Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శాంగ్రీ లా సంభాషణ లో ప్ర‌ధాన‌ మంత్రి చేసిన కీల‌క ప్రసంగం పాఠం


ప్ర‌ధాని శ్రీ లీ సియెన్ లూంగ్‌,

మీ స్నేహానికి, భార‌త‌దేశం-సింగ‌పూర్ భాగ‌స్వామ్యానికి మీరు వ‌హిస్తున్న నాయ‌క‌త్వానికి ధ‌న్య‌వాదాలు.  ఈ ప్రాంతం అంత‌టికీ ఉజ్జ్వల భ‌విష్య‌త్తు ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నాను.
ర‌క్ష‌ణ మంత్రులు శ్రీ జాన్ చిప్ మేన్‌,
ప్రముఖులు మరియు శ్రేష్ఠులారా,
న‌మ‌స్కారం; మీ అంద‌రికీ శుభ సాయంత్రం.

భార‌త‌దేశం సువ‌ర్ణ‌భూమిగా వ‌ర్థిల్లిన ప్రాచీన కాలం నుండి ఎంతో బాగా తెలిసిన ప్రాంతానికి తిరిగి వ‌చ్చినందుకు నాకు చాలా  ఆనందంగా ఉంది.

ఆసియాన్ సంబంధాలలో అత్యంత చ‌రిత్రాత్మ‌కమైందిగా నిల‌చే ప్ర‌త్యేక సంవ‌త్స‌రంలో ఇక్క‌డ‌కు రావ‌డం కూడా చాలా ఆనందం క‌లిగిస్తోంది.

గ‌త జ‌న‌వ‌రిలో గ‌ణ‌తంత్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌ది మంది ఆసియాన్ నాయ‌కుల‌కు ఆతిథ్యాన్ని ఇచ్చే ప్ర‌త్య‌క గౌర‌వం మాకు ద‌క్కింది.  ఆసియాన్ ప‌ట్ల మా వచనబద్ధతకు, మా యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి ఆసియాన్‌-భార‌తదేశం శిఖ‌రాగ్ర స‌ద‌స్సు నిద‌ర్శ‌నం.

వేలాది సంవ‌త్స‌రాల నుండి భార‌తీయులు తూర్పు ప్రాంతం ప‌ట్ల ఎంతో అనుబంధం క‌లిగివున్నారు.  సూర్యోద‌యం కోస‌మే కాకుండా ఆ వెలుగులు మొత్తం ప్ర‌పంచం అంత‌టా విస్త‌రించాల‌ని కోరుకుంటున్నారు.  ఈ 21వ శ‌తాబ్ది ఇండో-ప‌సిఫిక్ ప్రాంతం లోని ప‌రిణామాలు యావత్తు ప్ర‌పంచం అంత‌టినీ లోతుగా ప్ర‌భావితం చేసేవి కావ‌డం వ‌ల్ల మొత్తం ప్ర‌పంచం ఒక్క‌టిగా నిలబడే శ‌క్తి కోసం మాన‌వాళి అంతా ఎంతో ఆస‌క్తిగా ఉద‌యిస్తున్న తూర్పు వైపు కొత్త  ఆశ‌ల‌తో చూస్తూ ఉంటుంది.

ఈ కొత్త శ‌కం చ‌రిత్ర‌ లోని త‌ప్పిదాల‌ను స‌రిదిద్ది ప్ర‌పంచ రాజ‌కీయాల్లో మార్పున‌కు కార‌ణం అవుతుంది.  మ‌నంద‌రి సంఘ‌టిత ఆశ‌లు, ఆశ‌యాల‌తో ఈ ప్రాంతాన్ని మ‌నం తీర్చి దిద్ద‌బోతున్నందు వ‌ల్ల రాబోయే భ‌విష్య‌త్తు శాంగ్రీ లా ను విస్మ‌రించేదిగా ఉండ‌ద‌ని చెప్పేందుకే నేను ఇక్క‌డ ఉన్నాను.  ఒక్క సింగ‌పూర్ లో త‌ప్పితే ఈ ప్ర‌య‌త్నానికి స‌రిపోయే ప్ర‌దేశం మ‌రేదీ ఉండ‌దు.  సాగ‌రాల‌న్నీ తెరచి ఉండి, సాగ‌ర ప్రాంతం భ‌ద్రంగా ఉండి, దేశాల‌న్నీ అనుసంధానం అయి ఉండి, ఆయా దేశాల్లో చ‌ట్టాల‌కు గౌర‌వం ఉన్న‌ప్పుడు ఆ ప్రాంతం అంతా సుస్థిరంగా ఉంటుంద‌ని, దేశాలు చిన్న‌వైనా, పెద్ద‌వైనా నిర్భీతిగాను, స్వేచ్ఛ‌గాను ఉండాల‌న్న త‌మ ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా స‌ర్వ‌స‌త్తాక దేశాలుగా వ‌ర్ధిల్లుతాయ‌ని ఈ స‌మున్న‌త‌మైన దేశం మ‌న‌కు చాటిచెప్పింది.

ప్ర‌పంచం లోని అధికార కేంద్రాలలో ఏ ఒక్కరి వైపు మొగ్గ‌కుండా దేశాలు సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ప్పుడు అవి యావ‌త్తు ప్ర‌పంచం గౌర‌వాన్ని పొందుతాయ‌ని, అంత‌ర్జాతీయ అంశాల్లో వాటి మాట‌కు విలువ ఉంటుంద‌ని సింగ‌పూర్ మ‌నంద‌రికీ నిరూపించి చూపించింది. దేశంలో అంత‌ర్గ‌తంగా భిన్న‌త్వాన్ని గౌర‌వించిన‌ట్ట‌యితే అవి వెలుప‌లి ప్ర‌పంచం కూడా స‌మ్మిళితంగా  ఉండాల‌నే కోరుకుంటాయి.

