ఈ వైరస్ గురించి తెలియదని మనమందరం అంగీకరిస్తున్నామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. గతంలో ఇటువంటి వైరస్ ఉన్న దాఖలాలు లేవు.. కాబట్టి, తెలియని ఈ కొత్త శత్రువును ఎదుర్కొనేటప్పుడు మన ప్రతిస్పందన కూడా అభివృద్ధి చెందుతుంది.
నేను ఆరోగ్య నిపుణుడిని కాదు.. కానీ నా అంచనా సంఖ్యల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎన్ని ప్రాణాలను రక్షించగలుగుతున్నాం అనే అంశం అధారంగా కోవిడ్-19పై పోరాటాన్ని అంచనా వేయాలని నేను అనుకుంటున్నాను. కేసులు, మరణాల నిష్పత్తి ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. అనేక అభివృద్ధి చెందిన దేశాలలో కంటే మరణాలు రేటు తక్కువగా ఉంది.
వైరస్ చాలా అస్థిరమైనది అని రుజువయ్యింది. ఒకానొక సమయంలో గుజరాత్ వంటి కొన్ని చోట్ల హాట్‌స్పాట్‌గా మారితే, కేరళ, కర్ణాటకలో పరిస్థితులు అదుపులో ఉన్నాయి. కొన్ని నెలల తర్వాత గుజరాత్లో క్రమంగా మెరుగుపడితే, కేరళ, కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నాయి.
“కేసులు, మరణాల నిష్పత్తి ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. అనేక అభివృద్ధి చెందిన దేశాలలో కంటే మరణాలు రేటు (ప్రతి పది లక్షలకు) తక్కువగా ఉంది. ”- పిఎం మోదీ
ఇక్కడ ఆత్మసంతృప్తికి ఆస్కారం లేదు.. ఇటీవల అక్టోబరు 20న జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోనూ మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరిగా అనుసరించాలని స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే. ‘జబ్ తక్ దవాయ్ నహీ, తబ్ తక్ ధిలాయి నహీ’ (వ్యాక్సిన్ వచ్చేంత వరకు అలసత్వం వద్దు)
2. కానీ మీరు ఊహించినట్టు వైరస్ నుంచి విస్తృతంగా బయటపడిందా లేదా నిరంతరం మెరుగుపరచడం, ఆవిష్కరణ జరిగిందా?
దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నాం.. లాక్డౌన్ విధించేటప్పటికి దేశంలో కరోనా కేసులు కేవలం కొన్ని వందలు మాత్రమే ఉన్నాయి.. వేరే దేశాల్లో వేలాది కేసులు నమోదయిన తర్వాత లాక్డౌన్ విధించారు.. చాలా క్లిష్టమైన సమయంలో మేము లాక్డౌన్ విధించాం. వివిధ దశల్లో లాక్డౌన్ విధించడమే కాదు, ఆర్ధిక వ్యవస్థ పునరుద్దరించడానికి సరైన మార్గంలో అన్‌లాక్ ప్రక్రియ చేపట్టాం.. దీనికి ఆగస్టు, సెప్టెంబరు ఫలితాలే నిదర్శనం.
మహమ్మారిని కట్టిడిచేయడానికి భారత్ ముందస్తు, చురుకైన, వ్యూహాత్మక విధానాన్ని అనుసరించింది. దేశంలో కోవిడ్ -19 మహమ్మారికి ప్రతిస్పందనగా భారత్ అవలంభించిన శాస్త్రీయ ఆధారిత విధానం ప్రయోజనకరంగా ఉంది. ఇది దేశంలో వైరస్ శరవేగంగా వ్యాప్తిని అడ్డుకోవడమే కాదు, వేలాది మంది ప్రాణాలను కాపాడింది.
ఈ ప్రతిస్పందన వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి దారితీసే పరిస్థితిని నివారించడానికి సహాయపడిందని అధ్యయనాలు చెబుతున్నాయి. సకాలంలో లాక్‌డౌన్‌తో పాటు, మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేయడం, కాంటాక్ట్-ట్రేసింగ్ అనువర్తనాన్ని ఉపయోగించడం మరియు వేగవంతమైన యాంటిజెన్ పరీక్షలను అమలు చేసిన దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది.
