Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2021 ఆగస్టు 29 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం 80 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈరోజు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి అని మనందరికీ తెలుసు. ఆయన జ్ఞాపకార్థం మన దేశం దీన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ సమయంలో మేజర్ ధ్యాన్ చంద్ గారి ఆత్మ ఎక్కడ ఉన్నా చాలా సంతోషంగా ఉండవచ్చని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే హాకీ ప్రపంచంలో భారత హాకీకి పేరు తెచ్చింది ధ్యాన్ చంద్ గారే. నాలుగు దశాబ్దాల తరువాత- దాదాపు 41 సంవత్సరాల తరువాత- భారతదేశంలోని యువత- మరోసారి హాకీలో మన దేశం పేరు మారుమోగేలా చేశారు. ఎన్ని పతకాలు గెలిచినప్పటికీ హాకీలో పతకం వచ్చే వరకు భారతదేశ పౌరులు విజయాన్ని ఆస్వాదించలేరు. ఈసారి నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్ లో హాకీ పతకం అందుకున్నారు. మేజర్ ధ్యాన్ చంద్ గారి ఆత్మ ఎక్కడ ఉన్నా ఆయన హృదయంలో ఎంత ఆనందం ఉంటుందో మీరు ఊహించవచ్చు. ధ్యాన్ చంద్ గారు తమ జీవితమంతా క్రీడలకే అంకితం చేశారు. ఈ రోజు యువత దృష్టి క్రీడలవైపు మళ్ళుతోంది. మన కుమారులు, కుమార్తెలు ఆట వైపు ఆకర్షితులవుతున్నారు. పిల్లలు ఆటలో ముందుకు వెళుతుంటే తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. ఉత్సాహమే మేజర్ ధ్యాన్‌చంద్ గారికి పెద్ద నివాళి.

మిత్రులారా! క్రీడల విషయానికి వస్తే, మొత్తం యువ తరం మన ముందు కనిపించడం సహజం. మనం యువ తరాన్ని దగ్గరగా చూసినప్పుడు ఎంత పెద్ద మార్పు కనిపిస్తుంది? యువత మనసు మారింది. నేటి యువకుల మనస్సు పాత పద్ధతుల నుండి వైవిధ్యంగా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటుంది. విభిన్నంగా చేయాలని కోరుకుంటుంది. నేటి యువత మనస్సు ఏర్పరిచిన మార్గాల్లో నడవడానికి ఇష్టపడదు. వారు కొత్త మార్గాలు వేయాలనుకుంటున్నారు.తెలియని ప్రదేశంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు. గమ్యం కొత్తది. లక్ష్యం కూడా కొత్తది. మార్గం కూడా కొత్తది. కోరిక కూడా కొత్తది. పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్నారు. కొంతకాలం కిందట భారతదేశం అంతరిక్ష రంగానికి ద్వారాలు తెరిచింది. చూస్తూ ఉండగానే యువతరం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమైంది. ఆ అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులతో పాటు ప్రైవేట్ రంగంలో పనిచేసే యువకులు చాలా ఉత్సాహంతో ముందుకు వచ్చారు. రాబోయే రోజుల్లో మన యువత, మన విద్యార్థులు, మన కళాశాలలు, మన విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలల్లో పనిచేసే విద్యార్థులు రూపొందించే కృత్రిమ ఉపగ్రహాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని నాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది.

అదేవిధంగా ఈ రోజు మీరు ఎక్కడ చూసినా, ఏ కుటుంబాన్ని చూసినా – ఎంత ఆస్తి ఉన్న కుటుంబమైనా, ఎంత చదువుకున్న కుటుంబమైనా- మీరు ఆ కుటుంబంలోని యువకుడితో మాట్లాడితే, సంప్రదాయాలకు అతీతంగానే తాను స్టార్ట్-అప్ మొదలు పెడతానని చెప్తారు. స్టార్ట్-అప్‌ల వైపు వెళ్తానని చెప్తారు. అంటే రిస్క్ తీసుకోవడానికి వారి మనస్సు ఉవ్విళ్లూరుతోంది. నేడు చిన్న పట్టణాలలో కూడా స్టార్ట్-అప్ సంస్కృతి విస్తరిస్తోంది. నేను అందులో ఉజ్వల భవిష్యత్తు సంకేతాలను చూస్తున్నాను. కొద్ది రోజుల క్రితం మన దేశంలో బొమ్మల గురించి చర్చలు జరిగాయి. ఇది చూసి, ఈ అంశం మన యువత దృష్టికి వచ్చినప్పుడు, వారు కూడా భారతదేశంలోని బొమ్మలకు ప్రపంచంలో ఎలా గుర్తింపు ఉందో తెలుసుకున్నారు. అందులో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ప్రపంచంలో బొమ్మల రంగానికి భారీ మార్కెట్ ఉంది. 6-7 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ ఉంది. అందులో ఈరోజు భారతదేశ వాటా చాలా తక్కువ. కానీ పిల్లల మనస్తత్వశాస్త్రం ప్రకారం బొమ్మలు ఎలా తయారు చేయాలి, వివిధ రకాల బొమ్మలలో వైవిధ్యం ఎలా ఉంటుంది, బొమ్మలలో సాంకేతికత ఏమిటి మొదలైన విషయాలపై ఈ రోజు మన దేశంలోని యువత దృష్టి పెట్టింది. రంగంలో ఏదైనా సహకారం అందించాలనుకుంటోంది. మిత్రులారా! మరో విషయం- ఇది మనస్సులో ఆనందాన్ని నింపుతుంది. విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. అది ఏమిటి? మీరు ఎప్పుడైనా గుర్తించారా? మన దేశంలోని యువత మనస్సు ఇప్పుడు ఉత్తమమైన వాటి వైపు దృష్టి పెడుతోంది. ఉత్తమంగా కృషి చేయాలనుకుంటున్నారు. అత్యుత్తమ మార్గంలో చేయాలనుకుంటున్నారు. ఇది కూడా దేశాన్ని గొప్ప శక్తిగా అవతరించేలా చేస్తుంది.

