కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అమిత్ షా, చండీగఢ్ పరిపాలకుడు శ్రీ గులాబ్ చంద్ కటారియా జీ, పార్లమెంటులోని రాజ్యసభలో నా తోటి సభ్యుడు సత్నామ్ సింగ్ సంధూ జీ, సభకు హాజరైన ఇతర ప్రముఖులు, మహిళలు, సజ్జనులారా,
చండీగఢ్‌కు రావడమంటే అది నా సొంత ప్రజల మధ్యకు వచ్చినట్లు అనిపిస్తుంది. చండీగఢ్ గుర్తింపు శక్తి స్వరూపిణి చండీదేవి మాతతో జతపడి ఉంది. చండీ మాత సత్యానికి, న్యాయానికి ప్రతీక. ఇదే భావన భారతీయ న్యాయ సంహితకు, భారతీయ నాగరిక్ సురక్ష సంహితకు పునాదిగా ఉంది. దేశ ప్రజలు ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని తీసుకొని ముందుకు సాగిపోతున్న కాలంలో, మన రాజ్యాంగానికి 75 సంవత్సరాలు అయిన వేడుకలను మనం జరుపుకొంటున్న క్రమంలో రాజ్యాంగ ఆదర్శాల నుంచి ప్రేరణను పొందిన భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రావడం విజయ ప్రస్థానంలో మరో మెట్టు అని చెప్పాలి. దేశ పౌరుల కోసం మన రాజ్యాంగంలో ప్రస్తావించుకొన్న ఆదర్శాలను సాకారం చేసే దిశలో ఇది ఒక ప్రత్యేక చర్య. కొద్దిసేపటి కిందటే నేను ఈ చట్టాలు అమలవుతున్న తీరును ప్రత్యక్షంగా గమనించాను. ఈ అంశాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను న్యాయశాస్త్ర విద్యార్థులు, న్యాయవాదుల సంఘం సభ్యులు (బార్), న్యాయాధికారులు సహా అందరూ.. వారి వీలునుబట్టి చూడాల్సిందని నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహితలు ఆచరణలోకి వచ్చినందుకుగాను పౌరులందరికీ నేను నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. చండీగఢ్ పాలన యంత్రాంగంలోని వారందరినీ అభినందిస్తున్నాను.
మిత్రులారా,
నూతన భారతీయ న్యాయ సంహిత సమగ్రమైందే కాకుండా, ఒక విస్తృత ప్రక్రియను అనుసరించి రూపొందించింది. చాలా మంది రాజ్యాంగ నిపుణుల, చట్ట నిపుణుల కఠోర శ్రమ ఫలితంగా ఇది రూపొందింది. దీనిపై సూచనలు ఇవ్వాలని హోం శాఖ 2020 జనవరిలో కోరింది. దేశానికి ప్రధాన న్యాయమూర్తులుగా సేవలు అందించినవారు మహత్తరమైన మార్గదర్శత్వాన్ని, ఆలోచనలను అందించారు. సుప్రీంకోర్టు, 6 హైకోర్టులు, జ్యుడీషియల్ అకాడమీలు, అనేక చట్ట సంస్థలు, పౌర సమాజం సభ్యులు, తదితర మేధావులతోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు కొండంత అండగా నిలిచారు. ఈ వర్గాల వారందరూ కలిసి ఏళ్ళ తరబడి చర్చోపచర్చలు చేసి, వారి అనుభవాలను పంచుకుంటూ, దేశం అవసరాలను ఆధునిక దృష్టికోణంలో నుంచి గమనిస్తూ వారిలో వారు కూలంకషంగా చర్చించారు. స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల్లో న్యాయవ్యవస్థ ఎదుర్కొన్న సవాళ్ళను లోతుగా విశ్లేషించి, ముఖ్యంగా ప్రతి ఒక్క చట్టాన్నీ నిశితంగా పరిశీలించారు. భావి కాలం అవసరాలను కూడా ప్రతి ఒక్కటి మదింపు చేసిన తరువాత భారతీయ న్యాయ సంహితకు ఇప్పుడున్న రూపును సిద్ధం చేశారు. సుప్రీం కోర్టుకు, గౌరవనీయులైన న్యాయమూర్తులకు, అన్ని హైకోర్టులకు, ప్రత్యేకించి హర్యానా, పంజాబ్ హైకోర్టుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చొరవ తీసుకొని ముందుకు వచ్చినందుకు, ఈ నూతన న్యాయ సంహితకు బాధ్యతను వహించినందుకు న్యాయవాదుల సంఘానికి (బార్) కూడా నేను నా కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నాను. బార్ సభ్యులు అమిత ప్రశంసలకు, గుర్తింపునకు అర్హులు. ప్రతి ఒక్కరి సహకారంతో రూపొందించిన ఈ భారతీయ న్యాయ సంహిత మన దేశ న్యాయ ప్రస్థానంలో ఒక మేలి మలుపును ఆవిష్కరిస్తుందన్న నమ్మకం నాలో ఉంది.
మిత్రులారా,
మన దేశం 1947లో స్వాతంత్య్రాన్ని సాధించింది. శతాబ్దాలపాటు ఇతరుల ఏలుబడిలో ఉన్న తరువాత ఎట్టకేలకు మన దేశం విముక్తిని పొందింది. కొన్ని తరాలపాటు కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూశాక, అంకితభావం కలిగిన వ్యక్తులు ఎంతో మంది త్యాగాలను చేశాక స్వాతంత్య్ర ఉషోదయం వెలుగులను తన వెంట తీసుకువచ్చినప్పుడు కలలు ఫలించి, దేశం ఉత్సాహంతో పరవళ్లెత్తింది. బ్రిటిషువారు దేశాన్ని వీడి వెళ్ళడంతోనే వారి అణచివేత చట్టాలు కూడా అంతరిస్తాయని ప్రజలు ఆశపడ్డారు. ఈ చట్టాలు బ్రిటిషు వారికి నిరంకుశత్వం, పీడనల పనిముట్లుగా తోడ్పడ్డాయి. 1857లో నా యువ మిత్రులు దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించిపెట్టడానికి మొట్టమొదటిసారిగా ఒక ప్రధాన సమరానికి సిద్ధమయ్యారన్న సంగతిని నేను మీకు గుర్తుచేయదలచాను. 1857లో జరిగిన స్వాతంత్య్ర ఉద్యమం బ్రిటిషుపాలన పునాదులను కదిలించి, దేశంలో మూలమూలనా ఒక పెను సవాలును రువ్వింది. దీనికి బదులుగా మూడేళ్ళ తరువాత, అంటే 1860లో, బ్రిటిషువారు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)ను తీసుకువచ్చారు. ఇది జరిగిన కొన్నేళ్ళకు వారు భారతీయ సాక్ష్య చట్టాన్ని తీసుకువచ్చారు. దాని తరువాత కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ)ని కూడా తెచ్చారు. వీటిని తేవడంలో మౌలిక ఉద్దేశం, వీటి వెనుక దాగి ఉన్న మనస్తత్వం భారతీయులను దండించి, వారిని తమ వశంలో ఉంచుకోవాలనేవే. అలా చేసి బ్రిటిషువారు మన వారిని వారికి బానిసలుగా చూస్తూ వచ్చారు. దురదృష్టవశాత్తు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కొన్ని దశాబ్దాలపాటు మన చట్టాలు ఈ శిక్షాత్మక చట్టాలనూ, జరిమానాలు విధించే మనస్తత్వాన్నీ ఇరుసుగా చేసుకు తిరిగాయి. ఇవి పౌరులను వారి కింద పనిచేసే వర్గాలుగా పరిగణించడానికి రూపొందించినవి. కాలం ముందుకు సాగినకొద్దీ, స్వల్పమైన సంస్కరణల ప్రయత్నాలను చేసినా ఈ చట్టాల మౌలిక స్వభావం మార్పులేనిదిగానే మిగిలిపోయింది. ఒక స్వతంత్ర దేశంలో బానిసల కోసం రూపొందించిన చట్టాల బరువును ఎందుకు మనం మోయాలి? ఈ ప్రశ్నలు మనం అడగనేలేదు. అధికారంలో ఉన్నవారయినా ఈ విషయాన్ని గంభీరంగా పట్టించుకోలేదు. ఈ వలసవాద మనస్తత్వం భారత పురోగతిని, అభివృద్ధి ప్రస్థానాన్ని ఎంతగానో అడ్డుకుంది.
