Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2016 జూన్ 26న ఆకాశ వాణి లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్న “మన్ కీ బాత్” (మనసులో మాట) కార్యక్రమానికి తెలుగు అనువాదం


ప్రియమైన నా దేశ వాసులారా.. మీకు అందరికీ నమస్కారం.

కిందటి ఏడాది మనం ఎన్నో పరీక్షలకు లోనుకావలసి వచ్చింది.. వేసవిలో మండే ఎండలు, నీటి ఎద్దడి, కరవు పరిస్థితులు ఇంకా ఇలాంటివి అనేకం. అయితే, గత రెండు వారాలు వేరు వేరు ప్రదేశాలలో వర్షాలు పడి శుభ సంకేతాలను, ఒక తాజాదనపు అనుభూతిని అందించాయి. మీరు కూడా ఈ అనుభూతిని పొందే ఉంటారు. శాస్త్రవేత్తలు వేస్తున్న అంచనాల ప్రకారం ఈ సారి మంచి వర్షాలు అవీ విస్తారంగా వానాకాలం అంతా కూడా కురవాలి. ఈ కబురే మనలో ఎంతో ఉత్సాహాన్ని నింపేటటువంటిది. తగినంత వర్షపాతం ఉండాలని ఆశిస్తూ మన రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మన దేశంలో శ్రమిస్తున్న రైతుల మాదిరే మన శాస్త్రవేత్తలు కూడా మన దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చేందుకు అనేక రంగాలలో విజయాలను అందుకొంటున్నారు. నవతరం శాస్త్రవేత్తలు అవ్వాలనే కలలు కనాలని, శాస్త్ర విజ్ఞానం పట్ల వారు చక్కటి ఆసక్తి ని కలిగి ఉండాలని, రాబోయే తరాల వారి కోసం ఏదైనా చేయాలి అన్న ఉత్సుకతతో ముందంజ వేయాలని నేను మొదటి నుండి కూడా నమ్ముతూ వచ్చాను. నేను ఒక ఆనందదాయకమైన సంగతిని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టు వార్షికోత్సవం సందర్భంగా నిన్న నేను పుణెకు వెళ్లాను. అక్కడ పుణె కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులతో భేటీ అయ్యాను. వారు సొంతంగా ఒక ఉపగ్రహాన్ని తయారు చేవారు. దీనిని జూన్ 22న ప్రయోగించడమైంది. నా యువ మిత్రులను ఒకసారి చూడాలి, వారితో మాట్లాడాలి, వారిలో ఉన్న శక్తిని, ఉత్సుకతని నేరుగా పరికించాలని నాకనిపించి వారిని నా వద్దకు పిలిపించాను. గడచిన ఎన్నో సంవత్సరాల నుండి పలువురు విద్యార్థులు ఈ ప్రాజెక్టు కోసం వారి వంతుగా శ్రమించారు. ఒక విధంగా ఈ విద్యా ఉపగ్రహం ఉవ్వెత్తున ఎగురుతున్న యువ భారతం ధైర్యానికి, మహత్వాకాంక్షకు సజీవ ఉదాహరణ. అదే మన విద్యార్థులను ఈ ఉపగ్రహాన్ని తీర్చిదిద్దేటట్లుగా చేసింది. ఈ చిన్న ఉపగ్రహం వెనుక ఉన్న కలలు పెద్దవీ, ఉన్నతమైనవీనూ; అవి నింగిలోకి ఎగసేవి; వారు చేసిన ప్రయత్నాలు ఎంతో సాంద్రమైనవి. పుణె విద్యార్థుల కోవలోనే తమిళ నాడు లోని సత్యభామ యూనివర్సిటీ ఆఫ్ చెన్నై విద్యార్థులు కూడా వారు ఒక ఉపగ్రహాన్ని నిర్మించారు. వారి ‘సత్యభామ శాట్’ ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించడమైంది. ఇటువంటి విషయాలను మనం బాల్యం నుండే వింటున్నాం. ప్రతి ఒక్క పిల్ల వాడు ఆకాశాన్ని అందుకోవాలని, కొన్ని నక్షత్రాలను గుప్పెట్లోకి తీసుకోవాలని తన హృద‌యాంత‌రాళంలో కోరుకుంటుంటాడు. దీనిని మనసులో ఉంచుకొన్నప్పుడు, నా అభిప్రాయంలో. విద్యార్థులు తయారు చేసిన, ఐ ఎస్ ఆర్ ఒ ప్రయోగించిన ఈ రెండు ఉపగ్రహాలు ఎంతో ప్రాముఖ్యం గలవీ, అత్యంత విలువైనవీనూ. ఆ విద్యార్థులందరికీ హృద‌యపూర్వకంగా అభినందనలను తెలిపే తీరాలి. జూన్ 22న ఐ ఎస్ ఆర్ ఒ కు చెందిన మన శాస్త్రవేత్తలు ఏక కాలంలో 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి, ఆ క్రమంలో వారి పాత రికార్డులను బద్దలు కొట్టి ఒక కొత్త రికార్డును నెలకొల్పారు. ఈ సందర్భంగా నేను దేశ ప్రజలకు సైతం అభినందనలు తెలియజేయాలనుకొంటున్నాను. భారతదేశం నుండి ప్రయోగించిన 20 ఉపగ్రహాలలో 17 ఉపగ్రహాలు ఇతర దేశాలకు చెందినవి కావడం కూడా సంతోషాన్నిచ్చే విషయమే. అమెరికాతో పాటు.. అనేక ఇతర దేశాల ఉపగ్రహాలను భారతదేశ భూమి మీది నుంచి, భారత శాస్త్రవేత్తలు ప్రయోగించగా అవి అంతరిక్షంలోకి చేరుకొన్నాయి. వీటిలో మన విద్యార్థులు నిర్మించిన రెండు ఉపగ్రహాలు కూడా కలసి ఉన్నాయి. ఐ ఎస్ ఆర్ ఒ తక్కువ వ్యయంతో విజయాలకు పూచీ పడుతూ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకోవడమూ ఎన్నదగ్గదే. ఈ కారణంగానే, ప్రపంచంలోని అనేక దేశాలు వాటి ఉపగ్రహాల ప్రయోగం కోసం భారతదేశం వైపు చూస్తున్నాయి.

