Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆకాశ వాణి లో ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ప్రసంగ కార్యక్రమానికి తెలుగు అనువాదం


ప్రియమైన నా దేశ వాసులారా..

నమస్కారములు.

మీరు రేడియోలో నా ‘మన్ కీ బాత్’ వింటున్నారనుకుంటా; కానీ, పిల్లల పరీక్షలు మొదలవుతున్నాయి అన్న ఆలోచనే మనసులో మెదులుతూ ఉండి ఉంటుంది. కొందరికి పదో తరగతి పరీక్షలు, మరికొందరికి పన్నెండో తరగతి పరీక్షలు బహుశా మార్చి 1వ తేదీ నుంచే మొదలవుతున్నాయి. కాబట్టి, మీ మనసులో కూడా అదే మెదులుతూ ఉండి ఉంటుంది. నేను కూడా మీ ఈ యాత్రలో మీతో జత కలవాలనుకుంటున్నాను. మీకు మీ పిల్లల పరీక్షల విషయంలో ఎంతైతే ఆందోళన ఉందో, నాకూ అంతే ఆందోళన ఉంది. కానీ, పరీక్షల పట్ల మనకున్న ఆలోచన విధానాన్ని మార్చుకుంటే, బహుశా మనం ఈ ఆందోళన నుంచి విముక్తులం అవుతాం.

మీ అనుభవాలు, సూచనలు NarendraModiApp ద్వారా తప్పక పంపించండని నేను ఇంత క్రితం ‘మన్ కీ బాత్’ లో చెప్పాను. దీనికి జవాబుగా అధ్యాపకులు, తమ కెరియర్ లో ఎంతో సఫలీకృతులైన విద్యార్ధులు, తల్లితండ్రులు, సమాజంలోని కొంత మంది ఆలోచనాపరులు చాలా విషయాలు రాసి పంపించారు. ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. రెండు విషయాలు నా మనసును స్పర్శించాయి. వాటిలో ఒకటోది.. రాసిన వారందరు విషయాన్ని సరిగ్గా గ్రహించారు. ఇక రెండోది.. ఇన్ని వేల విషయాలు ప్రస్తావనకు వచ్చాయంటే, ఇది ఎంతో మహత్తు కలిగిన అంశమని నేను ఒప్పుకొంటాను. అయితే మనలో చాలా మందిమి పరీక్షలంటే అవి కేవలం ఆ పరిసరాలకో, లేదా ఆ కుటుంబానికో, లేదా విద్యార్థులకు మాత్రమే సంబంధించినవి అంటూ ఒక గిరిని గీచేశాం. నా App లో వచ్చిన సూచనల్ని బట్టి చూస్తే, ఇది ఎంతో విస్తృతమైన అంశమని అర్థమయింది. దీనిపై దేశవ్యాప్తంగా విద్యార్థి వర్గాల్లో చర్చ జరుగుతూ ఉండాలి.

నేను ఈ రోజు నా ‘మన్ కీ బాత్’ లో మరీ ముఖ్యంగా తల్లిదండ్రులతో, పరీక్షార్థులతో, వారి ఉపాధ్యాయులతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను విన్నవి, చదివినవి, నాకు ఎవరో సూచించినవి.. వాటిల్లో నుంచి కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నాకు తోచిన మరికొన్ని విషయాలను కూడా జోడిస్తాను. కానీ, పరీక్షలు రాయబోతున్న విద్యార్థుల కోసం నా ఈ 25- 30 నిమిషాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనేదే నా నమ్మకం.

ప్రియమైన నా విద్యార్థి మిత్రులారా..

నేను ఏదైనా చెప్పే ముందు- ఈ నాటి ‘మన్ కీ బాత్’ ను మనం ప్రపంచ ప్రసిద్ధ ఓపెనర్ మాటలతో ఎందుకు ప్రారంభించకూడదు?. జీవితంలో ఉన్నత విజయ శిఖరాలు చేరుకోవడంలో ఎలాంటి అంశాలు వారికి ఉపకరించాయో, వారి అనుభవాలు మీకు తప్పక తోడ్పడుతాయి. భారతదేశంలోని యువతరం ఎవరిని చూసి గర్వపడతారో అటువంటి వ్యక్తి, ‘భారత రత్న’ శ్రీ సచిన్ టెండూల్కర్ ఒక సందేశాన్ని పంపారు.. దానిని మీకు వినిపించాలనుకుంటున్నాను. వినండి..

“నమస్కారం, నేను సచిన్ టెండూల్కర్ ని మాట్లాడుతున్నాను. కొద్ది రోజుల్లోనే పరీక్షలు మొదలవుతాయని నాకు తెలుసు. మీలో చాలా మంది ఒత్తిడిలో ఉండుంటారు. మీ కోసం నాదొక్కటే సందేశం, మీ మీద మీ తల్లితండ్రులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. స్నేహితులు అంచనాలు వేస్తారు. ఎక్కడికెళ్లినా, పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారని అందరూ అడుగుతారు. ఎన్ని మార్కులు వస్తాయి, ఎంత స్కోరు చేస్తావని, నేనొకటి చెప్పదలచుకున్నాను.. మీరు స్వయంగా మీ కోసం లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. మీరు ఎవరి అంచనాల ఒత్తిడికి లోను కావద్దు. మీరు తప్పక కష్టపడి చదవండి; కానీ వాస్తవికమైన, అందుకోగలిగిన లక్ష్యాన్ని స్వయంగా పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నం చేయండి. నేను క్రికెట్ ఆడేటప్పుడు నా మీద ఎన్నో అంచనాలు పెట్టుకొనే వారు, నా నుంచి ఎంతో ఆశించే వారు. గత 24 ఏళ్ళలో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. చాలా సార్లు మంచి క్షణాలు కూడా వచ్చాయి. కానీ, ప్రజల అంచనాలు ఎప్పుడూ పెరుగుతూ పోయాయి. సమయం గడుస్తున్న కొద్దీ అంచనాలు మరింతగా పేరుకుపోసాగాయి. అందుకు దీనికొక పరిష్కారాన్ని కనుక్కోవడం నాకు ఎంతో అవసరం అయింది. దాంతో నేనిదే ఆలోచించాను.. నా అంచనాలను నేనే నిర్ణయించుకుంటాను; లక్ష్యాలను స్వయంగా నిర్దేశించుకుంటానని అనుకున్నాను. నా లక్ష్యాలను నేను స్వయంగా నిర్ణయించుకొని, వాటిని సాధించగలుగుతున్నానంటే దేశానికి నేను ఎంతో కొంత మంచిని చేయగలుగుతున్నాను. ఇంకా ఆ లక్ష్యాలను సాధించేందుకు నేను నిరంతరం ప్రయత్నిస్తూ ఉండే వాడినే. నా దృష్టి బంతి మీద కేంద్రీకృతమైన కొద్దీ నెమ్మది నెమ్మదిగా లక్ష్యాలు నెరవేరాయి. మన ఆలోచనలు సకారాత్మకంగా ఉండటం అత్యవసరం అని నేను మీకు చెప్పదలచుకున్నాను. సానుకూల ఆలోచనలను సానుకూల ఫలితాలు అనుసరిస్తాయి. అందుకే, మీరు తప్పనిసరిగా సానుకూలతతో ఉండండి, ఆ పై వాడు మీకు మంచి ఫలితాలు ప్రసాదిస్తాడని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. పరీక్షల వేళ మీకందరికీ నా శుభాకాంకాంక్షలు. ఎలాంటి ఒత్తిడికీ లోనవకుండా పరీక్షలు రాయండి. ఇంకా మంచి ఫలితాలు పొందండి. గుడ్ లక్..”