మిత్రులారా! ఈసారి ఒలింపిక్స్ భారీ ప్రభావాన్ని సృష్టించాయి. ఒలింపిక్ క్రీడలు ముగిశాయి. ఇప్పుడు పారాలింపిక్స్ జరుగుతున్నాయి. క్రీడా ప్రపంచంలో భారతదేశం పొందినవి ప్రపంచంతో పోలిస్తే తక్కువే కావచ్చు. కానీ ఇవి ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. యువత కేవలం క్రీడల వైపు మాత్రమే దృష్టి పెట్టడంలేదు. దానికి సంబంధించిన అవకాశాలను కూడా చూస్తోంది. దాని మొత్తం పర్యావరణ వ్యవస్థను చాలా దగ్గరగా చూస్తోంది. దాని సామర్థ్యాన్ని అర్థం చేసుకుంటోంది. ఏదో ఒక విధంగా తనను తాను జోడించాలనుకుంటోంది. ఇప్పుడు యువత సంప్రదాయ విషయాలకు అతీతంగా కొత్త విభాగాలను తనదిగా చేసుకుంటోంది. నా దేశవాసులారా! ఎఏ రంగంలో ఎంత వేగం వచ్చిందంటే ప్రతి కుటుంబంలో క్రీడల గురించి చర్చ మొదలైంది. మీరు చెప్పండి- ఈ వేగాన్ని ఇప్పుడు ఆపాలా? నిలిపివేయాలా? లేదు! మీరూ నాలాగే ఆలోచిస్తూ ఉండాలి. ఇప్పుడు దేశంలో క్రీడలు, ఆటలు, క్రీడాకారుల స్ఫూర్తి ఇప్పుడు ఆగకూడదు. ఈ వేగాన్ని కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో, జాతీయ జీవితంలో శాశ్వతంగా ఒక స్థాయిలో ఉండేలా చేయాలి. శక్తితో నింపాలి. నిరంతరం కొత్త శక్తితో నింపాలి. ఇల్లు, బయటి ప్రదేశం, గ్రామం, నగరం- ఎక్కడైనా మన ఆట స్థలాలు నిండి ఉండాలి. అందరూ ఆడుకోవాలి. అందరూ వికసించాలి. మీకు గుర్తుందా – నేను ఎర్రకోట నుండి చెప్పాను- సబ్ కా ప్రయాస్- “అందరి కృషి” – అవును, అందరి కృషి . అందరి కృషితో, క్రీడలలో భారతదేశం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. మేజర్ ధ్యాన్‌చంద్ గారి లాంటి వ్యక్తులు చూపిన మార్గంలో ముందుకు సాగడం మన బాధ్యత. ఎన్నో సంవత్సరాల తరువాత దేశంలో తిరిగి అలాంటి సమయం వచ్చింది. కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం యావత్తూ ప్రజలందరూ ఒకే మనస్సుతో క్రీడలతో అనుసంధానమవుతున్నారు.

 

నా ప్రియమైన యువకులారా! మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వివిధ రకాల క్రీడలలో ప్రావీణ్యం పొందాలి. గ్రామ గ్రామాన క్రీడా పోటీలు నిరంతరం కొనసాగాలి. పోటీ నుండి ఆట విస్తరిస్తుంది. ఆట అభివృద్ధి చెందుతుంది. పోటీ నుండే క్రీడాకారులు తయారవుతారు. రండి.. దేశప్రజలందరం ఈ వేగాన్ని కొనసాగించేందుకు మన వంతు సహకారం అందిద్దాం. ‘సబ్కా ప్రయాస్’.. అందరి కృషి .. అనే మంత్రంతో దీన్ని సాకారం చేసుకుందాం.