భార‌దేశానికి సింగ‌పూర్ ఎంతో ప్ర‌ధాన‌మైంది. మృగ‌రాజు వంటి జాతిని, న‌గ‌రాన్ని క‌లిపి ఉంచే స్ఫూర్తి అది.  ఆసియాన్ ను క‌లిపి ఉంచే శ‌క్తిగా సింగ‌పూర్ ను మేము చూస్తాము.  భార‌త‌దేశం తూర్పు ప్రాంతంలో ప్ర‌వేశానికి అది ఒక ముఖద్వారంగా శ‌తాబ్దాలుగా నిలుస్తోంది.  2000 సంవ‌త్స‌రాల‌కు పైగా రుతుప‌వ‌న గాలులు, స‌ముద్ర శ‌క్తి, మాన‌వాళి ఆశ‌యాల శ‌క్తి అన్నీ క‌లిసి భార‌త‌దేశానికి, ఈ ప్రాంతానికి మ‌ధ్య కాలాతీత‌మైన అనుసంధానాన్ని ఏర్పాటు చేశాయి.  శాంతి-స్నేహ‌భావం, మ‌తం-సంస్కృతి, క‌ళ‌లు-వాణిజ్యం, భాష‌-సాహిత్యం అన్నింటిలోనూ ఇది ప్ర‌తిబింబిస్తుంది.  రాజ‌కీయ‌, వాణిజ్య అల‌లు ఎగుడుదిగుడులు చ‌వి చూసినా మాన‌వాళి మ‌ధ్య గ‌ల ఈ అనుసంధానం చిర‌కాల మ‌నుగ‌డను క‌లిగివుంది.

ఈ ప్రాంతంలో మ‌న బంధాన్ని, పాత్ర‌ను పున‌రుద్ధ‌రించుకునేందుకు ఆ గ‌త వైభ‌వాన్ని మ‌నం మూడు ద‌శాబ్దాలుగా తిరిగి ప్ర‌క‌టించుకుంటూనే ఉన్నాము. భార‌త‌దేశానికి ఎన్నో కార‌ణాలుగా ఈ ప్రాంత‌మే అన్నింటి క‌న్నా ప్ర‌ధాన‌మైంది.

వేదాల ముందు కాలం నుండి భార‌తీయ త‌త్వ చింత‌న‌లో స‌ముద్రాల‌కు అత్యంత కీల‌క స్థానం ఉంది.  వేలాది సంవ‌త్స‌రాల క్రిత‌మే సింధు నాగ‌రక‌త‌, భార‌త ద్వీప‌క‌ల్పం రెండింటికీ  స‌ముద్ర వాణిజ్య బంధం ఉంది.  ప్ర‌పంచం లోని అతి ప్రాచీన గ్రంథాలైన వేదాలలో సాగ‌రాల‌కు, నీటికి అధిదేవ‌త అయిన వ‌రుణునికి ఎంతో ప్రాధాన్యం ఉంది.  వేలాది సంవ‌త్స‌రాల క్రితం ప్రాచీన పురాణాల్లో కూడా భార‌త‌దేశానికి ఉత్త‌రోం య‌త్ స‌ముద్ర‌స్య- స‌ముద్ర ఉత్త‌ర ప్రాంత భూమి- అన్న ప్ర‌స్తావ‌న ఉంది.

నా స్వ‌రాష్ట్రం గుజ‌రాత్‌ లోని లోథల్ లో ప్ర‌పంచంలోని అతి ప్రాచీన‌మైన రేవుల్లో ఒక‌టి ఉంది.  నేటికీ అక్క‌డ ఓడ‌రేవు కు సంబంధించిన శిథిలాలు ద‌ర్శ‌నం ఇస్తాయి.  గుజ‌రాతీలు ఇప్ప‌టికీ పారిశ్రామిక ధోర‌ణులను క‌లిగివుండి ప్ర‌పంచంలో విస్తృతంగా ప్ర‌యాణిస్తూ ఉండ‌డం ఆశ్చ‌ర్యం ఏమీ కాదు.  భార‌తదేశ చ‌రిత్ర‌ను హిందూ మ‌హాస‌ముద్రం తీర్చి దిద్దింది.  ఇప్పుడు కూడా భార‌త‌దేశం భ‌విష్య‌త్తుకు అది ఎంతో ప్ర‌ధానం.  భార‌తదేశ వాణిజ్యంలో, ఇంధ‌న వ‌న‌రులలో 90 శాతం స‌ముద్రాల నుండే వ‌స్తుంది.  ప్ర‌పంచ వాణిజ్యానికి జీవ‌న రేఖ హిందూ మ‌హాస‌ముద్ర‌మే.  భిన్న సంస్కృతులు, శాంతి, సుస్థిర‌త‌లలో భిన్న స్థాయిలు గ‌ల దేశాల‌ను క‌లిపి ఉంచే శ‌క్తి అదే.  ఇప్ప‌టికీ ప్ర‌పంచం లోని ప్ర‌ధాన శ‌క్తుల నౌక‌లు ఆ స‌ముద్రం లోకి వ‌స్తూనే ఉంటాయి.  ఇది ఆ ప్రాంత స్థిర‌త్వానికి సంబంధించిన ఆందోళ‌న‌ల‌కు కార‌ణం కావ‌డం కూడా ప‌రిపాటి.

తూర్పున మ‌లక్కా జ‌ల‌సంధి, ద‌క్షిణ చైనా స‌ముద్రం భార‌త‌దేశాన్ని ప‌సిఫిక్ ప్రాంతానికి క‌లుపుతూ ఉంటాయి.  మా ప్ర‌ధాన భాగ‌స్వాములైన ఆసియాన్‌, జ‌పాన్‌, కొరియా రిప‌బ్లిక్, చైనా, అమెరికా లతో అనుసంధానానికి ఇదే కీల‌కం.  ఈ ప్రాంతంతో మా వాణిజ్యం త్వ‌రిత వృద్ధిని సాధిస్తోంది.  అలాగే మా విదేశీ పెట్టుబ‌డులలో అధిక శాతం ఈ ప్రాంతానికే వ‌స్తూ ఉంటాయి.  ఒక్క ఆసియాన్ కే 20 శాతానికి పైబ‌డిన వాటా ఉంది.

ఈ ప్రాంతంలో మా ప్ర‌యోజ‌నాలు విస్తృత‌మైన‌వి.  మా అనుబంధం లోతైంది. హిందూమ‌హాస‌ముద్ర ప్రాంతంలో మా బాంధ‌వ్యాలు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి.  మా మిత్ర‌ దేశాలు, భాగ‌స్వామ్య దేశాల స‌ముద్ర భ‌ద్ర‌త‌ను మెరుగుప‌రచేందుకు, ఆర్థిక సామ‌ర్థ్య నిర్మాణానికి కూడా మేం చేయూతను ఇస్తున్నాము. హిందూ మ‌హాస‌ముద్ర నావికా స‌మ్మేళ‌నాల ద్వారా మేము ఉమ్మ‌డి భ‌ద్ర‌త‌ను ప్రోత్స‌హిస్తున్నాము.