మిత్రులారా..!

చూశారా… టెండూల్కర్ గారు ఏం చెప్తున్నారో! ఈ అంచనాల భారాల కింద నలిగిపోకండి. మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోవాలి. మీ లక్ష్యాన్ని మీ అంతట మీరే ఏర్పరచుకోండి. స్వచ్ఛమైన మనసుతో, స్వచ్ఛమైన ఆలోచనలతో, స్వచ్ఛమైన సామర్థ్యంతో మీ లక్ష్యానికి చేరే గమ్యాన్ని కూడా మీరే నిర్దేశించుకోండి. సచిన్ గారి ఈ మాటలు మీకు తప్పకుండా ఉపయోగపడతాయని నా నమ్మకం. వేరొకరితో మనకు పోటీ ఎందుకు?. మనతో మనమే పోటీ పడదాము. మరొకరితో పోటీ పడటంలో మన సమయం ఎందుకు వృథా చేసుకోవాలి. మనతో మనమే స్పర్ధ ఎందుకు పెట్టుకోకూడదు. మన రికార్డులను మనమే అధిగమించాలని ఎందుకు ప్రయత్నించకూడదు?. చూడండీ.. మీరు అభివృద్ధి చెందకుండా ఎవరూ ఆపలేరు. పాత రికార్డులను మీరంతట మీరే ఎప్పుడైతే ఛేదిస్తారో, అప్పుడు మీ సంతోషానికి, మీ ఆనందానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరు. ఒక రకమైన సంతోషం లోలోపలి నుంచి వ్యక్తమవుతుంది.

మిత్రులారా..!

పరీక్షలు అంటే సంఖ్యలతో ఆట అని భావించకండి. ఎక్కడికి చేరాము, ఎంత దూరం వచ్చాము.. అనేటటువంటి లెక్కా జమల్లో చిక్కుకోకండి. జీవితానికి అంత కంటే ఒక మహోన్నత ఉద్దేశాన్ని నిర్ణయించుకోవాలి. ఒక స్వప్నంతో ప్రయాణించాలి; సంకల్ప బద్ధులు అవ్వాలి. ఈ పరీక్షలు, అవి మనం సవ్యంగా వెళ్తున్నామా లేదా అనే లెక్కలు కడతాయి; మన పరిస్థితి బాగుందా లేదా అని చూస్తాయి. అందుకే ఒక విశాలమైన, ఉన్నతమైన స్వప్నాన్ని ఏర్పరచుకుంటే- పరీక్షలు అనేవి ఒక ఆనందోత్సవంగా మారిపోతుంది. ప్రతి పరీక్ష ఈ మహోన్నత ఉద్దేశం నెరవేరడానికి ఒక ముందడుగు అవుతుంది. ప్రతి విజయం ఆ మహోన్నత లక్ష్యాన్ని సాధించేందుకు తాళం చెవిగా మారుతుంది. అందుకని ఈ సంవత్సరం ఏమవుతుంది.., ఈ పరీక్ష ఏమవుతుంది.. అని అంతవరకే ఆలోచించకండి. ఒక మహోన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగండి. అలాంటి సమయంలో ఫలితం ఆశించిన స్థాయిలో లభించక పోయినప్పటికీ నిరాశ పడకండి. మరింత బలంగా, మరింత శక్తిమంతంగా పని చేస్తే.. మరి కాస్త గట్టి ప్రయత్నం చేస్తే.. ఫలితం వస్తుంది.

నా App లో వేలాది మంది మొబైల్ ఫోన్ నుంచి చిన్న చిన్న మాటలు రాశారు. వాటిల్లో ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది అని శ్రేయ గుప్తా రాసిన మాట ఎన్నదగినది. విద్యార్ధులు తమ చదువుల మీదే కాకుండా ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. దానివల్ల పరీక్షను కూడా ఆరోగ్యకరంగా, మంచిగా రాయగలుగుతారు. మీరు దండీలు తీయండి అని, మూడు కిలోమీటర్లు గాని లేదా ఐదు కిలోమీటర్లు గాని పరుగు తీయడానికి వెళ్లండని గాని నేను ఇప్పుడు పరీక్షలకు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉండగా మీకు చెప్పను. కానీ, ఒక్క మాట మాత్రం నిజం.. అదేమిటంటే.. మరీ ముఖ్యంగా పరీక్షల రోజులలో మీ దిన చర్య ఎలా ఉందో చూసుకోండి. ఆ మాటకొస్తే 365 రోజులూ మన దిన చర్య మన కలల, మరియు సంకల్పాల సాధనకు అనువుగా ఉండాలి. శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన ఒక అంశంతో నేను ఏకీభవిస్తాను. ఆయన ప్రత్యేకంగా చేసిన సూచన ఏమిటంటే.. నియమితమైన వేళకు నిద్ర పోవాలి, ఉదయం కాగానే త్వరగా నిద్ర నుంచి లేచి, మననం చేసుకోవాలి అని. పరీక్షా కేంద్రానికి ప్రవేశ పత్రాన్ని, ఇతర వస్తువుల్ని తీసుకొని నిర్ణీత సమయానికన్నా ముందుగానే చేరుకోవాలి. ఈ మాటలనూ ప్రభాకర్ రెడ్డి గారే చెప్పారు. ఈ మాటలను చెప్పడానికి నాకయితే ధైర్యం చాలదేమో!. ఎందుచేతనంటే.. నిద్ర పోయే విషయంలో నేను కాస్తంత ఉదాసీనతను వహిస్తాను. మీరు చాలా తక్కువ సేపే నిద్రపోతారని నా మిత్రులలో చాలా మంది నాతో ఫిర్యాదు చేస్తున్నట్లుగా కూడా అంటూ ఉంటారు మరి. ఇది నాలోని ఒక లోపం; దీనిని సరి చేసుకోవడానికి నేను సైతం ప్రయత్నం చేస్తాను. అయితే, ఈ వాదనతో నేను తప్పక ఏకీభవిస్తున్నాను. తగినంత సేపు నిద్రపోవడం, గాఢమైన నిద్ర.. ఇవి మీరు రోజంతా చేయవల్సిన పనుల కోసం ఎంతో అవసరమైనవే సుమా. నేను అదృష్టవంతుడిని; తక్కువ సేపే నిద్ర పోతాను.. అయితే, నాకు ఆ నిద్ర గాఢంగా పడుతుంది. అందువల్లనే ఆ నిద్ర నాకు సరిపోతున్నది. కానీ మీకు మాత్రం నా మనవి ఏమిటంటే, చాలినంత సేపే నిద్రపొమ్మని. లేదంటే, కొంత మందికి నిద్ర పోయే ముందు చాలా.. చాలా సేపటి వరకు టెలిఫోన్ లో మాట్లాడే అలవాటుంటుంది. ఇక ఆ తరువాత కూడా మెదడులో అవే ఆలోచనలు మెదులుతుంటాయి. అలాంటప్పుడు- నిద్ర ఎలా పడుతుంది?. నేను నిద్ర గురించి చెబుతూ ఉంటే – ఏదో పరీక్షల కోసమే నిద్ర పొమ్మని చెప్తున్నాననుకోకండి. అపార్థం చేసుకోవద్దు. పరీక్షలు రాసే సమయంలో ప్రశ్నలకు చక్కగా జవాబులు రాయడానికి ఎటువంటి ఆందోళన లేకుండా ఉండటానికే మిమ్మల్ని నిద్ర పొమ్మంటున్నాను. అలా నిద్ర పోతూనే ఉండాలని.. నేనేమీ చెప్పటం లేదు. తీరా బాగా నిద్ర పోయి పరీక్షలు రాసి, తక్కువ మార్కులు వచ్చాయంటే- తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయి అని అమ్మ అడిగినప్పుడు.. మోదీ గారు పడుకోమని చెప్పారు, నేను పడుకున్నాను.. అని అని చెబుతారా ఏమిటి! అలా చేయరు కద. మీరు అలా చేయరనే నేను నమ్ముతున్నాను.