నా ప్రియమైన దేశవాసులారా! రేపు జరిగే జన్మాష్టమి గొప్ప పండుగ. ఈ జన్మాష్టమి పండుగ .. శ్రీకృష్ణుని జన్మదినోత్సవం. కొంటె కన్నయ్య నుండి విరాట్ స్వరూపాన్ని సంతరించుకునే కృష్ణుడి వరకు, శాస్త్ర సామర్థ్యం ఉన్న కృష్ణుడి నుండి శస్త్ర సామర్థ్యం ఉన్న కృష్ణుడి వరకు- భగవంతుని అన్ని రూపాలతో మనకు పరిచయం ఉంది. కళ అయినా, అందం అయినా, మాధుర్యమైనా ఎక్కడైనా శ్రీకృష్ణుడు ఉన్నాడు. జన్మాష్టమికి కొన్ని రోజుల ముందు నేను అలాంటి ఆసక్తికరమైన అనుభవాన్ని పొందాను. కాబట్టి మీకు ఈ మాటలు చెప్పాలని నా మనసు కొరుకుంటోంది. ఈ నెల 20 వ తేదీన సోమనాథ దేవాలయానికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభించినట్లు మీకు గుర్తుండే ఉంటుంది. భాల్కా తీర్థం సోమనాథ దేవాలయం నుండి కేవలం 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భాల్కా తీర్థం శ్రీకృష్ణుడు ఆ అవతారంలో భూమిపై తన చివరి క్షణాలు గడిపిన ప్రదేశం. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఆయన లీలలు అక్కడ ముగిశాయి. సోమనాథ్ ట్రస్ట్ ద్వారా ఆ ప్రాంతంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నేను భాల్కా తీర్థం గురించి, అక్కడ జరిగే కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాను. అంతలో నా దృష్టి ఒక అందమైన ఆర్ట్ బుక్ పై పడింది. పుస్తకాన్ని నా నివాసం బయట ఎవరో నాకోసం వదిలివెళ్లారు. అందులో శ్రీకృష్ణుని అనేక రూపాలు, అనేక గొప్ప చిత్రాలు ఉన్నాయి. గొప్ప చిత్రాలు, చాలా అర్థవంతమైన చిత్రాలు ఉన్నాయి. నేను పుస్తకం పేజీలు తిప్పడం మొదలుపెట్టినప్పుడు, నా ఉత్సుకత మరింత పెరిగింది. నేను ఆ పుస్తకాన్ని, ఆ చిత్రాలన్నింటినీ చూసినప్పుడు, అందులో నా కోసం రాసిన ఒక సందేశాన్ని చదివినప్పుడు ఆ పుస్తకాన్ని నా ఇంటి బయట వదిలిపెట్టిన వారిని నేను కలవాలనుకున్నాను. మా ఆఫీసు వాళ్ళు వారిని సంప్రదించారు. ఆ తర్వాతి రోజే వారిని కలవడానికి ఆహ్వానించాను. ఆర్ట్-బుక్ లో శ్రీ కృష్ణుని వివిధ రూపాలను చూసి నా ఉత్సుకత అంతగా పెరిగింది. ఆ ఉత్సుకతతో నేను జదురాణి దాసి గారిని కలిశాను. ఆమె అమెరికన్. అమెరికాలో జన్మించారు. అమెరికాలో పెరిగారు. జదురాణి దాసి గారు ఇస్కాన్‌ సంస్థతో అనుసంధానమై ఉన్నారు. హరే కృష్ణ ఉద్యమంతో వారి జీవితం ముడిపడి ఉంది. ఆమె గొప్ప ప్రత్యేకత ఆమె భక్తి కళలలో నైపుణ్యం. కేవలం రెండు రోజుల తరువాత సెప్టెంబర్ 1 న ఇస్కాన్ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాద స్వామి గారి 125 వ జయంతి అని మీకు తెలుసు. జదురాణి దాసి గారు అందుకోసమే భారతదేశానికి వచ్చారు. నా ముందు ఉన్న పెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఆమె అమెరికాలో జన్మించారు. భారతీయ భావాలకు దూరంగా ఉన్నారు. అలాంటి ఆమె శ్రీకృష్ణుడి అందమైన చిత్రాలను ఎలా తయారు చేయగలిగిందనే నా ప్రశ్న. నేను ఆమెతో సుదీర్ఘంగా మాట్లాడాను. కానీ అందులో కొంత భాగాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.

 

ప్రధానమంత్రి గారు: జదురాణి గారూ.. హరే కృష్ణ!

నేను భక్తి కళ గురించి కొంచెం చదివాను. దాని గురించి మా శ్రోతలకు మరింత చెప్పండి. దాని పై మీ అభిరుచి, ఆసక్తి చాలా బాగున్నాయి.

జదురాణి గారు: భక్తి కళలో ఒక కథనం ఉంది. ఇది ఈ కళ మనస్సు లేదా ఊహ నుండి ఎలా రాలేదో వివరిస్తుంది. ఇది బ్రహ్మ సంహిత వంటి ప్రాచీన వేద గ్రంథాల నుండి వచ్చింది. ఓంకారాయ పతితం స్కిలతం సికంద్, బృందావన గోస్వామినుండి, స్వయంగా బ్రహ్మ దేవుడి నుండి ఈ కళ వచ్చింది. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః కృష్ణుడు వేణువును ఎలా ధరించాడో, ఆయన ఇంద్రియాలన్నీ ఏ ఇతర భావాల కోసం ఎలా పని చేయగలవో చెప్తుంది. శ్రీమద్భాగవతం (TCR 9.09) బర్హా పీండ నటవరవపుః కర్ణయో: కర్ణికారం. ఆయన చెవిపై కర్ణిక పుష్పం ధరించాడు. ఆయన బృందావనం అంతటా తన కమల పాదాల ముద్రను వేస్తారు. ఆవు మందలు ఆయన మహిమలను వినిపిస్తాయి. ఆయన వేణువు అదృష్టవంతుల హృదయాలను, మనస్సులను ఆకర్షిస్తుంది. కాబట్టి ప్రతిదీ ప్రాచీన వేద గ్రంథాల నుండి వచ్చిందే. ఈ గ్రంథాల శక్తి అతీంద్రియ వ్యక్తుల నుండి, స్వచ్ఛమైన భక్తుల నుండి వచ్చింది. కళకు వారి శక్తి ఉంది. అందుకే దాని పరివర్తన తప్ప అది నా శక్తి కాదు.

ప్రధానమంత్రిగారు: జదురాణి గారూ… 1966 నుండి.. ఒక విధంగా 1976 నుండి మీరు భౌతికంగా భారతదేశంతో సుదీర్ఘకాలం సంబంధం కలిగి ఉన్నారు. మీ దృష్టిలో భారతదేశం అంటే ఏమిటో నాకు చెప్తారా?

జదురాణి గారు: ప్రధాన మంత్రి గారూ.. భారతదేశం అంటే నాకు సర్వస్వం. నేను కొన్ని రోజుల క్రితం గౌరవ రాష్ట్రపతి గారిని ఉద్దేశించి ప్రస్తావించాను అనుకుంటా- భారతదేశం సాంకేతిక అభివృద్ధిలో చాలా ముందుకు వచ్చిందని. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఐఫోన్‌లు, పెద్ద భవనాలు, చాలా సదుపాయాలతో పాశ్చాత్య దేశాలను బాగా అనుసరిస్తోందని. కానీ అది భారతదేశపు నిజమైన కీర్తి కాదని నాకు తెలుసు. భారతదేశాన్ని గొప్పగా చేసేది ఏమిటంటే, కృష్ణుడు ఆ అవతారంలో ఇక్కడ కనిపించాడు. అవతారాలన్నీ ఇక్కడ కనిపించాయి- శివుడు ఇక్కడ కనిపించాడు, రాముడు ఇక్కడ కనిపించాడు. పవిత్ర నదులన్నీ ఇక్కడ ఉన్నాయి. వైష్ణవ సంస్కృతికి సంబంధించిన అన్ని పవిత్ర స్థలాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి భారతదేశం- ముఖ్యంగా బృందావనం- విశ్వంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం. బృందావనం అన్ని వైకుంఠ గ్రహాలకు మూలం. ద్వారకకు మూలం, మొత్తం భౌతిక సృష్టికి మూలం. కాబట్టి నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను.

ప్రధానమంత్రి గారు: ధన్యవాదాలు జదురాణి గారూ.. హరే కృష్ణ!

మిత్రులారా! ప్రపంచ ప్రజలు ఈనాడు భారతీయ ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు.ఈ సందర్భంలో ఈ గొప్ప సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. కాలంతో పాటు మారే విషయాలను వదిలివేసి, కాలాతీతమైన దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మన పండుగలను జరుపుకుందాం. వాటి శాస్త్రీయతను అర్థం చేసుకుందాం. వాటి వెనుక ఉన్న అర్థాన్ని అర్థం చేసుకుందాం. ఇది మాత్రమే కాదు- ప్రతి పండుగలో ఏదో ఒక సందేశం ఉంటుంది. ఏదో ఒక ఆచారం ఉంటుంది. మనం వాటిని తెలుసుకుని జీవించాలి. రాబోయే తరాలకు వారసత్వంగా అందించాలి. దేశ ప్రజలందరికీ మరోసారి జన్మాష్టమి శుభాకాంక్షలు.

