్నప్పుడు మాత్రమే దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లగలం. మనలో గనక ఏకత్వం లేకపోతే మనంతట మనమే కొత్త కొత్త ఆపదల్లో చిక్కుకుపోతాం. అంటే దేశం ఒక్కటిగా ఉంటే మనం ఉన్నతంగా ఉంటాం. మనం సర్దార్ పటేల్ జీవితంనుంచి ఆయన ఆశయాలనుంచి చాలా చాలా నేర్చుకోవచ్చు. మన ప్రసార మంత్రిత్వ శాఖ కూడా సర్దార్ పటేల్ జీవితంపై ఓ పిక్టోరియెల్ బయోగ్రఫీని ప్రచురించింది. మన దేశంలోని యువకులందరూ దాన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. దానిద్వారా మీకు ఆకర్షణీయమైన రీతిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. 

 

ప్రియమైన సహచరులారా, జీవితం నిరంతరాయంగా ప్రగతిని కోరుకుంటుంది, అభివృద్ధిని కోరుకుంటుంది, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటుంది. విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా సరే, ప్రగతి పథం ఎంత వేగంగా ఉన్నాసరే, భవనాలు ఎంత అందంగా నిర్మితమైనా సరే, జీవితంలో మాత్రం ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది. కానీ దానికి చక్కటి సంగీతాన్ని, కళల్ని, నాట్యాన్ని, సాహిత్యాన్ని జోడిస్తే అప్పుడు లభించే సంతృప్తి కోటానుకోట్ల రెట్లు పెరుగుతుంది. నిజానికి జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఇవన్నీ మనకు చాలా అవసరం. అందుకే ఇవన్నీ మన జీవితంలో ఓ కెటలిస్ట్ లా పనిచేస్తాయని చెబుతారుకదా. ఇవి మన శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. మానవుడి మనస్సుని అంతర్గతంగా వికసింపజేసేందుకు, మన మనోయాత్రకు చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు చక్కటి సంగీతం, ఇంకా వివిధ రకాలైన కళలు ముఖ్యమైన భూమికను పోషిస్తాయి. వాటికి ఉన్న శక్తి ఎలాంటిదంటే అవి కాలానికి, ప్రాంతానికి, మత తత్వానికీ కట్టుబడేవికావు, అమృత మహోత్సవంలోకూడా మన కళలు, సంస్కృతి, గీతాలు, సంగీతానికి సంబంధించిన రంగుల్ని నింపడం చాలా అవసరం. 

 

నాక్కూడా అనేకమందినుంచి అమృత మహోత్సవానికి, అలాగే సంగీత సాహిత్యాలకు ఉన్న శక్తికి సంబంధించిన అనేక సూచనలు అందుతున్నాయి. ఆ సూచనలు నాకు అత్యంత విలువైనవి. నేను వాటిని సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు అధ్యయనంకోసం పంపించాను. సంతోషకరమైన విషయం ఏంటంటే సాంస్కృతిక మంత్రిత్వ శాక వాటిని అతి తక్కువ కాలంలోనే అధ్యయనం చేసింది. దానికి సంబంధించిన పనికూడా మొదలయ్యింది. అలాంటి ఓ చక్కటి ఆలోచనే దేశ భక్తి గీతాల పోటీ. స్వాతంత్ర్య సంగ్రామంలో వేర్వేరు భాషలు, యాసల్లో దేశ భక్తి గీతాలు, భజనలు దేశాన్ని ఒక్కతాటిమీద నడిపించాయి. ఇప్పుడు అమృతకాలంలో మన యువత అలాంటి దేశ భక్తి గీతాల్ని రాసి, ఈ కార్యక్రమానికి మరింతగా శోభను పెంచొచ్చు. ఆ దేశ భక్తి గీతాలు మాతృభాషలో కూడా ఉండొచ్చు లేదా జాతీయ భాషలోనూ ఉండొచ్చు అలాగే ఇంగ్లిష్ భాషలో కూడా రాయొచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రచనలు నవ భారతానికి సంబంధించిన కొత్త ఆలోచనలతో కూడినవయ్యుండాలి. వర్తమానానికి సంబంధించి ప్రేరణను స్వీకరించి దేశ భవిష్యత్తుని సమున్నతమైన పథంలో నడిపించగలిగేవి అయ్యుండాలి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ఈ పోటీల్ని నిర్వహించాలి. 