“మహమ్మారిని కట్టిడిచేయడానికి భారత్ ముందస్తు, చురుకైన, వ్యూహాత్మక, ప్రభుత్వ మరియు సమాజ విధానాన్ని అనుసరించింది. “- పిఎం మోదీ
ఇలాంటి మహమ్మారిని ఓడించడానికి , దేశం సమైక్యంగా లేకపోతే ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఈ వైరస్ పై పోరాడేందుకు దేశం మొత్తం ఏకతాటిపై నిలిచింది. మన ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్లు అయిన కోవిడ్ యోధులు, తమ ప్రాణాలకు ముప్పు అని బాగా తెలిసిన , ఈ దేశం కోసం పోరాడారు..
3. పాలనలో మీరు నేర్చుకున్న అతిపెద్ద అంశం ఏంటి?
చిట్టచివరి మైలుకు చేరుకునే డెలివరీ విధానాల ప్రాముఖ్యత గత కొన్ని నెలల్లో ఒక సానుకూల అభ్యాసం. ఈ డెలివరీ మెకానిజం చాలావరకు తమ ప్రభుత్వం తొలిసారి అధికారం చేపట్టినప్పుడు నిర్మించాం.. శతాబ్దానికి ఒకసారి వచ్చిన ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో మాకు ఇది ఎంతో సహాయపడింది. నేను కేవలం రెండు ఉదాహరణలు ఇస్తాను. మొదట, నేరుగా లబ్దిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పాలన ద్వారా.. లక్షలాది మంది ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేయగలిగాం. దీన్ని ప్రారంభించడానికి ఈ మౌలిక సదుపాయాలు గత ఆరేళ్లలో రూపుదిద్దుకున్నాయి.
అంతకుముందు, చిన్న చిన్న ప్రకృతి వైపరీత్యాలలో కూడా సాయం పేదలకు చేరలేదు ..భారీ అవినీతి జరిగింది. కానీ మేము అవినీతికి తావు లేకుండా చాలా తక్కువ సమయంలో ప్రజలకు భారీ స్థాయిలో ఉపశమనం కలిగించాం. దీనికి విరుద్ధంగా చెప్పాలంటే, 1970లలో మశూచి (స్మాల్ పాక్స్) మహమ్మారి సమయంలో భారతదేశం ఎలా పనిచేసిందో ఒక్కసారి వెనక్కు తిరిగి చూడాలి,దానిపై మీరు మీ పాఠకులకు అవగాహన కల్పించవచ్చు.
.
”మా అతిపెద్ద అభ్యసన ఏమిటంటే, ప్రభుత్వం, దేశం ఏకమైతే ఏ సవాలునైనా ఎదుర్కోగలదు.“ పిఎం మోదీ
ఇక రెండోది ఎటువంటి బలవంతం లేకుండా కోట్లాది మంది ప్రజలు ఇంత తక్కువ వ్యవధిలో మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని కొనసాగించడం వంటి ప్రవర్తనా మార్పులు ప్రపంచానికి మోడల్‌గా నిలిచాయి.
ప్రభుత్వం, దేశం మొత్తం ఏదైనా సవాల్‌ను సంయుక్తంగా ఎదుర్కోగలదని తెలుసుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసివచ్చాయి.. అన్ని మంత్రిత్వ శాఖలు విభిన్న బాధ్యతలను నిర్వహించాయి.. ప్రజల భాగస్వామ్యం ఐక్యత, సమర్థవంతమైన పోరాటాన్ని నిర్ధారిస్తుంది.
4. దేశంలో కోవిడ్ -19 వ్యాప్తి స్థితిపై మీ అంచనా ఏంటి?