హిందూ మ‌హాస‌ముద్ర రిమ్ సంఘ‌ం ద్వారా ప్రాంతీయ స‌మ‌గ్ర కార్యాచరణను మేము ఆవిష్క‌రిస్తున్నాము.  అంత‌ర్జాతీయ ర‌వాణా మార్గాలు శాంతియుతంగాను, అంద‌రి ప్ర‌వేశానికి స్వేచ్ఛాయుతంగాను ఉండేలా చూడ‌డం కోసం హిందూ మ‌హాస‌ముద్రం వెలుప‌లి భాగ‌స్వాముల‌తో కూడా క‌లిసి మేము ప‌ని చేస్తున్నాము.

సాగ‌రం అంటే హిందీలో స‌ముద్రం.  ఆ ఒక్క ప‌ద‌మే మా భ‌విష్య‌త్ దృష్టికి దిక్సూచి అని మూడేళ్ల క్రితం నేను మారిష‌స్ లో వివ‌రించాను.  అన్ని ప్రాంతీయ దేశాల భ‌ద్ర‌త‌కు, వృద్ధికి సాగ‌రం ఆలంబ‌న‌గా నిలుస్తుంది.  తూర్పు ప్రాంతం వైపు మా చూపుల‌కు, ఇప్పుడు మా యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి కూడా స్ఫూర్తి.   ఈ ల‌క్ష్యంతోనే మా తూర్పు, ఈశాన్య ప్రాంత స‌ముద్ర‌తీర భాగ‌స్వాములు, భూభాగంతో అనుబంధం క‌లిగి వుండేందుకు భార‌త‌దేశం కృషి చేస్తోంది.

భూమి మీద‌, స‌ముద్రంలోనూ కూడా మా పొరుగు ప్రాంతం ఆగ్నేయాసియా. ప్ర‌తి ఒక్క ఆగ్నేయాసియా దేశంతోను రాజ‌కీయ‌, ఆర్థిక‌, ర‌క్ష‌ణ బంధాన్ని మేము పెంచుకొంటున్నాము.  ఆసియాన్ కు చ‌ర్చ‌ల భాగ‌స్వాములు కావ‌డం ద్వారా 25 సంవ‌త్స‌రాల‌కు పైగా మేము వారికి వ్యూహాత్మ‌క భాగ‌స్వాములుగా ఉన్నాము.  వార్షిక స‌ద‌స్సులు, 30 కి పైగా చ‌ర్చా వేదిక‌ల ద్వారా ఈ బంధాన్ని కొన‌సాగిస్తున్నాము.  అలాగే ప్రాంతీయ దేశాల‌తో భాగ‌స్వామ్య దార్శనికత, సౌక‌ర్యం, పురాత‌న బంధం ప్రాచుర్యం లోకి తేవ‌డం కూడా చేయ‌గ‌లుగుతున్నాము.

ఆసియాన్ నాయ‌క‌త్వం లోని తూర్పు ఆసియా శిఖ‌రాగ్రం, ఎడిఎంఎం ప్ల‌స్‌, ఎఆర్ఎఫ్ వంటి భిన్న వేదిక‌లలో మేము చురుకైన భాగ‌స్వాములుగా ఉన్నాము. బిమ్స్ టెక్ లోను, ద‌క్షిణ ప్రాంతాన్ని, ఆగ్నేయాసియాను అనుసంధానం చేసే వార‌ధి మెకాంగ్ గంగా ఎక‌నామిక్ కారిడోర్ లోను మేము భాగ‌స్వాములుగా ఉన్నాం.

ఆర్థికం నుండి వ్యూహాత్మ‌కం వ‌ర‌కు జ‌పాన్ తో మా బంధంలో పూర్తిగా మార్పులు చోటు చేసుకొన్నాయి.  భార‌త యాక్ట్ ఈస్ట్ పాలిసీ లో కీల‌కమైన పునాదిరాయిగా చెప్ప‌గ‌ల తీరులో ఆ భాగ‌స్వామ్యం విస్త‌రించింది.  కొరియా రిప‌బ్లిక్ తో మా స‌హ‌కారం మ‌రింత వేగంగా పెరుగుతోంది.  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల‌తో మా భాగ‌స్వామ్యంలో స‌రికొత్త శ‌క్తి చోటు చేసుకుంది.

ప‌లువురు భాగ‌స్వాముల‌తో మేము మూడు క‌న్నా ఎక్కువ ర‌కాల బంధాన్ని క‌లిగివున్నాము.  మూడు సంవ‌త్స‌రాల క‌న్నా ముందు నేను ఒక రోజు సాయం వేళ‌లో ఫిజీలో దిగాను.  ప‌సిఫిక్ ద్వీప‌క‌ల్ప‌దేశంతో మా బంధంలో కొత్త శ‌కాన్ని అది ఆవిష్క‌రించింది.  ఇండియా ప‌సిఫిక్ ద్వీప‌క‌ల్ప దేశాల స‌హ‌కార సంఘ‌ట‌న లేదా ఫిపిక్ ( FIPIC ) ద్వారా ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాలను, కార్యాచ‌ర‌ణను విస్త‌రించుకొని భౌగోళిక దూరాన్ని కూడా మేము త‌గ్గించుకున్నాము.

తూర్పు, ఆగ్నేయాసియా కు వెలుప‌ల భాగ‌స్వామ్యాల‌ను కూడా మేము విస్త‌రించుకుంటూ శ‌క్తివంతం చేసుకుంటున్నాము.  ర‌ష్యా తో మాకు గ‌ల వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ప్ర‌త్యేక‌మైందిగా, గ‌ర్వ‌కార‌ణ‌మైందిగా ప‌రిణ‌తి చెందింది.  మా వ్యూహాత్మ‌క స్వ‌తంత్ర ప్రతిప‌త్తికి ఇది ఒక తార్కాణం.

