Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ  ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


భారత్ మాతా కీ జై ।

భారత్ మాతా కీ జై ।

భారత్ మాతా కీ జై ।

ప్రియమైన నా దేశ ప్రజలారా, నా కుటుంబ సభ్యులారా!

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన, దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను అంకితం చేసిన, దేశం కోసం జీవితాంతం పోరాడిన, ఉరికంబం పై కూడా జై భారతమాత అని నినదించిన అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకొనే ఆ శుభ ఘడియ ఈ రోజు. వారి పవిత్ర స్మృతులను స్మరించుకొనే పండుగ ఈ రోజు. ఆ సమరయోధుల త్యాగంతో మనకు లభించిన ఈ స్వేచ్చా వాయువులు జీవితాంతం మనం వారికి రుణ పడేలా చేశాయి. అలాంటి ప్రతి మహానుభావుడికి మన గౌరవాన్ని తెలియజేస్తున్నాం.

ప్రియమైన నా దేశ ప్రజలారా,

దేశ నిర్మాణం కోసం నిబద్ధతతో పూర్తి అంకితభావంతో మహానీయులు దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అది మన రైతులు కావచ్చు, సైనికులు కావచ్చు, స్ఫూర్తి నిండిన యువత కావచ్చు, మన తల్లులు, సోదరీమణుల సహకారం కావచ్చు; లేదా దళితులు కావచ్చు, బాధితులు కావచ్చు, దోపిడీకి గురైనవారు కావచ్చు, అణగారినవారు కావచ్చు; నేడు వారి దేశభక్తి, ప్రజాస్వామ్యంపై వారి విశ్వాసం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. అలాంటి వారందరికీ నేను ఎంతో గౌరవంతో నమస్కరిస్తున్నాను.

ప్రియమైన నా దేశప్రజలారా,

ఈ ఏడాదితో పాటు గత కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు మనల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలా మంది తమ కుటుంబాలను, ఆస్తిని కోల్పోయారు, దేశం కూడా అనేక సార్లు భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ రోజు వారందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో దేశం మీ అందరికి అండగా నిలుస్తుందని నేను వారికి మరో సారి భరోసా ఇస్తున్నాను.

ప్రియమైన నా దేశ ప్రజలారా,

స్వాతంత్య్రానికి పూర్వం నాటి రోజులను ఇప్పుడు గుర్తు చేసుకుందాం. వందల ఏళ్ల బానిసత్వంలో ప్రతి కాలమూ ఒక పోరాటమే. మన యువత అయినా, వయోజనులైనా, రైతులైనా, మహిళలైనా, గిరిజనులైనా బానిసత్వానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. 1857 స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే మన దేశంలో అనేక గిరిజన ప్రాంతాలలో స్వాతంత్య్ర పోరాటాలు జరిగాయనడానికి చరిత్రే నిదర్శనం.

మిత్రులారా,

స్వాతంత్య్రానికి పూర్వం 40 కోట్ల మంది దేశ ప్రజలు అపారమైన స్ఫూర్తిని, సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఒక స్వప్నం, ఒక సంకల్పంతో ముందుకు సాగి అవిశ్రాంతంగా పోరాడారు. “వందేమాతరం” అనే ఒకే ఒక స్వరం, “భారత స్వాతంత్య్రం”- అనే ఒకే ఒక స్వప్నం తో ముందుకు కదిలారు.  వారి రక్తం ఈ రోజు మన నరాల్లో ప్రవహిస్తున్నందుకు మనం గర్వపడదాం. వారు మన పూర్వీకులు. వారు కేవలం 40 కోట్లు మాత్రమే. కేవలం 40 కోట్ల మంది ప్రజలు ప్రపంచ శక్తిని కూలదోసి బానిసత్వ సంకెళ్లను విచ్ఛిన్నం చేశారు. మన పూర్వీకులు దీన్ని సాధించగలిగితే నేడు మనది 140 కోట్ల జనాభా ఉన్న దేశం. 40 కోట్ల మంది ప్రజలు బానిసత్వ సంకెళ్లను విచ్ఛిన్నం చేయగలిగితే, 40 కోట్ల మంది ప్రజలు స్వాతంత్య్రం  సాధించాలనే కలను సాకారం చేయగలిగితే, నా దేశంలోని 140 కోట్ల మంది పౌరులు, 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు ఒక సంకల్పంతో ముందుకు సాగి, ఒక దిశను నిర్ణయించుకుని, ఎన్ని సవాళ్లు ఎదురైనా చేయి చేయి కలిపి ముందుకు సాగాలి.  వనరుల కొరత లేదా పోరాటం ఎంత తీవ్రంగా ఉన్నా, ప్రతి సవాలును అధిగమించి, సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించవచ్చు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని చేరుకోగలం. 40 కోట్ల మంది దేశప్రజలు తమ కృషి, అంకితభావం, త్యాగం, బలిదానాలతో మనకు స్వాతంత్య్రం ఇవ్వగలిగితే, 140 కోట్ల మంది దేశప్రజలు కూడా అదే స్ఫూర్తితో సుసంపన్నమైన భారతాన్ని నిర్మించగలరు.

 

మిత్రులారా,

 

ఒకప్పుడు దేశం కోసం ప్రాణత్యాగానికైనా కట్టుబడి స్వాతంత్య్రం సాధించుకున్నాం. దేశం కోసం జీవించడానికి కట్టుబడి ఉండాల్సిన సమయం ఇది. దేశం కోసం చనిపోవాలనే నిబద్ధత మనకు స్వతంత్రాన్ని తీసుకురాగలిగితే, దేశం కోసం జీవించాలనే నిబద్ధత కూడా సుసంపన్నమైన భారతదేశాన్ని సృష్టించగలదు.

 

మిత్రులారా,

 

వికసిత్ భారత్ 2047 కేవలం ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదు. దీని వెనుక కఠోర శ్రమ ఉంది. దేశ వ్యాప్తంగా అనేక మంది నుంచి సూచనలు తీసుకుంటున్నాము. పౌరుల నుంచి సూచనలు తీసుకున్నాము. వికసిత్ భారత్ 2047 కోసం కోట్లాది మంది పౌరులు లెక్కలేనన్ని సూచనలు చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రతి పౌరుడి కల ఇందులో ప్రతిబింబిస్తుంది. ఇందులో ప్రతి పౌరుడి సంకల్పం స్పష్టంగా కనిపిస్తుంది. యువత, వృద్ధులు, గ్రామస్థులు, రైతులు, దళితులు, గిరిజనులు, పర్వతాలు, అడవులు, నగరాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ 2047 నాటికి, దేశం వందేళ్లు జరుపుకొనే నాటికి వికసిత్ భారత్ ను నిర్మించాలని విలువైన సూచనలు చేశారు.

 

ఈ సలహాలను చదివినందుకు నాకు చాలా సంతోషం కలిగింది.. వారు ఏమి రాశారు? దేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా చేయాలని కొందరు ప్రతిపాదించారు. వికసిత్ భారత్ 2047 కోసం, దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రం (గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్) గా మార్చాలని కొందరు సూచించారు. మన విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయికి చేరుకోవాలని కొందరు సూచించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా మన మీడియా ఎందుకు ప్రపంచవ్యాప్తం (గ్లోబల్) కాకూడదు అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. నైపుణ్యం కలిగిన మన యువత ప్రపంచానికి ప్రథమ ఎంపిక కావాలన్న విశ్వాసాన్ని మరికొందరు వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా జీవితంలోని ప్రతి అంశంలో దేశం స్వయం సమృద్ధిగా ఉండాలని కొందరు సూచించారు. శ్రీ అన్న అని మనం పిలుచుకునే మన రైతులు పండించిన ముతక ధాన్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంచానికి (డైనింగ్ టేబుల్ కు) చేరాలని చాలా మంది సూచించారు. ప్రపంచంలోని పోషకాహారాన్ని బలోపేతం చేయడంతో పాటు, దేశంలోని చిన్న రైతులకు మద్దతు ఇవ్వాలి. స్థానిక స్వపరిపాలనా సంస్థలతో సహా దేశంలోని వివిధ సంస్థల్లో పాలనా సంస్కరణల ఆవశ్యకతను పలువురు ఎత్తిచూపారు. న్యాయ సంస్కరణల ఆవశ్యకతతో పాటు న్యాయవ్యవస్థలో జాప్యంపై ఆందోళనలు కూడా తరచూ వ్యక్తమయ్యాయి. అనేక కొత్త నగరాలను నిర్మించాల్సిన అవసరం ఉందని చాలా మంది రాశారు. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగంలో సామర్థ్యాన్ని పెంపొందించే ప్రచారాన్ని ప్రారంభించాలని ఒక వ్యక్తి సూచించారు. మరికొందరు వీలైనంత త్వరగా భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని భావించారు. ప్రపంచం సంపూర్ణ ఆరోగ్య సంరక్షణను స్వీకరిస్తున్నందున భారతదేశం సంప్రదాయ వైద్యం, ఆరోగ్యానికి (శ్రేయస్సుకు) కేంద్రంగా అభివృద్ధి చెందాలని కొందరు ప్రధానంగా ప్రస్తావించారు. ప్రపంచం లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా భారత్ నిలవడం లో ఎటువంటి జాప్యం ఉండకూడదని మరొకరు అన్నారు.