మిత్రులారా,
దేశం వలసవాద మనస్తత్వం బారి నుంచి బయటకు వచ్చి తీరాలి. దేశం శక్తియుక్తులను జాతి నిర్మాణం దిశగా ఉపయోగించాలి. ఇది జరగాలంటే జాతీయవాద దృక్పథం అత్యవసరం. ఈ కారణంగానే ఆగస్టు 15న నేను ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో బానిస మనస్తత్వం నుంచి దేశానికి విముక్తి కలిగించాలని సంకల్పించాను. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సంహితల రూపంలో దేశం ఈ బాటలో ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ‘ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం’ అనే సిద్ధాంతానికి సాధికారితను మన న్యాయ వ్యవస్థ సమకూర్చుతోంది.
మిత్రులారా,
సమానత్వం, సద్భావన, సామాజిక న్యాయం.. ఈ ఆదర్శాల ఆధారంగా న్యాయ సంహిత రూపుదిద్దుకొంది. చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్న మాటలను మనం సదా వింటూ వచ్చాం. అయితే, ఆచరణ ఇలా ఎంతమాత్రం లేదు. పేదలు, బలహీన వర్గాలవారు చాలా కాలంగా చట్టం పేరు చెబితేనే భయంతో వణికిపోతూ వచ్చారు. వారు న్యాయ స్థానాల్లోకిగానీ, పోలీసు స్టేషన్ల జోలికిగానీ వెళ్లడాన్ని వీలైనంత వరకు మానుకున్నారు. చట్ట ప్రక్రియల జోలికి కూడా వారు పోలేదు. ఇకపై ఈ సామాజిక, మానసిక దృక్పథాన్ని మార్చడానికి భారతీయ న్యాయ సంహిత కృషి చేస్తుంది. దేశంలో చట్టాలు సమానత్వానికి హామీనిస్తాయన్న విశ్వాసాన్ని ఇది ప్రజల్లో రేకెత్తిస్తుంది. నిజమైన సామాజిక న్యాయం సారం ఇదే. మన రాజ్యాంగం వాగ్దానం చేస్తున్న హామీ కూడా ఇదే.
మిత్రులారా,
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహితలలోని అంశాలు ప్రతి ఒక్క బాధిత వ్యక్తినీ సానుకూల దృష్టితోనే చూస్తాయి. వీటిలోని లోతుపాతులను గురించి తెలుసుకోవడమూ దేశ పౌరులకు అంతే ప్రధానం. ఈ కారణంగానే, చండీగఢ్‌లో ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక లైవ్ డెమోను చూడాలని మీ అందరికీ నేను సూచించదలచుకొన్నాను. అంతేకాకుండా, ఈ తరహా కార్యక్రమాన్ని ప్రతి రాష్ట్రంలోని పోలీసు శాఖ వారి వారి రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు, ఒక ఫిర్యాదు అందిన 90 రోజుల్లోపల ఆ కేసులో పురోగతిని బాధిత వ్యక్తికి తెలియజేయాలి. ఈ సమాచారాన్ని ఎస్ఎమ్ఎస్ వంటి డిజిటల్ సేవల మాధ్యమం ద్వారా నేరుగా వారికి అందజేయాలి. పోలీసుల విధులను అడ్డుకొనే వ్యక్తులపై చర్య తీసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటుచేశారు. మహిళల సురక్ష కోసం న్యాయ సంహితలో విడిగా ఒక అధ్యాయాన్ని చేర్చారు. ఈ అధ్యాయంలో పని ప్రదేశాలలో మహిళల సురక్షతోపాటు, మహిళలకు ఉన్న హక్కుల గురించే కాకుండా ఇళ్ళలో, సమాజంలో వారి హక్కులతో పాటు వారి పిల్లల హక్కుల గురించి కూడా వివరించారు. చట్టం బాధిత వ్యక్తికి వెన్నుదన్నుగా నిలిచేటట్లు భారతీయ న్యాయ సంహిత శ్రద్ధ వహిస్తుంది. మరో ముఖ్య నిబంధనను కూడా దీనిలో చేర్చారు. అత్యాచారం వంటి ఘోర నేరాల కేసులలో తొలి విచారణ చేపట్టిన నాటి నుంచి 60 రోజుల లోపల అభియోగ పత్రాన్ని (చార్జ్ షీట్) తప్పనిసరిగా సిద్ధం చేయాలి. దీనికితోడు, విచారణలు ముగిసిన తరువాత 45 రోజుల్లోపు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ఇప్పుడు తప్పనిసరైంది. ఏ కేసును రెండుసార్లకు మించి వాయిదా వేయకూడదని కూడా స్పష్టంగా నిర్దేశించారు.
మిత్రులారా,
‘‘పౌరులకే ప్రాథమ్యం’’.. ఇది భారతీయ న్యాయ సంహితలో అత్యంత కీలకమైన సూత్రం. ఈ చట్టం పౌర హక్కుల పరిరక్షకురాలిగా ఉంటూ, ‘న్యాయాన్ని అందించడంలో సౌలభ్యాని’కి పునాదిని వేస్తుంది. ఇంతకుముందు ఒక ఎఫ్ఐఆర్‌ను దాఖలు చేయాలన్నా అది కష్టమైన పనిగా ఉండేది. అయితే, ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్‌లకు చట్టపరమైన గుర్తింపు దక్కింది. కేసును ఎక్కడి నుంచైనా నమోదు చేసే సౌకర్యాన్ని పౌరులు పొందారు. ఎఫ్ఐఆర్ కాపీని అందుకోవడానికి కూడా బాధిత వ్యక్తికి హక్కుంది. నిందారోపణకు లోనైన వ్యక్తి పైన పెట్టిన కేసును ఉపసంహరించుకోవాల్సిన అవసరం వస్తే బాధిత వ్యక్తి అంగీకారంతో మాత్రమే అది సాధ్యం. పోలీసులు ఇక మీదట ఏ వ్యక్తినీ వారి స్వీయ విచక్షణతో నిర్భందించలేరు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం పోలీసులు నిర్భందిత వ్యక్తి కుటుంబానికి విషయాన్ని తెలియజేయడం తప్పనిసరి. మానవీయత, స్పందనశీలత్వం అనేవి భారతీయ న్యాయ సంహితలో మరో కోణం. శిక్ష వేయకుండా నిందారోపణ జరిగిన వ్యక్తిని దీర్ఘకాలంపాటు జైల్లో పెట్టడానికి కుదరదు. మూడేళ్ళ కన్నా తక్కువ కాలం జైల్లో ఉంచదగ్గ నేరాల విషయంలో ఇకపై ఉన్నతాధికారుల ఆమోదంతో మాత్రమే అరెస్టు చేయవచ్చు. చిన్న నేరాల విషయంలో తప్పనిసరి బెయిల్ ను జారీ చేయడానికి ఓ నిబంధనంటూ ఉంది. దీనికి అదనంగా చిన్న నేరాల విషయంలో శిక్షకు బదులు సమాజానికి సేవ చేయాలని సూచించవచ్చు. ఇది సమాజానికి సకారాత్మక తోడ్పాటును అందించేందుకు ఒక అవకాశాన్ని నిందపడ్డ వ్యక్తికి ఇస్తుంది. మొదటిసారిగా నేరాలకు పాల్పడినవారి విషయంలో సైతం న్యాయ సంహిత చాలా సున్నిత వైఖరిని కనబరుస్తుంది. పాత చట్టాల వల్ల జైలుపాలైన వేల మంది ఖైదీలను భారతీయ న్యాయ సంహిత అమలులోకి వచ్చిన తరువాత విడుదల చేశారని తెలిస్తే దేశ పౌరులు ఎంతో సంతోషిస్తారు. ఒక కొత్త వ్యవస్థ, ఒక నూతన చట్టం.. పౌర హక్కులకు ఎంతటి ఉన్నతమైన శక్తిని ప్రసాదిస్తాయో మీరే ఊహించండి.