ప్రియమైన నా దేశ వాసులారా.. ఆడ పిల్లను కాపాడండి, ఆడ పిల్లను చదివించండి (‘బేటీ బచావో, బేటీ పఢావో’) ఈసరికే ‘మన్ కీ బాత్’ (మనసులోని మాట)గా, భారతదేశ ప్రజలందరి హృద‌యాంత‌రాళం లోపలి ఆకాంక్ష అయిపోయింది. అయినప్పటికీ, కొన్ని సంఘటనలు ఈ నినాదానికి ఒక కొత్త ఊపిరిని ఊదుతున్నాయి. ఈ సారి పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షలలో మన బాలికలు ఎంతో చక్కటి ముందడుగు వేయడం గర్వ కారణం. ప్రియ మైన నా దేశ వాసులారా, మనందరం గర్వించవలసిన మరో ముఖ్యమైన కార్యక్రమం మరొకటి జరిగింది. జూన్ 18 న, భారతీయ వాయు సేన మొట్టమొదటి సారిగా మహిళా ఫైటర్ పైలట్ ల తొలి దళాన్ని తనలో చేర్చుకొంది. ‘మహిళా ఫైటర్ పైలట్ లు’.. ఈ మాటలు వినగానే మీకు ఒళ్లు గగుర్పొడుస్తుంది; మన దేశంలోని అమ్మాయిలలో ముగ్గురు.. అవని చతుర్వేది, భావన కాంత్, మోహన లు.. ఫ్లయింగ్ ఆఫీసర్ లుగా ఈ ఘనతను సాధించారంటేనే మనం ఎంతగానో గర్విస్తాం. ఈ ముగ్గురు అమ్మాయిలు సాధించిన పని ఎంతో ప్రత్యేకతమైంది. ఫ్లయింగ్ ఆఫీసర్ అవని మధ్య ప్రదేశ్ లోని రీవాకు చెందిన వారు. ఫ్లయింగ్ ఆఫీసర్ భావన బీహార్ లోని బేగూసరాయ్ నుండి వచ్చారు; ఇక మరో ఫ్లయింగ్ ఆఫీసర్ మోహన గుజరాత్ లోని వడోదరా కు చెందిన వారు. వీరు ముగ్గురు మన దేశంలోని మహా నగరాల నుండి వచ్చిన వారు కాదు అన్న సంగతిని మీరు గమనించే ఉంటారు. వారి కనీసం వారి వారి రాఫ్ట్రాల రాజధాని నగరాలకు చెందిన వారయినా కాదు. చిన్న పట్టణాల్లో పుట్టి పెరిగిన వారైనప్పటికీ, వారు ఆకాశమంత ఎత్తు కలలను కన్నారు. వారు ఆ కలలను నిజం చేసుకొన్నారు కూడా. ఈ ముగ్గురు అమ్మాయిలు అవని, భావన, మోహన లకు, వారి తల్లితండ్రులకు కూడా నేను హృద‌యపూర్వకంగా శుభాకాంక్షలను అందజేస్తున్నాను.

ప్రియమైన నా దేశ వాసులారా.. కొద్ది రోజుల కిందట జూన్ 21న యావత్ ప్రపంచం ‘అంతర్జాతీయ యోగా దినం’ సందర్భంగా గొప్పగా యోగాభ్యాస కార్యక్రమాలను నిర్వహించింది. ఒక భారతీయుడిగా మొత్తం ప్రపంచం యోగా ద్వారా ఒక్కటిగా నిలవడాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రపంచమంతా మన భూత, వర్తమాన, భవిష్యత్తులతో బంధాన్ని ఏర్పరచుకొంటోందన్న సంగతిని మనం గ్రహిస్తాం. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో మనం ఒక విశిష్ట బంధాన్ని ఏర్పరచుకొంటున్నాం. భారతదేశంలోనూ ఒక లక్షకు పైగా ప్రదేశాలలో మన:పూర్వకత, ఉత్సాహాలతో వివిధ రూపాలలో, వర్ణాలలో, ఆనందదాయకమైన వాతావరణంలో అంతర్జాతీయ యోగా దినాన్ని జరిపాం. చండీగఢ్ లో వేలాది మంది యోగా అభిమానులతో కలసి యోగా చేసే అవకాశాన్ని నేను సైతం పొందాను. చిన్నా, పెద్దా అందరిలోను తొణికిసలాడిన ఉత్సాహం చూడముచ్చటేసింది. పోయిన వారం భారతదేశ ప్రభుత్వం ఈ ఏడాది యోగా దినాన్ని పురస్కరించుకొని ‘సూర్య మనస్కారాలు’ ఇతివృత్తంగా ఒక తపాలా బిళ్లను విడుదల చేయడం మీరు చూసే ఉంటారు. ఈసారి యోగా దినం నాడు యావత్ ప్రపంచ ప్రజలు రెండు ప్రత్యేక కార్యక్రమాలకు సాక్షులుగా నిలచారు. వాటిలో ఒకటి ఐక్య రాజ్య సమితి కేంద్ర కార్యాలయ భవనం ఉన్న అమెరికాలోని న్యూయార్క్ సిటీలో పైన వివిధ యోగాసనాల భంగిమలను వీడియో ప్రొజెక్షన్ చేశారు. అటూ ఇటూ పోయేవారందరూ ఆగి ఈ చిత్రాలను ఫొటోలు తీసుకున్నారు. అవి ప్రపంచమంతా ప్రచారం పొందాయి. ఈ సారి ట్విట్టర్ ద్వారా యోగా చిత్రాలను ప్రదర్శించి, ‘యోగా దిన’ ప్రయోగం జరిపారు. మొబైల్ ఫోన్ లో యోగా చిత్రాలు గోచరించాయి. అలా ప్రపంచమంతా వాటిని చూసింది. యోగా అంటేనే జోడించడం అని అర్థం. విశ్వాన్నంతటినీ ఏకం చేసే శక్తి యోగాలో ఉంది. యోగాను అనుసరించడం ఒక్కటే మనం చేయవలసిన పని. మధ్య ప్రదేశ్ లోని సాత్నాకు చెందిన స్వాతి శ్రీవాస్తవ్ యోగా దినం తరువాత టెలిఫోన్ కాల్ చేసి, ఒక సందేశాన్ని ఇచ్చారు. నిజానికి ఆ సందేశం మీ అందరికీ కూడా. కానీ ప్రధానంగా నా కోసమేమో అనిపిస్తోంది. ‘నా దేశం యావత్తు ఆరోగ్యంగా ఉండాలని, నిరుపేద ప్రజలు కూడా వ్యాధి నుండి విముక్తులు కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అందువల్ల దూరదర్శన్ లో వచ్చే సీరియల్స్ మధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనలతో పాటు యోగా గురించి ఒక సందేశం కూడా ఉండాలి. యోగా ఎలా చేయాలి? ఏం లాభాలు ఉంటాయి? ఇలాంటి విషయాలు చెప్పాలి’ అంటూ.

