Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

17.7.2017 నాడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడాని కన్నా ముందు ప్రధాన మంత్రి వెలువరించిన ప్రకటన పాఠం


నేటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. వేసవి కాలం ముగిసిన తరువాత, తొలకరి జల్లులు నేలకు సరి కొత్త పరిమళాన్ని అద్దుతాయి. అలాగే, జిఎస్ టి విజయవంతంగా అమలైన అనంతరం వస్తున్న ఈ వర్షాకాల సమావేశాలు కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయి. దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమూ, రాజకీయ పక్షాలూ నిర్ణయాలు తీసుకొన్నప్పుడల్లా అది విశాల ప్రజానీకానికి మేలు చేయడం పట్ల వారికి ఉన్న నిబద్ధతను చాటుతుంది. జిఎస్ టి అమలు తో ఈ విషయం జయప్రదంగా నిరూపణ అయింది. అందరం కలసికట్టుగా ఎదగాలనే జిఎస్ టి చెబుతోంది. జిఎస్ టి స్ఫూర్తే ఈ సమావేశాల నిండా వ్యాపిస్తుందని నేను ఆశిస్తున్నాను. అనేక అంశాలపరంగా చూస్తే వర్షాకాల సమావేశాలు ఈ ముఖ్యమైన సమావేశాలుగా ఉండబోతున్నాయి. స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత 2017 ఆగస్టు 15వ తేదీ నాడు మన దేశం ఏడు దశాబ్దాలను పూర్తి చేసుకోనుంది. 2017 ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమం 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ సమావేశాల సందర్బంగా, దేశం నూతన రాష్ట్రపతిని మరియు ఉప రాష్ట్రపతిని ఎన్నుకొనే అవకాశాన్ని దక్కించుకొంటోంది. ఒక రకంగా, ఈ కాలం దేశానికి అనేక ముఖ్య సంఘటనలతో నిండివున్నదనాలి. కాబట్టి, ఈ సంవత్సరపు వర్షాకాల సమావేశాలపై ప్రజల దృష్టి కేంద్రీకృత‌ం కావడం సహజమే. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పురోగమించే క్రమంలో, తమ కఠిన ప్రయాసతో దేశానికి ఆహార భద్రతను అందిస్తున్న మన వ్యవసాయదారులకు మనం ప్రణమిల్లుదాము. దేశ విశాల హితాన్ని కోరి ప్రధానమైన నిర్ణయాలను తీసుకొనేటప్పుడు అత్యధిక స్థాయి నాణ్యతతో కూడినటువంటి సంభాషణలు, విలువైన సంభాషణలు జరిపేటందుకుగాను అన్ని రాజకీయ పక్షాలకు, ఎంపీలకు వర్షాకాల సమావేశాలు ఒక అవకాశాన్ని అందజేస్తాయని నాకు గట్టి నమ్మకముంది.

మీకు అనేకానేక ధన్యవాదాలు.