నా ప్రియమైన దేశవాసులారా! ఈ కరోనా కాలంలో నేను పరిశుభ్రత గురించి మాట్లాడాల్సిన అంశాలలో కొంత కొరత ఉన్నట్లు అనిపిస్తుంది. పరిశుభ్రత ప్రచారాన్ని కొద్దిగానైనా దూరం చేయకూడదని నేను భావిస్తున్నాను. జాతి నిర్మాణం కోసం ప్రతిఒక్కరి ప్రయత్నాలు దేశాన్ని ఎలా అభివృద్ధి చేస్తాయో చెప్పే ఉదాహరణలు మనకు స్ఫూర్తినిస్తాయి. ఏదైనా చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కొత్త విశ్వాసాన్ని అందిస్తాయి. మన సంకల్పానికి ప్రాణం పోస్తాయి. స్వచ్ఛ భారత్ అభియాన్ విషయం వచ్చినప్పుడు ఇండోర్ పేరు ప్రస్తావనకు వస్తుంది. ఎందుకంటే ఇండోర్ పరిశుభ్రతకు సంబంధించి ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. ఇండోర్ పౌరులు కూడా అభినందనలకు అర్హులు. మన ఇండోర్ చాలా సంవత్సరాలుగా ‘స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్’లో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పుడు ఇండోర్ ప్రజలు స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్‌తో సంతృప్తి చెందడానికి ఇష్టపడరు. వారు మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్నారు. వారి మనసులో నిర్ణయించుకున్న విషయం ‘వాటర్ ప్లస్ సిటీ’ గా ఆ నగరాన్ని రూపుదిద్దడం. ఇప్పుడు వారు ఇండోర్ ను ‘వాటర్ ప్లస్ సిటీ’గా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ‘వాటర్ ప్లస్ సిటీ’ అంటే మురుగునీటిని శుద్ధి చేయకుండా ఏ కాలువలోకీ వదలరు. ఇక్కడి ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి తమ కాలువలను మురుగునీటి కాలువలతో అనుసంధానించారు. పరిశుభ్రత ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు.ఈ కారణంగా సరస్వతి, కాన్ నదులలో మురికి నీటిని వదలడం కూడా గణనీయంగా తగ్గిపోయింది. పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తోంది. ఈ రోజు మన దేశం స్వాతంత్ర్య భారత అమృతమహోత్సవాలను జరుపుకుంటున్నప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ తీర్మానాన్ని మందగించనివ్వకూడదని గుర్తుంచుకోవాలి. మన దేశంలో ‘వాటర్ ప్లస్ సిటీ’ నగరాలు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే అంత పరిశుభ్రత పెరుగుతుంది. మన నదులు కూడా శుభ్రంగా ఉంటాయి. నీటిని ఆదా చేసే మానవ బాధ్యతను నెరవేర్చే సంస్కారం కూడా ఉంటుంది.

మిత్రులారా! బీహార్‌లోని మధుబని నుండి ఒక ఉదాహరణ వచ్చింది. మధుబనిలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం కలిసి మంచి ప్రయత్నం చేశాయి. రైతులు దీని ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇది స్వచ్ఛ భారత్ అభియాన్‌కు కొత్త బలాన్ని ఇస్తోంది. విశ్వవిద్యాలయం ప్రారంభించిన ఈ చొరవ పేరు ‘సుఖేత్ మోడల్’. గ్రామాల్లో కాలుష్యాన్ని తగ్గించడమే సుఖేత్ మోడల్ ఉద్దేశ్యం. ఈ పతాకంలో భాగంగా ఆవు పేడ, ఇతర గృహ వ్యర్థాలను గ్రామంలోని రైతుల నుండి సేకరిస్తారు. బదులుగా గ్రామస్తులకు వంట గ్యాస్ సిలిండర్ల కోసం డబ్బు ఇస్తారు. గ్రామం నుండి సేకరించిన చెత్తను పారవేయడం కోసం వర్మీ కంపోస్ట్ తయారు చేసే పని కూడా జరుగుతోంది. అంటే సుఖేత్ మోడల్ లో నాలుగు ప్రయోజనాలు నేరుగా కనిపిస్తాయి. మొదటిది గ్రామానికి కాలుష్యం నుండి విముక్తి. రెండవది – గ్రామానికి మురికి నుండి విముక్తి. మూడవది గ్రామస్తులకు LPG సిలిండర్ కోసం డబ్బు లభించడం. నాల్గవది గ్రామంలోని రైతులకు సేంద్రియ ఎరువులు లభించడం. అలాంటి ప్రయత్నాలు మన గ్రామాల శక్తిని ఎంతగా పెంచుతాయో మీరు ఊహించండి. ఇది స్వావలంబనకు సంబంధించిన విషయం. దేశంలోని ప్రతి పంచాయితీ ఇలాంటి వాటిని చేయాలని నేను చెప్తున్నాను. మిత్రులారా! మనం ఒక లక్ష్యంతో బయలుదేరినప్పుడు ఫలితాలు లభిస్తాయని ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పుడు తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఉన్న కాంజీ రంగాల్ పంచాయితీని చూడండి. ఈ చిన్న పంచాయితీ ఏమి చేసిందో చూడండి. చెత్త నుండి సంపద సృష్టించే మరో నమూనాను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ గ్రామ పంచాయితీ స్థానిక ప్రజలతో కలిసి తమ గ్రామంలో వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే స్థానిక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మొత్తం గ్రామం నుండి చెత్తను సేకరిస్తారు. దాని నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. మిగిలిన ఉత్పత్తులను కూడా పురుగుమందులుగా అమ్ముతారు. గ్రామంలో ఈ పవర్ ప్లాంట్ సామర్థ్యం రోజుకు రెండు టన్నుల వ్యర్థాలను పారవేయడం. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు వీధిలైట్లు, గ్రామంలోని ఇతర అవసరాలకు ఉపయోగపడుతోంది. ఈ కారణంగా పంచాయతీ డబ్బు ఆదా అవుతోంది. ఆ డబ్బు ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగపడుతోంది. ఇప్పుడు చెప్పండి- తమిళనాడులోని శివగంగ జిల్లాలోని ఒక చిన్న పంచాయితీ మనందరికీ ప్రేరణ ఇస్తుంది. వారు అద్భుతాలు చేశారు. కదా!