స్వాతి గారూ! మీ సూచన ఎంతో బాగుంది. కానీ మీరు కొంచెం శ్రద్దగా గమనిస్తే, దూరదర్శన్ లోనే కాదు. ఈ మధ్య కాలంలో భారతదేశం లోనూ, ఇతర దేశాల్లోనూ టెలివిజన్ ఛానెళ్లన్నీ యోగా విషయంలో వాటి వంతుగా ఏదో ఒక సందేశాన్ని అందిస్తూనే ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కో ఛానల్ ది ఒక్కో సమయం.. యోగా ను గురించిన ప్రచారం మాత్రం తప్పనిసరిగా జరుగుతోంది. పైపెచ్చు ప్రపంచంలో కొన్ని దేశాలలో 24 గంటలూ యోగా గురించి మాట్లాడే ఛానల్స్ ఉన్నాయనేది నేను గమనించాను. అంతర్జాతీయ యోగా దినం సందర్భంగా నేను కూడా ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లో రోజూ ఒక ఆసనం గురించి వీడియో ను షేర్ చేస్తూ ఉంటాను. ఆయుష్ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ను కనుక మీరు చూస్తే, శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఎటువంటి యోగా అవసరం, ఏ వయస్సు వారు ఏం చేయవచ్చు, తేలికపాటి ఆసనాలు ఏవి.. ఇటువంటి విషయాలను సరళంగా వివరించే ఒక 40-45 నిమిషాల వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో తప్పనిసరిగా చూడాలని నేను మీకూ, యోగా పట్ల ఆసక్తి ఉన్న ప్రతివారికీ సూచిస్తున్నాను. ఈ సారి యోగా కు సంబంధించి నేను ఒక ప్రస్తావన చేస్తున్నాను. యోగా రోగాల నుండి విముక్తిని కలిగించే ఒక మాధ్యమం. యోగాకు సంబంధించి ఎన్నో రకాల దృక్ఫథాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ వారి వారి ప్రాధాన్యతలు ఉన్నాయి. ప్రతివారికి వారిదైన అనుభవం ఉంది. కానీ అందరి అంతిమ లక్ష్యం ఒకటే.. వ్యాధుల నుండి విముక్తి. యోగా కు సంబంధించి ఉన్న వివిధ విధానాలను అనుసరించే వారు, సంస్థల వారు, గురువులు అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అందరం కలసి మధుమేహానికి వ్యతిరేకంగా ఒక యోగా ఉద్యమాన్ని ఎందుకు ప్రారంభించ కూడదు ? యోగా ద్వారా మధుమేహం నియంత్రణ, నిరోధాలు అనేవి సాధ్యపడతాయా.. ? కొంత మందికి ఈ విషయంలో సత్ఫలితాలు సిద్ధించాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పరిష్కార మార్గాన్ని వెదకుతుంటారు గానీ మధుమేహాన్ని నయం చేసే పద్ధతిని ఏ ఒక్కరూ చెప్పలేదన్నది మనం చూస్తున్నాం. మందులు వేసుకుంటూ కాలం వెళ్లబుచ్చాలి తప్ప మార్గం లేదు. పైగా డయాబెటిస్ ఎటువంటి రోగం అంటే – ఇంకా ఇతర రోగాలెన్నింటికో ఇది మూలకారణం అవుతోంది. అందువల్లనే ప్రతివారు మధుమేహం బారి నుండి కాపాడుకోవాలని అనుకుంటారు. ఎంతో మంది మధుమేహం నివారణ రంగంలో కృషి చేస్తున్నారు కూడా. కొంత మంది రోగులు యోగా ద్వారా వారి జబ్బును నియంత్రించుకో గలిగారు. ఈ విషయంలో ఆ అనుభవాలను మనం ప్రజలతో ఎందుకు పంచుకోకూడదు? ఈ పనికి ఊపునిద్దాం. ఏడాది పొడవునా ఒక మంచి వాతావరణాన్ని కల్పిద్దాం. ‘హ్యాష్ ట్యాగ్ యోగా ఫైట్స్ డయాబెటిస్’ అనే హ్యాష్ టాగ్ తో సామాజిక మాధ్యమంలో ఈ అంశాన్ని మీ మిత్రులతో పంచుకోండి, లేదా నరేంద్ర మోదీ యాప్ మీద మీ అనుభవాన్ని రాసి నాకు పంపించండి. ఎవరు ఎటువంటి ప్రయోగాలు చేశారో ఒకసారి తెలుసుకుందాం. ‘హ్యాష్ ట్యాగ్ యోగా ఫైట్స్ డయాబెటిస్’ ని ఉపయోగించి మీ ప్రయత్నాలను, అనుభవాలను గురించి మాకు తెలియజేయండని మరొక్క సారి కోరుతున్నాను.