వైరస్ ప్రారంభ దశలలో తీసుకున్న అనుకూల-క్రియాశీల చర్యలు మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం చేయడంలో సహకరించాయి. అయినప్పటికీ, అకాల మరణం కూడా చాలా బాధాకరమైంది.. దేశ పరిమాణం, కనెక్టివిటీని బట్టి ప్రపంచంలో కోవిడ్ -19 మరణాల రేటు తక్కువగా..రికవరీ రేటు ఎక్కువగా ఉంది. యాక్టివ్ కేసులు గణనీయంగా పడిపోతున్నాయి. మహమ్మారిపై పోరాటంలో ముందస్తు నిర్ణయాలు, చర్యలు సహకరించాయి. సెప్టెంబర్ మధ్యలో దాదాపు 97,894 రోజువారీ కేసుల గరిష్ట స్థాయి నుండి, మనం అక్టోబర్ చివరలో 50,000 కొత్త కేసులను మాత్రమే నివేదిస్తున్నాము. ఇదంతా కలిసికట్టుగా టీమ్ ఇండియాగా పనిచేయడం వల్లే సాధ్యమయ్యింది.
.
5.ఇటీవలి పోకడలు క్రియాశీల కేసులు మరియు మరణాలలో తగ్గుదలను సూచిస్తాయి, ఈ పెరుగుతున్న ఆశలు రానున్న కాలంలో జరిగే ప్రమాదాన్ని సూచిస్తున్నాయా . ప్రభుత్వంతో అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా మీరు కూడా ఈ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారా?
ఇది కొత్త వైరస్. ఈ విస్ఫోటనాన్ని మొదట నియంత్రించిన దేశాలు ఇప్పుడు కొత్త కేసుల గురించి నివేదించాయి.
భారతదేశ భౌగోళిక వ్యాప్తి, జనాభా సాంద్రత, సాధారణ సామాజిక సమావేశాలు ఈ సంఖ్యలను మనం చూసి, ఇతరులతో పోల్చడానికి ప్రయత్నించేటప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. మన రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు కొన్ని దేశాల కంటే పెద్దవి.
దేశం లోపల, ప్రభావం చాలా వైవిధ్యంగా ఉంటుంది – కొన్ని ప్రాంతాలలో చాలా తక్కువగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల దృష్టి నిరంతరాయంగా వాటి మీదే ఉన్నాయి. 700 కంటే ఎక్కువ జిల్లాలున్న దేశంలో, కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే దీని ప్రభావం కనబడుతుందని గుర్తుంచుకోవాలి.
“కొవిడ్ కేసులు తగ్గుతున్న ప్రస్తుత దశ ను మన సంకల్పాన్ని, మన ప్రవర్తనను, మన వ్యవస్థలను మరింతగా పటిష్టం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని నేను నమ్ముతున్నాను.”- పిఎం మోదీ
కొత్త కేసులు, మరణాల రేటు మరియు మొత్తం క్రియాశీల కేసులు కొంతకాలం క్రితం కంటే తక్కువ దశను సూచిస్తున్నాయి, అయినప్పటికీ మనం సంతృప్తి చెందలేము. వైరస్ ఇంకా పోలేదు. మనం ఇప్పుడే ఆత్మసంతృప్తి చెందలేము.
పరిస్థితిని నిర్వహించే సామర్థ్యాలను పెంపొందించుకోవడం, ప్రజలకు మరింత అవగాహన కల్పించడం, మరిన్ని సదుపాయాలను సృష్టించడం మొదలైన వాటిపై దృష్టి కేంద్రీకరించాలని నేను భావిస్తున్నాను’ ‘ఉత్తమమైనది జరగాలని ఆశిస్తున్నాము కాని జరగబోయే చెడు కు కూడా సిద్ధం గా ఉండాలి ’ అనే దానికి అనుగుణంగా దృష్టి సారించాలని నేను భావిస్తున్నాను.
6.కోవిడ్ -19 మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. జీవితాలు, జీవనోపాధికి మధ్య సరైన సమతౌల్యత సాధించే లక్ష్యంతో ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ప్రభుత్వం ఎంత వరు విజయవంతమైందని మీరు అనుకుంటున్నారు?