 

మిత్రులారా, మనసులో మాట శ్రోత ఒకరు ఏం సలహా ఇచ్చారంటే అమృత మహాత్సవంలో ముగ్గుల పోటీలుకూడా పెట్టాలన్నారు. మన దేశంలో పండుగ రోజుల్లో రంగు రంగుల ముగ్గులెయ్యడం శతాబ్దాలుగా ఆనవాయితీ. రంగుల ముగ్గుల్లో దేశం వైవిధ్యంగా కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో వివధ పేర్లతో, వివిధ రకాలైన థీమ్ లతో రంగుల ముగ్గులు వేస్తారు. అందుకే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి కూడా ఓ క్యాంపెయిన్ నిర్వహించబోతోంది. మీరే ఆలోచించండి, స్వాతంత్ర్య సమరానికి సంబంధించిన ముగ్గులు వేస్తే, జనం వాళ్లవాళ్ల ఇళ్లముందు, గోడల మీద స్వాతంత్ర్యోద్యమ కారుల బొమ్మల్ని చిత్రీకరిస్తే, స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించిన ఏ సంఘటననైనా రంగులతో చిత్రీకరిస్తే, అమృత మహోత్సవం శోభ ఎన్నో రెట్లు పెరుగుతుంది. 

 

మిత్రులారా మనకి లాలి పాటలు పాడే ఇంకో కళకూడా ఉంది. మన దేశంలో లాలి పాటల ద్వారా చిన్న పిల్లలకు సంస్కారాన్ని నేర్పుతారు. వాటిద్వారా మన సంస్కృతిని వాళ్లకి పరిచయం చేస్తారు. లాలిపాటలకు కూడా ఓ వైవిధ్యం ఉంది. మరప్పుడు మనం అమృత కాలంలో ఈ కళనుకూడా తిరిగి బతికించుకోకూడదు, దేశ భక్తికి సంబంధించిన లాలి పాటల్ని ఎందుకు రాయకూడదు, కవితలు, గీతాలు ఏదో ఒకటి రాయగలిగితే, చాలా తేలికగా ప్రతి ఇంట్లోనూ తల్లులు తమ చిన్నారి బాలలకు వాటిని వినిపించొచ్చుకదా. ఆ లాలిపాటల్లో ఆధునిక భారతం కనిపించాలి. 21వ శతాబ్దపు భారతీయ కలలు వాటిలో ప్రతిఫలించాలి. మీరు చేసిన ఈ సూచనల ఆధారంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వాటికి సంబంధించిన పోటీల్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 

మిత్రులారా, ఈ మూడు పోటీలూ అక్టోబర్ 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున ప్రారంభం కాబోతున్నాయి. రాబోయే రోజుల్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దానికి సంబంధించిన వివరాల్ని మీకు అందజేస్తుంది. ఆ వివరాల్ని మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో, సోషల్ మీడియాలోకూడా అందజేస్తారు. మీరందరూ ఈ పోటీల్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. మన యువతరం తప్పనిసరిగా తమలోని కళను, తమ ప్రతిభను ప్రదర్శించాలి. దానివల్ల మీ ప్రాంతానికి సంబంధించిన కళ, సంస్కృతి దేశంలో మూల మూలలకూ విస్తరిస్తాయి. మీ కథల్ని దేశం మొత్తం వింటుంది. 

 

ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం అమృతోత్సవ సమయంలో వీరులైన, అమరులైన భరతమాత ముద్దు బిడ్డల్ని గుర్తు చేసుకుంటున్నాం. వచ్చే నెల నవంబర్ 15వ తేదీన అలాంటి మహా పురుషులు, వీర యోధులైన, భగవాన్ బిరసా ముండ్ గారి జయంతి రాబోతోంది. భగవాన్ బిరసా ముండ్ ను భరత మాతకు తండ్రిగా కీర్తిస్తారు. అంటే ఆయన ఈ భూమికే తండ్రి అని అర్థం. భగవాన్ బిరసా ముండ్ తమ నేలను, అడవుల్ని, భూమిని రక్షించుకోవడంకోసం తీవ్రమైన పోరాటం చేశారు. భూమికి తండ్రియైనవారే అంతటి పోరాటం చెయ్యగలరు. ఆయన మనకు మన సంస్కృతిని, దాని మూలాల్నీ చూసి గర్వించడం నేర్పించారు. విదేశీ పాలకులు ఆయన్ని ఎంతగా బెదిరించినా సరే, ఎంతగా ఒత్తిడి చేసినా సరే, ఆయన మాత్రం ఆదివాసీల సంస్కృతిని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రకృతిని, పర్యావరణాన్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలంటే, కచ్చితంగా దానికి భగవాన్ బిరసా ముండ్ మనకు ప్రేరణగా నిలుస్తారు. ఆయన, పర్యావరణానికి హాని కలిగించే విదేశీ పాలనకు సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా సరే తీవ్రంగా వ్యతిరేకించారు. బీదసాదల్ని, కష్టాల్లో ఉన్నవాళ్లని ఆదుకోవడానికి ఆయన ఎప్పుడూ ముందుండేవారు. అనేక రకాలైన సామాజిక దురాచారాల్ని నిర్మూలించడానికి ఆయన చాలా కృషి చేశారు. ఉల్ గులాన్ ఉద్యమాన్ని ఆయన తప్ప ఇంకెవరు ముందుకు నడిపించగలిగుండేవారు. ఆ ఉద్యమం ఆంగ్లేయులకు మనశ్శాంతి లేకుండా చేసింది. దాని తర్వాతే ఆంగ్లేయులు భగవాన్ బిరసా ముండ్ ని పట్టించిన వారికి చాలా పెద్ద నగదు బహుమతిని ప్రకటించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని జైల్లోపెట్టింది. ఆయన్ని ఎంతగా వేధించారంటే పాతికేళ్లకంటే తక్కువ వయసులోనే ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన మనల్ని కేవలం భౌతికంగా మాత్రమే విడిచి వెళ్లిపోయారు. జనం మనసుల్లో మాత్రం ఆయన శాశ్వతమైన, సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. జనానికి ఆయన జీవితం ఓ ప్రేరణాత్మక శక్తిగా మిగిలిపోయింది. ఇవ్వాళ్టికీ ఆయన జీవిత గాథకు సంబంధించిన జానపద గీతాలు, కథలు మధ్య భారతంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ ధరిత్రికే తండ్రి అయిన భగవాన్ బిరసా ముండ్ కి నేను నమస్కరిస్తున్నాను. ఆయన గురించి విస్తృత స్థాయిలో తెలుసుకోవాలని నేను యువతరానికి సూచిస్తున్నాను. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మన ఆదివాసీ జాతుల పోరాట పటిమను గురించి మీరు ఎంతగా తెలుసుకుంటే అంతగా మీకు గౌరవప్రదమైన అనుభూతులు కలుగుతాయి. 

 

ప్రియమైన సహచరులారా, ఇవ్వాళ్ల అక్టోబర్ 24వ తేదీ UN Day అంటే ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాం. ఈ రోజునే ఐక్య రాజ్య సమితి ఆవిర్భవించింది. ఐక్యరాజ్య సమితిని స్థాపించిన రోజునుంచీ భారత్ కి దానిలో అనుబంధం ఉంది. భారత దేశం 1945లో స్వాతంత్ర్యం సాధించడానికి పూర్వమే ఐక్యరాజ్య సమితి చార్టర్ లో సంతకం చేసిందన్న విషయం మీకు తెలుసా. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఐక్యరాజ్య సమితి ప్రభావనాన్ని ఇంకా దాని శక్తిని పెంచడానికి భారతీయ నారీశక్తి చాలా ముఖ్యమైన భూమికను నిర్వహించింది. 1947-48లో UN Human Rights Universal Declarationని రూపొందించేటప్పుడు అందులో “All Men are Created Equal” అని రాశారు. కానీ భారతీ దేశానికి చెందిన ఓ Delegate దానికి అభ్యంతరం తెలిపారు. తర్వాత Universal Declarationలో – “All Human Beings are Created Equal” అని రాశారు. Gender Equality అనే ఈ అంశం భారత దేశంలో శతాబ్దాల క్రితమే అమల్లో ఉంది. శ్రీమతి హంసా మెహతా ఆ Delegate అన్న విషయం మీకు తెలుసా. ఆవిడవల్లే ఆ మార్పు జరిగింది. అప్పుడే మరో Delegate శ్రీమతి లక్ష్మీ మీనన్ Gender Equalityఅంశంపై బలంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. అది మాత్రమే కాక, 1953లో శ్రీమతి విజయలక్ష్మీ పండిట్, UN General Assemblyకి తొలి మహిళా President అయ్యారు.