అలాగే, జీవితంలో క్రమశిక్షణ అనేది విజయాల పునాదిరాయిని పటిష్టంగా ఉంచేందుకు మూల కారణంగా నిలుస్తుంది. క్రమశిక్షణతో ఒక బలమైన పునాది పడుతుంది. సువ్యవస్థితంగా ఉండని వారు, క్రమశిక్షణను అలవరచుకోని వారు ఉదయం పూట చేయాల్సిన పనిని సాయంత్రం పూట చేస్తారు; మధ్యాహ్నం పూట చేయాల్సిన పనిని రాత్రి ఎంతో పొద్దు పోయిన తరువాత చేస్తారు.. వారు తాము పనిని పూర్తి చేసేశామనుకుంటారు; కానీ, దీనిలో ఎంత శక్తి వృథా అవుతున్నదో.. ప్రతి క్షణం మానసికంగా ఎంత ఒత్తిడో- తెలుసుకోలేరు. మన శరీరంలో ఏదైనా ఒకటీ అరా అవయవాలకు ఏ కొంచెం ఇబ్బంది ఎదురైనా సరే.. మొత్తం శరీరమే బాగా లేనట్టు అనిపిస్తుందన్నది మీకు అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అంతే కాదు, మన దినచర్య కూడా అస్తవ్యస్తం అవుతుంది. కాబట్టి దేన్నీ మనం చిన్న చూపు చూడకూడదు. అందుకని ప్రతిదీ అనుకున్న సమయం లోనే చేసేయాలి; ఇందులో రాజీ పడే అలవాటు చేసుకోవద్దు. నిశ్చయించుకోండి, చేసి చూడండి.

మిత్రులారా..!

అప్పడప్పుడు నేను చూశాను, పరీక్షలకు వెళ్లే విద్యార్ధుల్లో రెండు రకాల వాళ్లు కనిపిస్తారు. వారిలో ఒకటో రకం వారు.. వీరు ఏం చదివారో, ఏం నేర్చుకున్నారో, ఏయే విషయాల్లో వారికి ప్రావీణ్యం ఉందో.. అనే విషయాలపైన మనసును లగ్నం చేస్తారు. రెండో రకం వారు.. ఈ విద్యార్ధులకు పరీక్షలో ఏ ప్రశ్న వస్తుందో తెలియదు, ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారో, ఆ ప్రశ్నలకు వారు సమాధానాలు రాయగలరో, లేదో ? ప్రశ్నపత్రం కఠినంగా వస్తుందా లేక తేలిగ్గా ఉంటుందా.. అని ఆలోచిస్తారు. మీరు కూడా ఈ రెండు రకాలైన విద్యార్థుల్ని చూసే ఉంటారు. ప్రశ్నపత్రం ఎలా వస్తుందో అనుకుని ఆందోళనలో ఉండే వారిపైన వారి ఫలితాల విషయంలో కూడా నకారాత్మక ప్రభావమే పడుతుంది. ఎవరైతే నా దగ్గర ఏముంది అనే నమ్మకంతో వెళ్తారో వారు ఏం వచ్చినా దానిని తట్టుకోగలుగుతారు. ఈ విషయాన్ని నా కన్నా బాగా ఎవరు చెప్పగలరు అంటే అది – ప్రపంచంలో చేయి తిరిగిన క్రీడాకారుల ఆట కట్టించిన చదరంగం చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్- అంటాను. ఆయన తన అనుభవాలను మీతో పంచుకొంటారు. రండి, ఈ పరీక్షల ఆట కట్టించడం ఎలాగో ఆయన ద్వారానే నేర్చేసుకుందురు గాని..

“హలో, నేను విశ్వనాథన్ ఆనంద్ ని. ముందుగా, మీరంతా పరీక్షలు బాగా రాయాలని చెప్పి మీకు నా శుభాభినందనలను అందజేయనివ్వండి. ఇక .. నేను నా పరీక్షలకు ఎలా సిద్దమయ్యానో, ఇంకా నా అనుభవాలు ఏమిటో ఇప్పుడు వివరిస్తాను. జీవితంలో ముందుముందు ఎదురయ్యే సమస్యల వంటివే ఈ పరీక్షలు అని నాకనిపించింది. మీరు బాగా విశ్రాంతి తీసుకొని, రాత్రంతా కంటి నిండా కునుకు తీయాలి. అందుకోసం కడుపారా భోంచేయాలి. ఆకలితో మాత్రం ఉండనేకూడదు. అన్నిటి కంటే ముఖ్యమైనది – ప్రశాంతంగా ఉండటం. ఇదంతా చదరంగం క్రీడా పోటీ వంటిదే; మీరు ఆడుతున్నప్పుడు ఏ పావు ఎప్పుడు ఎటు వస్తుందో మీకు తెలియదు. తరగతి గదిలో మీకు తెలియదు కదా.. పరీక్షలో ఏ ప్రశ్న వచ్చేదీ? అలాగే నన్న మాట ఇది కూడా. అందుకని మీరు ప్రశాంతంగా ఉంటే, పౌష్టికాహారం తింటే, చక్కగా నిద్రపోతే- అదుగో అప్పుడే మీ మెదడు సరైన సమాధానాన్ని సరైన సమయంలో గుర్తు చేసుకోగలుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. మీ మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవటం అనేది ఎంతో కీలకమైన అంశం. మీ మీద అంచనాలను కూడా మరీ ఎక్కువగా పెట్టుకోకండి. కేవలం ఒక సవాలుగా దాన్ని చూడండి- సంవత్సరం అంతా నేర్పించింది గుర్తు చేసుకోగలనా? ఈ సమస్యలను పరిష్కరించగలనా? – అని. చివరి నిమిషంలో చాలా ముఖ్యమైన అంశాలను, ఇంకా మీకు ముఖ్యమైనవిగా అనిపించిన అంశాలను, మీకు బాగా గుర్తు లేని అంశాలను మరోసారి చూసుకోండి. మీ తోటి విద్యార్థుల తోనో, లేక మీ ఉపాధ్యాయుల తోనో జరిగిన కొన్ని ఘటనలను కూడా మీరు పరీక్ష రాసే సమయంలో జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు; దీనివల్ల మీకు ఆ పాఠానికి సంబంధించిన ఎంతో సమాచారం గుర్తుకొస్తుంది. మీకు కష్టంగా అనిపించిన ప్రశ్నలను, పాఠాలను పునశ్చరణ చేశారంటే- అవి మీ మెదడులో తాజా అయిపోతాయి. దీంతో పరీక్ష రాసే సమయంలో వాటిని మరింత మెరుగ్గా రాయగలుగుతారు. అందుకే ప్రశాంతంగా ఉండండి; బాగా నిద్రపోండి. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి పోకండి; న్యూనత భావాన్ని కూడా దరిజేరనీయవద్దు. నా అనుభవం ఏమిటంటే – ముందు భయపడిన దాని కంటే పరీక్షలు ఎంతో మెరుగ్గా గడచిపోతాయి. ధైర్యంగా ఉండండి.. మీకు అంతా మంచే జరగాలి గాక.”