మిత్రులారా,
సకాలంలో న్యాయమందించడమే న్యాయానికి తొలి ప్రమాణం. ‘‘న్యాయం ఆలస్యమైతే తిరస్కృతమైనట్లే’’ అని మనందరం అన్నాం, విన్నాం. అందుకే, భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్షా సంహిత ద్వారా సత్వర న్యాయం దిశగా మన దేశం గణనీయమైన ముందడుగు వేసింది. అభియోగ పత్రాల దాఖలు, త్వరితగతిన తీర్పులు వెలువరించడంపై ఇందులో ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేసులో ప్రతి దశనూ పూర్తి చేయడానికి ఓ కాలపరిమితిని నిర్దేశించారు. కొన్ని నెలల క్రితమే అమల్లోకి వచ్చిన ఈ వ్యవస్థ పరిణతి చెందడానికి ఇంకా సమయం పడుతుంది. అయినప్పటికీ, అనతి కాలంలోనే మనం చూస్తున్న మార్పులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం నిజంగా సంతృప్తికరంగా, ప్రోత్సాహకరంగా ఉన్నాయి. చండీగఢ్ లో వాహన దొంగతనం కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన 2 నెలల 11 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడిన విషయం మీ అందరికీ తెలిసిందే. సామాజిక అలజడికి కారణమైన మరో కేసులో 20 రోజుల్లోనే కోర్టు తీర్పు వెలువరించింది. ఢిల్లీలో ఓ కేసులో ఎఫ్ఐఆర్ నుంచి శిక్ష పడే వరకూ మొత్తం ప్రక్రియ 60 రోజుల్లో ముగియగా, నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. అదేవిధంగా, బీహార్ లోని చాప్రాలో ఓ హత్య కేసులో ఎఫ్ఐఆర్ నుంచి తీర్పు వరకు మొత్తం ప్రక్రియకు 14 రోజులు మాత్రమే పట్టింది. దోషులకు యావజ్జీవ శిక్ష పడింది. ఈ నిర్ణయాలు భారతీయ న్యాయ సంహిత బలానికి, ప్రభావానికి నిదర్శనం. ప్రభుత్వం జన సామాన్యం సంక్షేమానికి కట్టుబడి ఉండి, ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తే.. మార్పు వస్తుందని, దానికి అనుగుణంగా ఫలితాలూ ఉంటాయని పై అంశాల ద్వారా వెల్లడవుతోంది. దేశవ్యాప్తంగా ఈ తీర్పులపై విస్తృతంగా చర్చ జరగాలని కోరుతున్నాను. తద్వారా న్యాయం పొందడంలో తమ శక్తి ఏ విధంగా పెరిగిందో ప్రజలంతా తెలుసుకుంటారు. ఎడతెగని జాప్యం జరిగే రోజులు ఇక ముగిశాయనే స్పష్టమైన సందేశాన్ని కూడా ఇది నేరగాళ్లకు పంపుతుంది.
మిత్రులారా,
నిబంధనలైనా, చట్టాలైనా కాలానుగుణంగా ఉంటేనే ప్రభావవంతంగా ఉంటాయి. ప్రపంచం శరవేగంగా మారుతోంది. దానికి అనుగుణంగా నేరాలు, నేరస్తుల పద్ధతులూ మారుతున్నాయి. 19వ శతాబ్దంలో పాతుకుపోయిన వ్యవస్థ నేటి ప్రపంచంలో ఎలా ఆచరణీయమవుతుంది? అందుకే ఈ చట్టాలను మరింత భారతీయీకరించడమే కాక, వాటిని మేం ఆధునికీకరించాం. ఉదాహరణకు, కీలకమైన రుజువుగా డిజిటల్ సాక్ష్యం చెల్లుబాటు అవుతుండడాన్ని చూస్తున్నాం. ప్రస్తుతం సాక్ష్యాల సేకరణ ప్రక్రియలో వీడియోగ్రఫీ ద్వారా.. అందులో తారుమార్లు జరగకుండా ఉంటాయి. ఈ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఇ-సాక్ష్య, న్యాయశ్రుతి, న్యాయసేతు, ఇ-సమన్ పోర్టల్ వంటి సాధనాలను రూపొందించారు. కోర్టులు, పోలీసులు ఇకపై నేరుగా ఎలక్ట్రానిక్ విధానంలో సమన్లు జారీ చేయవచ్చు. సాక్షుల వాంగ్మూలాలను ఆడియో-వీడియో రూపాల్లో నమోదు చేయవచ్చు. డిజిటల్ సాక్ష్యాలు కూడా న్యాయస్థానాల్లో ఆమోదయోగ్యంగా ఉంటాయి, అవి న్యాయానికి ప్రాతిపదికగా ఉపయోగపడతాయి. దొంగతనం కేసుల్లో వేలిముద్రలను సరిపోల్చడం, అత్యాచార కేసుల్లో డీఎన్ఏ నమూనాలను సరిపోల్చడం, లేదా హత్య కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీతో బాధితుడి వద్ద నుంచి సేకరించిన బుల్లెట్‌ను పోల్చడం వంటివి ఇందుకు ఉదాహరణలు. వీడియో సాక్ష్యాలు సహా ఇవన్నీ బలమైన చట్టపరమైన ఆధారాలవుతాయి.
