Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం, చైనా ల మధ్య జరిగిన లాంఛనప్రాయం కాని శిఖర స్థాయి సమావేశం


 

ప్రధాన మంత్రి, మాన్యులు శ్రీ నరేంద్ర మోదీ మరియు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షులు, శ్రేష్ఠులైన శ్రీ శీ జిన్ పింగ్ లు 2018 ఏప్రిల్ 27వ, 28వ తేదీలలో వారి ఒకటో లాంఛనప్రాయం కానటువంటి శిఖర స్థాయి సమావేశంలో పాలుపంచుకొన్నారు. ద్వైపాక్షిక స్థాయి లోను, ప్రపంచ స్థాయి లోను ప్రాముఖ్యం కలిగిన అనేక అంశాల పైన వారు తమ అభిప్రాయాలను ఒకరికి మరొకరు తెలియజెప్పుకొనేందుకు, ఇంకా ప్రస్తుత అంతర్జాతీయ స్థితిగతులను మరియు భావి అంతర్జాతీయ స్థితిగతులను గమనంలోకి తీసుకొంటూ ఇరు పక్షాల యొక్క ప్రాధాన్యాలను, దార్శనికతలను విడమరచి చాటి చెప్పుకొనేందుకు జరిగిన సమావేశం ఇది.

భారతదేశం మరియు చైనా ఏక కాలంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు గాను, వ్యూహాత్మకమైన నిర్ణయాత్మకమైన స్వతంత్రప్రతిపత్తి కలిగిన మహా శక్తులుగాను ఆవిర్భవించడం వల్ల ప్రాంతీయంగా మరియు ప్రపంచ పరంగా చూసినప్పుడు కొన్ని చిక్కులు ఉంటాయని వారు నమ్ముతున్నారు. భారతదేశానికి, చైనా కు మధ్య శాంతియుతమైన సంబంధాలు, నిలకడతనంతో కూడిన సంబంధాలు మరియు సమతుల్యత కలిగిన సంబంధాలు నెలకొంటే అది వర్తమాన ప్రపంచ అనిశ్చితుల నడుమ స్థిరత్వానికి ఒక సకారాత్మకమైన అంశంగా ఉండగలదన్న ఆలోచనను వారు వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను తగిన తీరున నడుపుకొంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి మరియు సమృద్ధికి సహాయకారి కాగలుగుతుందని, అంతే కాక ఆసియా శతాబ్దికి తగ్గ స్థితిగతులను ఇది నిర్మించగలుగుతుందని కూడా వారు అంగీకరించారు. ఈ దిశగాను మరియు జాతీయ ఆధునికీకరణ, ఇంకా ప్రజలకు ఇతోధిక సౌభాగ్యం అనే లక్ష్యాలను సాధించేందుకు ఇరు పక్షాలకు లాభదాయకంగా ఉండే తీరున మరియు కొనసాగే రీతిలో క్లోజర్ డివెలప్ మెంట్ పార్ట్ నర్ శిప్ ను పటిష్టపరచాలని వారు నిర్ణయించారు.

భారతదేశం చైనా సంబంధాలలో చోటు చేసుకొన్న పరిణామాలను ప్రధాన మంత్రి శ్రీ మోదీ మరియు అధ్యక్షులు శ్రీ శీ వ్యూహాత్మక దృష్టికోణం నుండి మరియు దీర్ఘ కాలిక దృష్టికోణం నుండి సమీక్షించారు. ఇప్పటికే ఏర్పాటై ఉన్న యంత్రాంగాలను కలబోసి, భవిష్యత్తు సంబంధం కోసం ఒక అతి విశాల వేదిక ను నిర్మించేందుకు గల అవకాశాల పరంగా చొరవ తీసుకోవడాన్ని చెప్పుకోదగ్గ రీతిలో పెంచాలని వారు అంగీకారానికి వచ్చారు. అభిప్రాయ భేదాలను మొత్తంమీద సంబంధం అనే కోణం నుండి చూస్తూ, ఒక పక్షం అవతలి పక్షం యొక్క సున్నితత్వాలను, ఆందోళనలను మరియు అభిలాషలను గౌరవించడానికి ప్రాముఖ్యాన్ని కట్టబెడుతూ, శాంతియుత చర్చ ద్వారా పరిష్కరించేందుకు అవసరమైన పరిణతి మరియు జ్ఞ‌ానం ఇరు పక్షాలకు ఉన్నాయని వారు అంగీకరించారు.