ప్రియమైన నా దేశవాసులారా.. అప్పుడప్పుడు నా ఈ ‘మనసులో మాట’ కార్యక్రమం గురించి ఎగతాళి చేస్తున్నారు ! లోతుగానూ ఆలోచిస్తున్నారు ! అయితే, మనం ప్రజాస్వామ్యానికి బద్ధులం కావడం చేతే ఇలా జరుగుతోంది. కానీ నేడు.. జూన్ 26న.. మీతో మాట్లాతున్నప్పుడు ముఖ్యంగా – యువత చెప్పదల్చుకున్నది ఏమిటంటే – ఏ ప్రజాస్వామ్యాన్ని చూసి మనం గర్వపడుతున్నామో.. ఏ ప్రజాస్వామ్యం మనకు గొప్ప శక్తినిచ్చిందో … ప్రతి నాగరికుడికి గొప్ప శక్తినిచ్చిందో – అలాగే 1975 వ సంవత్సరం జూన్ 26 మనం మరిచిపోలేనిది. జూన్ 25 రాత్రి, ఇంకా జూన్ 26 ఉదయం మన భారతదేశానికి ఒక చీకటి సమయం లాంటిది. దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని విధించడం జరిగింది. పౌరుల అధికారాలనెన్నింటినో హరించి వేశారు. దేశాన్ని ఒక చెరసాలగా మార్చాశారు. జయప్రకాశ్ నారాయణ్ తో సహా దేశంలోని లక్షలాది ప్రజలను, వేలాది నాయకులను, సమావేశాలలో పాల్గొన్న అనేక మందిని కారాగారం ఊచల వెనుకకు నెట్టివేశారు. ఆ భయంకరమైన ఘటన గురించి ఎన్నో పుస్తకాలు రాశారు. విస్తృతంగా చర్చలు జరిగాయి. కానీ నేను జూన్ 26 న మీతో మాట్లాడుతున్న ఈ సమయంలో, మనం ఒక్క విషయం మర్చిపోకూడదు. ప్రజాస్వామ్యమే మన బలం. ప్రజాశక్తే మన బలం. దేశవాసులు ప్రతి ఒక్కరూ మన బలం. ఈ కట్టుబడిని మనం ముందు ముందు కూడా కొనసాగించాలి, బలవర్ధకం చెయ్యాలి. ప్రజలు ప్రజాస్వామ్యంలో బతకడమే ప్రజల శక్తికి ఒక నిదర్శనం. పత్రికల నోళ్లు మూసినా, ఆకాశవాణి ఒకే తీరున మాట్లాడినా, రెండో వైపు దేశవాసులు అవకాశం దొరకగానే ప్రజాస్వామ్య శక్తి ఏమిటో చూపించాలి. ఈ విషయంలో ఏ దేశానికైనా అవి వారి బలాన్ని తెలియజేస్తాయి. భారతదేశంలో అత్యవసర పరిస్థితిలో ఒక సామన్య పౌరుడు చూపించిన ప్రజాస్వామ్య శక్తికి అది ఒక గొప్ప ఉదాహరణ. ఆ శక్తిని గురించి దేశ ప్రజలకు మాటి మాటికి గుర్తు చేయడం అవసరం. ప్రజా బలం ఏమిటో తెలుసుకుంటూ ఉండాలి. దాని ద్వారా ప్రజలు బలం పుంజుకొంటారు. ఈ విధంగా మన ప్రజలు వారి ప్రవృత్తిని మార్చుకొంటూ ఉండాలి. అందరూ ఒక్కటి కావాలి. నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే సోదరా! ప్రజాస్వామ్యం అంటే – ప్రజలు వోటు వేసి – ఆ తరువాత ఐదేళ్ల పాటు పాలించండి అంటూ కాంట్రాక్టు ఇచ్చేయడం కాదు. అలా కానే కాదండీ ! వోటు వేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ! గొప్ప మలుపు! అయితే – అంతకన్నా ఎక్కువ మలుపులూ ఉన్నాయి. వాటిల్లో అతి గొప్ప మలుపు – ప్రజల భాగస్వామ్యం. ప్రజల మనః స్థితి. ప్రజల ఆలోచన. ప్రభుత్వాలు ప్రజలతో ఎంత ఎక్కువగా కలుస్తాయో, అంత ఎక్కువగా బల సంపన్నం అవుతాయి. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య ఏర్పడ్డ అగాథాలే మన వినాశానికి మరింత శక్తిని ఇచ్చాయి. ప్రజల భాగస్వామ్యంతోనే దేశం పురోగమిస్తుంది. అలా పురోగమించేటట్లు చేయడమే నా ప్రయత్నం.

