Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్విస్ కన్ ఫెడరేశన్ ప్రెసిడెంట్ 2017 ఆగస్టు 31వ తేదీన భారతదేశ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రకటన పాఠం

స్విస్ కన్ ఫెడరేశన్ ప్రెసిడెంట్ 2017 ఆగస్టు 31వ తేదీన భారతదేశ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రకటన పాఠం


యువర్ ఎక్స్ లెన్సీ, మేడమ్ ప్రెసిడెంట్ మరియు మాననీయ అతిథులు,

ప్రసార సాధనాల సభ్యులారా,

భారతదేశంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మేడమ్ ప్రెసిడెంటు కు మరియు ఆమె ప్రతినిధి వర్గానికి నేను స్వాగతం పలుకుతుండటం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.

ఎక్స్ లెన్సీ,

మీకు భారతదేశం కొత్త ఏమీ కాదు; మీరు గతంలో అనేక పర్యాయాలు ఈ దేశాన్ని ఈసరికే పర్యటించివున్నారు. అయితే, మేము భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 70 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని వేడుకగా జరుపుకొంటున్న తరుణంలో ఒక ప్రెసిడెంట్ గా మీరు ఇక్కడకు విచ్చేయడం జరిగింది. ఇది ఇండో- స్విస్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్ షిప్ & ఎస్టాబ్లిష్ మెంట్ కు 70 సంవత్సరాలు పూర్తి అయిన సమయం కూడాను. 2016 లో మేము స్విట్జర్ ల్యాండ్ ను సందర్శించినప్పుడు అనుభూతి చెందినప్పటి ఆత్మీయతను మరియు ఆతిథ్యాన్నే.. మీరు సైతం ఈ పర్యటన వేళ అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాము.

ఇరు పక్షాలు అన్ని స్థాయిలలో ప్రగాఢమైన సంబంధాలను కొనసాగించాలని కుతూహలపడుతున్నాయని తెలిసి నేను ఆనందిస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు, మనం ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు ప్రపంచ అంశాలపై సమగ్రమైనటువంటి, ఇంకా అర్థవంతమైనటువంటి చర్చలు జరిపాము. మన మధ్య ఉన్నటువంటి బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఈ పర్యటన తో మరింత ముందుకు పోయాయి.

నిరాయుధీకరణ మరియు భౌగోళిక విస్తరణ వంటి అంశాలు స్విట్జర్ ల్యాండుకు, భారతదేశానికి రెండింటికీ అత్యంత ముఖ్యమైన అంశాలే. ఈ దృష్టికోణంలో నుండి చూసినప్పుడు, ఎమ్ టిసిఆర్ లో భారతదేశ ప్రవేశాన్ని స్విట్జర్ ల్యాండ్ సమర్ధిస్తున్నందుకు మేము ఎంతగానో కృత‌జ్ఞ‌ులమై ఉన్నాము.

మనం భారతీయ మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ల మధ్య వ్యాపారం, ఇంకా ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని గురించి కూడా చర్చించాము. ఈ ఒప్పందం తాలూకు నియమాల పైన చర్చ ఇప్పటికే మొదలైంది. ఇది చాలా ఆహ్వానించదగినటువంటి చర్య. ఈ ఒప్పందాన్ని పూర్తి చేసుకోవాలని ఉభయ పక్షాలు వాటి వచనబద్ధతను వ్యక్తం చేశాయి. ప్రస్తుతం, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత్వం అనే అంశం ప్రపంచంలో తీవ్ర ఆందోళనకరంగా పరిణమించింది. అది నల్లధనం కావచ్చు లేదా మలిన ధనం కావచ్చు, లేదా మనీ లాండరింగ్ కావచ్చు, లేదా ఆయుధాలు మరియు డ్రగ్స్ తో ముడిపడ్డ నిధులు కావచ్చు. ఈ ప్రపంచవ్యాప్త చేటుకు ఎదురొడ్డటానికి స్విట్జర్ ల్యాండ్ తో మా సహకారం కొనసాగుతూనే ఉంది.

