Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మన్ కీ బాత్ – మనసులో మాటతేదీ: 27.08.2017


నా ప్రియమైన దేశవాసులారా, సాదర నమస్కారం! ఒకవైపు దేశం ఉత్సవాలలో మునిగి ఉంది. మరోవైపు భారతదేశంలో ఏదో ఒక మూల నుండి హింసాత్మక వార్తలు వచ్చినప్పుడు దేశం చింతించడం సహజమే. ఇది బుధ్ధ భగవానుడు, గాంధీ పుట్టిన దేశం. దేశ ఐక్యత కోసం ప్రాణాలను సైతం అర్పించిన సర్దార్ పటేల్ పుట్టిన దేశం ఇది. కొన్ని యుగాలుగా మన పూర్వీకులు ప్రజల జీవన విలువలను, అహింసను , సమానంగా ఆదరించారు. ఇది మన నరనరాల్లో నిండి ఉంది. “అహింసా పరమో ధర్మ: ” దీనిని మనం చిన్నప్పటి నుండీ వింటూ వచ్చాం చెప్తూ వచ్చాం. నేను ఎర్ర కోట నుండి కూడా చెప్పాను – విశ్వాసాల పేరుతో హింసను సహించేది లేదు అని చెప్పాను. అది సంప్రదాయపరమైన విశ్వాసం అయినా సరే, రాజకీయ ఆలోచనా ధోరణి తాలూకూ విశ్వాసం అయినా సరే, ఒక వ్యక్తి పట్ల ఉన్న విశ్వాసం అయినా సరే, వారసత్వపరమైన విశ్వాసం అయినా సరే. విశ్వాసాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరికీ లేదు. డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం, ప్రతి వ్యక్తి కీ న్యాయం పొందేందుకు అన్నిరకాల ఏర్పాట్లూ ఉన్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారు, హింసామార్గంలో పయనించేవారు ఎవరినైనా సరే, వారు వ్యక్తి అయినా, గుంపు అయినా, ఈ దేశం సహించదు. ఏ ప్రభుత్వమూ సహించదు అని నేను దేశప్రజలకు నమ్మకంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాల్సిందే. చట్టం జవాబుదారీలను నిర్ణయించి, దోషులకు శిక్షను వేసి తీరుతుంది.

మన దేశం అనేక భిన్నత్వాలతో నిండి ఉంది. ఈ భిన్నత్వాలు ఆహారం, జీవనశైలి, వస్త్రధారణ వరకే పరిమితం కాదు. జీవితంలో ప్రతి విషయంలోనూ ఈ వైవిధ్యాలు మనకు కనిపిస్తాయి. మన పండుగలు కూడా అనేక భిన్నత్వాలతో నిండి ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల నాటి పురాతాన సంస్కృతి మనకు వారసత్వంగా లభించిన కారణంగా సాంస్కృతిక సంప్రదాయాలు, సామజిక సంప్రదాయాలు, చారిత్రక ఘటనలు, అన్నీ గమనిస్తే, గనుక ఏడాదిలో ఏదో ఒక్కరోజు ఏ పండుగతోనూ ముడిపడని రోజు ఉంటుందేమో. మన పండుగలన్నీ కూడా ప్రకృతిపరంగా కాలానుగుణంగా వస్తుంటాయి. అన్నీ కూడా ప్రకృతితో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. చాలావరకూ మన పండుగలన్నీ కూడా రైతులతో ముడిపడి ఉంటాయి, జాలరులతో జతపడి ఉంటాయి.

ఈవేళ నేను పండుగల గురించి చెప్తున్నాను కాబట్టి అన్నింటికన్నా ముందర మీ అందరికీ ’మిచ్ఛామి దుక్కడం’ – నొప్పించి ఉంటే క్షమించండి అని చెప్పాలనుకుంటున్నాను. జైన సమాజం నిన్న సంవత్సరీ పండుగ జరుపుకుంది. జైన సమాజంవారు భాద్రపద మాసంలో పురుషూయ పండుగ జరుపుకుంటారు. పురుషూయ పండుగ ఆఖరిరోజున సంవత్సరీ పండుగ ఉంటుంది. నిజంగా ఇది ఒక అద్భుతమైన సంప్రదాయం. సంవత్సరీ పండుగ క్షమ, అహింస, స్నేహా భావాలకు ప్రతీక. దీనిని ఒక రకంగా క్షమాపణ పండుగ అని కూడా అంటారు. ఈ రోజున ఒకరికొకరు ’మిచ్ఛామి దుక్కడం ’ అని చెప్పుకునే సంప్రదాయం ఉంది. అలానే మన శాస్త్రాల్లో ’క్షమా వీరస్య భూషణమ్’ అంటే క్షమించడం వీరులకు ఆభరణం వంటిదని అర్ధం. క్షమించేవారే వీరులు. ’క్షమించడం బలవంతుడి ప్రత్యేకత’ అని మహాత్మా గాంధీ చెప్పిన మాటలు మనం వింటూనే వచ్చాం.

షేక్స్పియర్ తన ’ మర్చెంట్ ఆఫ్ వెనీస్ ’ నాటకంలో క్షమాభావం ఎంత గొప్పదో చెప్తూ – ““Mercy is twice blest, It blesseth him that gives and him that takes” అంటాడు. అంటే క్షమించేవాడు, క్షమించబడేవాడూ, ఇద్దరికీ భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుంది” అని అర్థం.