ఇప్పుడిప్పుడే నా ప్రభుత్వం రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంది. అయితే – ‘సార్… మీరింత గొప్పగా ప్రజాస్వామ్యం గురించి చెబుతున్నారు కదా. మరి మీరు మీ ప్రభుత్వం గురించి ప్రజలతో విలువ కట్టించారా?’ అంటూ ఆధునిక భావాలున్న కొంత మంది యువకులు నాకు సూచనలిచ్చారు. ఒక విధంగా అందులో సవాల్ ఉంది, సలహా ఉంది. కానీ వారు నా మనసును ఒక విధంగా కుదిపేశారు. నా సీనియర్ సహచరుల ముందు ఈ విషయాన్ని ఉంచాను. దానికి ప్రతిస్పందనగా వెంటనే ‘లేదు సార్.. లేదు. మీరు చెయ్యబోతున్నది ఏమిటి ? ఈనాడు సాంకేతిక విజ్ఞానం ఎంతగా మారిపోయింది. కొంత మంది ఒక్కటిగా చేరి… గుమికూడి సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరుపయోగం చేస్తే, ఆ సర్వేక్షణ మనల్ని ఎక్కడి నుండి ఎక్కడకు తీసుకువెళ్తుందో తెలియదు..’ అన్నారు. లోతుగా ఆలోచించ సాగారు. కానీ, నాకు మాత్రం రిస్క్ తీసుకోవాలి, ప్రయత్నించి చూడాలి అని అనిపించింది. చూద్దాం ఏమవుతుందో!

ప్రియమైన నా దేశ వాసులారా.. ఆనందించాల్సిన విషయం ఒకటి ఏమిటంటే – సాంకేతిక మాధ్యమం- ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వేర్వేరు భాషలలో నా ప్రభుత్వానికి విలువ కట్టండంటూ ప్రజలను ఆహ్వానించాను. ఎన్నికల తరువాత కూడా ఎన్నో సర్వేక్షణలు జరుగుతాయి. ఎన్నికల సమయంలోనూ సర్వేక్షణలు జరుగుతాయి. మధ్య మధ్య కొన్ని విషయాల మీద కూడా సర్వేక్షణలు జరుగుతాయి. ప్రజల మెప్పుదల గురించీ సర్వేక్షణలు జరుగుతాయి! కాని వాటి ఫలితాల పరిమాణం అంత పెద్దగా ఉండదు. మీలో చాలామంది rate-my-government-MyGov. In’ ద్వారా మీమీ అభిప్రాయాలను తెలియజేశారు. ఒక విధంగా లక్షలాది ప్రజలు దీని మీద ఆసక్తిని వ్యక్తం చేశారు. కానీ, 3 లక్షల మంది ఒక్కొక్క సవాలుకు జవాబును ఇచ్చేందుకు శ్రమ పడ్డారు. చాలా సమయాన్ని వెచ్చించారు. నేను ఆ 3 లక్షల మంది దేశ వాసులకు ఎంతో రుణపడి ఉన్నాను. కృతజ్ఞుడిని. వాళ్లు స్వయంగా ఆలోచించి, ప్రభుత్వానికి విలువ కట్టారు. నేను ఫలితాల గురించి చర్చించను. ఆ పని మన పత్రికల వాళ్లు, టీవీ ఛానళ్ల వాళ్లు తప్పకుండా చేస్తారు. కానీ, ఇదీ ఒక మంచి ప్రయోగమే. ఒక్కటి మాత్రం తప్పకుండా చెబుతాను. భారతదేశంలోని వేర్వేరు భాషలు మాట్లాడే వారు, దేశపు నలుమూల్లో నివసించే వారు, రక రకాల నేపథ్యం ఉన్న వారు- అంతా ఇందులో పాలుపంచుకున్నారు. అన్నింటికన్నా నాకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే – కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘గ్రామీణ రోజ్ గార్ యోజన’ అమల్లో ఉంది. ఆ పథకానికి ఒక వెబ్ సైట్ ఉంది. ఆ పోర్టల్ ను అందరికన్నా ఎక్కువ మంది ఎగబడి మరీ ఉపయోగించారు. దీని అనర్థం.. గ్రామీణ జీవితంలో ముడిపడిన, పేదరికంతో ముడిపడిన ప్రజలే ఇందులో ఎక్కువగా పాలుపంచుకున్నారా అన్న ఆలోచన కలుగుతోంది నాకు. ఇది నాకు ఎంతో తృప్తిని ఇచ్చింది. మరి చూశారు కదా! కొన్నేళ్ల క్రితం జూన్ 26 న ప్రజల గొంతులు నొక్కి వేయబడినప్పుడు చూశాం. ఇప్పుడు ప్రజలే స్వయంగా నిర్ణయం తీసుకొంటున్నారు. ప్రభుత్వం సరిగా పనిచేస్తుందా, లేదా. మంచి పనులు చేస్తోందా, తప్పుడు పనుల చేస్తోందా చూద్దాం అంటూ మధ్య మధ్య నిర్ణయాలు తీసుకొంటున్నప్పుడూ చూస్తున్నాం! ఇదే మరి ప్రజాస్వామ్య శక్తి అంటే.