మిత్రులారా, మనం ఎలాంటి పవిత్రమైన నేలకు చెందినవాళ్లమంటే, దేన్ని విశ్వసిస్తామంటే, ఏమని ప్రార్థన చేస్తామంటే :

 

ఓం ద్యోశాన్తిరన్తరిక్ష శాన్తిః,

పృధ్వీ శాన్తిరాపః శాంతిరోషధయః శాన్తిః ।

వనస్పతయః శాన్తిర్విశ్వేదేవాః శాన్తిర్బ్రహ్మమ్ శాన్తిః,

సర్వే శాన్తిః, శాన్తిరేవ శాన్తిః, సామా శాన్తిరేధి

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ।।

 

భారత దేశం ఎప్పుడూ విశ్వశాంతికోసం పాటుపడింది. మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే భారతదేశం 1950వ దశాబ్దంలో నిరంతరాయంగా ఐక్యరాజ్య సమితి శాంతి మిషన్ లో భాగంగా ఉంది. దారిద్ర్య నిర్మూలన, Climate Change ఇంకా శ్రామికులకు సంబంధించి సమస్యలు విషయంలో సమాధానాలకు సంబంధించి భారతదేశం అగ్రపథంలోనే పయనిస్తోంది. అది మాత్రమే కాక యోగాని ఇంకా ఆయుష్ ని అందరికీ చేరువ చేసేందుకు భారత దేశం WHOఅంటే World Health Organisation తో కలిసి పనిచేస్తోంది. 2021 మార్చ్ లో WHO భారతదేశంలో సంప్రదాయ చికిత్సను అందించేందుకు ఓ Global Centreని స్థాపిస్తామని ప్రకటించింది. 

మిత్రులారా, ఐక్యరాజ్య సమితి గురించి మాట్లాడుతుంటే నాకివ్వాళ్ల అటల్ బిహారీ వాజ్ పేజ్ గారి మాటలు గుర్తొస్తున్నాయి. 1977లో ఆయన ఐక్యరాజ్య సమితిలో హిందీ భాషలో ప్రసంగించి ఓ కొత్త చరిత్రను సృష్టించారు. ఇవ్వాళ్ల నేను మనసులో మాట శ్రోతలకు, నాడు అటల్ బిహారీ వాజ్ పేయ్ గారి ప్రసంగంలోని ఓ భాగాన్ని వినిపించాలనుకుంటున్నాను. 

 

“ఇక్కడ నేను దేశాల గురించి వాటి గొప్పదనం గురించి ఆలోచించడం లేదు. సామాన్యుల అభివృద్ధి, గౌరవాలు నాకు అత్యంత ప్రధానమైన అంశాలు. చివరికి మన విజయాలు, పరాజయాలను కేవలం ఒకే అంశం ఆధారంగా లెక్కించాలి అదేంటంటే నిజంగా మనం మొత్తం మానవ సమాజాన్ని, అంటే ప్రతి ఒక్క పురుషుడు, స్త్రీ, పిల్లవాడు లేదా పిల్లకి సంపూర్ణమైన న్యాయం చెయ్యడానికి, వాళ్ల జీవితాల్లోంచి బీదరికాన్ని  పారద్రోలడానికి పూర్తి ప్రయత్నం చెయ్యగలుగుతున్నామా అన్నదే ఆ అంశం.’’ | 

 

మిత్రులారా, వాజ్ పేయిగారు చెప్పిన ఆ మాటలు ఇవ్వాళ్టికీ మనకు దిశా నిర్దేశం చేస్తాయి. ఈ భూమిని ఓ చక్కటి, సురక్షితమైన Planetగా చెయ్యడంలో భారతదేశం యొక్క పాత్ర, విశ్వవ్యాప్తంగా చాలా గొప్ప ప్రేరణ. 

 

ప్రియమైన మిత్రులారా, కొన్ని రోజుల క్రితం అక్టోబర్ 21వ తేదీన, పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఏ పోలీసు సోదరులైతే దేశ రక్షణకరోసం తమ ప్రాణాలను త్యాగం చేశారో, ఆ రోజున మనం వారందర్నీ మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటాం. 