 

మిత్రులారా,

 

నేను ఈ సూచనలను చదివాను ఎందుకంటే అవి నా తోటి పౌరులు అందించారు. ఇవి నా దేశంలోని సామాన్య పౌరుల సూచనలు. ఈ దేశ ప్రజలకు ఇంత పెద్ద ఆలోచనలు, గొప్ప కలలు ఉన్నప్పుడు, వారి సంకల్పం ఈ మాటలలో ప్రతిబింబించినప్పుడు, అది మనలో ఒక కొత్త సంకల్పాన్ని బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను. మన ఆత్మవిశ్వాసం కొత్త శిఖరాలకు చేరుకుంటుంది, ప్రజల ఈ విశ్వాసం కేవలం మేధోపరమైన చర్చ మాత్రమే కాదు; ఇది అనుభవాల నుంచి బయటపడింది. ఈ నమ్మకం దీర్ఘకాలిక కృషి ఫలితమే. అందువల్ల భారత్ లోని 18 వేల గ్రామాలకు నిర్దిష్ట కాలపరిమితిలో విద్యుత్ అందిస్తామని, ఆ హామీ నెరవేరుతుందని ఎర్రకోటపై నుంచి సామాన్యుడు  వినగానే వారిలో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ 2.5 కోట్ల కుటుంబాలు విద్యుత్తు లేకుండా అంధకారంలో మగ్గిపోతున్నాయని చెప్పగానే..  2.5 కోట్ల ఇళ్లకు విద్యుత్ అందితే సామాన్యుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం ‘స్వచ్ఛ భారత్’ గురించి మాట్లాడేటప్పుడు, సమాజంలోని సంపన్న వర్గాల నుండి గ్రామీణ కుటుంబాల వరకు, పేద కాలనీలలో నివసిస్తున్న ప్రజలు లేదా చిన్న పిల్లల వరకు, ఈ రోజు ప్రతి కుటుంబం పరిశుభ్రమైన వాతావరణాన్ని అలవాటుగా మార్చుకుంది, పరిశుభ్రతపై చర్చలను ప్రోత్సహిస్తోంది. పరిశుభ్రమైన అలవాట్లు, పర్యావరణం దిశగా సామాజిక మార్పు కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. ఇది దేశంలో వచ్చిన కొత్త చైతన్యానికి నిజమైన ప్రతీక అని నేను నమ్ముతున్నాను.

నేడు మూడు కోట్ల కుటుంబాలకు కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని ఎర్రకోటపై నుంచి ప్రకటించాం, మన కుటుంబాలన్నింటికీ  స్వచ్ఛమైన తాగునీరు అందడం చాలా అవసరం. జల్ జీవన్ మిషన్ ద్వారా 12 కోట్ల కుటుంబాలకు తక్కువ సమయంలో పరిశుభ్రమైన కుళాయి నీటి సరఫరా అందుతోంది. నేడు 15 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నాయి. మన ప్రజలలో ఎవరు ఈ సౌకర్యాలకు దూరమయ్యారు? ఎవరు మిగిలారు? సమాజంలోని అగ్రవర్ణాలకు ఇలాంటి సౌకర్యాల లేమి ఎదురుకాలేదు. దళితులు, అణగారిన వర్గాలు, దోపిడీకి గురైన వర్గాలు, గిరిజన సోదరసోదరీమణులు, మురికివాడలలో బందీలుగా నివసిస్తున్న ప్రజలు, వారికి కనీస అవసరాలు లేవు. ఇలాంటి అనేక ప్రాథమిక అవసరాలను తీర్చడానికి మేము ప్రయత్నాలు చేశాము. ఫలితాల ప్రయోజనాలు సమాజంలోని అందరికీ అందాయి.