ప్ర‌స్తుత కాలంలో మ‌నం ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌ను దీటుగా ప‌రిష్క‌రించాలంటే శ‌క్తివంత‌మైన బ‌హుళ ధ్రువ ప్ర‌పంచం రావ‌ల‌సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని ప‌ది రోజుల క్రితం సోచి లో జ‌రిగిన శిఖ‌రాగ్ర స‌మావేశంలో నేను, అధ్యక్షుల వారు శ్రీ పుతిన్ ఉమ్మ‌డి అభిప్రాయాన్ని ప్ర‌కటించాం.  అలాగే అమెరికా తో మా వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం చారిత్ర‌క ఆలోచ‌న‌ల‌నే హ‌ద్దుల‌ను చెరిపివేసి మ‌రింత విస్తార‌మైంది, అసాధార‌ణ‌మైందిగా మారుతూ వ‌స్తోంది.  మారుతున్న ప్ర‌పంచంలో అది స‌రికొత్త ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది.  బాహిరం, సుస్థిరం, సుర‌క్షితం, సుసంప‌న్నం అయిన ఇండో- ప‌సిఫిక్ ప్రాంతం ఆవిష్కారం కావాల‌న్న ఉమ్మ‌డి ఆకాంక్ష మా భాగ‌స్వామ్యానికి మూల‌స్తంభంగా ఉంది.  ఏ ఇత‌ర భాగ‌స్వామ్యంలోను లేని విధంగా ప‌లు అంచెలుగా చైనాతో మా అనుబంధం విస్త‌రించింది.  మావి  ప్ర‌పంచంలోనే అధిక జ‌న‌సంఖ్య గ‌ల దేశాలు.  త్వ‌రిత‌ గ‌తిన విస్త‌రిస్తున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు. మా స‌హ‌కారం విస్త‌రిస్తోంది.  వాణిజ్యం పెరుగుతోంది.  స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో మేం ప‌రిణ‌తి, ఆచ‌ర‌ణీయ‌త ప్ర‌ద‌ర్శిస్తూ శాంతియుత స‌రిహ‌ద్దుల‌కు భ‌రోసా ఇస్తున్నాము.

ఏప్రిల్ లో అధ్యక్షుల వారు శ్రీ శీ జిన్ పింగ్ తో జ‌రిగిన రెండు రోజుల శిఖ‌రాగ్ర స‌ద‌స్సు లో మా అవ‌గాహ‌న మ‌రింత బ‌ల‌ప‌డింది.  అంత‌ర్జాతీయ శాంతి, పురోగ‌తి రెండింటికీ మా ఉభ‌య దేశాల మ‌ధ్య శ‌క్తివంత‌మైన‌, స్థిర బంధం అత్యంత కీల‌కం అని మేము అవ‌గాహ‌న‌కు వ‌చ్చాము.  భార‌త‌దేశం,చైనా లు న‌మ్మ‌కంతో, ఒక‌రి ప్ర‌యోజ‌నాల‌పై మ‌రొక‌రికి చ‌క్క‌ని అవ‌గాహ‌న‌తో సాగితే ఆసియా ప్రాంతం, ప్ర‌పంచం కూడా మెరుగైన భ‌విష్య‌త్తు క‌లిగి  ఉంటాయ‌ని నేను ప్ర‌గాఢంగా న‌మ్ముతున్నాను.

ఇండియా-ఆఫ్రికా ఫోర‌మ్ సమిట్స్ ల వంటి యంత్రాంగం ద్వారా ఆఫ్రికా తో మా బంధం విస్త‌రిస్తోంది.  చారిత్ర‌కమైన సౌక‌ర్యం, ప‌ర‌స్ప‌ర గౌర‌వం ప్రాతిప‌దిక‌గా, ఆఫ్రికా అవ‌స‌రాల ఆధారిత‌ స‌హ‌కారం మా బంధానికి అత్యంత కీల‌కం.

మిత్రులారా,

ఇక మ‌న ప్రాంతానికి వ‌ద్దాము.  ప్రాంతీయ దేశాల‌తో భార‌త ఆర్థిక‌, ర‌క్ష‌ణ స‌హ‌కారం మ‌రింత లోతుగా పాతుకుంటోంది.  ప్ర‌పంచంలోని ఏ ఇత‌ర ప్రాంతం క‌న్నా ఎక్కువ‌గా ఈ ప్రాంత దేశాల‌తో మేం వాణిజ్య అంగీకారాలు క‌లిగి ఉన్నాము.  సింగ‌పూర్, జ‌పాన్, ద‌క్షిణ కొరియా ల‌తో మేం స‌మ‌గ్ర ఆర్థిక భాగ‌స్వామ్య ఒప్పందాలను కూడా ఏర్పాటు చేసుకున్నాము.

ఆసియాన్‌ తో, థాయ్ లాండ్ తో మాకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి.  రీజనల్ కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్ట్ నర్ శిప్ అగ్రిమెంట్ ను పూర్తి చేసుకునే దిశ‌గా మేము చురుకుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాము.  భార‌త‌దేశానికి 90 సముద్రపు మైళ్లు దూరంగా కాకుండా 90 సముద్రపు మైళ్ల స‌మీపంలో ఉన్న ఇండోనేశియా లో నేను ఇప్పుడే తొలి ప‌ర్య‌ట‌న ను ముగించుకొన్నాను.

స‌మ‌గ్ర వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని సాధించే దిశ‌గా నా మిత్రుడు శ్రీ విడోడో, నేను భార‌తదేశం, ఇండోనేశియా సంబంధాల‌ను మ‌రింత పెంచుకున్నాము.  ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలో స‌ముద్ర జ‌లాల స‌హ‌కారం ఉండాల‌ని కూడా మేం ఉమ్మ‌డి భావ‌న క‌లిగి ఉన్నాం.  ఇండోనేశియా నుండి తిరిగి వ‌స్తూ నేను ఆసియాన్ సీనియ‌ర్ నాయ‌కుల్లో ఒక‌రైన ప్ర‌ధాని శ్రీ మ‌హ‌తిర్ ను క‌లిసేందుకు కొద్ది స‌మ‌యం పాటు మ‌లేశియా లో కూడా ఆగాను.