 

 

నేనివ్వాళ్ల ఆ పోలీస్ ఉద్యోగులతోపాటుగా వాళ్ల కుటుంబాల్నికూడా గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. కుటుంబంనుంచి సహకారం, త్యాగం లేకపోతే పోలీస్ ఉద్యోగం లాంటి సర్వీస్ చెయ్యడం చాలా కష్టం. పోలీస్ సేవకు సంబంధించిన ఇంకో విషయాన్ని నేను మనసులో మాట శ్రోతలకు చెప్పాలనుకుంటున్నాను. మొదట్లో అందరూ పోలీస్, సైన్యం లాంటి సర్వీసులు కేవలం మగవాళ్లకి మాత్రమే అని అనుకునేవాళ్లు. కానీ ఇవ్వాళ్ల పరిస్థితి అలా లేదు. Bureau of Police Research and Development లెక్కల ప్రకారం గడచిన కొద్ది సంవత్సరాల్లో మహిళా పోలీసు ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది. 2014లో వారి సంఖ్య ఒక లక్షా ఐదు వేల వరకూ ఉండేది. అదే 2020కల్లా అది రెట్టింపుకన్నా ఎక్కువై రెండు లక్షల 15 వేల వరకూ వచ్చింది. అంతేకాకుండా Central Armed Police Forces లో కూడా గడచిన ఏడేళ్లలో మహిళా ఉద్యోగుల సంఖ్య దాదాపుగా రెట్టింపయ్యింది. నేను కేవలం సంఖ్య గురించి మాత్రమే మాట్లాడ్డం లేదు. ఇప్పుడు మన దేశంలో అడబిడ్డలు అత్యంత కఠినమైన Dutyలనుకూడా పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు, విశ్వాసంతో చేస్తున్నారు. ఉదాహరణకు చాలామంది ఆడబిడ్డలు అత్యంత కఠినంగా చెప్పుకునే Trainingsలో ఒకటైన Specialized Jungle Warfare Commandos Training తీసుకుంటున్నారు. వాళ్లు మన Cobra Battalion భాగస్వాములవుతారు. 

 

 

 

మిత్రులారా, ఇప్పుడు మనం Airports వెళ్తున్నాం, Metro Stations కి వెళ్తున్నాం, లేదంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తాం. CISF కి చెందిన సమర్ధులైన మహిళలు చాలా ముఖ్యమైన అనేక ప్రాంతాల్లో గస్తీ కాస్తూ కనిపిస్తారు. దీనికి సంబంధించి సకారాత్మక ఫలితాలు కేవలం పోలీసు బలగాలతోపాటుగా సమాజం మనోబలాన్నికూడా పెంచుతున్నాయి. మహిళా రక్షక దళాల్ని చూసి జనంలో, ప్రత్యేకంగా మహిళల్లో సహజంగానే ఓ నమ్మకం ఏర్పడుతుంది. వాళ్లు అత్యంత సహజంగా తాము పరిపూర్ణమైన రక్షణ వలయంలో వారికి దగ్గరగా ఉన్న భావనకు లోనవుతారు. మహిళలకు ఉండే సహజలక్షణాలైన ఓర్పు, సహనాలవల్లకూడా జనం వారిని ఎక్కువగా నమ్ముతారు. మన మహిళా పోలీసు ఉద్యోగులు దేశంలో లక్షలాదిమందికి, ఆడ బిడ్డలకు Role Modelగా నిలుస్తున్నారు. స్కూళ్లు తెరిచిన తర్వాత మీమీ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లని విజిట్ చెయ్యమని, అక్కడ పిల్లలతో మాట్లాడమని నేను మహిళా పోలీసు ఉద్యోగుల్ని కోరుతున్నాను. అలా మాట్లాడ్డంవల్ల మన పిల్లలకు ఓ కొత్త స్ఫూర్తి లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. అది మాత్రమే కాక పోలీసులమీద జనానికి నమ్మకంకూడా పెరుగుతుంది. ఇకపై కూడా మహిళలు ఎక్కువ సంఖ్యలో పోలీసు ఉద్యోగాల్లో చేరతారని, మన దేశంలో New Age Policingని లీడ్ చేస్తారని ఆశిస్తున్నాను. 

