ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ మయన్మార్‌లో కలాదాన్ మల్టి మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టును సవరించిన అంచనా వ్యయం 2904.04 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు ఆమోద ముద్ర వేసింది. భారత ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు ప్రత్యామ్యాయ అనుసంధాన మార్గం ఏర్పడడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిలో ఈ ప్రాజెక్టు సహాయకారిగా ఉంటుంది. భారత, మయన్మార్ల మధ్య ఆర్థిక, వాణిజ్య, వ్యూహాత్మక బంధాలకు ఇది కీలకంగా నిలుస్తుంది.
నేపథ్యం
భారత తూర్పు తీరంలోని రేవుల నుంచి మయన్మార్‌కు సరకు రవాణా, ఈశాన్య రాష్ట్రాల నుంచి మయన్మార్ మీదుగా వస్తు రవాణా కోసం కలాదాన్ మల్టి మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టాలని భారత, మయన్మార్ గుర్తించాయి. ఈ ప్రాజెక్టు మయన్మార్‌లోని సిట్వె పోర్ట్‌ను భారత మయన్మార్ సరిహద్దుతో అనుసంధానం చేస్తుంది.ఈశాన్య భారతం నుంచి వివిధ రకాల ఉత్పత్తుల ఎగుమతికి సముద్ర మార్గాన్ని అందుబాటులోకి తెస్తుంది. దీని వల్ల సిలిగురి కారిడార్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ప్రత్యామ్నాయ మార్గం ఏదీ లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు భారత ఆర్థిక, వాణిజ్య, వ్యూహాత్మక బంధంతో పాటుగా మయన్మార్ అభివృద్ధికి, భారత్‌తో ఆర్థిక సమగ్రతకు ఇది సహాయకారిగా నిలుస్తుంది. దీనికి రాజకీయ, వ్యూహాత్మక ప్రాధాన్యత ఉండడంతో మయన్మార్‌కు గ్రాంట్ మంజూరు చేయడం ద్వారా దీన్ని అమలుపరుస్తారు.
2003 ఏప్రిల్‌లో పోర్టులు, అంతర్గత జలమార్గాల ద్వారా జలరవాణా వ్యవస్థ ఏర్పాటుకు, 2005 మార్చిలో రోడ్డు మార్గం ఏర్పాటుకు అధ్యయనం చేసిన రైల్వే శాఖ అనుబంధ సంస్థ రైట్స్ ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించింది. కలాదాన్ నది మీదుగా సిట్వె పోర్ట్ నుంచి కలెట్వాకు 225 కిలోమీటర్ల నిడివి గల జలమార్గం, తదుపరి దశలో భారత, మయన్మార్ల మధ్య 62 కిలోమీటర్ల నిడివి గల రోడ్డు మార్గాన్ని నిర్మించేందుకు రైట్స్ ప్రతిపాదనలు చేసింది. 2008 మార్చిలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 535.91 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారు.