ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి గౌరవనీయ డాక్టర్ అర్జు రాణా దేవుబా సమావేశమయ్యారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఆహ్వానం మేరకు ఆమె మన దేశంలో పర్యటనకు వచ్చారు.
నేపాల్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ప్రధానమంత్రి ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉభయ పక్షాల మధ్య ఉన్నతస్థాయి చర్చల వేగంపై ప్రశంసించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ ఆదానప్రదానాల సానుకూల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ భారత్ నిర్వహించిన 3వ ‘దక్షిణార్థ గోళ దేశాల గళంపై శిఖరాగ్ర సదస్సు’లో నేపాల్ ప్రధాని పాల్గొనడాన్ని కూడా ఆయన కొనియాడారు.
భారత్ అనుసరిస్తున్న ‘పొరుగుకు ప్రాధాన్యం’ విధానంతోపాటు నేపాల్‌లో భారత్ చేపట్టిన వివిధ అభివృద్ధి, సహకార కార్యక్రమాలపై దేవుబా ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. భారత్-నేపాల్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తన నిబద్ధతను ఆమె ప్రకటించారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీకి నేపాల్ ప్రధాని తరఫున ఆమె ఆహ్వానం అందజేశారు. ఈ ఆహ్వానాన్ని మన్నిస్తూ ఉభయపక్షాలకూ పరస్పర సానుకూల తేదీలను దౌత్య పద్ధతిలో నిర్ణయించి, పర్యటించేందుకు ప్రధానమంత్రి అంగీకారం తెలిపారు.
***
Pleased to welcome Nepal’s Foreign Minister @Arzuranadeuba. India and Nepal share close civilizational ties and a progressive and multifaceted partnership. Looking forward to continued momentum in our development partnership. pic.twitter.com/DwM8zq6qsL
— Narendra Modi (@narendramodi) August 19, 2024