నా ప్రియమైన దేశప్రజలారా, ప్రస్తుతం దేశం నలుమూలలా అందరూ వైభవంగా గణేశ చతుర్థి పండుగ జరుపుకుంటున్నారు. గణేశ చతుర్థి సంగతి వచ్చినప్పుడు బహిరంగ-గణేశోత్సవాల విషయం రావడం స్వాభావికమే. బాలగంగాధర తిలక్ గారు 125 ఏళ్ళ క్రితం ఈ సంప్రదాయానికి జన్మనిచ్చారు. గత 125 ఏళ్ళు స్వాతంత్రానికి పూర్వం అవి స్వాతంత్ర్యోద్యమానికి ప్రతీకగా ఉండేవి. స్వాతంత్రం తరువాత అవి సమాజ శిక్షణ, సామాజిక చైతన్యాన్ని మేల్కొలిపడానికి ప్రతీకగా నిలిచాయి. గణేశ చతుర్థి పండుగ పదిరోజుల వరకూ చేస్తారు. ఈ పండుగని ఏకత్వం, సమానత, పరిశుభ్రతలకు ప్రతీకగా చెప్తారు. దేశవాసులందరికీ గణేశ ఉత్సవాల సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు.

ఇప్పుడు కేరళలో ఓనమ్ పండుగ జరుపుకుంటున్నారు. భారతదేశంలోని రంగురంగుల పండుగలలో కేరళకు చెందిన ఓనమ్ ఒక ప్రముఖమైన పండుగ. ఈ పండుగ సామాజిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలుపుతుంది. ఓనమ్ పండుగ కేరళీయుల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఉత్సవం సమాజంలో ప్రేమ మరియు సామరస్యం యొక్క సందేశంతో కొత్త ఉత్సాహం, కొత్త ఆశ, ప్రజల మనస్సుల్లో కొత్త విశ్వాసాన్ని జాగృతం చేస్తుంది. ఇప్పుడు మన పండుగలు కూడా పర్యాటక శాఖ వారి ఆకర్షణలుగా మారుతున్నాయి. గుజరాత్ లో నవరాత్రి ఉత్సవాలు, బెంగాలు లో దుర్గా పూజ ఉత్సవాలు ఒకరకంగా పర్యాటక శాఖ వారి ఆకర్షణలుగా మారిపోయాయి. మన ఇతర పండుగలు కూడా విదేశీయులను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. ఆ దిశగా మనం ఏం చెయ్యగలమని ఆలోచించాలి.

ఈ పండుగల పరంపరలో కొన్ని రోజుల్లో ’ఈద్-ఉల్-జుహా’ పండుగ వస్తోంది. దేశవాసులందరికీ ’ఈద్-ఉల్-జుహా’ సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు, అభినందనలు. పండుగ అంటే నమ్మకానికీ, విశ్వాసానికీ చిహ్నం. నవభారతదేశంలో పండుగలను పరిశుభ్రతకు ప్రతీకలుగా తయారుచెయ్యాలి. పండుగకు తయారవడమంటే – ఇంటిని శుభ్రపరచడం. ఇది మనకు కొత్తేమీ కాదు కానీ దీనిని ఒక సామాజిక అలవాటుగా మార్చడం ముఖ్యం. సార్వత్రికంగా శుభ్రత అంటే కేవలం ఇంట్లో అని మాత్రమే కాదు. మొత్తం గ్రామంలో, నగరంలో, పట్టణంలో, రాష్ట్రంలో, మన దేశంలో శుభ్రత, పరిశుభ్రతని పండుగలలో ఒక ముఖ్యమైన భాగంగా తయారుచెయ్యాలి.

నా ప్రియమైన దేశప్రజలారా, ఆధునికత అర్థాలు మారుతున్నాయి. ఈ రోజుల్లో మీరెంత సంస్కారవంతులైనా, ఎంత ఆధునీకులైనా మీ ఆలోచనా విధానం ఎంత నూతనంగా ఉన్నా సరే, అవన్నీ బేరీజు వెయ్యడానికి ఒక కొత్త కోణం, ఒక కొత్త కొలమానం, ఒక సంతులనం తయారయ్యాయి; అదేమిటంటే పర్యావరణం పట్ల మీరెంత జాగ్రత్తగా ఉన్నారు అన్నది. మీరు మీ చర్యల్లో పర్యావరణానికు అనుకూలమైన పనులు చేస్తున్నారా, వ్యతిరేకంగా చేస్తున్నారా, అని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఈ పండుగ రోజుల్లో అన్నిచోట్లా పర్యావరణానికి అనుకూలమైన మట్టి గణపతి ఉద్యమం మొదలైంది. మీరు యూట్యూబ్ లో గనుక చూస్తే, ప్రతి ఇంట్లోనూ పిల్లలు మట్టిగణపతిని తయారుచేసి దానికి రంగులు అద్దుతున్నారు. కొందరు కూరగాయల రంగులు అద్దితే, కొందరు రంగురంగుల కాగితం ముక్కలు అంటిస్తున్నారు. దగ్గరదగ్గర ఈ ప్రయోగాన్ని అన్ని కుటుంబాలవారూ చేస్తున్నారు. ఒకరకంగా పర్యావరణాత్మక చేతన తాలూకూ ఇంత పెద్ద విస్తృతమైన శిక్షణ ఈ గణేశోత్సవాల సమయంలో తప్ప ఇంతకు ముందెప్పుడూ బహుశా గమనించి ఉండం. మీడియా హౌస్ వారు కూడా పెద్ద ఎత్తున పర్యావరణానికి అనుకూలమైన మట్టి గణపతి విగ్రహాలను తయారుచేసే శిక్షణను ప్రజలకు అందిస్తూ ప్రేరణని, మార్గనిర్దేశాన్నీ ఇస్తున్నారు. చూడండి ఎంత పెద్ద మార్పు వచ్చిందో! ఆనందకరమైన మార్పు.