ప్రియమైన నా దేశ వాసులారా! ఇవాళ ఒక్క విషయం గురించి మీతో స్పష్టం చేయాలనుకొంటున్నాను. ఒకప్పుడు – పన్నులు విస్తృతంగా విధిస్తున్నప్పుడు ఆ పన్నులను దొంగచాటుగా నొక్కేయడం అలవాటుగా మారిన రోజులు ఉన్నాయి. విదేశీ వస్తువులు దిగుమతి చేసుకోవడానికి ఎన్నో ఆంక్షలు విధించినప్పుడు దొంగ రవాణా కూడా అంతగానూ పెరిగింది. కానీ మెల్ల మెల్లగా రోజులు మారాయి. ఇప్పుడు కొనుగోలుదారుకు ప్రభుత్వ కొనుగోలు వ్వవస్థ ద్వారా లావాదేవీ చేయడం ఏమంత కష్టం కాదు. కానీ పాత అలవాట్లు అంత తొందరగా పోవు కదా! ఒక తరం వారికి ‘బాబోయ్! ప్రభుత్వం నుండి దూరంగా ఉండడం మంచిది’ అని ఇప్పుడు అనిపిస్తొండొచ్చు. నేను ఇవాళ మీకు చెప్పేది ఏమిటంటే – నియమాల నుంచి దూరంగా పారిపోయి, మన సుఖ శాంతులను మనమే దూరం చేసుకుంటున్నాం. ఎవరో ఒక చిన్న వ్యక్తి మనల్ని కష్టాల పాల్జేయగలడు. అతనికి ఆ అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి ?. మన ఆదాయం గురించి, మన ఆస్తుల గురించి అన్ని వివరాలు మనమే స్వయంగా ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వకూడదు ? గతంలో ఇవ్వవలసిన వివరాలేమన్నా ఉంటే వాటిని ఇచ్చి, నిర్భయంగా ఊపిరి పీల్చుకోండి. ఈ బరువును దించుకోమని నా దేశ వాసులైన మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎవరి దగ్గరైతే బహిరంగపరచని ఆదాయం అంటే అన్ డిస్ క్లోజ్ డ్ ఇన్ కమ్ ఉందో వారికి భారత ప్రభుత్వం ఒక అవకాశాన్ని ఇస్తోంది. ఇంతవరకు ప్రకటించకుండా దాచిన ఆదాయపు వివరాలు ప్రకటించండి. సెప్టెంబర్ 30 వ తేదీ లోపల బహిరంగపరచని ఆదాయాన్ని ప్రకటించే సులభమైన అవకాశాన్ని ప్రభుత్వం దేశ ప్రజల ముందు ఉంచబోతోంది. జరిమానా చెల్లించి రక రకాల ఇబ్బందుల నుండి మనం విముక్తులం కావచ్చు. ఎవరైతే వారి సంపదను గురించి, అప్రకటిత ఆదాయాన్ని గురించి స్వేచ్ఛగా ప్రభుత్వానికి వెల్లడి చేస్తారో – వారి పైన ఎటువంటి సోదా జరపబోమని నేను హామీని కూడా ఇస్తున్నాను. ఇంత ధనం ఎక్కడి నుండి వచ్చింది ? ఎలా వచ్చింది ? అని ఒక్కసారి కూడా అడగం. అందుకని నేను చెప్పేది ఏమిటంటే – ఇది ఒక మంచి అవకాశం. దాగుడుమూతలు లేని ఒక పారదర్శక వ్యవస్థలో భాగస్వాములు కండి. ఇంకా, నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే- ఈ ప్రణాళిక సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంటుంది. దీనిని ఒక ఆఖరి అవకాశం అనుకోండి. మన చట్ట సభ సభ్యులతో ఇది కూడా చెప్పాను. సెప్టెంబర్ 30 తరువాత ఏ పౌరుడికైనా ప్రభుత్వ నియమాలను పాటించడం కష్టంగా ఉన్నట్లయితే ఆ పౌరుడికి ఎటువంటి సహాయమూ లభించదు అని. దేశ వాసులైన మీరు సెప్టెంబర్ 30 తరువాత ఏ కారణంగానైనా నష్టాల పాలు కావద్దని కొరుకుంటున్నాను. అందుకని సెప్టెంబర్ 30 లోపు ఈ ప్రణాళిక ద్వారా లాభం పొందండి. ఆ తరువాత ఎదురుకాగల ఇబ్బందుల నుంచి ముందే తప్పించుకోండి.