 

వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని మేం ఇచ్చాం. ఈ రోజు ఆర్థికాభివృద్ధికి ఇదొక కొత్త మంత్రంగా   మారినందుకు సంతోషంగా ఉంది. ప్రతి జిల్లా ఇప్పుడు తమ ఉత్పత్తులను చూసి గర్వపడుతోంది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఇప్పుడు కొత్త తరంగం (వేవ్). వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఉత్పత్తిని ఎగుమతి చేసే దిశలో ప్రతి జిల్లా ఇప్పుడు ఆలోచించడం ప్రారంభించింది. పునరుత్పాదక ఇంధన సంకల్పాన్ని జిల్లాలు తీసుకున్నాయి. ఈ రంగంలో జీ-20 దేశాల కంటే భారత్ ఎక్కువ సాధించింది. ఇంధన రంగంలో స్వావలంబన సాధించడానికి, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది.

 

మిత్రులారా,

 

ప్రపంచం కూడా మన నుంచి నేర్చుకోవాలనుకుంటున్న ఫిన్ టెక్ లో సాధించిన విజయానికి మన దేశం ఎంతో గర్వపడుతోంది. ఇది మన సామర్థ్యాల గురించి మరింత గర్వపడేలా చేస్తుంది.

 

మిత్రులారా,

కరోనా మహమ్మారి సమయంలో మనం ఎదుర్కొన్న సంక్షోభాన్ని మనం ఎలా మరచిపోగలం? ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ (టీకా) కార్యక్రమం జరిగింది మన దేశంలోనే. ఇప్పుడు మన సైన్యం సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు యువత హృదయాలు గర్వంతో నిండిపోతాయి. వారి కారణంగానే 140 కోట్ల మంది దేశ ప్రజలు ఈ రోజు గర్వంగాను, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

మిత్రులారా,

ఈ అంశాలన్నింటిపై ఒక ఉద్దేశపూర్వక ప్రయత్నం జరిగింది. సంస్కరణల సంప్రదాయానికి మరింత ఊపు లభించింది. రాజకీయ నాయకత్వం సాధికారతను తీసుకురావాలని నిశ్చయించుకున్నప్పుడు, అభివృద్ధి పట్ల దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు, ప్రభుత్వ యంత్రాంగం కూడా పటిష్ఠమైన అమలుకు వీలు కల్పించడంతో పాటు నిర్ధారించడం ప్రారంభిస్తుంది. ఈ కలల ను సాకారం చేసే దిశ గా ప్రతి ఒక్క పౌరుడు క్రియాశీలకంగా పాలుపంచుకోవడం మొదలు పెట్టినప్పుడు ఆశించిన ఫలితాలను సాధించడం ఖాయం.

 

ప్రియమైన నా దేశప్రజలారా,

 