అలానే నేను చెప్పినట్లుగా మన దేశం కోట్లాదికోట్ల అద్భుతమైన ఆలోచనాపరులతో నిండి ఉంది. ఎవరైనా కొత్త కొత్త ఆవిష్కారాలు చేస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఎవరో ఇంజనీరు స్వయంగా చెప్పారు నాకు, ఆయన కొన్ని ప్రత్యేకమైన రకరకాలైన మట్టిని సంపాదించి, దానిని కలిపి, మట్టిగణేశుడిని తయారుచేసే శిక్షణ ప్రజలకి అందించారుట. పూజ తర్వాత ఒక చిన్న బకెట్ లో ఆ గణేశ నిమజ్జనం చేస్తే, విగ్రహం వెంటనే నీటిలో కరిగిపోతుంది. అక్కడితో ఆగకుండా ఆయన అందులో ఒక తులసిమొక్క వేసి, పెంచారు. మూడేళ్ళ క్రితం నేను పరిశుభ్రత ఉద్యమం మొదలుపెట్టాను. దీనికి వచ్చే అక్టోబర్ రెండు నాటికి మూడేళ్ళు పూర్తవుతాయి. ఈ ఉద్యమం తాలూకూ అనుకూల పరిణామాలు కనబడుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణాలు 39% నుండి దాదాపు 67% కి చేరాయి. రెండు లక్షల ముఫ్ఫైవేల కన్నా అధికంగా పల్లెలు, బహిరంగ మలమూత్ర విసర్జన నుండి తాము విముక్తులమయ్యామని ప్రకటించారు.

ఆమధ్య గుజరాత్ లో భయంకరమైన వరదలు వచ్చాయి. చాలామంది ప్రజలు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ వరద నీరు ఇంకిపోయిన తర్వాత చాలా దుర్గంధం వ్యాపించింది. ఇలాంటి సమయంలో గుజరాత్ లోని బనాస్కాంతా జిల్లా లో ధానేరా లో, జమీయత్ ఉలేమా-ఎ-హింద్ కార్యకర్తలు వరద ప్రభావిత ఇరవై రెండు గుడులను, మూడు మసీదులను దశలవారీగా శుభ్రపరిచారు. తమ చెమటను చిందించి అందరినీ రక్షించారు. పరిశుభ్రత పాటించడానికి ఐక్యత ఎంత అవసరమో జమీయత్ ఉలేమా-ఎ-హింద్ కార్యకర్తలు చూపెట్టారు. ఇలాంటి సంఘటనలు మనకు ప్రేరణను అందిస్తాయి. పారిశుధ్యం కోసం సమర్పణా భావంతో చేసే ప్రయత్నాలు శాశ్వతమైన స్వభావాలుగా మారితే మన దేశం మరెంతో ఎత్తుకు ఎదగగలదు.

నా ప్రియమైన దేశ ప్రజలారా, అక్టోబర్ రెండున గాంధీ జయంతికి పదిహేను ఇరవై రోజుల ముందు నుండే ’పారిశుధ్య సేవ’ అని ఇంతకు ముందు చెప్పినట్లే ’జన సేవే ప్రభు సేవ’ , ’పరిశుభ్రతే సేవ’ అనే ప్రచారాన్ని నడపవలసిందిగా మీ అందరినీ మరోసారి కోరుతున్నాను. దేశమంతటా పారిశుధ్య వాతావరణం తయారుచెయ్యండి. ఎక్కడ అవకాశం దొరికినా, ఎక్కడ దొరికితే అక్కడ, మనం అవకాశాలని వెతుక్కుందాం. అందరం కలిసికట్టుగా ఉందాం. ఒకరకంగా దీపావళికి, నవరాత్రికి, దుర్గా పూజకు ముందు సన్నాహాలుగా దీనిని భావిద్దాం. శ్రమదానం చేద్దాం. సెలవు రోజున, ఆదివారాల్లో ఒక దగ్గర చేరి, ఒక్కటిగా పనిచేయండి.చుట్టుపక్కల ఉన్న బస్తీల్లోకి వెళ్ళండి, దగ్గరలోని పల్లెకు వెళ్లండి. కానీ ఇదంతా ఒక ఉద్యమంగా భావిస్తూ చేయండి. అందరూ అన్ని ఎన్.జి.ఓ లను, పాఠశాలలు, కళాశాలలు, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులనూ, కలెక్టర్లను, సర్పంచ్ లనూ, ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను – అక్టోబర్ రెండున గాంధీ జయంతికి పదిహేనురోజుల ముందర నుండి మనమందరమూ ఒక పారిశుధ్య వాతావరణాన్ని తయారుచేద్దాం. చక్కని పరిశుభ్రతతో అక్టోబర్ రెండు ని నిజంగా గాంధీగారు కలలుకన్న అక్టోబర్ రెండు గా మారుద్దాం. త్రాగునీరు మరియు స్వచ్ఛతా మంత్రిత్వశాఖ, MyGov.in లో ఒక విభాగాన్ని సృష్టించారు. అందులో మరుగుదొడ్ల నిర్మాణం తరువాత మరు మీ పేరు, మీరు సహాయం చేసిన కుటుంబం పేరు నమోదు చేయవచ్చు. నా సోషల్ మీడియా మిత్రులందరూ కూడా మీ మీ రచనాత్మక ఉద్యమాన్ని చేపట్టవచ్చు. Virtual World Forumపై కూడా పని జరుగుతోంది, ఇది మనకు ప్రేరణను ఇవ్వవచ్చు. పరిశుభ్ర సంకల్పం నుండి పరిశుభ్రతను గురించిన పోటీలలో పాల్గొనవచ్చు. ఈ ప్రచారంలో భాగంగా త్రాగునీరు మరియు స్వచ్ఛతా మంత్రిత్వశాఖ వారు వ్యాస రచన పోటీలు, కథా పోటీలు, లఘు చిత్రాల పోటీలు, పెయింటింగ్ పోటీలు నిర్వహించబోతున్నారు. ఇందులో మీరు వివిధ భాషల్లో వ్యాస రచన చేయవచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఒక లఘు చిత్రాన్ని మీరు మీ మొబైల్ తో తీసేయవచ్చు. పారిశుధ్యానికి ప్రేరణను అందించేలాంటి రెండు మూడు నిమిషాల ఫిల్మ్ ను తయారు చేయవచ్చు. ఈ పోటీల్లో పాల్గొనేవారికి జిల్లా స్థాయిలో మూడు, రాష్ట్ర స్థాయిలో కూడా మూడు బహుమతులు ఉంటాయి. పారిశుధ్యానికి సహాయపడే ఇటువంటి ప్రచారానికి కూడా మీ అందరినీ కలవమని, ఈ పోటీల్లో పాల్గొనవలసిందని నేను ఆహ్వానిస్తున్నాను.