నా దేశ వాసులారా.. ఈ నాటి ‘ మనసులో మాట’ కార్యక్రమంలో ఈ విషయాన్ని మీతో చెప్పడానికి ఒక కారణం ఉంది. ఇటీవలే రెవెన్యూ శాఖలోని భాగాలైన ఆదాయపు పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్ అధికారులందరితో ఒక రెండు రోజులు మేధోమధనం నిర్వహించాను. ఎన్నో విషయాలు చర్చలోకి వచ్చాయి. నేను వారితో స్పష్టంగా- చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాను. మనం మన పౌరుల్ని దొంగలుగా చూడవద్దు అని. వారి మీద నమ్మకం ఉంచుదాం. వారిని విశ్వసిద్దాం. చేయి అందుకొని నడుద్దాం. వారు నియమాలను పాటించేటట్లయితే, వారిని ప్రోత్సహించి.. ప్రేమగా వెంట తీసుకొని నడుద్దాం అని. వారి చుట్టూ ఒక విశ్వాస పూరితమైన వాతావారణాన్ని కల్పించడం ఎంతైనా అవసరం. ఆచరణ ద్వారా మనం ఆ మార్పు తీసుకురావాలి. పన్ను చెల్లించే వారికి మనం నమ్మకం కలిగించాలి. ఈ విషయాలను నేను వాళ్లతో నొక్కి నొక్కి మరీ చెప్పాను. దానితో మన దేశం పురోగమిస్తున్నప్పుడు అందులో మనందరం భాగస్వాములం కావాలని వాళ్లకీ అనిపించింది. ఈ చర్చలో నాకు తెలియవచ్చిన విషయాలలో ఒక విషయం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. దాన్ని మీలో చాలా మంది నమ్మకపోవచ్చు. నూట పాతిక కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో 50 లక్షల పైన ఆదాయం ఉన్నవారు లక్షా ఏభై వేల మందే ఉన్నారు. ఇది ఎవరికీ మింగుడుపడే విషయం కాదు. 50 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వారు పెద్ద పెద్ద పట్టణాలలో లక్షాధికారులుగానే మనకు కనిపిస్తుంటారు. కానీ, ఒక కోటి, 2 కోట్ల విలువజేసే వారి బంగళాలను చూడగానే – వీళ్లు 50 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నవాళ్లుగా ఎలా చలామణి అవుతున్నారని అనిపించక మానదు. అంటే – ఎక్కడో ఏదో మతలబు ఉంది. ఈ స్థితిలో మార్పు రావాలి. ఆ మార్పు కూడా సెప్టెంబర్ 30 లోపల రావాలి. ప్రభుత్వం ఏదైనా కఠోర నిర్ణయాన్ని తీసుకొనే ముందు ప్రజా దేవుళ్లకు అవకాశం ఇవ్వాలి. అందుకని నా ప్రియమైన సోదర సోదరీమణులారా.. బహిరంగపరచని ఆదాయాన్ని ప్రకటించడానికి ఇది ఒక సువర్ణావకాశం. ఇంకో రకంగా చూస్తే సెప్టెంబర్ 30 తరువాత ఎదురయ్యే కష్టాల నుండి విముక్తులవ్వడానికి ఇది ఒక మంచి మార్గం. దేశ ప్రగతి కోసం, దేశ సంక్షేమం కోసం, పేద ప్రజల ఉద్ధరణ కోసం ఈ విషయంలో ముందుకు రమ్మని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 30 తరువాత మీరెటువంటి కష్టం ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు.

ప్రియమైన నా దేశ వాసులారా.. ఈ దేశంలోని ఒక సామాన్య మానవుడు తన దేశం గురించి ఎంతో కొంత పాటుపడే అవకాశం కోసం వెతుకుతుంటాడు. ‘వంట ఇంటి గ్యాస్ సబ్సిడీని వదులుకోండి’ అని నేను ప్రజలతో చెప్పినప్పుడు ఈ దేశంలో కోటికి పైగా కుటుంబాలు స్వచ్ఛందంగా, సుముఖంగా తమ గ్యాస్ సబ్సిడీని వదులుకొన్నాయి. ముఖ్యంగా – బహిరంగపరచని ఆదాయం ఉన్న వారికి ప్రత్యేకంగా ఒక ఉదాహరణ ఇవ్వదలుచుకున్నాను. స్మార్ట్ సిటీ కార్యక్రమం నిమిత్తం నేను పుణె వెళ్లినప్పుడు నాకు అక్కడ శ్రీ చంద్రకాంత్ దామోదర్ కులకర్ణిని, వారి కుటుంబ సభ్యులను కలుసుకొనే సదవకాశం లభించింది. వాళ్లను కలవాలని ప్రత్యేకంగా కబురు పంపించాను. కారణం తెలుసా ? ఎప్పుడైనా దొంగతనం చేసిన వ్యక్తికి నా మాటలు ప్రేరణ ఇవ్వవచ్చు. ఇవ్వకపోవచ్చు. కానీ చంద్రకాంత్ కులకర్ణి గారి మాటలు మాత్రం తప్పకుండా ప్రేరణనిస్తాయి. కారణం ఏమిటో మీకు తెలుసా ? ఈ చంద్రకాంత్ కులకర్ణి గారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబికుడు. ప్రభుత్యోద్యోగం చేస్తుండే వాడు. ఈయన పదవీ విరమణ చేశారు. నెలకు 16,000 రూపాయల పెన్షన్ వస్తుంది.

ప్రియమైన నా దేశ వాసులారా…. అసలు విషయం తెలిస్తే, మీరు ఆశ్చర్య పోతారు. పన్నులు ఎగ్గొట్టే అలవాటున్న వాళ్లకైతే ఇంకా వింతగా ఉంటుంది. నెలకు కేవలం 16,000 పెన్షన్ వచ్చే ఈ చంద్రకాంత్ కులకర్ణి గారు కొంతకాలం క్రితం నాకొక ఉత్తరాన్ని రాశారు. ఏమని..? ”నాకు వచ్చే 16,000 రూపాయల పెన్షన్ లో ప్రతి నెల ఒక 5,000 రూపాయలు ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కు విరాళంటా ఇవ్వదల్చుకుంటున్నాను” అంటూ. అంతే కాదు, ఏ నెలకు ఆ నెల తారీఖులు వేసిన 52 చెక్కులు, ఒక్కొక్క చెక్కు 5,000 రూపాయలకు రాసి, ఆ ఉత్తరంతో జత చేసి పంపించారు. ఏ దేశంలోనైనా ప్రభుత్వోద్యోగం చేసిన వ్యక్తి తన 16,000 రూపాయల పెన్షన్ లో 5,000 రూపాయలు స్వచ్ఛతా అభియాన్ కోసం విరాళం ఇస్తున్నారో, ఆ దేశంలో పన్ను ఎగవేసే హక్కు ఎవరికీ ఉండదు గాక ఉండదు. చంద్రకాంత్ కులకర్ణి గారి కన్నా ఎక్కువగా ఎవ్వరూ మనకి ప్రేరణ ఇవ్వలేరు. స్వచ్ఛ భారత్ అభియాన్ లో పాటుపడే వాళ్లకు కూడా చంద్రకాంత్ కులకర్ణి గారి కన్నా ఉత్తమ ఉదాహరణగా ఎవరూ సాటిరారు. నేను చంద్రకాంత్ గారిని గౌరవంగా పిలిచాను. వారిని కలిశాను. వారి జీవనం, వారి జీవన విధానం నా మనస్సును తాకాయి. వారి కుటుంబ వ్యక్తులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి గొప్ప వ్యక్తులు లెక్కలోకి రాకుండా ఇంకా చాలా మంది ఉండ వచ్చు. బహుశా వారి గురించి నాకు తెలియకపోవచ్చు. కానీ వీళ్లే ప్రజలు. ఇదే ప్రజా శక్తి. బలం అంటే ఇదే. 16,000 పెన్షన్ తీసుకొనే వ్యక్తి 2 లక్షల అరవై వేల రూపాయలకు చెక్కులు – అదీ అడ్వాన్స్ గా పంపించడం ఏమైనా సామాన్య విషయమా. రండి. మనం కూడా మన మనస్సుల్ని ఒకసారి తట్టిలేపుదాం. మన ఆదాయాన్ని బహిరంగపరచడానికి ప్రభుత్వం మనకు ఒక అవకాశం ఇచ్చిందని ఆలోచిద్దాం! మనం కూడా చంద్రకాంత్ గారిని గుర్తుచేసుకుంటూ, దేశాభివృద్ధిలో భాగస్వాములం అవుదాం.