భారతదేశం చైనా సరిహద్దు ప్రశ్న పై ప్రత్యేక ప్రతినిధుల అంశంపై పని చేయడం కోసం నేతలు ఇరువురూ వారి మద్దతును వ్యక్తం చేశారు. ఒక న్యాయమైన, సహేతుకమైన మరియు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కరాన్ని వెతకడం కోసం కృషిని తీవ్రీకరించవలసిందిగా ఆ ప్రత్యేక ప్రతినిధులకు వారు విజ్ఞ‌ప్తి చేశారు. ద్వైపాక్షిక సంబంధాల యొక్క సర్వతోముఖ అభివృద్ధి తాలూకు విశాల హితం కోసం భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతం యొక్క అన్ని ప్రాంతాలలోనూ శాంతిని, ప్రశాంతత్వాన్ని పోషించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాల్సివుందని ఉభయ నేతలు నొక్కిపలికారు. ఈ దిశగా, వారు వారి వారి సైన్యాలకు కమ్యూనికేశన్ ను పటిష్టపరచుకొనేందుకు ఒక వ్యూహాత్మకమైన మార్గదర్శకత్వాన్ని జారీ చేశారు. నమ్మకాన్ని మరియు పరస్పర అవగాహనను పాదుగొల్పేందుకు మరియు సరిహద్దు సంబంధి వ్యవహారాలలో ప్రభావకారిత ను, పూర్వానుమేయాన్ని పెంపొందించేందుకే వారు ఈ పనిని చేశారు. ఇరుపక్షాలు అంగీకరించిన మేరకు వివిధ విశ్వాస నిర్మాణ చర్యలను చిత్తశుద్ధి గలిగి అమలుపరచవలసిందిగా ఉభయ నేతలు వారి సైన్యాలను ఆదేశించారు. ఈ చర్యలలో పరస్పర భద్రత, సమాన భద్రత సూత్రం, మరియు సరిహద్దు ప్రాంతాలలో ఘటనలను నివారించేందుకుగాను ఇప్పటికే అమలులో ఉన్నటువంటి సంస్థాగత ఏర్పాట్లను, ఇంకా సమాచారాన్ని పంచుకొనే యంత్రాంగాలను బలోపేతం చేయడం వంటివి చేరివున్నాయి.

ద్వైపాక్షిక వ్యాపారాన్ని మరియు పెట్టుబడులను ఒక సమతులమైన మరియు కొనసాగే తీరున ముందుకు తీసుకుపోవాలని, ఈ క్రమంలో ఉభయ ఆర్థిక వ్యవస్థలలో పూరకాలుగా ఉన్న అంశాలను ప్రయోజనాల రీత్యా ఉపయోగించుకోవాలని నేతలు ఇరువురు అంగీకరించారు. వారు రెండు దేశాలలోనూ ప్రజలు ఆ దేశం నుండి ఈ దేశానికి, ఈ దేశం నుండి ఆ దేశానికి రాకపోకలు జరపడాన్ని ప్రోత్సహించే మార్గాలను, ఇంకా సాంస్కృతిక బృందాల రాక పోకలను ప్రోత్సహించే మార్గాలను గురించి కూడా చర్చించారు. ఈ దిశగా కొత్త యంత్రాంగాలను నెలకొల్పేందుకు అన్వేషణ చేపట్టాలనుకొన్నారు.

రెండు పెద్ద దేశాలు అయిన చైనా కు మరియు భారతదేశానికి పరస్పర ప్రయోజనం ఇమిడివున్నటువంటి అంశాలు అతివ్యాప్తంగా ఉన్న సంగతిని అధ్యక్షులు శ్రీ శీ మరియు ప్రధాన మంత్రి శ్రీ మోదీ లు గమనంలోకి తీసుకొన్నారు. పరస్పర ప్రయోజనం ఇమిడివున్నటువంటి అంశాలన్నింటిపైనా మరింత విస్తృతమైన సంప్రదింపులను జరపడం ద్వారా వ్యూహాత్మక కమ్యూనికేశన్ ను పటిష్టపరచుకోవలసిన అవసరం ఉన్నదని వారు అంగీకరించారు. ఈ విధమైన వ్యూహాత్మక కమ్యూనికేశన్ పరస్పర అవగాహనను ఇతోధికం చేయడంలో ఒక సకారాత్మకమైన ప్రభావాన్ని చూపగలుగుతుందని, అలాగే ఇది ప్రాంతీయ స్థిరత్వానికి మరియు ప్రపంచ స్థిరత్వానికి సహాయపడుతుందని వారు నమ్ముతున్నారు.

భారతదేశం మరియు చైనా తమ తమ వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి ల ద్వారా ప్రపంచ శాంతికి మరియు సమృద్ధికి ప్రధానమైన తోడ్పాటును విడివిడిగా అందించాయని, ముందు ముందు కూడాను ప్రపంచ వృద్ధి కోసం తమ దేశాలు రెండూ చోదక శక్తుల పాత్రను పోషించడాన్ని కొనసాగించగలవని నేతలు ఇరువురూ అంగీకారం తెలిపారు. అన్ని దేశాలు వాటి అభివృద్ధి లక్ష్యాలను అనుసరించేందుకు వీలు కల్పించే మరియు ప్రపంచం లోని అన్ని ప్రాంతాలలోనూ పేదరికం ఇంకా అసమానత్వాల అంతానికి తోడ్పడే ఒక ప్రతినిధ్యపూర్వకమైన, అనేకత్వంతో కూడిన, బహుళధ్రువసహితమైన, ఆంక్షలకు తావు ఉండనటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ను నిర్మించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసివుందని వారు పునరుద్ఘాటించారు. వారు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి మరియు ప్రపంచ ఆర్థికాభివృద్ధికి తమ వంతుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలను గురించి కూడా ప్రస్తావించుకొన్నారు.