అక్టోబర్ రెండు, గాంధీ జయంతిని ’పారిశుధ్య అక్టోబర్ రెండు’ గా జరుపుకోవాలనే సంకల్పాన్ని చేసుకోమని మరోసారి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అందుకోసం సెప్టెంబర్ పదిహేను నుండీ ’పారిశుధ్య సేవ’ మంత్రాన్ని ఇంటింటికీ చేర్చండి. పరిశుభ్రత కోసం ఏదో ఒక అడుగు వెయ్యండి. స్వయంగా పరిశ్రమించి ఈ ప్రచారంలో ఒక భాగమవ్వండి. ఈ అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఎలా ప్రకాశవంతమవుతుందో మీరే చూడండి. పదిహేను రోజుల ప్రచారం తరువాత, ’పారిశుధ్య సేవ’ తరువాత, అక్టోబర్ రెండున గాంధీ జయంతి జరుపుకునేప్పుడు పూజ్య బాపూజీ కి శ్రధ్ధాంజలి ఘటిస్తున్నప్పుడు మీలో ఎంత పవిత్రమైన ఆనందం ఉంటుందో మీరు ఊహించగలరు.

నా ప్రియమైన దేశప్రజలారా, నేనీవేళ విశేషంగా మీ అందరి ఋణాన్నీ స్వీకరించాలనుకుంటున్నాను. హృదయపూర్వకంగా నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకాలంగా మీరు నా ’మనసులో మాట’ తో కలిసిఉన్నందుకు కాదు, నేను ఋణపడి ఉన్నది, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న నా ’మనసులో మాట’ కార్యక్రమంతో దేశం నలుమూలల నుండీ లక్షల ప్రజలు నాతో కలుస్తున్నందుకు. వినేవారి సంఖ్య కోట్లలో ఉంది. కానీ లక్షల మంది ప్రజలు ఉత్తరాలు రాస్తున్నారు, సందేశాలు పంపుతున్నారు, ఫోన్ ద్వారా సందేశాలు ఇస్తున్నారు. ఇదంతా నాకు పెద్ద కోశాగారం లాంటిది. దేశప్రజలందరి మనసులోని మాటలూ తెలుసుకోవడానికి నాకు ఇదొక పెద్ద అవకాశం గా మారింది. మీరు ఎంత ఎక్కువగా మనసులో మాట కోసం ఎదురుచూస్తారో, అంతకంటే ఎక్కువగా నేను మీ సందేశాల కోసం ఎదురుచూస్తాను. మీ ప్రతి మాటతో నాకు ఎంతో కొంత నేర్చుకునే అవకాశం లభిస్తుంది. అందుకే అంత ఆశగా ఎదురుచూస్తాను. నేను చేసే పనికి గీటురాయిగా అవి పనికి వస్తాయి. మీ చిన్న చిన్న మాటలు నాలో పెద్ద పెద్ద ఆలోచనలు రేకెత్తించడానికి పనికొస్తాయి. అందువల్ల మీ ఈ సహకారానికి ఋణపడి ఉంటాను. వీలయినంతవరకూ మీ మాటలను నేను స్వయంగా చూసి, చదివి, విని , అర్థంచేసుకోవాల్సినటువంటి మాటలు వస్తుంటాయి. మీరే చూడండి, ఈ ఫోన్ కాల్ తో మీరు ఎలా మిమ్మల్ని జతపరుచుకుంటారో.. మీక్కూడా అనిపిస్తుంది, అవును, నేను కూడా ఇలాంటి పొరపాటు చేశానని. ఒకోసారి కొన్ని విషయాలు మన అలవాట్లలో ఎంతగా కలిసిపోతాయంటే, మనం పొరపాటు చేస్తున్నామన్న సంగతి మనం గమనించం కూడా.