విశ్వనాథన్ ఆనంద్ నిజంగా గొప్ప మాట చెప్పారు. ఆయన ఆడే అంతర్జాతీయ చదరంగం పోటీల్లో ఎంత స్వస్థతతో కూర్చుంటారో, ఎంత ఏకాగ్రంగా ఉంటారో మీరు పరిశీలించే ఉంటారు. ఆయన కళ్లు అటూ ఇటూ తిరగవు; ఇది కూడా మీరు గమనించే ఉంటారు. అర్జునుడు దృష్టి పక్షి కంటి మీద నిలిచేదని విన్నాం కదా.. అలాగన్నమాట. సరిగ్గా విశ్వనాథన్ ఆనంద్ కూడా ఆట ఆడుతున్నప్పుడు- ఆయన దృష్టంతా పెద్ద లక్ష్యం మీద కేంద్రీకృతమై ఉంటుంది. ఆయన మనసు లోని ప్రశాంతత ఆ కళ్లలో ప్రతిఫలిస్తుంటుంది. ఎవరైనా చెప్పారని, లోపలి శాంతి బయటికి కనిపిస్తుందా అంటే చెప్పడం కష్టమే. కానీ, ప్రయత్నం చేయాలి. దీనిని నవ్వుతూ నవ్వుతూ ఎందుకు చేయలేం? మీరు నవ్వుతూ ఉండండి. పరీక్షలు రాసేటప్పుడు కూడా ఆడుతూ పాడుతూ, నవ్వుతూ ఉంటే శక్తి తనంతట తాను ప్రశాంతంగా వెలికి వస్తుంది. మీరు స్నేహితులతో మాట్లాడటం లేదు; లేదా, ఒంటరిగా నడుస్తున్నారు.. ఒక్కొక్క అడుగే వేస్తున్నారు; చివరి క్షణం వరకు అలాగే పుస్తకాలను, పేజీలను తిరగేస్తున్నారనుకోండి. అలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉండజాలదు. నవ్వండి.. బాగా నవ్వూతూ సాగండి. తోటి వారితో కలసి ఛలోక్తులు విసరుతూ సాగండి. అప్పుడు చూడండి – శాంతియుతమైన వాతావరణం దానంతట అదే వెలస్తుంది.

నేను మీకు ఒక చిన్న మాటను అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒక చెరువు ఒడ్డున నిలబడి ఉన్నారనుకోండి. కింద నీటిలో చాలా వస్తువులు కనపడతాయి. కానీ అకస్మాత్తుగా ఆ నీటిలో ఎవరైనా ఒక రాయిని రువ్వారనుకోండి.. నీరు కదలడం మొదలైపోతుంది. అంతకు ముందు ఏమీ లేనప్పుడు కనిపించినట్టుగా రాయి వేసిన తరువాత కనిపిస్తాయా? నీరు కుదురుగా ఉంటే, అందులో అడుగున వస్తువులు కూడా కనిపిస్తాయి. నీరు చెదరిపోతే, అందులోనివి ఏవీ కనపడవు. మీ లోపల కూడా అలా ఎంతో పడి ఉంది; ఏడాది పాటు పడిన శ్రమ తాలూకు భాండాగారం లోపల నిండిపోయి ఉంటుంది. కానీ మనస్సు అశాంతిగా ఉంటే, ఆ ఖజానాను మీరు వెతుక్కోలేరు. అదే.. మనసు ప్రశాంతంగా ఉందనుకోండి.. మీ మనసులోని ఆ ఖజానా వెలికి వచ్చి మీ ముందు నిలుస్తుంది. మీ పరీక్ష అమాంతం సరళంగా మారిపోతుంది.

నేను ఒక విషయాన్ని వెల్లడించనా.. అది నా స్వవిషయమే. నేను ఎప్పుడైనా ఏదైనా ఉపన్యాసం వినడానికి వెళ్తాను, లేదా ప్రభుత్వంలో కూడా కొన్ని విషయాలు నాకు తెలియనివి ఉండవచ్చు. అలాంటి వాటిపైన నేను ఎంతో దృష్టిని కేంద్రీకరించవలసి వస్తుంది. అప్పుడప్పుడు లోతైన పరిశీలన ద్వారా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాను. అటువంటప్పుడు మనసు లోపల ఒత్తిడి బయలుదేరుతుంది. మళ్లీ నాకనిపిస్తుంది.. లేదు లేదు.. కొద్దిగా సేద తీరుదామని; అలా చేస్తే – అప్పుడు బాగుంటుందనిపిస్తుంది. ఇందుకోసం నాలో నేనే ఒక పద్ధతిని రూపొందించుకున్నాను. బాగా దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటాను. మూడు సార్లు గాని, అయిదు సార్లు గాని- గట్టిగా ఊపిరిని పీల్చుకొని వదులుతాను. దీనికి 30, 40, 50 సెకండ్లు పడుతుంది. కానీ, ఒక్కసారిగా నా మనసు ప్రశాంతమై, విషయాలను అర్థం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇది నా అనుభవమే కావచ్చు; మీకు కూడా ఉపయోగపడేదే.