మిత్రులారా,

ఇండో- పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతల నిమిత్తమే కాక మానవతావాద సహాయాన్ని, విపత్తు సహాయాన్ని అందించడం కోసం మా సాయుధ బలగాలు.. ప్రత్యేకించి నావికాదళం భాగస్వామ్యాలను నెలకొల్పుకుంటోంది.  ఆ మేరకు శిక్షణ, కసరత్తు లతో పాటు సౌహార్ద కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతంలో నిర్వహిస్తోంది.  ఉదాహరణకు సింగ‌పూర్‌ తో సంయుక్తంగా మేం నిరంతరాయ నావికాదళ విన్యాసాలు నిర్వహిస్తుండగా నేడు ఈ భాగస్వామ్యం 25వ సంవత్సరంలో కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో సింగ‌పూర్‌తో కలసి కొత్త త్రైపాక్షిక కసరత్తులను కూడా త్వరలో ప్రారంభించనున్నాం.  అంతేకాకుండా దీనిని ఇతర ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్)కు కూడా విస్తరించగలమన్న ఆశాభావంతో ఉన్నాము.  పరస్పర సామర్థ్యాల నిర్మాణం కోసం వియత్ నామ్ వంటి భాగస్వాముల తో కలసి కృషి చేస్తాం.  అమెరికా, జపాన్ లతో సంయుక్తంగా భారతదేశం ప్రస్తుతం మలబార్ కసరత్తులను నిర్వహిస్తోంది.  ఈ మేరకు హిందూ మహాసముద్రంలో ‘మిలన్’ పేరిట భారతదేశం నిర్వహించే విన్యాసాలలో, ‘రిమ్‌ప్యాక్‌’ పేరుతో పసిఫిక్ సముద్రం లో నిర్వహించే కసరత్తు లలో అనేక ప్రాంతీయ భాగస్వామ్య దేశాలు కూడా పాలుపంచుకుంటున్నాయి.

ఆసియా ఖండపు నౌకల దోపిడీ, సముద్ర చౌర్యం నిరోధంపై ఇదే నగరంలో రూపొందిన ప్రాంతీయ సహకార ఒప్పందం అమలులో మేమెంతో చురుగ్గా ఉన్నాం.  ఇక ప్రేక్షకుల లోని విశిష్ట సభ్యులారా, ఇక స్వదేశం విషయానికి వస్తే..  2022 లో స్వాతంత్ర్య భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకొనే సరికి ఒక న్యూ ఇండియా నిర్మాణం లక్ష్యంగా దేశ పరివర్తన కోసం ఉద్యమ స్ఫూర్తి తో ముందుకు పోతున్నాం.  ఇందులో భాగంగా 7.5 శాతం నుండి 8 శాతం వార్షిక వృద్ధిని కొనసాగిస్తాము.  మా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే కొద్దీ మా అంతర్జాతీయ, ప్రాంతీయ ఏకీకరణ శాతం కూడా పెరుగుతుంది.  భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో మాత్రమే కాక అంతర్జాతీయ భాగస్వామ్యం లోతు మీద తమ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని 800 మిలియన్ యువత తో నిండిన మా దేశానికి బాగా తెలుసు.  ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ ప్రాంతంతో మా సంబంధాలు, ఇక్కడ మా ఉనికి మరింత లోతుకు పాతుకుపోగలవు.  అయితే, మేం కోరుకుంటున్న భవిష్యత్ నిర్మాణానికి సుస్థిర శాంతి పునాది ఎంతో అవసరం.  కానీ, అందుకు కచ్చితమైన హామీ ఇంకా లభించవలసివుంది.

అంతర్జాతీయంగా అధికార బదిలీ తో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ స్వరూపంలో మార్పులు, సాంకేతిక విజ్ఞానం కూడా దినదిన అభివృద్ధి చెందుతోంది.  అంతర్జాతీయ క్రమం పునాదులు కూడా కదలిపోతూ భవిష్యత్తు పై అనిశ్చితి నెలకొంటోంది.  మన ప్రగతి ని గురించి ఆలోచిస్తే.. అనిశ్చితి, అంతు లేని ప్రశ్నలు- అపరిష్కృత వివాదాలు; ఘర్షణలు-వాదనలు; సంఘర్షణాత్మక దృక్పథాలు, స్పర్థాత్మక నమూనాల అంచున కాలం వెళ్లదీస్తున్నాము.  వృద్ధి చెందుతున్న పరస్పర అభద్రత, పెరుగుతున్న సైనిక వ్యయం; అంతర్గత అలజడులు విదేశీ ఉద్రిక్తతలుగా పరిణమించడం, అంతర్జాతీయ వాణిజ్యం- ఉమ్మడి అంశాలకు సంబంధించిన పోటీ లో కొత్త కొత్త పొరపొచ్చాలు తదితరాలను మనం చూస్తూనే ఉన్నాము.  అన్నింటినీ మించి అంతర్జాతీయ నిబంధనలను పాటించడం కన్నా బల ప్రయోగానికి తలపడుతున్న పరిస్థితిని చూస్తున్నాము.  వీటన్నింటి నడుమ ఉగ్రవాదం, తీవ్రవాదాల బెదిరింపు సహా మన అందరినీ వేధిస్తున్న సవాళ్లు అనేకం ఉన్నాయి.  మొత్తంమీద ఇది విజయాలు- వైఫల్యాలు పరస్పర ఆధారితాలైన ప్రపంచం.  కాబట్టి ఏ దేశమూ తనంతట తాను సురక్షితం కాజాలదన్నది వాస్తవం.  విభేదాలకు, స్పర్థలకు అతీతంగా కలసికట్టుగా కృషి చేయాలని ఈ ప్రపంచం మనకు ప్రబోధిస్తోంది.  కానీ అది సాధ్యమేనా ?

కచ్చితంగా సాధ్యమే. ఇందుకు ఆసియాన్ ఒక ఉదాహరణ.  స్ఫూర్తి.  ప్రపంచం లోని ఏ కూటమి లోనూ లేని సంస్కృతి, మతం, భాష, పాలన, సౌభాగ్యాల పరమైన వైవిధ్యం ఈ కూటమి లో అత్యంత గొప్ప స్థాయిలో ఉంటుంది.  ఒకనాడు ఆగ్నేయ ఆసియా ప్రాంతం అంతర్జాతీయ పోటీ కి అగ్ర భూమిగా, ఘోర యుద్ధాలకు వేదికగా అనిశ్చిత దేశాలకు ఆలవాలంగా ఉన్న సమయంలో ఆసియాన్ ఆవిర్భవించింది.  అయినప్పటికీ నేడు ఒక ఉమ్మడి లక్ష్యం దిశగా పది దేశాలను ఇది ఒక్కటిగా చేసింది.  అందుకే ఈ ప్రాంత సుస్థిర భవిష్యత్తు కోసం ఆసియాన్ ఐక్యత అవశ్యం.  కాబట్టి మనలో ప్రతి ఒక్కరం దానికి మద్దతు ఇవ్వాలి.  దానిని ఎన్నడూ బలహీనపరచరాదు.  నాలుగు తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలకు నేను హాజరయ్యాను.  ఈ నేపథ్యంలో మరింత విస్తృత ప్రాంతాన్ని ఆసియాన్ ఏకీకృతం చేయగలదన్న విశ్వాసం నాకు కలిగింది.  ఈ ప్రక్రియలో ఆసియాన్ అనేక విధాలుగా ఇప్పటికే ముందుండి నడిపిస్తోంది.  ఈ కృషిలో భాగంగా అది ఇండో- పసిఫిక్ ప్రాంతానికి పునాది వేసిందని చెప్పాలి.  ఈ భౌగోళికత కూర్పు లో అంతర్భాగంగా మారిన తూర్పు ఆసియా కూటమి, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాలను ఆసియాన్ కృషి లో ప్రాధాన్యం గల వినూత్న చర్యలుగా పరిగణించాలి.