“ప్రధానమంత్రి గారూ, నేను పూనా నుండి అపర్ణ ని మాట్లాడుతున్నాను. నేను నా స్నేహితురాలి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఎప్పుడు ప్రజలకి సహాయం చెయ్యాలనే ప్రయత్నంలో ఉంటుంది. కానీ తనకున్న ఒక అలవాటు నన్ను కంగారుపెడుతోంది. నేను తనతో ఒకసారి ఒక షాపింగ్ మాల్ కు వెళ్లాను. ఒక చీరపై తను రెండువేల రూపాయలు సులువుగా ఖర్చు పెట్టింది. పీజా కి 450 రూపాయలు పెట్టింది కానీ షాపింగ్ మాల్ కు వెళ్ళిన ఆటో డ్రైవర్ తో ఐదు రూపాయల కోసం బేరసారాలు చేసింది. దారిలో కూరలు కొనుక్కుంది. ఒక్కో కూరగాయపై బేరమాడి 4,5 రుపాయిలు మిగుల్చుకుంది. నాకు అది నచ్చలేదు. మనం పెద్ద పెద్ద చోట్లలో అడగకుండానే పెద్ద మొత్తాలు చెల్లిస్తాం కానీ కష్టపడే సోదర సోదరీమణులతో కొద్ది రూపాయిల కోసం గొడవ పడతాం. వారిని నమ్మం. మీరు మీ ’మనసులో మాట’ లో ఈ సంగతిని తప్పకుండా ప్రస్తావించండి”

ఈ ఫోన్ కాల్ విన్న తరువాత మీరు తప్పకుండా ఉలిక్కిపడి ఉంటారు. ఇలాంటి పొరపాటు ఇక చెయ్యకూడదు అని మీరు మనసులో నిశ్చయించుకుని ఉంటారని నా నమ్మకం. మనం మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా సామానులు అమ్మేవారు , తోపుడు బళ్ళ వారు, చిన్న దుకాణదారుడో, కూరగాయలు అమ్మేవారో మన పని కోసం వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఆటో డ్రైవర్ తో పని పడినప్పుడు – మరెప్పుడైనా సరే ఎవరైనా కష్టపడి పనిచేసేవారితో పని వచ్చినప్పుడు వారికి ఇవ్వాల్సిన ధర విషయమై బేరసారాలు చేస్తాము. ఇంత కాదు, రెండు రూపాయిలు తక్కువ చేసుకో, ఐదు రూపాయిలు తక్కువ చేసుకో..అని. అదే మనం ఏదైనా రెస్టారెంట్ కు భోజనానికి వెళ్తే బిల్లు కూడా చూడకుండా డబ్బులు తీసి ఇచ్చేస్తాము. ఇంతేకాదు, షోరూమ్ లో చీర కొనడానికి వెళ్తే బేరాలాడం కానీ ఎవరైనా పేదవారితో పని వస్తే మాత్రం బేరాలాడ కుండా అస్సలు ఉండం. పేదవాడు ఏమనుకుంటాడో అని మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రశ్న రెండు రూపాయిలదో, ఐదు రూపాయిలదో కాదు. పేదవాడి మనసుకు కలిగిన కష్టానిది. వాళ్ళు పేదవారు కాబట్టి మీరు వారి నిజాయితీని అనుమానించారని వాళ్లు బాధపడతారు.

మీ జీవితంలో రెండు రూపాయిలకి, ఐదు రూపాయిలకి ఏమీ ప్రాముఖ్యత ఉండదు. కానీ మీ ఈ చిన్న అలవాటు వాళ్ల మనసులను ఎంత లోతుగా గాయపరచగలదో ఎప్పుడైనా ఆలోచించారా? ఇటువంటి హృదయానికి హత్తుకునేటువంటి విషయాన్ని మీ ఫోన్ కాల్ ద్వారా నాకు తెలిపినందుకు, మేడమ్, మీకు నా కృతజ్ఞతలు. నా దేశప్రజలు కూడా, వారికి పేదవారితో ఇలా ప్రవర్తించే అలవాటు ఉంటే, వారు తప్పకుండా మారతారనే నమ్మకం నాకుంది.

నా ప్రియమైన యువమిత్రులారా, ఆగస్టు 29వ తేదీని దేశమంతా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటుంది. ఇది గొప్ప హాకీ ఆటగాడు, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జన్మదినం. హాకీ ఆటకు ఆయన చేసిన సేవ ఎనలేనిది. ఈ సంగతిని గుర్తు చేసుకోవడానికి కారణమేమిటంటే, మన దేశ భావితరం క్రీడలతో ముడిపడాలని నా కోరిక. ఆటలు మన జీవితాలలో భాగం కావాలి. ప్రపంచంలోకెల్లా మనదే యువ దేశమైనప్పుడు ఆ యౌవ్వనదశ క్రీడామైదానంలో కూడా కనబడాలి. క్రీడలంటే శారీరిక ధృఢత్వం, మానసిక చురుకుదనం, వ్యక్తిత్వ మెరుగుదల. అంతకంటే ఏం కావాలి? ఒకరకంగా ఆటలు మనసులు కలిపేందుకు ఉపయోగపడే పెద్ద ఔషధం. మన దేశ యువత క్రీడాప్రపంచంలో ముందుకు రావాలి. ఇవాల్టి కంప్యూటర్ యుగంలో ప్లే-స్టేషన్ కన్నా ప్లేయింగ్ ఫీల్డ్ చాలా మహత్యం కలిగినదని నేను హెచ్చరించదలచుకున్నాను. కంప్యూటర్ లో FIFA ఆడండి కానీ బయట మైదానంలో కూడా ఎప్పుడైనా ఫుట్బాల్ తో ఫీట్లు చేసి చూపించండి. కంప్యూటర్ లో క్రికెట్ ఆడుతూ ఉండి ఉంటారు కానీ ఆరుబయట మైదానంలో ఆకాశం క్రింద క్రికెట్ ఆడే ఆనందమే వేరు. ఒక సమయంలో ఇంట్లోని పిల్లలు బయటకు వెళ్తే, ఎప్పుడొస్తారని అమ్మ అడిగేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా ఫోనో, కార్టూన్ సినిమానో చూడడంలో మునిగిపోతున్నారు లేదా మొబైల్ గేమ్ కి అతుక్కుపోతున్నారు. ఇప్పుడు అమ్మకి ’ఎప్పుడు బయటకు పోతావురా’ అని గట్టిగా అరవాల్సి వస్తోంది. కాలాన్ని బట్టి మనుషులు మారిపోతున్నారు. ఒక సమయంలో నువ్వెప్పుడొస్తావు అని అడిగే అమ్మ, ఇవాళ నువ్వెప్పుడు బయటికి వెళ్తావు? అని అడుగుతోంది.