మిత్రులారా,
దీనివల్ల నేరస్తులను పట్టుకోవడంలో అనవసర జాప్యం గణనీయంగా తగ్గుతుంది. ఈ మార్పులు జాతీయ భద్రతకు కూడా అంతే కీలకం. డిజిటల్ సాక్ష్యాలు, సాంకేతిక పరిజ్ఞానాల అనుసంధానం ఉగ్రవాదంపై మరింత సమర్థవంతంగా పోరాడడానికి మనకు సహాయపడుతుంది. ఉగ్రవాదులు/ఉగ్రవాద సంస్థలు చట్టపరమైన సంక్లిష్టతలను తమకు తగ్గట్టుగా ఉపయోగించుకోకుండా కొత్త చట్టాలు నిరోధిస్తాయి.
మిత్రులారా,
నూతన భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్షా సంహిత ప్రతి శాఖలో ఉత్పాదకతను పెంచి, దేశ పురోగతిని వేగవంతం చేస్తాయి. గతంలో అవినీతికి ఆజ్యం పోసిన న్యాయపరమైన చిక్కులు ఇకపై తగ్గుతాయి. ఏళ్ల తరబడి న్యాయపోరాటాల్లో చిక్కుకుంటారనే భయంతో చాలా మంది విదేశీ పెట్టుడిదారులు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు గతంలో వెనుకాడేవారు. ఈ భయాలు తొలగిపోతే పెట్టుబడులు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది.
మిత్రులారా,
దేశంలోని చట్టాలు ప్రజల కోసమే. కాబట్టి న్యాయ ప్రక్రియలు కూడా ప్రజాహితంగా ఉండాలి. గత వ్యవస్థలో ఆ ప్రక్రియే శిక్షను తలపించేది. ఆరోగ్యకరమైన సమాజంలో చట్టాలు ప్రజలను సాధికారులను చేయాలి. కానీ, ఐపీసీ ప్రకారం చట్టాలపై భయం మాత్రమే ఉండేది — నేరస్తుల కన్నా నిజాయితీపరులే ఎక్కువగా భయాందోళనలకు లోనయ్యేవారు. ఉదాహరణకు, చట్టపరమైన చిక్కుల భయంతో రోడ్డుపై ప్రమాద బాధితులకు సహాయం చేయడానికీ ప్రజలు సంకోచించేవారు. ఇప్పుడు, సహాయం చేసేవారికి అలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా, బ్రిటీష్ కాలం నాటి 1,500 చట్టాలను రద్దు చేశాం. ఈ చట్టాల రద్దు సమయంలో.. ఎలాంటి చట్టాల భారాన్ని తాము మోశామో తెలుసుకుని ప్రజలు దిగ్భ్రాంతి చెందారు.