రజత్ అగర్వాల్ ఒక మంచి మాట చెప్పారు.. ఆయన నా App లో ఇలా రాశారు – మేము ప్రతి రోజు కనీసం అర గంట స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడి సేద తీరుతాం. పిచ్చాపాటి మాట్లాడతాం, గప్పాలు కొడతాం. రజత్ జీ చాలా గొప్ప మాట చెప్పారు. ఎందుకంటే చాలా వరకు మనం చూస్తాము.. పరీక్షలు రాసి ఇంటికి రాగానే, లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాం.. ఎన్ని సరిగ్గా రాశాము. ఎన్ని తప్పులు రాశాము.. అని. ఇంట్లో కూడా తల్లితండ్రులు చదువుకున్న వారైతే, వారు కూడా ఉపాధ్యాయులైతే.. నువ్వు పరీక్ష ఎలా రాశావు?, ఏమేం ప్రశ్నలు వచ్చాయి అంటూ మళ్లీ పరీక్షను పూర్తిగా రాయిస్తారు; లేదా, ఏం జవాబులు రాశావో చెప్పమంటారు. 40 మార్కులు వస్తాయా?, 80 మార్కులు వస్తాయా?, 90 మార్కులు వస్తాయా? అని అడుగుతారు. అప్పుడు మీ మెదడంతా వేడెక్కుతుంది. మీరైనా ఏం చేస్తారు.. ఫోన్లలో స్నేహితులతో ఈ విషయాలు మాట్లాడతారు. ‘అరె యార్! అందులో నువ్వు ఏమి రాశావు?. ఏయే ప్రశ్నలకు జవాబులు రాశావు, నీకేమనిపిస్తోంది’ అంటారు. మీ మిత్రులేమో – నేనంతా గందరగోళంలో పడిపోయాను. తప్పు చేశాననిపించింది; నాకు జవాబు తెలిసి కూడా, ఆ సమయానికి జ్ఞాపకం రాలేదు.. అంటారు. ఇట్లా, ఇందులోనే పడి కొట్టుకుంటాము. మిత్రులారా! మీరిలా చేయకండి. పరీక్ష సమయం ముగిసింది. అయిపోయిందేదో అయిపోయింది. కుటుంబ సభ్యులతో గప్పాలు కొట్టండి. పాత హాస్యపు ముచ్చట్లు మరో సారి చెప్పుకోండి. ఎప్పుడైనా అమ్మానాన్నలతో ఎక్కడికైనా వెళ్లి ఉంటే, అదుగో అప్పటి సంగతులను నెమరు వేసుకోండి. పూర్తిగా వాటి నుంచి బయటపడి అరగంట గడపండి. రజత్ జీ మాటలు నిజంగా అర్థం చేసుకోదగినవిగా ఉన్నాయి.

మిత్రులారా..!

నేను మీకు శాంతి గురించి ఓ మాట చెప్పనా? ఈ రోజు మీరు పరీక్ష రాయడానికి ముందు ఎటువంటి వ్యక్తి మీకొక సందేశం పంపారంటే.. ఆయన మౌలికంగా ఒక అధ్యాపకుడు; ఇప్పుడు ఒక రకమైన సంస్కార ప్రబోధకునిగా మారారు. రాంచరిత్ మానస్ ను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి, దాని గురించి వ్యాఖ్యానం చేస్తూ దేశం లోపలా, దేశం బయటా ప్రపంచం అంతటికీ ఆ సంస్కార ప్రవాహాన్ని చేరవేసే ప్రయత్నాలలో ఉన్నారు. అటువంటి పూజ్య మురారీ బాపూ సైతం విద్యార్థుల కోసం ఒక మహత్వపూర్ణమైన చిట్కాను పంపించారు. ఆయన ఒక బోధకుడు , ఆలోచనాపరుడు కూడా, అందుచేత ఆయన మాటల్లో రెండింటి సమ్మేళనం ఉంటుంది.

“నేను.. మురారీ బాపూను.. మాట్లాడుతున్నాను. విద్యార్థి సోదర సోదరీమణులకు నేను చెప్పదలచుకుంటున్నది ఏమిటంటే.. పరీక్షల సమయంలో మనసు మీద ఎటువంటి భారాన్నీపెట్టుకోకండి. స్పష్టమైన నిర్ణయాన్నితీసుకుని, మీరు పరీక్ష రాయడానికి కూర్చోండి. ఎటువంటి పరిస్థితి వచ్చినా, దానిని స్వీకరించండి. పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించినట్లయితే, మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. సంతోషంగా ఉండగలుగుతాము అనేది నా అనుభవం. మీ పరీక్షలో మీరు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత చిత్తంతో ముందుకు సాగినట్లయితే తప్పక సఫలులవుతారు. ఒకవేళ ఉత్తీర్ణత లభించకపోయినా, పరీక్ష తప్పామన్న దిగులు ఉండదు; సఫలమయ్యామని గర్వంగా కూడా ఉంటుంది. ఒక కవిత చెప్పి నేను నా సందేశాన్ని, శుభాకాంక్షలనూ అందజేస్తాను – అది
“ప్రతి ఒక్కరూ కృతకృత్యులే కావాలని నియమం ఏమీ లేదు;

వైఫల్యాలతో కూడా కలసి జీవించడం నేర్చుకోండి”.

గౌరవనీయులైన మన ప్రధాన మంత్రి గారి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం విలువైనదిగా భావిస్తున్నాను. అందరికీ మరీ మరీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు.

పూజ్య మురారీ బాపు మనందరికీ చాలా మంచి సందేశం ఇచ్చినందుకు ఆయనకు నేను కూడా కృతజ్ఞుడను.

మిత్రులారా..!

ఇవాళ నేను మరో మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక విషయం గమనిస్తున్నాను. ఈ సారి ప్రజలు తమ అనుభవాలను చెప్పినపుడు వాటిలో యోగా గురించిన ప్రస్తావన తప్పకుండా తీసుకువచ్చారు. ఈ రోజుల్లో ప్రపంచంలో నేను ఎవరిని కలసినా సరే, కొంచెం సమయం దొరికినా చాలు యోగా గురించి కొద్దిగా అయినా ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు; ఇది నాకు ఎంతో సంతోషం కలిగించే విషయం. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా కానివ్వండి; భారత్ కి చెందిన వ్యక్తే అయినా కానివ్వండి – యోగా గురించి ఇంతటి ఆకర్షణ ఏర్పడింది; ఇంతటి జిజ్ఞాస పుట్టుకువచ్చింది. ఇది నాకు చాలా బాగా అనిపిస్తోంది. నా మొబైల్ App నకు ఎంతో మంది – శ్రీ అతను మండల్, శ్రీ కుణాల్ గుప్తా, శ్రీ సుశాంత్ కుమార్, శ్రీ కె.జి. ఆనంద్, శ్రీ అభిజీత్ కులకర్ణి – ఇలా లెక్కలేనంత మంది మెడిటేషన్ గురించి ప్రస్తావించారు. యోగా ప్రాధాన్యం గురించి మాట్లాడారు. సరే, మిత్రులారా! నేను ఇప్పుడే ఇవాళే చెప్పాను అనుకోండి, రేపు పొద్దుటి నుంచి యోగా చేయడం మొదలు పెట్టండి అని – అది మీ పట్ల అన్యాయం చేయడమే అవుతుంది. కానీ, ఇప్పటికే యోగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పరీక్ష ఉంది, ఇవాళ చేయవద్దులే అనుకోవద్దు; అలా చేయవద్దు. చేస్తున్నారంటే.. చేయండి. కానీ, ఈ మాట మాత్రం నిజం. విద్యార్థి జీవితంలో కానివ్వండి, లేదా ఆ తదనంతర జీవితంలో కానివ్వండి.. మనో వికాస యాత్రలో యోగా ఒక మంచి పరిష్కారం. చాలా తేలికైన పరిష్కారం. మీరు తప్పక దానిపై దృష్టి సారించండి. ఆ.. మీ దగ్గర్లో ఎవరైనా యోగా తెలిసిన వారు ఉన్నట్లయితే వారిని అడగండి. అంతకు ముందు యోగా చేయకపోయినప్పటికీ పరీక్షల రోజుల్లో – రెండు, మూడు విషయాలు చెప్తారు, మీరు వాటిని రెండు నాలుగైదు నిమిషాల్లో చేయగలుగుతారు. చూడండి, వాటిని మీరు చేయగలరేమో. అవును, దాని మీద నాకు బాగా నమ్మకం ఉంది.