యువ మిత్రులారా, క్రీడామంత్రిత్వశాఖ వారు క్రీడా ప్రతిభను వెతికి, మెరుగుపెట్టడం కోసం ఒక స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ పోర్టల్ ను తయారుచేశారు. దేశం మొత్తం లో క్రీడారంగంలో ప్రతిభ గల పిల్లలు ఎక్కడ ఉన్నా, క్రీడారంగంలో వాళ్ళు సాధించిన విజయాలు ఈ పోర్టల్ లో బయోడేటాతో సహా లేదా విడియో ను అప్లోడ్ చేయవచ్చు. ఎంచుకున్న ఔత్సాహిక క్రీడాకారులకు క్రీడా మంత్రిత్వశాఖ శిక్షణనందిస్తుంది. ఈ పోర్టల్ రేపటి నుండీ ప్రారంభమవబోతోంది. మన క్రీడాకారులకు సంతోషకరమైన వార్త ఏమిటంటే, భారతదేశంలో అక్టోబర్ 6 నుండీ 28 వరకూ, ఫీఫా అండర్ 17 ప్రపంచ కప్ మొదలవబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇరవై నాలుగు టీమ్ లు భారతదేశాన్ని తమ నివాసంగా మార్చుకోనున్నాయి.

రండి, ప్రపంచం నలుమూలల నుండి రాబోయే మన యువ అతిథులను, క్రీడా ఉత్సవాలతో స్వాగతిద్దాం. ఆటలను ఆస్వాదిద్దాం. దేశంలో ఒక క్రీడా వాతావరణాన్ని తయారుచేద్దాం. ఆటల విషయం మాట్లాడుతుంటే నాకు గతవారంలో జరిగిన మనసుకు హత్తుకునే సంఘటన ఒకటి గుర్తుకువచ్చింది. ఆ విషయం నేను దేశప్రజలతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలా చిన్న వయసు ఉన్న ఆడపిల్లలను కలిసే అవకాశం నాకు లభించింది. వారిలో కొందరు హిమాలయ ప్రాంతాల్లో పుట్టినవారు. సముద్రంతో వారికి ఎప్పుడూ అనుబంధం లేదు. నావికాదళం లో పని చేసే అలాంటి ఆరుగురు ఆడపిల్లల ఉత్సాహం, వాళ్ల ధైర్యం మనందరికీ ప్రేరణని ఇచ్చేలాంటిది. ఈ ఆరుగురు ఆడపిల్లలూ INS తారిణి (Tarini) అనే ఒక చిన్న బోటు తీసుకుని సముద్రాన్ని దాటడానికి బయల్దేరుతున్నారు. ఈ ప్రచారం పేరు “నావికా సాగర్ పరిక్రమ’. వారు ప్రపంచాన్ని మొత్తం చుట్టి కొన్ని నెలల తరువాత, లేదా చాలా నెలల తరువాత భారతదేశం తిరిగివస్తారు. ఒకోసారి నలభై రోజుల దాకా నీటిలోనే ప్రయాణించాల్సి వస్తుంది వారికి. ఒకోసారి వారికి ముఫ్ఫైయ్యేసి రోజులు. సముద్రపు అలల మధ్యన మన ఆరుగురు ఆడపిల్లలు ప్రయాణించడం ప్రపంచంలోనే మొదటి సంఘటన అవుతోంది. ఈ ఆడపిల్లలను చూసి గర్వపడని భారతీయుడు ఉంటాడా? నేను ఈ ఆడపిల్లల ఉత్సాహానికి అభివాదం చేస్తున్నాను. దేశప్రజలతో తమ అనుభవాలను పంచుకోవాల్సిందిగా నేను వారిని కోరాను. నేను కూడా నరేంద్ర మోదీ యాప్ లో మీరంతా చదువుకునేందుకు వీలుగా, వారి అనుభవాల కోసం ఒక విభాగాన్ని ఏర్పాటుచేస్తాను. ఎందుకంటే ఒకరకంగా ఇదొక సాహసగాథ, స్వీయ అనుభవాల కథ. ఈ ఆడపిల్లల మాటలను మీదాకా చేర్చడం నాకు సంతోషకరం. ఈ ఆడపిల్లలకి నేను అనేకానేక అభినందనలు, అనేకానేక ఆశీర్వాదాలు తెలుపుతున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, సెప్టెంబర్ ఐదవ తేదీని మనమందరమూ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఆరోజు మన దేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం. వారు రాష్ట్రపతి అయినా కూడా జీవితాంతం తనను తాను ఒక అధ్యాపకుడిగానే భావించేవారు. వారు ఎప్పటికీ ఒక అధ్యాపకుడిగానే జీవించడానికి ఇష్టపడేవారు. వృత్తి పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి ఆయన. ఒక విద్యావంతుడు, పండితుడు, ఒక రాజనీతిజ్ఞుడు, భారతదేశ రాష్ట్రపతి అయినా కూడా ప్రతి క్షణం ఒక అధ్యాపకుడిలానే భావించుకునేవారు. వారికి నా ప్రణామాలు.