నా ప్రియమైన దేశవాసులారా!

‘మన్ కీ బాత్’ ఇప్పుడు భారతదేశ సరిహద్దులకే పరిమితం కాదు. ప్రపంచంలోని వివిధ మూలల్లో కూడా ‘మన్ కీ బాత్’ గురించి చర్చ జరుగుతోంది. విదేశాలలో నివసిస్తున్న మన భారతీయ సమాజానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. వారు కూడా నాతో కొత్త కొత్త విషయాలను పంచుకుంటూనే ఉన్నారు. అలాగే ‘మన్ కీ బాత్’ లో విదేశాలలో జరుగుతున్న ప్రత్యేకమైన కార్యక్రమాలను కొన్నిసార్లు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు కూడా అలాంటి కొంతమందిని నేను మీకు పరిచయం చేస్తాను. కానీ అంతకు ముందు నేను మీకు ఆడియో వినిపించాలనుకుంటున్నాను. శ్రద్ధగా వినండి.

##

[రేడియో యూనిటీ నైంటీ ఎఫ్. ఎం.-2]

నమోనమః సర్వేభ్యః మమ నామ గంగా భవంతః శృణ్వంతు రేడియో-యూనిటీ -నవతి-F.M-‘ఏక్ భారతం శ్రేష్ఠ భారతం’ | అహం ఏకతా మూర్తే: మార్గ్ దర్శికా ఏవం రేడియో యూనిటీ మాధ్యమే ఆర్. జె. అస్మి | అద్య సంస్కృత దినం అస్తి | సర్వేభ్య: బహవ్య: శుభ కామ్ నాః సంతి | సర్దార్-వల్లభాయ్-పటేల్ మహోదయ: ‘లోహ పురుషః’ ఇత్యుచ్యతే. 2013-తమే వర్షే లోహసంగ్రహస్య అభియానం ప్రారబ్ధం | 134-టన్-పరిమితస్య లోహస్య గలనం కృతమ్ | జార్ఖండస్య ఏక: వ్యవసాయవేత్త: ముద్రరస్య దానం కృత్వాన్ | భవంతః శృణ్వంతు రేడియో-యూనిటీ-నవతి-ఎఫ్. ఎం. -‘ఏక భారతం శ్రేష్ఠ-భారతం’ |

[రేడియో యూనిటీ నైంటీ ఎఫ్. ఎం.-2]

 

##

మిత్రులారా! భాషను మీరు అర్థం చేసుకుని ఉంటారు. ఈ రేడియోలో సంస్కృతంలో మాట్లాడుతున్నవారు ఆర్జే గంగ. గుజరాత్ రేడియో జాకీల సమూహంలో ఆర్జే గంగ సభ్యురాలు. ఆమెతో పాటు ఆర్.జె. నీలం, ఆర్.జె. గురు, ఆర్.జె. హేతల్ వంటి ఇతర సహచరులు కూడా ఉన్నారు. గుజరాత్‌లో, కేవడియాలో వీరంతా కలిసి ప్రస్తుతం సంస్కృత భాష విలువను పెంచడంలో నిమగ్నమై ఉన్నారు. మీకు తెలుసు కదా! ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం, మన దేశానికే గర్వకారణమైన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉన్న కెవాడియా ఇదేనని. నేను అదే కెవాడియా గురించి మాట్లాడుతున్నా అని మీకు తెలుసు కదా! వీరంతా ఒకేసారి అనేక పాత్రలను పోషించే రేడియో జాకీలు. వారు గైడ్‌లుగా కూడా పనిచేస్తారు. అలాగే సామాజిక రేడియో అయిన రేడియో యూనిటీ 90 ఎఫ్. ఎం. ని నిర్వహిస్తారు. ఈ ఆర్. జె.లు తమ శ్రోతలతో సంస్కృత భాషలో మాట్లాడతారు. వారికి సంస్కృతంలో సమాచారాన్ని అందిస్తారు.

మిత్రులారా! సంస్కృతం గురించి ఇలా చెప్తారు. –

అమృతం సంస్కృత మిత్ర, సరసం సరళం వచః |

ఏకతా మూలకం రాష్ట్రే, జ్ఞాన విజ్ఞాన పోషకమ్|

అంటే మన సంస్కృత భాష సరసమైనది. సరళమైనది కూడా.

 