 

 

 

 

 

ప్రియమైన దేశ వాసులారా, గడచిన కొన్ని ఏళ్లుగా మన దేశంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం ఎంత వేగంగా పెరుగుతోందంటే, దానిమీద మనసులో మాట శ్రోతలు నాకు తరచూ రాస్తుంటారు. ఇవ్వాళ్ల నేను మీతో అలాంటి ఓ  విషయం గురించి చర్చించాలనుకుంటున్నాను. అది మన దేశంలో, ప్రత్యేకించి యువతలో చిన్న చిన్న పిల్లల్లో పాకిపోయింది. అదేంటంటే డ్రోన్, మరియు డ్రోన్ టెక్నాలజీ గురించి. కొన్నేళ్ల క్రితం డ్రోన్ అనే పదం వినిపించగానే జనం మనసుల్లో ఉత్పన్నమయ్యే మొదటి భావనేంటి? సైన్యం, ఆయుధాలు, యుద్ధం. కానీ ఇప్పుడు మన దగ్గర ఎక్కడ పెళ్లి ఫంక్షన్లు జరిగినా మనం డ్రోన్ ని ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఉపయోగిస్తుంటే చూస్తున్నాం. డ్రోన్ వినియోగం, దాని శక్తి అంత మాత్రమే కాదు. గ్రామాల్లో భూమి వివరాల్ని సేకరించడానికి డ్రోన్ ని వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం డ్రోన్ వినియోగాన్ని Transportation కోసం చాలా విస్తృత స్థాయిలో చేసేందుకు ప్రయత్నిస్తోంది. అది గ్రామాల్లో వ్యవసాయానికి సంబంధించైనా కావొచ్చు లేదా ఇంటి సామాను డెలివరీకైనా కావొచ్చు.  ఆపత్కాలంతో సహాయం అందించడానికి కావొచ్చు లేదా చట్టపరమైన వ్యవస్థకు సంబంధించి నిఘా పెట్టడానికి కావొచ్చు. చాలా కొద్ది సమయంలోనే డ్రోన్లు మనకి ఈ అవసరాలన్నింటికీ ఉపయోగపడే రోజు వస్తుంది. వాటిలో చాలావాటికి ఇప్పటికే డ్రోన్ల వినియోగం ప్రారంభమయ్యింది. ఎలాగంటే కొద్ది రోజుల క్రితం గుజరాత్ లోని భావ నగర్ లో డ్రోన్ ద్వారా పొలాల్లో నానో యూరియాని చల్లారు. Covid Vaccine పథకంలోకూడా డ్రోన్లు తమ వంతు పాత్రని పోషిస్తున్నాయి. దానికి సంబంధించిన ఓ చిత్రం మనకు మణిపూర్ లో కనిపిస్తుంది. అక్కడ ఓ ద్వీపంలో డ్రోన్ ద్వారా వాక్సీన్ ని అందజేశారు. తెలంగాణలోకూడా డ్రోన్ ద్వారా వాక్సీన్ డెలివరీకి ట్రయల్స్ వేశారు. అది మాత్రమే కాక ఇప్పుడు ఇన్ ఫ్రా స్ట్రక్టర్ కి సంబంధించిన ఎన్నో పెద్ద ప్రాజెక్టుల్లో నిఘాకోసం కూడా డ్రోన్లని ఉపయోగిస్తున్నారు. నేను అలాంటి ఓ యంగ్ స్టూడెంట్ గురించి కూడా చదివాను, తను డ్రోన్ ని దోమలపై ప్రయోగించాడని. A

