ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) 2022 బ్యాచ్ శిక్షణార్థి అధికారులు ఇవాళ లోక్ కల్యాణ్ మార్గ్ నం.7లోగల ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో విస్తృతంగా సంభాషించారు. ఉద్యోగ బాధ్యతులు స్వీకరించిన తర్వాత ఇప్పటిదాకా వారి అనుభవాల గురించి ఆరాతీశారు. ఈ మేరకు వారు తమ శిక్షణ సమయంలో గ్రామ సందర్శన, భారత్ దర్శన్, సాయుధ దళాలతో సంధానంసహా అనుభవాలను ఆయనతో పంచుకున్నారు. మొట్టమొదటగా తాము గమనించిన జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజన వంటి పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల పరివర్తన ప్రభావం గురించి కూడా వారు ప్రధానికి వివరించారు.
సంక్షేమ పథకాల అమలులో సంతృప్త స్థాయి సాధించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం గురించి, ఎలాంటి వివక్షకు తావులేకుండా ప్రతి పేదకూ వాటి లబ్ధిని అందించడం ద్వారా ఒనగూడిన ఫలితాల గురించి ప్రధాని వివరించారు. దక్షిణార్థ గోళంలోని దేశాలను అభివృద్ధి పథంలో నడిపించేలా తోడ్పాటునివ్వడంలో ఈ అవగాహన దోహదం చేస్తుందన్నారు. అలాగే ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం అమలు, విజయాలను అధ్యయనం చేయాల్సిందిగా శిక్షణార్థి అధికారులకు ప్రధాని సూచించారు. అంతేకాకుండా భారత జి-20 అధ్యక్షత గురించి కూడా వారితో చర్చించారు. అలాగే జి-20 సమావేశాలకు హాజరైనప్పటి వారి అనుభవాల గురించి వాకబు చేశారు. పర్యావరణ సమస్యలను ప్రస్తావిస్తూ, ‘మిషన్ లైఫ్’ (పర్యావరణం కోసం జీవనశైలి) గురించి ప్రధాని వారికి విశదీకరించారు. ప్రతి ఒక్కరూ జీవనశైలి మార్పు ద్వారా వాతావరణ మార్పు సమస్యను సమర్థంగా ఎదుర్కొనవచ్చునని స్పష్టం చేశారు.
*****
Interacted with Officer Trainees of the 2022 Batch of the Indian Foreign Service. We had a fruitful exchange of views on diverse subjects.https://t.co/SwVAhacGVA pic.twitter.com/GWbL4Mplid
— Narendra Modi (@narendramodi) July 25, 2023