సంస్కృతం ఆ భాష ఆలోచనలు, సాహిత్యం ద్వారా జ్ఞానాన్ని అందిస్తుంది. దేశ ఐక్యతను పెంపొందిస్తుంది. బలపరుస్తుంది. సంస్కృత సాహిత్యంలో ఎవరినైనా ఆకర్షించగల మానవత్వం, జ్ఞానాల దైవిక తత్వం ఉంది. ఇటీవల విదేశాలలో సంస్కృతం బోధించే స్ఫూర్తిదాయకమైన పని చేస్తున్న చాలా మంది గురించి నాకు తెలిసింది. అలాంటి వారిలో ఒకరు రట్గర్ కోర్టెన్‌హార్స్ట్ గారు. ఆయన ఐర్లాండ్‌లో ప్రసిద్ధ సంస్కృత పండితుడు, ఉపాధ్యాయుడు. ఆయన అక్కడి పిల్లలకు సంస్కృతం నేర్పిస్తున్నారు. ఇక్కడ తూర్పున భారతదేశం, థాయ్‌లాండ్ ల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో సంస్కృత భాష కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డాక్టర్ చిరాపత్ ప్రపండవిద్య గారు, డాక్టర్ కుసుమ రక్షామణి గారు – ఇద్దరూ థాయ్‌లాండ్‌లో సంస్కృత భాష ప్రచారంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వారు థాయ్, సంస్కృత భాషలలో తులనాత్మక సాహిత్యాన్ని కూడా రచించారు. రష్యాలోని మాస్కో స్టేట్ యూనివర్సిటీలో సంస్కృతం బోధించే బోరిస్ జాఖరిన్ గారు అటువంటి ప్రొఫెసర్. ఆయన అనేక పరిశోధనా పత్రాలను, పుస్తకాలను ప్రచురించారు. సంస్కృతం నుండి రష్యన్ భాషలోకి అనేక పుస్తకాలను అనువదించారు. అదేవిధంగా ఆస్ట్రేలియాలో విద్యార్థులకు సంస్కృత భాష బోధించే ప్రముఖ సంస్థలలో సిడ్నీ సంస్కృత పాఠశాల ఒకటి. ఈ పాఠశాల పిల్లల కోసం సంస్కృత వ్యాకరణ శిబిరం, సంస్కృత నాటకం, సంస్కృత దినోత్సవం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.

మిత్రులారా! ఇటీవలి కాలంలో చేసిన ప్రయత్నాలు సంస్కృతం విషయంలో కొత్త అవగాహన తెచ్చాయి. ఈ దిశగా మన ప్రయత్నాలను పెంచాల్సిన సమయం వచ్చింది. మన వారసత్వాన్ని సంరక్షించడం, నిర్వహించడం, కొత్త తరానికి అందించడం, భవిష్యత్తు తరాల వారికి అందించడం మన బాధ్యత. వీటిపై భావి తరాలకు కూడా హక్కు ఉంటుంది. ఇప్పుడు ఈ పనుల కోసం కూడా అందరి ప్రయత్నాలను పెంచాల్సిన సమయం వచ్చింది. మిత్రులారా! ఈ రకమైన ప్రయత్నంలో నిమగ్నమైన వ్యక్తి మీకు తెలిసినట్లయితే, మీకు అలాంటి సమాచారం ఏదైనా ఉంటే, దయచేసి వారికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో #CelebratingSanskrit అన్న ట్యాగ్ తో పంచుకోండి.

నా ప్రియమైన దేశవాసులారా! ‘విశ్వకర్మ జయంతి’ కూడా రాబోయే కొద్ది రోజుల్లో రాబోతోంది. ప్రపంచ సృష్టి శక్తికి చిహ్నంగా విశ్వకర్మ దేవుడిని పరిగణిస్తారు. కుట్టు-ఎంబ్రాయిడరీ అయినా, సాఫ్ట్‌వేర్ అయినా, ఉపగ్రహమైనా, ఎవరైనా తన నైపుణ్యంతో ఒక వస్తువును సృష్టించినా- ఇదంతా విశ్వకర్మ స్వరూపం. ఈ రోజు ప్రపంచంలో నైపుణ్యాన్ని కొత్త మార్గంలో గుర్తిస్తున్నప్పటికీ మన రుషులు వేల సంవత్సరాల నుండి నైపుణ్యం, కొలతల ప్రకారం తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టారు. వారు నైపుణ్యాన్ని, కౌశలాన్ని, విశ్వాసాన్ని మన జీవిత తత్వశాస్త్రంలో ఒక భాగంగా చేశారు. మన వేదాలు కూడా విశ్వకర్మ దైవానికి అనేక శ్లోకాలను అంకితం చేశాయి. విశ్వంలోని గొప్ప సృష్టి ప్రణాళికలు, కొత్త, పెద్ద పనులు మొదలయిన వాటి ఘనత మన గ్రంథాలలో భగవాన్ విశ్వకర్మకే ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఏ అభివృద్ధి, ఆవిష్కరణ జరిగినా అది నైపుణ్యాల ద్వారా మాత్రమే జరుగుతుందనేదానికి ఇది చిహ్నం. విశ్వకర్మ భగవంతుని జయంతి, ఆయన ఆరాధన వెనుక ఉన్న స్ఫూర్తి ఇది. మన గ్రంథాలలో ఇలా పేర్కొన్నారు. –

విశ్వస్య కృతే యస్య కర్మవ్యాపారః సః విశ్వకర్మ |

 