మిత్రులారా, ముందు ఈ సెక్టర్ లో ఎన్ని నియమాలు, చట్టాలు, ఇంకా ప్రతిబంధకాలు ఉండేవంటే డ్రోన్ యొక్క అసలు శక్తిని వినియోగించుకోవడానికి కూడా సాధ్యమయ్యేది కాదు. ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడం మంచిదో దాన్ని సందేహాస్పదంగా చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఒకవేళ మీరు దేనికోసమైనా సరే డ్రోన్ ని వాడాల్సొస్తే లైసెన్సులు, అనుమతులు ఎంత క్లిష్టంగా ఉండేవంటే జనం డ్రోన్ అనే పేరునికూడా గుర్తు చేసుకోలేనంతగా. నేను ఈ మైండ్ సెట్ ని మార్చాలని, కొత్త ట్రెండ్స్ ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ సంవత్సరం ఆగస్ట్ 25న దేశంలో ఓA కొత్త డ్రోన్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఈ విధానం డ్రోన్ కి సంబంధించి వర్తమాన, భవిష్యత్తు లెక్కలకు సంబంధించి రూపొందించినది. అందులో ఇప్పుడు బోల్డన్ని ఫామ్స్ నింపాల్సిన బాధ లేదు, అలాగే ముందులా ఎక్కువ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. కొత్త డ్రోన్ పాలసీ వచ్చిన తర్వాత చాలా డ్రోన్స్ స్టార్టప్స్ లో బోల్డన్ని దేశీ, విదేశీ పెట్టుబడులు పెరిగాయి. చాలా కంపెనీలు Manufacturing Units కూడా పెట్టాయి. Army, NavyమరియుAir Force లు భారతీయ Droneకంపెనీలకు 500 కోట్ల రూపాయలకంటే ఎక్కువ Orderలు కూడా ఇచ్చాయి. కేవలం ఇది ప్రారంభం మాత్రమే. మనం ఇక్కడితో ఆగిపోకూడదు. మనం Drone Technologyలో అగ్ర దేశంగా నిలవాలి. దానికోసం ప్రభుత్వం కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. నేను దేశంలోని యువతకు ఏం చెబుతున్నానంటే మీరు Drone Policyతర్వాత వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవడం గురించి తప్పక ఆలోచించండి. ముందుకు రండి. 

 

ప్రియమైన దేశ వాసులారా, యూపీలోని మీరట్ నుంచి ఓ మనసులో మాట శ్రోత శ్రీమతి ప్రభా శుక్లా స్వచ్ఛతకు సంబంధించిన ఓ లేఖను పంపారు. ఆవిడేం రాశారంటే “భారత దేశంలో అన్ని పండగలకూ మనం స్వచ్ఛతను సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే మనం స్వచ్ఛతని ప్రతిరోజూ మన జీవితాల్లో భాగంగా చేసుకుంటే, మొత్తం దేశమంతా స్వచ్ఛంగా ఉంటుంది.” అని. నాకు ప్రభగారి మాటలు చాలా బాగా నచ్చాయి. నిజంగానే ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది, ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సామర్ధ్యం ఉంటుంది అలాగే ఎక్కడ సామర్ధ్యం ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. అందుకే దేశంలో స్వచ్ఛ భారత కార్యక్రమంమీద అంతగా శ్రద్ధ పెడుతున్నాం. 

 

(साथियो, मुझेराँचीसेसटेएकगाँवसपारोमनयासराय, वहाँकेबारेमेंजानकरबहुतअच्छालगा |)

మిత్రులారా, నాకు రాంచీలోని सपारोमनयासराय ఓ కుగ్రామంలో పరిశుభ్రత గురించి తెలిసి చాలా సంతోషం కలిగింది. ఈ గ్రామంలోఓ చెరువు ఉండేది. కానీ గ్రామస్తులు ఆ చెరువు ఉన్న ప్రాంతాన్ని బహిరంగ మల విసర్జనకు ఉపయోగించడం మొదలుపెట్టారు.  స్వచ్ఛ భారత్ పథకం ద్వారా అందరి ఇళ్లలోనూ మరుగుదొడ్లు నిర్మించుకున్నారో అప్పుడే ఊరివాళ్లందరూ కలిసి ఏమని ఆలోచించారంటే మనం ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటుగా దాన్ని అందంగా తీర్చిదిద్దాలనుకున్నారు. తర్వాతేమయ్యిందంటే అందరూ కలిసి ఆ చెరువు ఉన్న ప్రాంతంలో ఓ పార్కుని నిర్మించుకున్నారు. ఇవ్వాళ్ల ఆ ప్రదేశం జనానికి, పిల్లలకి చక్కగా సేదతీరే స్థానమయ్యింది. దానివల్ల మొత్తం గ్రామస్తులందరి జీవితాల్లో చాలా మార్పొచ్చింది. నేను మీకు చత్తీస్ ఘడ్ లోని దేవుర్ గ్రామానికి చెందిన మహిళల గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. అక్కడి మహిళలు ఓ స్వయం సహకార సంఘాన్ని నడుపుకుంటున్నారు. వాళ్లందరూ కలిసి గ్రామంలోని కూడళ్లు, ముఖ్య ప్రదేశాలు, రోడ్లు, మందిరాల్ని శుభ్రం చేస్తున్నారు. 