నా యువజన సహచరులారా! పరీక్ష హాలులోకి వెళ్ళాలని మీకు చాలా తొందరగా ఉంటుంది. త్వరత్వరగా మీ బల్ల మీద వెళ్ళి కూర్చోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ హడావుడిగా ఎందుకు చేస్తారు? మీ మొత్తం రోజులోని సమయానికి ప్రణాళిక ముందుగానే ఎందుకు సిద్ధం చేయరు..? అంటే ట్రాఫిక్ లో చిక్కుకుపోయినా సరే, సమయానికన్న ముందుగానే గమ్యాన్ని చేరగలిగేటట్లుగా ప్రణాళికను ఎందుకు వేసుకోరు. అలా వేసుకోలేదంటే గనక ఇటువంటి విషయాలు ఒక కొత్త ఒత్తిడిని సృష్టిస్తాయి. ఇంకొక మాట – మనకు ఎంత సమయం దొరికిందో ఆ సమయంలో ప్రశ్నపత్రం, సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సమయం వృథా అవుతుంది కదా- మన సమయాన్ని ఇవి మింగేస్తాయి కదా- ఇలాగని అప్పుడప్పడూ అనిపిస్తుంది. కానీ, అలాంటిదేమీ లేదు. మిత్రులారా! ఆ సూచనలను మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవండి. రెండు నిమిషాలు, మూడు నిమిషాలు, ఐదు నిమిషాలు పోతే పోతాయి. అంతే కదా! పెద్ద నష్టమేమీ జరగదు. కానీ దాని వల్ల పరీక్షలో ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ఎటువంటి అయోమయం ఉండదు, తరువాత పశ్చాత్తాపం కలగదు. ఇంకా, నేను చాలా సార్లు చూశాను.. పరీక్ష పేపరు వచ్చిన తరువాతనే పద్ధతి కొత్తగా ఉందనిపిస్తుంది. కానీ, సూచనలు చదివిన తరువాత బహుశా అందుకు తగినట్టుగా మనకు మనం సిద్ధమవుతాం. ఆ.. ఫర్వా లేదు; నేను ఇలాగే రాయాలి అని. మీకు నేను విన్నవిస్తున్నాను.. ఒక్క అయిదు నిమిషాలు ఇందులో పోతే పోనీయండి కానీ, ఇది మాత్రం తప్పక చేయండి.

శ్రీ యశ్ నాగర్ నా మొబైల్ App నకు ఇలా రాశారు – ఆయన మొదటి సారి ప్రశ్నపత్రాన్ని చదివినప్పుడు అది చాలా కష్టంగా ఉన్నట్టు అనిపించిందిట. కానీ, అదే పేపరును రెండో సారి ఆత్మ విశ్వాసంతో చదివితే ఇప్పుడు ఈ ప్రశ్నా పత్రమే నా దగ్గర ఉంది.. కొత్త ప్రశ్నలేవీ వచ్చేది లేదు. ఇన్ని ప్రశ్నలు మాత్రమే నేను రాయాలి అని. ఆయన ఏం రాశారంటే, రెండో సారి నేను ఆలోచించడం మొదలు పెడితే – నాకు ఎంతో తేలిగ్గా పేపరు అర్థమయింది అని. మొదటి సారి చదివినప్పుడు నాకు రాదు అని అనిపించింది. కానీ, అదే పేపరును రెండో మారు చదివితే – కాదు.. కాదు; అదే ప్రశ్నను వేరే పద్ధతిలో పెట్టారు, కానీ విషయం మాత్రం అదే, నాకు తెలిసినదే.. అని అర్థమైంది అని. అంటే ఇక్కడ ప్రశ్నలను గ్రహించడం అనేది చాలా ముఖ్యావవసరం. ప్రశ్న తీరును అర్థం చేసుకోకపోతే అప్పుడప్పుడు ప్రశ్న కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ప్రశ్నలను రెండు సార్లు చదవండి, మూడు సార్లు చదవండి, నాలుగు సార్లు చదవండి.. మీకు తెలిసిన దానితో దానిని సరిచూసుకునే ప్రయత్నం చేయండి – అని యశ్ నాగర్ చెప్పిన మాటలను నేను సమర్థిస్తున్నాను. మీరు చూడండి, దీనివల్ల రాయటానికి ముందే ప్రశ్న తేలికయిపోతుంది.

నాకు ఈ రోజు చాలా సంతోషం కలిగించే విషయం ఏమిటంటే – ‘భారత రత్న’ – మన ప్రముఖ శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావు – ధైర్యాన్ని గురించి నొక్కి చెప్పారు. అతి కొద్ది పదాలలోనే; కానీ మన విద్యార్థులందరికీ ఆయన మంచి సందేశాన్ని ఇచ్చారు. రండి – రావు గారి సందేశం విందాం…

“నేను.. బెంగళూరు నుంచి సి.ఎన్.ఆర్.రావు ను. పరీక్షలు ఉత్కంఠ కలిగిస్తాయని నేను పూర్తిగా అర్థం చేసుకుంటాను. అందునా పోటీ పరీక్షలు. ఆందోళన పడకండి, మీ శక్తి వంచన లేకుండా పని చేయండి. నా యువ మిత్రులందరికీ నేను చెప్పేది అదే. అదే సమయంలో, ఒక విషయం గుర్తు పెట్టుకోండి – ఈ దేశంలో చాలా అవకాశాలు ఉన్నాయి. జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి, ఎప్పటికీ పట్టు వీడకండి. మీరు గెలుస్తారు. మీరు ఈ విశ్వ మాత పిల్లలన్న సంగతి మరచిపోవద్దు. చెట్లూ – పర్వతాల మాదిరి గానే మీకు కూడా ఇక్కడ ఉండే హక్కు ఉంది. మీకు కావలసిందల్లా పట్టుదల, అంకిత భావం, సాధన. ఈ లక్షణాలతో మీరు అన్ని పరీక్షలలోనూ ఉత్తీర్ణులవుతారు. అన్ని ఇతర ప్రయత్నాలలో గెలుస్తారు. మీరు చేయాలనుకునే ప్రతి విషయంలో విజయం సాధించాలని ఆశిస్తున్నాను. దైవం మిమ్మల్ని ఆశీర్వదించుగాక.”

చూశారా, ఒక గొప్ప శాస్త్రవేత్త మాట్లాడే తీరు ఎలా ఉంటుందో! ఏ మాట చెప్పడానికి నేను అర గంట సమయం తీసుకుంటానో, ఆ మాటను వాళ్ళు మూడు నిమిషాల్లో చెప్పేస్తారు. ఇదే విజ్ఞాన శాస్త్రానికి ఉండే బలం. ఇదే శాస్త్రవేత్త మనసుకు ఉండే బలం. దేశంలోని పిల్లలకు స్ఫూర్తిని ఇచ్చినందుకు రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దృఢత్వం, నిష్ఠ, సాధన ల గురించి ఆయన చెప్పిన మాటలు ఇవే – అంకిత భావం, దృఢ నిశ్చయం, శ్రద్ధ – దృఢంగా ఉండండి మిత్రులారా! దృఢంగా ఉండండి. మీరు దృఢంగా ఉంటే భయం కూడా భయపడుతూ ఉంటుంది. ఇంకా, మంచి చేయడానికి బంగారు భవిష్యత్తు మీ కోసం ఎదురు చూస్తోంది.