మిత్రులారా,
చట్టం పౌరులకు సాధికారత కల్పించాలంటే మన దృక్పథాన్ని విస్తృతం చేసుకోవాలి. ఎందుకింత ప్రత్యేకించి చెప్తున్నానంటే – కొన్ని చట్టాలు అందరి దృష్టినీ ఆకట్టుకుంటాయి. అదే ప్రాధాన్యమున్న ఇతర కీలకమైన చట్టాలు ఎవరూ పెద్దగా పట్టించుకోనివిగా మిగిలిపోతాయి. ఉదాహరణకు అధికరణ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చట్టం, వక్ఫ్ బోర్డు చట్టాలపై ఇటీవలి పరిణామాలపై చాలా చర్చ జరిగింది. అయితే, పౌరుల గౌరవాన్నీ, హోదానూ పెంచే చట్టాలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు, ఇవాల అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. దివ్యాంగులు మన కుటుంబ సభ్యులు. కానీ పాత చట్టాల్లో ఏ నాగరిక సమాజమూ అంగీకరించలేని పదాలను ఉపయోగించి దివ్యాంగులను తీవ్రంగా అగౌరవపరిచే విధంగా వర్గీకరించారు. వారిని దివ్యాంగులని పిలవడం మొదలుపెట్టి.. కించపరిచే పదాలతో కలిగే న్యూనత నుంచి వారు బయటపడేలా చేశాం. 2016లో దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేశాం. ఇది కేవలం దివ్యాంగుల కోసం రూపొందించిన చట్టం మాత్రమే కాదు.. సమాజాన్ని మరింత ఆర్ధ్రమైనదిగా, సమ్మిళితమైనదిగా మార్చే చర్య. నారీ శక్తి వందన్ అధినియం ఇప్పుడు గణనీయమైన సామాజిక పరివర్తనకు పునాది వేస్తోంది. అదేవిధంగా ట్రాన్స్ జెండర్ హక్కులకు సంబంధించిన చట్టాలు, మధ్యవర్తిత్వ చట్టం, జీఎస్టీ చట్టం పరివర్తనాత్మకమైన చట్టాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. మరింత సానుకూల, విస్తృత చర్చకు అవి అర్హమైనవి.
మిత్రులారా,
దేశానికి పౌరులే బలం, పౌరులకు చట్టాలు బలం. అందుకే ‘‘నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని’’ అని ప్రజలు గర్వంగా చెప్తుంటారు. చట్టం పట్ల ఈ నిబద్ధత గొప్ప జాతీయ ఆస్తి. చట్టంపై ఈ విశ్వాసం చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోవడం మన సమష్టి బాధ్యత. ప్రతి శాఖ, సంస్థ, అధికారి, పోలీసు సిబ్బంది కొత్త నిబంధనలు, వాటి ఉద్దేశాన్ని అవగతం చేసుకోవాలని కోరుతున్నాను. భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్షా సంహితను సమర్థవంతంగా అమలు చేసే దిశగా క్రియాశీలకంగా పనిచేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. తద్వారా వాటి ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఈ కొత్త చట్టాల ద్వారా తమ హక్కుల గురించి పౌరులు కూడా వివరంగా తెలుసుకుని ఉండాలని మరోసారి విన్నవిస్తున్నాను. ఈ విషయంలో సమష్టిగా కృషి చేయాలి. ఈ చట్టాలను ఎంత సమర్థవంతంగా అమలు చేస్తే మన భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది. ఇది మీ జీవితాన్నే కాదు, మీ పిల్లల జీవితాలను కూడా తీర్చిదిద్దుతుంది. మీ సేవల్లో సంతృప్తినివ్వడంతోపాటు మొత్తంగా మీ అనుభవాన్ని అది మెరుగుపరుస్తుంది. ఈ దిశగా కలిసి పనిచేస్తామని, దేశ నిర్మాణంలో మన పాత్రను మరింత బలంగా పోషిస్తామని నేను గట్టిగా నమ్ముతున్నాను. భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్షా సంహితను స్వీకరించిన మీ అందరికీ, దేశంలోని పౌరులందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చండీగఢ్ లో ఉత్తేజకరమైన వాతావరణానికి, మీ ప్రేమకు, మీ ఉత్సాహానికి ప్రణామాలర్పిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
ధన్యవాదాలు!
***
Addressing a programme marking the successful implementation of the three new criminal laws. It signifies the end of colonial-era laws. https://t.co/etzg5xLNgf
— Narendra Modi (@narendramodi) December 3, 2024
The new criminal laws strengthen the spirit of - "of the people, by the people, for the people," which forms the foundation of democracy. pic.twitter.com/voOeaWd3Wg
— PMO India (@PMOIndia) December 3, 2024
Nyaya Sanhita is woven with the ideals of equality, harmony and social justice. pic.twitter.com/XDu0Qa6Scq
— PMO India (@PMOIndia) December 3, 2024
The mantra of the Bharatiya Nyaya Sanhita is - Citizen First. pic.twitter.com/RJPTypK8mo
— PMO India (@PMOIndia) December 3, 2024