మిత్రులారా,

ఇండో-పసిఫిక్ ఓ ప్రకృతి సహజ ప్రాంతం.  ఇది విస్తృత శ్రేణి అంతర్జాతీయ అవకాశాల, సవాళ్ల సమాహారం.  ఈ ప్రాంతంలో నివసించే మనందరి భవిష్యత్తు గమ్యాలు పరస్పరం ముడివడి వున్నాయన్న భావన నాలో రోజురోజుకు బలపడుతోందని నేను విశ్వసిస్తున్నాను.  కాబట్టే ఇవాళ మన విభేదాలకు, స్పర్థలకు అతీతంగా మనమంతా కలసికట్టుగా కృషి చేద్దామన్న పిలుపునకు దారితీసింది.  ఆగ్నేయాసియా లోని పది దేశాలు రెండు మహా సముద్రాలను భౌగోళికంగానే కాక నాగరకత ల పరంగా కలుపుతున్నాయి.  కాబట్టి సార్వజనీనత, నిష్కాపట్యంలతో పాటు ఆసియాన్ కూటమి కేంద్ర స్థానం, ఐక్యతలు సరికొత్త ఇండో-పసిఫిక్ ప్రాంతానికి గుండెకాయ వంటివి.  అయితే, ఇండో- పసిఫిక్ ప్రాంతాన్ని ఒక వ్యూహం గానో లేదా పరిమిత సభ్యులు ఉన్నటువంటి సంఘం గానో లేక ఆధిపత్యం చలాయించే బృందం గానో భారతదేశం భావించదు.  అంతేకాదు ఏదైనా దేశానికి వ్యతిరేకంగా మోహరించబడిన కూటమి గానో, ఓ భౌగోళిక నిర్వచనం గానో ఎంతమాత్రం పరిగణించదు.  కనుక ఇండో- పసిఫిక్ ప్రాంతం అన్నది భారతదేశం దృష్టిలో అనేక ప్రాధాన్యాలు కలిగిన ఓ సానుకూల అంశం.  అవి ఏమిటంటే..

ఒకటి,

స్వేచ్ఛాయుతమైన, నిష్కాపట్యం కలిగిన, సార్వజనీన ప్రాంతానికి ఇదొక ప్రతీక.  ప్రగతి, సౌభాగ్యాల ఉమ్మడి లక్ష్యం ప్రాతిపదికన ఇది మన అందరినీ ఒక్కటి చేస్తుంది.  ఈ భౌగోళిక ప్రాంతం లోని అన్ని భాగస్వామ్య దేశాలతో పాటు దీనితో పాలుపంచుకోని ఇతర ప్రాంతాలూ ఇందులో అంతర్భాగమే.

రెండు,

ఆగ్నేయాసియా ఆసియాన్ కేంద్ర స్థానమైతే… ఆసియాన్ స్వీయ భవిష్యత్తు కు తానే కేంద్ర స్థానం.  భారతదేశాన్ని నడిపించే దృక్పథం ఇదే.. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతల మేలు కలయిక కు మేము సహకారాన్ని అభిలషిస్తుండడం దీనికి నిదర్శనం.

మూడు,

మన ఉమ్మడి సౌభాగ్యం, భద్రతల దిశగా ఈ ప్రాంతం కోసం సార్వత్రిక నిబంధనల ఆధారిత వ్యవస్థను చర్చల ద్వారా రూపొందించుకోవడం అవసరమని మేము విశ్వసిస్తున్నాము.  అది విడివిడిగా, అంతర్జాతీయంగా అన్ని దేశాలకూ సమానంగా శిరోధార్యం కావాలి.  అది సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించేదిగా ఉండాలి.  అంతేకాక పరిమాణంతో, బలంతో నిమిత్తం లేకుండా అన్నిదేశాల సమానతకు ప్రాధాన్యం ఇచ్చేదిగా ఉండాలి.  ఏవో కొద్ది శక్తిమంతమైన దేశాల బలం ఆధారంగా కాక అన్ని దేశాల సమ్మతి తో నియమ నిబంధనలు రూపొందాలి.  చర్చలపై నమ్మకం ప్రాతిపదిక గా తయారు కావాలి తప్ప బలం మీద ఆధారపడి రూపొందరాదు.  అంటే.. అంతర్జాతీయ ఒడంబడికలకు ఆమోదం ప్రకటించిన దేశాలు కచ్చితంగా వాటికి కట్టుబడి వుండాలి.  బహు పాక్షికత, ప్రాంతీయతా వాదం, చట్ట నిబద్ధతలపై భారతదేశం విశ్వాసానికి ఇదే పునాది.

నాలుగు,

అంతర్జాతీయ చట్టాలలో భాగంగా సముద్రతలంలో, గగన తలంలో ఉమ్మడి ప్రదేశాలను వినియోగించుకొనే హక్కు మన అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి.  స్వేచ్ఛా యానానికి, ఆటంకాలు ఉండని వాణిజ్యానికి, అంతర్జాతీయ చట్టాల పరిధిలో వివాదాల పరిష్కారానికి ఇది ఎంతో అవసరం.  ఆ నియమావళికి కట్టుబడేందుకు మనం అందరమూ అంగీకరిస్తే మన సముద్ర మార్గాలు సౌభాగ్యానికి బాటలుగా, శాంతి పథాలుగా విలసిల్లుతాయి.  సముద్ర నేరాల నిరోధం, సముద్ర జీవ సంరక్షణ, విపత్తుల నుండి రక్షణ సహా నీలి ఆర్థిక వ్యవస్థ తో సౌభాగ్యం దిశగా మనం అంతా ఏకం కావడం సాధ్యపడుతుంది.