” It is the supreme art of the teacher to awaken joy in creative expression and knowledge.” అని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అనే గొప్ప శాస్త్రవేత్త అన్నారు. తన విద్యార్థుల్లో సృజనాత్మక భావాన్ని, జ్ఞానం తాలూకూ ఆనందాన్నీ జాగృతం చేయడమే ఒక అధ్యాపకుడిలో్ అన్నింటికన్నా ఎక్కువగా ఉండాల్సిన ముఖ్యమైన గుణం. ఈసారి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటూ మనం ఒక సంకల్పాన్ని చేద్దామా? ఒక మిషన్ గా మారి ఒక ప్రచారాన్ని చేద్దామా? ’Teach to Transform, Educate to Empower, Learn to Lead” అనే సంకల్పం తో ముందుకు నడుద్దామా? ప్రతి ఒక్కరినీ ఐదేళ్ల వరకూ ఏదో ఒక సంకల్పంతో ముడిపెట్టండి. దానికి సాఫల్యం చేసుకునే మార్గాన్ని చూపెట్టండి. జీవితంలో సాఫల్యాన్ని పొందిన ఆనందాన్ని అందుకోండి. ఇలాంటి వాతావరణాన్ని మన పాఠశాలలు, మన కళాశాలలు, మన విద్యా సంస్థలు ఏర్పరచగలవు. మన దేశంలో మనం మార్పు గురించి మాట్లాడుతున్నప్పుడు, కుటుంబం గురించి మాట్లాడితే అమ్మ గుర్తుకు వచ్చినట్లు, సమాజం గురించి మాట్లాడితే ఉపాధ్యాయుడు గుర్తుకువస్తాడు. మార్పు లో ఉపాధ్యాయుడికి చాలా పెద్ద పాత్ర ఉంటుంది. ప్రతి ఉపాధ్యాయుడి జీవితంలోనూ తన సహజమైన కృషి కారణంగా మరొకరి జీవితంలో మార్పులు తెచ్చే ప్రయత్నంలో విజయం పొందిన ఘటనలు, ఎప్పుడో ఒకప్పుడు జరిగిన సంఘటనలు ఉండే ఉంటాయి. మనం గనుక కలిసికట్టుగా ప్రయత్నిస్తే, దేశాన్ని మార్చడంలో అతిపెద్ద పాత్ర వహించగలం. రండి.. ’Teach to Transform’ అనే మంత్రం తో ముందుకు నడుద్దాం.

“ప్రణామం ప్రధానమంత్రి గారూ, నా పేరు డా. అన్నయా అవస్థీ. నేను ముంబాయి నగరంలో ఉంటున్నాను. హోవార్డ్ విశ్వవిద్యాలయం వారి భారతీయ పరిశోధక కేంద్రం లో పనిచేస్తాను. నాకు financial inclusion , దానికి సంబంధించిన సామాజిక పథకాలు ఉండే ఆర్థిక సమావేశాలపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. మిమ్మల్ని నేను అడిగేదేమిటంటే, మీరు 2014లో ప్రవేశపెట్టిన జన ధన యోజన వల్ల మూడేళ్ల తరువాత కూడా భారతదేశాన్ని ఆర్థికంగా సురక్షితం చేసిందా? దేశం ఆర్థికంగా బలోపేతం అయ్యిందా? గణాంకాలు చూసి చెప్పగలరా? ఈ సాధికారత, సదుపాయాలు మన మహిళలకు, రైతులకు, గ్రామాల్లోని శ్రామికుల వద్దకూ చేరగలిగిందా?చెప్పండి. ధన్యవాదాలు.”