గత సంవత్సరంలో, మనం పన్నుల సంబంధిత సమాచారాన్ని ఆటోమేటిక్ గా ఇచ్చి పుచ్చుకోవడం కోసం ఒక సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశాము. ఈ ఒప్పందంలో భాగంగా, సమాచారాన్ని స్విట్జర్ ల్యాండ్ లో అంతర్గత ప్రక్రియలు పూర్తి కావడంతోనే ఆటోమేటిక్ గా మాతో పంచుకోవడం జరుగుతుంది. మన ఆర్థిక సంబంధాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఒక కీలకమైన ప్రాతిపదికగా ఉంది. భారతదేశం మరీ ముఖ్యంగా స్విట్జర్ ల్యాండ్ ఇన్ వెస్టర్ లను స్వాగతిస్తుంది. ఈ సందర్భంలో, ఒక కొత్త ద్వైపాక్షిక పెట్టుబడి ఒడంబడిక యొక్క అవసరాన్ని గురించి చర్చలను కొనసాగించాలని మనం ఒక అంగీకారానికి వచ్చాము. భారతదేశ వృద్ధి లోనూ, అభివృద్ధి లోనూ ఒక భాగస్వామి కావడానికి స్విస్ కంపెనీలకు అనేక అవకాశాలు ఉన్నాయి.

ఈ రోజు, రెండు దేశాలకు చెందిన వ్యాపార రంగ నాయకులతో మేము జరిపిన చర్చల సందర్భంగా, పరస్పర ప్రయోజనం కోసం వ్యాపార వర్గాల సమన్వయాన్ని అదే పనిగా పెంచుకుంటూ పోవాలనే ఒక దృఢమైన వాంఛ వారిలో ఉందన్న విషయాన్ని మేము గ్రహించాము.

ఆరోగ్యాన్ని మరియు వెల్ నెస్ ను పెంచి పోషించడంలో భారతదేశ సంప్రదాయ ఔషధాలు ప్రధానంగా ఆయుర్వేదం ఒక ముఖ్యమైన పాత్రను పోషించగలదు. ఆయుర్వేదాన్ని స్విట్జర్ ల్యాండ్ గుర్తించినందుకు మరియు ఈ ముఖ్యమైన రంగంలో మరింత సహకారం కోసం ఆ దేశం ముందుకు వస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

వృత్తి విద్య మరియు నైపుణ్యాల రంగంలో స్విట్జర్ ల్యాండ్ నుండి ప్రయోజనాలు పొందడం కోసం స్కిల్ సానిక్స్ రూపంలో ఒక సంయుక్త కార్యక్రమాన్ని ఇరు దేశాలు చేపట్టాయి; అయిదు వేల మందికి పైగా భారతీయులు ఈ కార్యక్రమం నుండి లబ్ధిని పొందారు. ఈ నమూనాను విస్తరించడానికి తోడ్పడటం కోసం మేము సుముఖంగా ఉన్నాము.

మిత్రులారా,

జల వాయు పరివర్తన అనేది ప్రతి దేశం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలు. ప్యారిస్ ఒప్పందాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రాతిపదికన అమలుపరచవలసిన అవసరం ఉందని, అలాగే, దానిని అమలుపరచడం కోసం మార్గాలను కలిసికట్టుగా అభివృద్ధిపరచాలని మేము అంగీకారానికి వచ్చాము. భారతదేశంలో కాలుష్య రహిత శక్తి అవసరాలు పెరుగుతూ ఉండటంతో, ఆ అవసరాలను తీర్చడంలో భారతదేశానికి తోడ్పాటు లభించనుంది. ఇందుకోసం న్యూక్లియర్ సప్లయర్ గ్రూపు (ఎన్ఎస్ జి) లో భారతదేశం ఒక సభ్యత్వ దేశంగా చేరుతుంది. ఎన్ఎస్ జి సభ్యత్వాన్ని పొందడంలో మాకు నిరంతర మద్దతిస్తున్నందుకుగాను మీకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ వంటి కార్యక్రమాలు మరియు 2022 కల్లా 175 గీగా వాట్ ల నవీకరణయోగ్య శక్తిని ఉత్పత్తి చేయాలని పెట్టుకొన్న లక్ష్యాన్ని సాధించడం కోసం మేము చేస్తున్న ప్రయత్నాలు పరిశుభ్ర శక్తి కి మరియు హరిత భవిష్యత్తుకు భారతదేశం బద్ధురాలై ఉందన్న సంగతిని ప్రతిబింబిస్తున్నాయి.

ఎక్స్ లెన్సీ,

మీ ఈ పర్యటన మన సంబంధాలను ఒక కొత్త శిఖరానికి చేర్చడంలో తోడ్పడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఎంతో అర్థవంతమైన
చర్చ సాగించినందుకుగాను మేడమ్ ప్రెసిడెంటుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతే కాకుండా రానున్న మాసాలలో మీతో కలసి పనిచేయడం కోసం- మేడమ్ ప్రెసిడెంట్- నేను ఎదురుచూస్తున్నాను కూడా.

మీకు మరో సారి హృద‌యపూర్వక స్వాగతం పలుకుతూ, భారతదేశంలో మీ పర్యటన సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నాను.

మీకు అనేకానేక ధన్యవాదాలు.