మిత్రులారా, యూపీలోని గజియాబాద్ లో ఉన్న రామ్ వీర్ తంవర్ ని జనం ‘Pond Man’ అని పిలుచుకుంటారు. రామ్ వీర్ గారు మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన తర్వాత ఉద్యోగం చేశారు. కానీ ఆయన మనసులో స్వచ్ఛతకు సంబంధించిన ఎలాంటి ఆలోచన వచ్చిందంటే ఆయనా ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి చెరువుల్ని శుభ్రం చేసే పని మొదలుపెట్టారు. రామ్ వీర్ గారు ఇప్పటివరకూ ఎన్నో చెరువుల్ని శుభ్రం చేసి వాటికి పునరుజ్జీవనాన్ని ప్రసాదించారు. 

 

మిత్రులారా, స్వచ్ఛతకోసం చేసే ప్రయత్నాలు ఎప్పుడు సఫలమవుతాయంటే దేశంలోని ప్రతి పౌరుడూ స్వచ్ఛతకు సంబంధించి తన బాధ్యతను నిర్వర్తించినప్పుడే. ఇప్పుడు దీపావళి పండక్కి మనందరం మన ఇళ్లను శుభ్రం చేసుకుంటాంకదా. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే మన ఇంటితోపాటుగా మన చుట్టుపక్కల, పరిసరాల్నికూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం మన ఇంటిని మాత్రం శుభ్రం చేసుకుని, మన ఇంటిలో ఉన్న చెత్తని బైట రోడ్లమీద పడెయ్యకూడదు. ఇంకో విషయం నేను స్వచ్ఛత గురించి మాట్లాడేటప్పుడు ఆ సందర్భంలో మనం Single Use Plastic నుంచి విముక్తిని పొందే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. రండి మనం సంకల్పం తీసుకుందాం.. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉత్సాహాన్ని మనం తక్కువ కానివ్వకూడదు. మనందరం కలిసి మన దేశాన్ని పూర్తి స్థాయిలో స్వచ్ఛంగా మార్చుకుందాం. శుభ్రంగా ఉంచుకుందాం. 

ప్రియమైన దేశవాసులారా, అక్టోబర్ నెల మొత్తం పండుగల రంగులతో నిండిపోయింది. లాగే ఇంకొన్ని రోజుల్లో దీపావళి పండుగ కూడా వస్తోంది. దీపావళి, దాని తర్వాత గోవర్థన పూజ ఆ తర్వాత భగినీ హస్త భోజనం ఈ మూడు పండుగల్ని ఎలాగూ జరుపుకుంటాం. ఆ తర్వాత छठपूजा మరో పూజ. నవంబర్ లో గురునానక్ జయంతికూడా ఉంది. ఇన్ని పండుగలు ఒకేసారి వచ్చినప్పుడు వాటికోసం ఏర్పాట్లుకూడా ముందునుంచే మొదలవుతాయి. మీరందరూ ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీకు గుర్తుంది కదా కొనడం అంటే అర్థం ‘VOCAL FOR LOCAL’ | మీరు స్థానిక వస్తువుల్నే కొంటే మీ పండగ కూడా అత్యంత మనోహరంగా జరుగుతుంది. నిరుపేదలైన అక్క చెల్లెళ్లు, అన్నదమ్ముల, కార్మికుల, ఆకలితో ఉన్నవాళ్ల ఇళ్లలో కూడా వెలుగులు ప్రసరిస్తాయి. మనందరం కలిసి ఈ విధానాన్ని ప్రారంభించుకున్నాం. ఈసారి పండుగలకు మీరు దాన్ని మరింత బలంగాకొనసాగిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు మీకు స్థానికంగా దొరికే వస్తువుల్నే కొనండి, సోషల్ మీడియాలో షేర్ చెయ్యండి. మీతోపాటు మిగతావాళ్లకి కూడా ఈ విషయాన్ని చెప్పండి. వచ్చే నెల మనం మళ్లీ కలుసుకుందాం. అప్పుడుకూడా ఇలాగే బోల్డన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. 

మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నమస్కారం.

 

***