నా ప్రియమైన దేశప్రజలారా, ’ప్రధానమంత్రి జన ధన యోజన’ , financial inclusion , భారతదేశం లోనే కాక ప్రపంచం మొత్తం లోని ఆర్థిక జగత్తులోని పండితులకు చర్చావిషయమైంది. 2014, ఆగష్టు 28 న నా మనసులోని ఒక కలతో ఈ ప్రచారాన్ని ప్రారంభించాను. రేపు ఆగష్టు 28 న ఈ ’ప్రధానమంత్రి జన ధన యొజన’ మొదలై మూడేళ్ళు పూర్తి అవుతాయి. ముఫ్ఫై కోట్ల కొత్త కుటుంబాలవారిని దీనితో జతపరిచాం, బ్యాంక్ ఖాతాలు తెరిచాం. ఈ సంఖ్య ప్రపంచంలో ఎన్నో దేశాల జనాభా కంటే ఎక్కువ. ఈవేళ నా వద్ద పెద్ద సమాధానమే ఉంది.. మూడేళ్ళ లోపే సమాజంలోని ఆఖరి మెట్టుపై కూచుని ఉన్న నా పేద సోదరుడు కూడా దేశ ఆర్థిక వ్యవస్థ తాలూకూ ముఖ్య ధార లో భాగస్థుడయ్యాడు. అతడి అలవాటు మారింది. అతడు బ్యాంక్ కు వెళ్ళివస్తున్నాడు. డబ్బుని ఆదా చేస్తున్నాడు. డబ్బు ఉండటం వల్ల సురక్షితంగా ఉండగలుగుతున్నాడు. డబ్బు చేతిలో ఉన్నా, జేబులో ఉన్నా, ఇంట్లో ఉన్నా వృధాఖర్చు చెయ్యడానికి మనసవుతుంది. కానీ ఇప్పుడు ఏర్పడిన సంయమన వాతావరణం వల్ల నెమ్మది నెమ్మదిగా అతడికి కూడా డబ్బు పిల్లల అవసరలకు పనికివస్తుందని అర్థమౌతోంది. రాబోయే రోజుల్లో ఏదన్నా మంచి పని చెయ్యాలంటే డబ్బులు పనికివస్తాయని అర్థమైంది. పేదవాడు ఇప్పుడు తన జేబులోని రుపే కార్డ్ ని చూసుకుని, ధనవంతులతో సమానంగా తనను తాను చూసుకుంటున్నాడు. వాళ్ల జేబుల్లో క్రెడిట్ కార్డ్ ఉంటే, నా జేబులో రుపే కార్డ్ ఉంది అని సంతృప్తి పడుతున్నాడు. అది తనకు గౌరవంగా భావిస్తున్నాడు. ప్రధానమంత్రి జన ధన యోజనలో మన పేదవారి ద్వారా దాదాపు 65 వేల కోట్ల రూపాయిలు బ్యాంకుల్లో జమ అయ్యింది. ఒకరకంగా ఇది పేదవారి ఆదా. రాబోయే రోజుల్లో ఇదే వారి శక్తి. ప్రధానమంత్రి జన ధన యోజన ద్వారా ఎవరి ఖాతాలయితే ఏర్పడ్డాయో, వారికి బీమా లాభం కూడా లభించింది.

ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం, ప్రధానమంత్రి సురక్షా బీమా పథకం – ఒక రూపాయి, ముఫ్ఫై రూపాయల అతి తక్కువ ప్రీమియం ఈవేళ పేదవారికి జీవితంలో కొత్త నమ్మకాన్ని అందిస్తోంది. చాలా కుటుంబాల్లో ఒక రూపాయి బీమా కారణంగా; పేదవాడికి ఆపద వచ్చినప్పుడు, కుటుంబంలో ముఖ్యవ్యక్తి మరణిస్తే, కొద్ది రోజుల్లోనే వారికి రెండు లక్షల రూపాయిలు లభిస్తాయి. దళితులైనా, గిరిజనులైనా, మహిళలైనా, చదువుకున్న యువకుడైనా, తన కాళ్ళపై తాను నిలబడి ఏదన్నా చెయ్యాలనుకునే యువకుడైనా ప్రధానమంత్రి ముద్రా పథకం, స్టార్టప్ పథకం, స్టాండప్ పథకం మొదలైన పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. కోటాను కోట్ల యువతకు ప్రధానమంత్రి ముద్రా పథకం ద్వారా బ్యాంకుల నుండి ఏ గ్యారెంటీ లేకుండానే ఋణాలు అందేలా, వారు స్వయంగా తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. ఇంతే కాక, ప్రతి ఒక్కరూ మరొకరికి లేదా ఇద్దరికి ఉద్యోగాన్ని ఇచ్చే సఫలయత్నం చేశారు. గత కొద్ది రోజుల క్రితం బ్యాంకుల వారు నన్ను కలిశారు. జన ధన యోజన వల్లా, ఇన్సురెన్స్ వల్లా, రుపే కార్డ్ వల్లా, ప్రధానమంత్రి ముద్రా పథకం వల్లా, సామాన్య ప్రజలకు ఎలాంటి లాభం చేకూరిందో, వారు సర్వే చేయించారు. వాటి వల్ల ప్రేరణాత్మకమైన సంఘటనలు వెలికివచ్చాయి. ఇవాళ సమయం లేదు కానీ అలాంటి విషయాలను మై గౌ.ఇన్ లో అప్లోడ్ చెయ్యమని బ్యాంకులవారికి నేను కోరుతున్నాను. ఒక ప్రణాళిక వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పును తీసుకువస్తుందో, ఎలా శక్తిని నింపుతుందో , ఎలా కొత్త విశ్వాసాన్ని నింపుతుందో, దానిని చదివి ప్రజలు ప్రేరణ పొందుతారు. అలాంటి ఎన్నో ఉదాహరణలు నా వద్దకు వచ్చాయి. వాటిని మీవరకూ చేర్చే పూర్తి ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఇలాంటి ప్రేరణాత్మక ఘటనల వల్ల మీడియా వారు కూడా పూర్తి లాభాన్ని పొందవచ్చు. అలాంటివారి ముఖాముఖిని ప్రసారం చేసి కొత్త తరాలవారికి కొత్త ప్రేరణను అందించగలరు.

నా ప్రియమైన దేశప్రజలారా, మరోసారి మీ అందరికీ ’మిచ్ఛామి దుక్కడం ’ – నొప్పించి ఉంటే క్షమించండి . అనేకానేక ధన్యవాదాలు.