ఇప్పుడు నా App పైన రుచిక డాబస్ నుంచి ఒక సందేశం – తన పరీక్షల అనుభవాన్ని రుచిక పంచుకున్నారు. పరీక్షల సమయంలో తన కుటుంబ సభ్యులు అందరూ ఒక సానుకూల వాతావరణం ఉండేలా నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటారనీ, ఇదే విధమైన కసరత్తు తమ తోటి కుటుంబాల్లో కూడా జరుగుతుందనీ చెప్పారు. మొత్తంమీద సానుకూలమైన వాతావరణం అన్న మాట. ఈ మాట సరైనదే. సచిన్ జీ కూడా చెప్పినట్టు.. సానుకూల ధోరణి, సానుకూల మనో దృక్పథం- ఇవి సానుకూల శక్తిని తయారు చేస్తాయి.

అప్పుడప్పుడు చాలా మాటలు ఎలా ఉంటాయంటే, మనకు ప్రేరణనిచ్చే బోలెడు మాటలు – విద్యార్థులకు మాత్రమే ప్రేరణనిస్తాయని అనుకోవద్దు. జీవితంలో ఎటువంటి దశలో మీరు ఉన్నప్పటికీ, ఒక మంచి ఉదాహరణ, నిజ జీవిత ఘట్టాలు.. ఇవి అధిక ప్రేరణనిస్తాయి; చాలా బలాన్ని కూడా ఇస్తాయి. క్లిష్ట సమయంలో నూతన మార్గాలను చూపుతాయి. మనందరం విద్యుత్తు బల్బు ను ఆవిష్కరించిన థామస్ ఎల్వా ఎడిసన్ ను గురించి మన పాఠాల్లో చదువుకుంటాం. కానీ మిత్రులారా, ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించారా.. ఈ పని చేయడానికి ఆయన ఎన్ని సంవత్సరాలు వెచ్చించారో. ఆయనకు ఎన్నిసార్లు వైఫల్యాలు ఎదురయ్యాయో! ఎంత సమయం పట్టిందో. ఎంత డబ్బు ఖర్చయిందో, వైఫల్యాలతో ఎంతగా నిరాశ చెంది వుండవచ్చో. కానీ, ఈ రోజు ఆ విద్యుత్తే, ఆ బల్బే.. మన జీవితాల్లో కూడా వెలుగులు నింపుతున్నాయి. అందుకే అంటారు.. వైఫల్యాల్లో కూడా విజయాలు దాగి ఉంటాయని.

శ్రీనివాస రామానుజన్ అంటే తెలియని వారు ఎవరు? ఆధునిక కాలంలో మహోన్నత గణిత శాస్త్రవేత్తలలో ఒక పేరున్న భారత గణిత శాస్త్రవేత్త ఆయన. మీకు తెలిసే ఉంటుంది, గణితంలో ఎటువంటి సంప్రదాయ విద్యను ఆయన అభ్యసించలేదు. ప్రత్యేక శిక్షణ అయినా తీసుకోలేదు. కానీ ఆయన గణిత విశ్లేషణ, సంఖ్యా సిద్ధాంతం వంటి విభిన్న రంగాలలో అమూల్యమైన సేవలు అందించారు. అత్యంత కష్టమైన జీవితాన్ని, దుఃఖ భరితమైన జీవితాన్ని గడిపినప్పటికీ ప్రపంచానికి ఆయన ఎంతో ఇచ్చి వెళ్ళారు.

విజయం అనేది ఎప్పుడైనా, ఎవరినైనా వరించవచ్చుననటానికి మంచి ఉదాహరణ జె.కె. రాలింగ్. హారీ పోటర్ సిరీస్ ఈనాడు ప్రపంచమంతటా మారుమోగుతోంది. కానీ మొదటి నుంచి ఇలా లేదు. ఆమె ఎన్నో సమస్యలకు ఎదురీదవలసి వచ్చిందని, ఎన్ని వైఫల్యాలో వచ్చాయని, ఇన్ని కష్టాల్లో కూడా తాను దైవంగా భావించే ఆ పనిలోనే తన శక్తినంతా ధారపోశానని రాలింగ్ స్వయంగా చెప్పారు.

పరీక్షలు ఈ మధ్య విద్యార్థులకు ఒక్కరికే కాదు, మొత్తం కుటుంబానికీ, పాఠశాలకూ, ఉపాధ్యాయులకూ.. అందరికీ పరీక్షలు అవుతాయి. కానీ, తల్లితండ్రులు, ఉపాధ్యాయుల మద్దతు లేకుండా ఒంటరి విద్యార్థి పరిస్థితి బావుండదు. టీచరో, తల్లిదండ్రులో, సీనియర్ విద్యార్థులో.. వీరంతా కలసి ఒక జట్టుగా ఏర్పడి, ఒకే విధంగా ఆలోచిస్తూ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తే, పరీక్ష సులువై పోతుంది.

శ్రీ కేశవ్ వైష్ణవ్ నాకు App లో రాశారు. ఆయన ఫిర్యాదు చేశారు. ఏమనంటే, ఎక్కువ మార్కుల కోసం తల్లితండ్రులు తమ పిల్లల మీద ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాకూడదని. పరీక్షలకు సిద్ధం కావటానికి మాత్రం ప్రోత్సహించాలి. వాళ్ళు విశ్రాంతిగా ఉండేలా చూడాలి.

పిల్లల మీద తమ ఆశల బరువును మోపవద్దని విజయ్ జిందల్ రాశారు. ఎంత వీలైతే అంతగా వారికి ధైర్యం చెప్పాలి. విశ్వాసం నిలుపుకొనేందుకు సహాయం చేయాలి. అది నిజమే. ఈ రోజు తల్లితండ్రులకు ఎక్కువగా చెప్పాలనుకోవడం లేదు. దయచేసి పిల్లలను ఒత్తిడిలో పడేయకండి. ఒకవేళ ఎవరైనా స్నేహితునితో మాట్లాడుతుంటే – వారించకండి. ఒక తేలికపాటి వాతావరణాన్ని – సకారాత్మక వాతావరణాన్ని నెలకొల్పండి. చూడండి.. మీ అబ్బాయి లేదా మీ అమ్మాయిలో ఎంత నమ్మకం వస్తుందో. మీకు కూడా ఆ విశ్వాసం కనిపిస్తుంది.

మిత్రులారా…!

ఒకటి మాత్రం తథ్యం. ముఖ్యంగా యువ మిత్రులతో చెప్పాలనుకుంటున్నాను. మన జీవితం మన పూర్వ తరాల కంటే ఎంతో మారిపోయింది. ప్రతి క్షణం కొత్త ఆవిష్కారం, కొత్త పరిజ్ఞానం, విజ్ఞానం నిత్య నూతన రూపాన్ని సంతరించుకుంటోంది. ఇంకా.. మనం కేవలం నిష్ఫలం అయిపోతున్నామనే భావన. కానీ, అది కాదు.. దానితో జత కలవటానికి మనం ఇష్టపడతాం. మనం కూడా విజ్ఞానం వేగాన్ని మించి, ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటాం.