స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఒక దేశంగా మనం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయాన్ని మరచిపోకూడదు. ‘చల్తా హై’ (నడిచిపోతుంది లే) అనే మన వైఖరి, యథాతథ స్థితిని అంగీకరించడమే ఇందుకు కారణం. మార్పును అమలు చేయడంలో మనం విశ్వసించము లేదా పాల్గొనము. ప్రస్తుత స్థితిని సవాలు చేయం. కొత్తగా ఏమీ చేయం. అది మరిన్ని సమస్యలను సృష్టిస్తుందని అనుకోం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులతోనే జీవించాలన్న స్థితిగతుల వాతావరణం ఏర్పడింది. ప్రజలు ఏమీ జరగబోదని నమ్మేవారు. ఈ మనస్తత్వాన్ని విచ్ఛిన్నం చేయాల్సి వచ్చింది. మనలో ఆత్మవిశ్వాసం నింపాలి, ఆ దిశగా ప్రయత్నాలు చేశాం. చాలా మంది అంటుంటారు, “మనం ఇప్పుడు తరువాతి తరం కోసం ఎందుకు పనిచేయాలి? వర్తమానంపై దృష్టి పెడదాం. కానీ దేశంలోని సాధారణ పౌరులు అలా కోరుకోలేదు. వారు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు, వారు మార్పును కోరుకుంటున్నారు, వారు దాని కోసం ఆత్రుతగా ఉన్నారు. కానీ వారి కలలు, ఆశలు, ఆకాంక్షలకు ఎవరూ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఫలితంగా వారు కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. సంస్కరణల కోసం ఎదురు చూశారు. మాకు బాధ్యత అప్పగించారు, మేము గణనీయమైన సంస్కరణలను అమలు చేశాము. పేదలైనా, మధ్యతరగతి వారైనా, బడుగు, బలహీన వర్గాలైనా, పెరుగుతున్న పట్టణ జనాభా అయినా, యువత కలలు, తీర్మానాలు, వారి ఆకాంక్షలు అయినా వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి సంస్కరణల మార్గాన్ని ఎంచుకున్నాం. సంస్కరణల పట్ల మా నిబద్ధత కేవలం గులాబీ పత్రికల సంపాదకీయాలకే పరిమితం కాదని దేశ పౌరులకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. సంస్కరణల పట్ల మా నిబద్ధత నాలుగు రోజులు మాత్రమే కాదు. మా సంస్కరణల ప్రక్రియ బలవంతం వల్ల కాదు, దేశాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో నడుస్తుంది. అందువల్ల, ఈ రోజు, మన సంస్కరణల మార్గం వృద్ధికి బ్లూప్రింట్ గా మారిందని నేను చెప్పగలను. మన సంస్కరణలు, ఈ పెరుగుదల, మార్పు, ఇవి కేవలం చర్చా సంఘాలు, మేధో సమాజం లేదా నిపుణులకు సంబంధించిన అంశాలు కావు.

 

మిత్రులారా,

 

రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మేం అలా చేయలేదు. ఏం చేసినా రాజకీయ లాభనష్టాలను లెక్కపెట్టి ఆలోచించం. మా ఏకైక తీర్మానం- నేషన్ ఫస్ట్, నేషన్ ఫస్ట్, దేశ ప్రయోజనాలే పరమావధి. నా దేశం గొప్పగా మారాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నాం.

 

మిత్రులారా,

 

సంస్కరణల విషయానికి వస్తే సుదీర్ఘమైన కథ ఉంది, నేను దాని చర్చలోకి వెళితే గంటలు పట్టవచ్చు. కానీ నేను ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు- బ్యాంకింగ్ రంగం స్థితిగతుల గురించి ఆలోచించండి- అభివృద్ధి లేదు, విస్తరణ లేదు, విశ్వాసం లేదు. అంతే కాదు, జరుగుతున్న కార్యకలాపాలు మన బ్యాంకులను సంక్షోభంలోకి నెట్టాయి. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలు అమలు చేశాం. ఫలితంగా నేడు మన బ్యాంకులు ప్రపంచంలోని ఎంపిక చేసిన బలమైన బ్యాంకుల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాయి. బ్యాంకులు బలపడినప్పుడు, అధికారిక ఆర్థిక వ్యవస్థ శక్తి కూడా బలపడుతుంది. . ఒక బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పడినప్పుడు, సామాన్య పేదల అవసరాలను తీర్చడానికి, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల అవసరాలను తీర్చడానికి ఇది గొప్ప శక్తిగా మారుతుంది.