అంటే సృష్టికి, నిర్మాణానికి సంబంధించిన అన్ని చర్యలను చేసేవాడు విశ్వకర్మ. మన గ్రంథాల దృష్టిలో, మన చుట్టూ ఉన్న నిర్మాణాల్లో, సృజనలో నిమగ్నమైన నైపుణ్యం ఉన్న వ్యక్తులందరూ విశ్వకర్మ భగవానుడి వారసులు. వారు లేని జీవితాన్ని మనం ఊహించలేము. ఆలోచించండి. చూడండి- మీ ఇంట్లో విద్యుత్ సమస్య ఉంటే, మీకు ఎలక్ట్రీషియన్ దొరకకపోతే ఏం జరుగుతుంది? మీరు ఎంత పెద్ద సమస్యను ఎదుర్కొంటారు! ఇలాంటి నైపుణ్యం కలిగిన వ్యక్తుల కారణంగా మన జీవితం కొనసాగుతుంది. లోహాలతో పని చేసేవారు, కుండల తయారీదారు, చెక్క పనివారు, ఎలక్ట్రీషియన్, హౌస్ పెయింటర్, స్వీపర్ లేదా మొబైల్-ల్యాప్‌టాప్ రిపేర్ చేసేవారు – ఎవరైనా కానివ్వండి. వారంతా మీ చుట్టూ ఆధునిక రూపంలో ఉన్న విశ్వకర్మలే. కానీ మిత్రులారా! దానిలో మరో కోణం ఉంది. ఇది కొన్నిసార్లు ఆందోళనను కలిగిస్తుంది. దేశంలో సంస్కృతి, సంప్రదాయం, ఆలోచన, నైపుణ్యం ఉన్న మానవశక్తిని విశ్వకర్మగా భావించే రోజులుండేవి. అలాంటి పరిస్థితులు ఎలా మారిపోయాయి? ఒకప్పుడు మన కుటుంబ జీవితం, సామాజిక జీవితం, జాతీయ జీవితంపై కౌశల్య ప్రభావం భారీగా ఉండేది. కానీ బానిసత్వపు సుదీర్ఘ కాలంలో నైపుణ్యానికి అలాంటి గౌరవం ఇచ్చిన భావన క్రమంగా పోయింది. నైపుణ్యం ఆధారిత పనులు చిన్నవిగా భావించే విధంగా ఆలోచన మారింది. ఇప్పుడు ఈ రోజు చూడండి- ప్రపంచం మొత్తం నైపుణ్యం మీద ఎక్కువగా దృష్టి పెడుతోంది. విశ్వకర్మ భగవంతుని ఆరాధన కూడా లాంఛనాలతో మాత్రమే పూర్తి కాలేదు. మనం ప్రతిభను గౌరవించాలి. నైపుణ్యం సాధించడానికి మనం కష్టపడాలి. నైపుణ్యం ఉన్నందుకు గర్వపడాలి. మనం కొత్తగా ఏదైనా చేసినప్పుడు, కొత్త అంశాన్ని ఆవిష్కరించినప్పుడు, సమాజానికి ఉపయోగపడేదాన్ని సృష్టించినప్పుడు, ప్రజల జీవితాన్ని సులభతరం చేసినప్పుడు, మన విశ్వకర్మ పూజ అర్థవంతంగా ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో నైపుణ్యం ఉన్న వ్యక్తులకు అవకాశాల కొరత లేదు. నేడు నైపుణ్యాలతో ఎన్నో ప్రగతి మార్గాలు సిద్ధమవుతున్నాయి. కాబట్టి రండి.. ఈసారి విశ్వకర్మ దేవుడిని ఆరాధించడంలో విశ్వాసంతో పాటు ఆయన సందేశాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుందాం. నైపుణ్యం ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకునే విధంగా మన ఆరాధన లోని భావం ఉండాలి. అలాగే నైపుణ్యం ఉన్న వ్యక్తులు ఏ పని చేసినా వారికి పూర్తి గౌరవం ఇవ్వాలి.

నా ప్రియమైన దేశ వాసులారా! ఇది స్వాతంత్ర్యానికి 75 వ సంవత్సరం. ఈ సంవత్సరం మనం ప్రతిరోజూ కొత్త తీర్మానాలు చేసుకోవాలి. కొత్తగా ఆలోచించాలి. కొత్త విషయాలను సాధించేందుకు ప్రేరణ పొందాలి. భారతదేశం స్వాతంత్య్రం సాధించి వంద సంవత్సరాలు పూర్తయినప్పుడు, మన ఈ తీర్మానాలు మాత్రమే విజయానికి పునాదిగా కనిపిస్తాయి. కాబట్టి మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఇందులో మన వంతు సహకారం అందించాలి. ఈ ప్రయత్నాల మధ్య మనం గుర్తుంచుకోవలసిన మరో విషయం ఉంది. ఔషధం కూడా- కఠిన నియమాలు కూడా. దేశంలో 62 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లు అందజేశాం. అయినా మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. అవును- ఎప్పటిలాగే మీరు ఏదైనా కొత్త పని చేసినప్పుడు కొత్తగా ఆలోచించండి. అప్పుడు ఖచ్చితంగా నన్నుకూడా అందులో భాగస్వామిని చేయండి. నేను మీ ఉత్తరాలు, సందేశాల కోసం వేచి ఉంటాను. ఈ శుభాకాంక్షలతో, రాబోయే పండుగలకు మీ అందరికీ మరోసారి అభినందనలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!

***