నేనీమాట ఎందుకు చెప్తున్నానంటే, మిత్రులారా, ఈరోజు జాతీయ విజ్ఞాన దినోత్సవం. దేశ విజ్ఞాన మహోత్సవాన్ని ఏటా ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవంగా పాటిస్తాం. 1928 ఫిబ్రవరి 28 – సర్ సి.వి.రామన్ తన పరిశోధన – ‘రామన్ ఎఫెక్ట్’ను ప్రకటించారు. అదే పరిశోధనకు ఆయనకు నోబెల్ పురస్కారం లభించింది. అందుకే దేశం ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే రూపంలో జరుపుకొంటోంది. జిజ్ఞాస – విజ్ఞానానికి మాత. ప్రతి ఒక్కరి మనసులో వైజ్ఞానిక సంబంధమైన ఆలోచనలు ఉండాలి. విజ్ఞానం పట్ల ఆకర్షణ ఉండాలి. ప్రతి తరం ఆవిష్కారాల పైన దృష్టి పెట్టాలి. విజ్ఞానం, టెక్నాలజీ లేకుండా- ఆవిష్కారం సంభవం కాదు.

ఈ రోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా దేశంలో ఆవిష్కారాలకు బలం చేకూరింది. జ్ఞానం, విజ్ఞానం, సాంకేతికత, ఇవన్నీ మన వికాస యాత్రలో సహజంగా భాగం కావాలి. ఇంకా, ఈ సారి నేషనల్ సైన్స్ డే ఇతివృత్తం ‘మేక్ ఇన్ ఇండియా.. సైన్స్ – టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలు.’

సర్ సి.వి.రామన్ కు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుకోవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

మిత్రులారా..!

అప్పుడప్పుడూ విజయాలు చాలా ఆలస్యంగా వస్తాయి. విజయం ఎప్పుడైతే వరిస్తుందో – అప్పుడు ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా మారిపోతుంది. పరీక్షల్లో మీరు బహుశా తీరిక లేకుండా ఉండవచ్చు. అందుకే చాలా వార్తలు మీ మనసులో నమోదు కాకపోవచ్చు. కానీ ఈ మాటను నేను దేశ ప్రజలందరికీ మరో సారి చెప్పాలనుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితం విని ఉంటారు. విజ్ఞాన ప్రపంచంలో ఒక పెద్ద… ముఖ్యమైన పరిశోధన జరిగింది. ప్రపంచ శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారు. తరాలు వచ్చిపోయాయి. ఎంతో కొంత చేస్తూ పోయాయి. ఇంకా సుమారు వందేళ్ళ తరువాత ఒక విజయం చేతికందింది. గురుత్వాకర్షణ తరంగాలను (Gravitational Waves)మన శాస్త్రవేత్తలు తీవ్ర కృషితో గుర్తించారు. విజ్ఞాన రంగంలో ఇదొక సుదూర ప్రయాణం అనంతరం లభించిన ఫలితం. గత శతాబ్దికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ సిద్ధాంతాన్ని ఈ పరిశోధన ప్రామాణీకరించటంతో పాటు భౌతిక శాస్త్రంలో గొప్ప ఆవిష్కారంగా కూడా గుర్తింపు పొందింది. మానవ జాతి అంతటికీ, విశ్వమంతటికీ ప్రయోజనం చేకూర్చే అంశం ఇది. ఈ పరిశోధన ప్రక్రియలో మన దేశ ముద్దు బిడ్డలు, మన మేధావి శాస్త్రవేత్తలు కూడా పాల్గొనడం, వారికీ ఇందులో భాగస్వామ్యం ఉండటం భారతీయులుగా మనకందరికీ ఆనందదాయకం.

నేను ఆ శాస్త్రవేత్తలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియ జేయాలనుకుంటున్నాను; అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఈ పరిశోధనను ముందుకు తీసుకువెళ్ళడంలో మన శాస్త్రవేత్తలు కృషి ని కొనసాగిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే కృషిలో భారతదేశం కూడా భాగస్వామి అవుతుంది. నా దేశ వాసులారా! గతంలో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ పరిశోధనలో మరిన్ని సత్ఫలితాలు సాధించేందుకు లేజర్ ఇంటర్ ఫెరో మీటర్ గ్రావిటేషనల్- వేవ్ అబ్జర్వేటరీ.. సంక్షిప్తంగా చెప్పాలంటే.. ‘లిగో’ను భారతదేశంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ప్రపంచంలో రెండు చోట్ల మాత్రమే ఇలాంటి వ్యవస్థ ఉంది. భారతదేశం మూడోది. ఈ కృషిలో భారతదేశం కూడా పాలుపంచుకోవడంతో, కొత్త శక్తి వస్తుంది; కొత్త వేగం పుంజుకొంటుంది. తనకున్న సదుపాయాలతోనే మానవ వికాసానికి దోహదం చేసే ఈ మహోన్నత వైజ్ఞానిక పరిశోధనా ప్రక్రియలో మన దేశం సక్రియాత్మక భాగస్వామి అవుతుంది. నేను మరొక్క సారి శాస్త్రవేత్తలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ప్రియమైన నా దేశ వాసులారా…!

నేను మీకు ఒక నంబర్ ఇస్తున్నాను. రేపటి నుంచి ఆ నంబర్ కు మిస్ డ్ కాల్ ఇచ్చి ఆ నంబర్ నుంచి నా ‘మన్ కీ బాత్’ వినగలుగుతారు. మీ మాతృ భాషలో కూడా వినవచ్చు. మిస్ డ్ కాల్ ఇవ్వడానికి నంబర్ 81908 – 81908.

మరో సారి నంబర్ చెబుతున్నాను 81908 – 81908.

మిత్రులారా…!

మీ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. నేను కూడా రేపు పరీక్ష రాయాల్సి ఉంది. 125 కోట్ల మంది దేశ ప్రజలు నన్ను పరీక్షించనున్నారు. అదేమిటో తెలుసా.. రేపు బడ్జెట్ ఉంది. 29 ఫిబ్రవరి. ఇది లీప్ సంవత్సరం. అయితే మీరు చూశారు.. నా మాటలు వినగానే మీకు తెలుసుంటుంది నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, ఎంత ఆత్మ విశ్వాసంతో ఉన్నానో. సరే.. నా పరీక్ష పూర్తవుతుంది. ఎల్లుండి మీ పరీక్షలు మొదలవుతాయి. మనం అందరం ఉత్తీర్ణులమవుదాం. దాంతో, దేశం కూడా సఫలమవుతుంది.

మరి మిత్రులారా..!

మీకు కూడా ఎన్నెన్నో శుభాకాంక్షలు. బోలెడన్ని శుభాభినందనలు. సాఫల్య – వైఫల్యాల ఆందోళన నుంచి బయటపడి విముక్తమైన మనసులతో ముందుకు సాగండి; దృఢంగా సాగుతూనే ఉండండి.

ధన్యవాదములు.

*******