ప్రియమైన నా దేశ వాసులారా.. ఉత్తరాఖండ్ లో పౌడీ గడ్వాల్ నుండి శ్రీ సంతోష్ నేగీ ఫోన్ చేసి, తన అనుభవమొకటి పంచుకొన్నారు. జల సంరక్షణను గురించి ఆయన నాకొక సందేశాన్ని ఇచ్చారు. మిత్రులారా, ఆయన అనుభవం మీకు కూడా ఉపయోగపడేదే.

“మీ ప్రేరణతో మేము విద్యాలయంలో వర్ష రుతువు మొదలు కాక ముందే వర్షపు నీటిని నిల్వ చేయడానికి, క్రీడా మైదానం అంచులలో 4 అడుగుల లోతు చిన్న చిన్న ఇంకుడు గుంతలను 250 దాకా తవ్వించాం. ఇలా చేయడం ద్వారా వాన నీటిని వీటిలో సేకరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. క్రీడా మైదానమూ పాడవదు, పిల్లలు వీటిలో మునిగిపోయే అపాయమూ ఎదురవదు.. మేం మైదానం మీద పడే వాన మూలంగా వృథా అయ్యే కోట్ల లీటర్ల నీటిని ఆదా చేయగలిగాం.” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

సంతోష్ గారూ ! ఈ సందేశాన్ని పంపినందుకు మీకు ఇవే నా అభినందనలు. పౌడీ గఢ్ వాల్ ఒక కొండ ప్రాంతం. అక్కడ కూడా మీరు ఇంతటి అద్భుతమైన పనిని చేసినందుకు నిజంగా మీరు అభినందన పాత్రులు. మన దేశ వాసులు వర్షాలను సంతోషంగా అనుభవించాల్సిందే, కానీ ఇది సర్వశక్తిమంతుడి వద్ద నుండి మనకు అందే ఒక పవిత్రమైన బహుమతి. ఇది ఒక అనంతమైన సంపద. ప్రతి ఒక్క నీటి బిందువును ఆదా చేయడానికి మనం శాయశక్తుల యత్నించాలి. ఊరిలోని నీటిని ఊరి వరకే, పట్టణంలోని నీటిని పట్టణం వరకే మనం ఎలా ఆపగలం? తల్లి భూమి తిరిగి శక్తిని పుంజుకోవడానికి మనం నీటిని మళ్లీ భూమి లోకి ఎలా పంపించగలం..? నీరు ఇవాళ ఉంటేనే మనకు రేపు అనేది ఉండగలదు. ప్రాణానికి ఆధారం జలమే. దేశంలో ఇప్పుడు ఒక వాతావరణమంటూ ఏర్పడింది. ఈ మధ్య కాలంలో ప్రతి రాష్ట్రంలోనూ నీటిని ఆదా చేయడానికి అనేక పద్ధతులను పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు వాన నీరు సమృద్ధిగా అందనుంది కాబట్టి ఆ నీరు వృథాగా పారకుండా మనం చూసుకోవాలి. ప్రాణాలను కాపాడడానికి మనం ఎంతగా ఆలోచిస్తామో, అంతే శ్రద్ధగా నీటిని కాపాడుకోవడానికి కూడా ఆలోచించాలి.

ప్రియమైన నా దేశ వాసులారా.. 1922 అనే సంఖ్యను గురించి మీరు ఇప్పటికే తెలుసుకొన్నారు. అది ఈ సరికి మీ స్మృతిలో ఒక భాగంగా అయిపోయింది. 1-9-2-2 . ఈ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఎటువంటి సంఖ్య అంటే, మీరు దీనికి ఒక మిస్ డ్ కాల్ ఇచ్చారంటే, మీరు ‘మనసులో మాట’ కార్యక్రమాన్ని మీకు ఇష్టమైన భాషలో వినగలుగుతారు. మీకు వీలు కుదిరినప్పుడు, మీ భాషలో ‘మనసులో మాట’ను వినడం ద్వారా మీరు సైతం మీ సంకల్పం తీసుకొని మన దేశ పురోగతి కార్యక్రమంలో మీ వంతు సహకారాన్ని అందించగలుగుతారు.

నా దేశ వాసులారా.. మీకందరికీ మరొక్క సారి నా నమస్కారం, ధన్యవాదాలు.