ఐదు,

ప్రపంచీకరణతో ఈ ప్రాంతంతో పాటు మనం అందరమూ లబ్ధి ని పొందాము.  భారతీయ ఆహారమే ఇందుకు ప్రబల నిదర్శనం!  అయితే, వస్తువులు, సేవల విషయంలో స్వీయ రక్షణాత్మక ధోరణి పెరుగుతోంది.  మనమంతా మార్పు ను ఆహ్వానిస్తే తప్ప ఈ స్వీయ రక్షణాత్మక అడ్డుగోడ మాటున పరిష్కారాలను కనుగొనలేం.  మనం అంతా కోరుతోంది సమాన అవకాశాల క్షేత్రం.  అందుకే సుస్థిర, దాపరిక రహిత అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ ను భారతదేశం డిమాండ్ చేస్తోంది.  ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారితమైన, నిష్కాపట్యయుతమైన, సమతూకంతో కూడిన, సుస్థిరమైన వాణిజ్య వాతావరణం ఏర్పడాలన్న డిమాండుకూ మేము మద్దతునిస్తాము.  తద్వారానే అన్ని దేశాలూ వాణిజ్య, పెట్టుబడుల కడలి కెరటపు పోటును అధిగమించడం సాధ్యం.  రీజనల్ కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్ట్ నర్ శిప్ (ఆర్ సి ఇపి). ఆర్ సిఇపి నుండి మేము ఆశిస్తున్నది ఇదే.  కాబట్టి దీని పేరులో ఉన్న విధంగా, ఇది ప్రకటిస్తున్న సూత్రాలకు అనుగుణంగా ఈ భాగస్వామ్యం సర్వ సమగ్రం కావాలి.  తదనుగుణంగా వాణిజ్యంలో, పెట్టుబడులలో, సేవలలో సమతూకం అవశ్యం.

ఆరు,

అనుసంధానం చాలా కీలకం.  వాణిజ్యం, సౌభాగ్యం వృద్ధి ని మించిన ప్రగతి కి ఇది ఎంతగానో దోహదపడుతుంది.  ఒక ప్రాంతం మొత్తాన్నీ ఇది ఏకం చేయగలుగుతుంది.  కొన్ని శతాబ్దాలుగా కూడలి లో ఉన్న భారతదేశానికి అనుసంధానం లోని సానుకూల అంశాలు ఏమిటో చాలా చక్కగా తెలుసును.  పైగా ఈ ప్రాంతంలో అనుసంధానం దిశగా చాలా ప్రయత్నాలే చోటుచేసుకున్నాయి.  ఇవి అన్నీ విజయవంతం కావాలంటే మనం మౌలిక సదుపాయాలను మాత్రమే కల్పిస్తే చాలదు.  పరస్పర విశ్వాస సేతువులను కూడా నిర్మించుకోవాలి.  అందుకే సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, సంప్రదింపులు, సుపరిపాలన, పారదర్శకత, ఆచరణీయత, సుస్థిరతలకు గౌరవం ఇస్తూ ఈ చర్యలన్నీ సాగాలి.  అదే సమయంలో సదరు చర్యలన్నీ కోలుకోలేని రుణభారం మోపేవి కాకుండా ఆయా దేశాలకు సాధికారితను కల్పించేవిగా ఉండాలి.  అలాగే వ్యూహాత్మక స్పర్థకు గాక వాణిజ్యాన్ని ప్రోత్సహించేవిగా సాగాలి.  ఈ సూత్రాలకు అనుగుణంగానే ప్రతి ఒక్కరితో కలసి కృషి చేసేందుకు మేము సిద్ధం అయ్యాము.  దక్షిణాసియాలో జపాన్ సహా హిందూ మహాసముద్ర పరిధి లోని ఆగ్నేయ ఆసియా దేశాలతో, ఆఫ్రికాతో పాటు పశ్చిమ ఆసియా దేశాలతో సంయుక్త భాగస్వామ్యం తోనే కాకుండా స్వయంగా కూడా భారతదేశం తన వంతు పాత్రను పోషిస్తోంది.  న్యూ డివెలప్ మెంట్ బ్యాంకు, ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంకులలో మేం ప్రాధాన్య భాగస్వాములుగా ఉన్నాము.

ఆఖరుగా..

నేను ఇంతకు ముందు చెప్పినట్లు అగ్ర శక్తుల మధ్య శత్రుత్వాల యుగం లోకి మనం తిరోగమించని పక్షంలోనే ఇవన్నీ సాధ్యం.  వైరుధ్యాల ఆసియా మనల్ని వెనక్కు నెడుతుంది- సహకారాత్మక ఆసియా నవ శతాబ్ది కి రూపుదిద్దుతుంది.  కాబట్టి… తన ప్రాథమ్యాలు మరింత ఐక్య ప్రపంచానికి దోహదపడుతున్నాయా ?, లేక కొత్త వైరుధ్యాలకు దారితీస్తున్నాయా ? అని ప్రతి దేశం తనను తాను ప్రశ్నించుకోవాలి.  ఇది ప్రస్తుత, వర్ధమాన శక్తులన్నింటిపై గల బాధ్యత.  స్పర్థ సహజం.. కానీ, అది వైరుధ్యంగా పరిణమించకూడదు.  విభేదాలు కాస్తా వివాదాలయ్యే అవకాశం ఇవ్వరాదు.  కాబట్టి విశిష్ట ప్రేక్షక సభ్యులారా.. ఉమ్మడి విలువలు, ప్రయోజనాలు ప్రాతిపదికగా భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం సాధారణం.  ఈ ప్రాంతంలోనేగాక ఇతరత్రా కూడా భారత దేశానికీ ఇలాంటివి చాలానే ఉన్నాయి.  వాటన్నిటితోనూ మనం ముందడుగు వేద్దాం.  వ్యష్టిగా లేదా మూడు లేదా అంతకు మించి సమష్టి రూపాలలో సుస్థిరమైన, శాంతియుతమైన ప్రాంతంగా రూపొందడం కోసం కృషి చేద్దాము.  అయితే, మన స్నేహ బంధాలు ప్రతిబంధక కూటములు కారాదు.  మనం అందరమూ సూత్రాలు, విలువలు, శాంతి, ప్రగతి తదితరాలతో కూడిన మార్గాన్నే ఎంచుకుందాం తప్ప విభేదం, విడిపోవడం వైపు వెళ్లరాదు.  మన స్థానం ఏమిటో మన స్నేహ బంధాలే ప్రపంచానికి చాటిచెప్తాయి.