ప్రపంచంలో సమృద్ధిని మరియు భద్రతను సాధించడం లక్ష్యంగా ఉన్న తమ తమ విదేశాంగ విధాన దార్శనికతల తాలూకు అభిప్రాయాలను నేతలు ఉభయులు పంచుకొన్నారు. వారు జల వాయు పరివర్తన, స్థిర ప్రాతిపదికన అభివృద్ధి, ఆహార భద్రత తదితర ప్రపంచ సవాళ్లకు మన్నికైన పరిష్కార మార్గాలను చూపడంలో సకారాత్మకమూ, నిర్మాణాత్మకమూ అయిన రీతిలో ఇరు దేశాలూ కలసి తోడ్పాటును అందించాలని కూడా ఒప్పుకోవడం జరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను తీర్చడంలో ప్రతిస్పందించేటట్టు బహుళ పార్శ్విక ఆర్థిక సంస్థల మరియు రాజకీయ సంస్థల ప్రాతినిధ్యం విషయంలో సంస్కరణలు ఎంతైనా అవసరమని వారు నొక్కిపలికారు.

రెండు ప్రధానమైన, ఇంకా ప్రవర్ధమానమవుతున్న ఆర్థిక వ్యవస్థలైన భారతదేశం, చైనా లు అవి సముపార్జించినటువంటి అపార అభివృద్ధి సంబంధ అనుభవాలను మరియు దేశీయ శక్తియుక్తులను బట్టి చూస్తే, 21వ శతాబ్దంలో మానవ జాతి ఎదుర్కొంటున్న సవాళ్లకు వినూత్నమైనటువంటి మరియు చిరకాలం మన్నేటటువంటి పరిష్కార మార్గాలను చూపించడంలో ముందు వరుసలో నిలవడం కోసం చేతులు కలపాలని నేతలిద్దరూ అంగీకరించారు. ఈ పరిష్కార మార్గాలలో వ్యాధులపై పోరాడటం, వైపరీత్యాల రిస్కు ను తగ్గించడం తో పాటు అంతిమంగా న్యూనీకరించడం కోసం సమన్వయపూర్వక చర్యలను చేపట్టడం, జల వాయు పరివర్తన ను లఘూకరించే దిశగా పాటుపడటం, ఇంకా డిజిటల్ ఎంపవర్ మెంట్ ను ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి. ఈ ఈ రంగాలలో తమ ప్రావీణ్యాన్ని, తమ వనరులను ఒక చోటుకు చేర్చేందుకు మరియు మానవాళి విశాల హితం కోసం ఈ సవాళ్లను రూపుమాపడానికి అంకితమయ్యే ఒక గ్లోబల్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసేందుకు నేతలు అంగీకరించారు.

ఉగ్రవాదం రువ్వుతున్న ఉమ్మడి భయాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ, అధ్యక్షులు శ్రీ శీ ఇరువురూ గుర్తించారు. ఉగ్రవాదానికి- దాని యొక్క అన్ని నమూనాలు మరియు వ్యక్తీకరణలలోను- తీవ్రంగా ఖండించడంతో పాటు వాటికి ఎదురొడ్డి నిలవాలన్న కృత‌నిశ్చయాన్ని వారు పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేసేందుకు సహకరించుకొందామని వారు తమ వచనబద్ధతను మరో మారు ప్రకటించారు.

లాంఛనప్రాయం కానటువంటి రీతిలో జరిగిన ఈ శిఖర సమావేశం ప్రత్యక్షమైన, స్వేచ్ఛాయుతమైన మరియు పక్షపాత రహితమైన అభిప్రాయాల ఆదాన ప్రదానానికి అందించగలిగే ఆస్కారం ఎంతటిదన్నది నేతలు ఇరువురు లోతుగా పరిశీలించారు. ఇకమీదట కూడా ఇటువంటి సంభాషణలను జరుపుకొంటూ వుండాలని వారు అంగీకారానికి వచ్చారు. ముందుచూపు ను ప్రదర్శించినటువంటి ఈ చర్చలు ఆయా దేశాల వ్యూహాత్మక కమ్యూనికేశన్ యొక్క స్థాయిని దేశీయంగా, ప్రాంతీయంగా ఇంకా ప్రపంచ పరంగా ఎంపిక చేసుకోవలసిన విధానాలకు మార్గదర్శకత్వం వహించగల విధంగా విస్తరించాయి. రెండు దేశాలూ అవతలి పక్షం అభివృద్ధి సంబంధ మహత్త్వాకాంక్షల పట్ల గౌరవభావాన్ని కలిగివుండటం మరియు అభిప్రాయ భేదాలను పరస్పర సూక్ష్మగ్రాహ్యత తోను, వివేకం తోను సంబాళించుకోవాలన్న పునాది మీద నిర్మితమైన భారతదేశం, చైనా ల సంబంధాల యొక్క భవిష్యత్తు దిశ పట్ల ఒక ఉమ్మడి అవగాహనను ఏర్పరచడానికి ఈ చర్చలు తోడ్పడ్డాయి.