 

గృహ రుణం, వాహన రుణం, ట్రాక్టర్ కొనడానికి రైతుకు రుణం, అంకుర సంస్థలు ప్రారంభించడానికి  యువతకు రుణం, యువతకు విద్య కోసం రుణం లేదా విదేశాలకు వెళ్ళడానికి రుణం- ఇవన్నీ బ్యాంకుల ద్వారా సాధ్యమవుతాయి. నా పశుపోషక రైతులు, మత్స్య కారులైన  నా సోదర సోదరీమణులు కూడా ఈ రోజు బ్యాంకుల నుండి లబ్ధి పొందుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. లక్షలాది మంది వీధి వ్యాపారులు ఇప్పుడు బ్యాంకులతో అనుసంధానం కావడం, కొత్త శిఖరాలను అధిరోహించడం, అభివృద్ధి పథంలో భాగస్వాములు కావడం నాకు సంతోషాన్నిస్తోంది. మన ఎమ్ఎస్ఎమ్ఇ ల కు, మన చిన్న తరహా పరిశ్రమ లకు బ్యాంకులు అతి పెద్ద తోడ్పాటు ను అందిస్తున్నాయి. మరింత పురోగతి కోసం రోజువారీ ఖర్చుల కోసం వారికి డబ్బు అవసరం, ఇది మన బలమైన బ్యాంకుల కారణంగా నేడు సాధ్యమైంది.

 

మిత్రులారా,

 

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, దురదృష్టవశాత్తు “తల్లి-తండ్రి” సంస్కృతి వేళ్లూనుకుంది, ఇక్కడ ప్రజలు నిరంతరం ప్రభుత్వానికి విన్నవించవలసి వచ్చింది, ఉపకారాలు కోరవలసి వచ్చింది. సూచనలు లేదా సిఫార్సులపై ఆధారపడవలసి వచ్చింది. నేడు ఆ పాలనా నమూనాను మార్చాం. ఇప్పుడు ప్రభుత్వమే లబ్ధిదారులకు చేరువవుతోంది. ప్రభుత్వమే వారి ఇళ్లకు గ్యాస్ స్టవ్ లను పంపిణీ చేస్తుంది, వారి గృహాలకు నీటి సరఫరాను తీసుకువస్తుంది, విద్యుత్తును అందిస్తుంది, అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరేలా వారిని ప్రోత్సహించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది.

 

మిత్రులారా,

మా ప్రభుత్వం ప్రధాన సంస్కరణలకు కట్టుబడి ఉంది, ఈ ప్రయత్నాల ద్వారా, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.

మిత్రులారా,

 

దేశంలో కొత్త వ్యవస్థలు ఏర్పాటవుతున్నాయి. దేశ ప్రగతి కోసం అనేక ఆర్థిక విధానాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి, ఈ కొత్త వ్యవస్థలపై దేశ విశ్వాసం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 20-25 ఏళ్లు ఉన్నవారు, దశాబ్దం క్రితం 12-15 ఏళ్ల వయసున్న వారు తమ కళ్లముందే ఈ మార్పును చూశారు. కేవలం 10 సంవత్సరాలలో, వారి కలలు రూపుదిద్దుకున్నాయి, వేగం పుంజుకున్నాయి, వారి  ఆత్మవిశ్వాసంలో కొత్త చైతన్యం పుట్టుకొచ్చింది,, ఇది ఇప్పుడు దేశానికి తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. నేడు, దేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది,దేశం పట్ల ప్రపంచ వైఖరి మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన యువతకు అవకాశాల తలుపులు ఇప్పుడు తెరుచుకున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లుగా మనకు అందని లెక్కలేనన్ని కొత్త ఉద్యోగావకాశాలు ఇప్పుడు వారి ముంగిట ఉన్నాయి. అవకాశాలు పెరిగాయి, కొత్త అవకాశాలు సృష్టించబడుతున్నాయి. నా దేశ యువత ఇక నెమ్మదిగా ముందుకు సాగాలని కోరుకోవడం లేదు. బదులుగా, వారు ధైర్యంగా, సాహసోపేతమైన అడుగులు వేయడం ద్వారా కొత్త మైలురాళ్లను సాధించడానికి ఉత్సాహంగా ఉన్నారు. భారతదేశానికి ఇది స్వర్ణయుగం అని చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచ పరిస్థితులతో పోలిస్తే ఇది నిజంగా మన స్వర్ణయుగం.
ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకుని మన కలలు, తీర్మానాలతో ముందుకు సాగితే 2047 నాటికి స్వర్ణిమ్ భారత్ (స్వర్ణ భారత్) కోసం దేశ ఆకాంక్షలను నెరవేరుసస్తూ, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని సాధిస్తాము. శతాబ్దాల సంకెళ్ల నుంచి విముక్తి పొందాం