మనమంతా కలసికట్టుగా ముందుకు సాగితే వర్తమాన వాస్తవ సవాళ్లను దీటుగా ఎదుర్కొనగలం.  మన భూగోళాన్ని రక్షించుకోగలుగుతాము.. నిరాయుధీకరణ లక్ష్యాన్ని సాధించగలము.  ఉగ్రవాదం, సైబర్ దాడుల బెదిరింపు బారి నుండి మన ప్రజలను కాపాడుకోగలుగుతాము.  చివరగా మరొక్క సారి ఈ విషయం చెప్పనివ్వండి:  ఇండో- పసిఫిక్ ప్రాంతం సహా ఆఫ్రికా నుండి అమెరికా తీరాల దాకా భారతదేశం పాత్ర సార్వజనీనం.  ఏకత్వం ప్రతి ఒక్కరికీ అవశ్యం అన్న వేదాంత విజ్ఞానానికి మేము వారసులము.  ‘సత్యం ఒక్కటే.. దానిని మహా జ్ఞానులు భిన్న రీతులలో నిర్వచిస్తారు’.. ఆ విధంగా భిన్నత్వంలో ఏకత్వం మాకు సొంతం.  బహుళత్వం, సహజీవనం, నిష్కాపట్యం, చర్చలతో కూడిన మా నాగరక ఆచార వ్యవహారాలకు పునాది ఇది.  మమ్మల్ని ఒక జాతిగా నిర్వచించే ప్రజాస్వామ్య ఆదర్శాలు ప్రపంచంతో మేము ఎలా మెలగాలో  నిర్దేశిస్తాయి.  కాబట్టి, హిందీ లో చెప్పాలంటే ‘సమ్మాన్’ (గౌరవం), ‘సంవాద్’ (చర్చలు), ‘సహయోగ్’ (సహకారం), ‘శాంతి’, ‘సమృద్ధి’ (సౌభాగ్యం) గా దీన్ని అభివర్ణించవచ్చును.  ఈ పదాలను అభ్యసించడం, ఆచరించడం సులభం.  కాబట్టే అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా కట్టుబడుతూ గౌరవప్రదంగా, చర్చల ద్వారా ప్రపంచ శాంతి సాధన లో మేము నిమగ్నం అవుతాము.

ప్రజాస్వామిక, నిబంధనలపై ఆధారపడ్డ అంతర్జాతీయ క్రమాన్ని మేము ప్రోత్సహిస్తాము.  అందులో చిన్న,పెద్ద దేశాలు అన్నీ సమానంగా, సార్వభౌమత్వంతో పురోగమిస్తాయి.  మా సముద్ర, అంతరిక్ష, గగన తలాలను స్వేచ్ఛకు, స్వాతంత్ర్యానికి ప్రతీకలుగా ఉంచడం కోసం మేము ఇతరులతో కలసి పనిచేయడానికి సిద్ధం.  మన దేశాలన్నీ ఉగ్రవాదం నుండి, సైబర్ దాడి బెదిరింపు నుండి, విచ్ఛిన్నం నుండి, వైరుధ్యాల నుండి సురక్షితం కావడం కోసం కృషి చేస్తాము.  మా ఆర్థిక వ్యవస్థ తలుపులు ఎప్పటికీ అందరికీ తెరచే ఉంటాయి.  మా ఆర్థిక వ్యవస్థను అందరికీ అందుబాటులో ఉంచుతాము.  మా సంభాషణలలో పారదర్శతను కొనసాగిస్తాము.  మా సహజ వనరులను, విపణులను, సౌభాగ్యాన్ని మిత్రదేశాలతో, భాగస్వామ్య దేశాలతో పంచుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాము.  ఫ్రాన్స్ సహా ఇతర భాగస్వామ్య దేశాలతో కలసి అంతర్జాతీయ సౌర కూటమి ద్వారా మన భూగోళానికి సుస్థిర భవిష్యత్తును భారతదేశం అభిలషిస్తోంది.  ఈ విస్తృత ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలలోనూ ఇదే స్ఫూర్తితో మనం, మన భాగస్వాములు ముందుకు సాగాలని మేము ఆకాంక్షిస్తున్నాము.  ఈ ప్రాంతం లోని పురాతన జ్ఞాన దీపికే మనందరి ఉమ్మడి వారసత్వం.  బుద్ధ భగవానుడు ప్రబోధించిన శాంతి, కరుణల సందేశంతో మనమంతా సంధానించబడి వున్నాము. మనం అందరమూ ఉమ్మడిగా మానవాళి నాగరకత వికాసానికి ఎంతగానో దోహదపడ్డాము.  యుద్ధ విధ్వంసాన్ని చవిచూడటమే గాక శాంతి కిరణాల ప్రకాశాన్నీ మనం చూశాం.  శక్తికి గల పరిమితులు ఏమిటో కూడా చూసేశాము.  సహకార ఫలాల రుచి ని తెలుసుకున్నాము.  ఈ ప్రపంచం ఇప్పుడో నాలుగు రహదారుల కూడలి లో ఉంది.  చరిత్ర నేర్పిన ఘోర పాఠాలతో రేగిన ఉద్రిక్తతలు ఉన్నాయి.  అయితే, అందులోనే జ్ఞాన మార్గం కూడా ఉంది.  అది మనల్ని మరింత ఉన్నత లక్ష్యం దిశగా ప్రేరేపించి.. స్వీయ ప్రయోజనాల సంకుచిత దృక్పథాన్ని అధిగమించేందుకు తోడ్పడుతుంది.  అలాగే అన్ని దేశాల శ్రేయస్సు ను కోరుతూ మనం అందరమూ సమానమే అనే భావనతో కలసికట్టుగా ముందుకు సాగితే ప్రతి ఒక్కరికీ మరింత మెరుగైన ప్రయోజనాలు  సిద్ధిస్తాయని గుర్తించేందుకు తోడ్పడుతుంది.  ఆ మేరకు మనం అందరమూ ఈ దిశగా పయనిద్దామని కోరేందుకే ఇక్కడకు నేను వచ్చాను.

ధన్యవాదాలు..

మీకు అందరికీ అనేక ధన్యవాదాలు.

***