మనకు స్వాతంత్ర్యం లభించి ఏడు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ కొంతమంది ప్రజలు, ప్రభుత్వాలు రెండు వేర్వేరు సంస్థలనే వలసవాదం నుంచి బయటపడలేకపోతున్నారు. ఈ మనస్తత్వం వల్లే విపత్తుకు ప్రభుత్వం కారణమనే అభిప్రాయపడుతున్నారు. మహమ్మారి 130 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసింది.. దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం, పౌరులు కలిసి పనిచేస్తున్నారు.
కోవిడ్ -19 ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఆకస్మిక భారంతో ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. భారత్‌లో ఇలాంటి పరిస్థితిని నివారించడం, ప్రాణాలను రక్షించడం మా లక్ష్యం. ఈ వైరస్ కంటికి కనిపించని శత్రువు..ఇది ఇంతకు ముందు ఎన్నడూ ఊహించనిది.
ఒక అదృశ్య శత్రువుతో పోరాడుతున్నప్పుడు, దానిని అర్థం చేసుకోవడానికి, ఎదుర్కోవడానికి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించడానికి సమయం పడుతుంది. 130 కోట్ల మంది భారతీయులను సంప్రదించాల్సి ఉంటుంది , వైరస్ వల్ల మనం ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి, మనల్ని, మన కుటుంబ సభ్యులను ఎలా కాపాడగలమో వారికి అవగాహన కల్పించాల్సి ఉంది.
ఇది చాలా సవాలుతో కూడుకున్న పని. జనాల్లో చేతనను జాగృతం చేయడం చాలా ముఖ్యం. జన చేతన యొక్క జాగృతి జనాల భాగస్వామ్యం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది . జనతా కర్ఫ్యూ ద్వారా, తాలీలను కొట్టడం ద్వారా లేదా దీపాలను వెలిగించడం ద్వారా సమిష్టి జాతీయ సంకల్పాన్ని సూచించి, భారతీయులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి జన్ భగిదారిని (జనాల భాగస్వామ్యం) ఉపయోగించాం. అతి తక్కువ సమయంలో సామూహిక అవగాహనకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ.
7.మరి మీ ఆర్ఢిక వ్యూహం ఏమిటి?
ప్రాణాలను కాపాడటం కోవిడ్ -19 నుంచి ప్రాణాలను రక్షించడానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది పేదలకు తగినంత ఆహారం, అవసరమైన వాటిని అందించడం గురించి కూడా ఉంది. కార్పొరేట్ రంగానికి ఆర్థిక ప్యాకేజీని విడుదల చేయాలని చాలా మంది నిపుణులు, మీడియా ప్రభుత్వాన్ని కోరినప్పుడు కూడా, మా దృష్టి బలహీన వర్గాల ప్రాణాలను కాపాడటమే. పేదలు, వలసదారులు, రైతుల ఇబ్బందులను తొలగించడానికి మొదట పీఎం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని ప్రకటించాం.
”ఎనిమిది నెలలు పాటు 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు పంపిణీ మానవ చరిత్రలో ఎన్నడూ లేని కార్యక్రమం. ”- పిఎం మోదీ
ఉత్పాదకతతో రాజీపడకుండానే సురక్షిత దూరం నియమాన్ని మరింత పక్కాగా పాటించడానికి వీలున్న రంగాలలో వ్యవసాయరంగం ఒకటన్న సంగతిని మేము ఎంతో ముందుగానే అర్థం చేసుకున్నాము. ఈ కారణంగా ఆరంభం నుంచే వ్యవసాయ సంబంధ కార్యకలాపాలను అనుమతించడం జరిగింది. అనేక నెలలపాటు అంతరాయం ఎదురైనప్పటికీ ఈ రంగం చక్కని ఫలితాలను నమోదు చేయగలిగింది.
తక్షణ, మధ్యస్థాయి అవసరాలున్న జనాభాకు రికార్డుస్థాయిలో ఆహారధాన్యాల పంపిణీ, శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడిపాం. ప్రస్తుతం భారత ఆర్ధిక వ్యవస్థ పట్టాలెక్కింది, ఇది మరింత వేగంతో ముందుకెళ్లనుంది.
ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చడానికి మేము ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీతో ముందుకు వచ్చాము. ఈ ప్యాకేజీ సమాజంలోని అన్ని వర్గాలు మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క అన్ని రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించింది.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సంస్కరణలను అమలు చేయడానికి ఇది మాకు అవకాశం కల్పించింది, అయితే ఇంతకు ముందు ఎవరూ చొరవ తీసుకోలేదు. బొగ్గు, వ్యవసాయం, కార్మిక, రక్షణ, పౌర విమానయానం వంటి రంగాల్లో సంస్కరణలు చేపట్టబడ్డాయి, ఇది సంక్షోభానికి ముందు ఉన్న అధిక వృద్ధి పథంలో తిరిగి రావడానికి దోహదపడుతుంది.
భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఊహించిన దానికంటే వేగంగా దారి లోకి వస్తున్నందున మా ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
8.మీ ప్రభుత్వం వ్యవసాయ బిల్లులు, కార్మిక సంస్కరణలు అనే రెండు ముఖ్యమైన రెండవ తరం సంస్కరణలను చేపట్టింది. ప్రత్యేకించి ఆర్థిక మందగమనం, రాజకీయ వ్యతిరేకత ఎదుర్కొంటున్న సమయంలో ఆర్థిక డివిడెండ్‌ను అందించే ఈ కార్యక్రమాలపై ఎటువంటి అంచనాలతో ఉన్నారు?
సంస్కరణలు చేపట్టాలని నిపుణులు ఎప్పటి నుంచో సూచిస్తూ వచ్చారు. చివరికి రాజకీయ పక్షాలు కూడా ఈ సంస్కరణల పేరు చెప్పే ఓట్లను అడుగుతూ వస్తున్నాయి. ఈ సంస్కరణలు చోటు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. సమస్య ఏమిటంటే – దీనికి సంబంధించిన ఖ్యాతిని మేము పొందాలని ప్రతిపక్షాలు కోరుకోవడం లేదు.
మాకు ఎలాంటి ఖ్యాతి అవసరం లేదు. కేవలం రైతులు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సంస్కరణలు తీసుకువచ్చాం. మేము చేసిన పనుల కారణంగా వారు మా ఉద్దేశాలను అర్థం చేసుకుని , విశ్వసిస్తారు.
”భారతీయ వ్యవసాయంలో లోపం ఏమిటంటే, మన రైతులు పడ్డ శ్రమకు సంపూర్ణ రాబడి రాకపోవడం. ఈ సంస్కరణల ద్వారా తీసుకువచ్చిన కొత్త నిర్మాణం మన రైతుల లాభదాయకతను గణనీయంగా పెంచుతుంది.” -పిఎం మోదీ
గత ఆరేళ్లలో వ్యవసాయ రంగాన్ని దశల వారీగా సంస్కరించాలని నిర్ణయించాం.. కాబట్టి ఈ రోజు మనం చేసింది 2014 లో మేము ప్రారంభించిన చర్యలలో ఓ భాగం. మేము కూడా కనీస మద్దతు ధరలలను చాలాసార్లు పెంచాం.. వాస్తవానికి, మునుపటి ప్రభుత్వాలు చేసినదానికంటే ఎంఎస్పీ చాలా రెట్లు ఎక్కువ. నీటిపారుదల, బీమా రెండూ భారీ మెరుగుదల సాధించాయి. రైతులకు ప్రత్యక్ష ఆదాయ సహకారం లభించింది.
భారతీయ వ్యవసాయంలో లోపం ఏమిటంటే, మన రైతులు పడ్డ శ్రమకు సంపూర్ణ రాబడి రాకపోవడం. ఈ సంస్కరణల ద్వారా తీసుకువచ్చిన కొత్త నిర్మాణం మన రైతుల లాభదాయకతను గణనీయంగా పెంచుతుంది. ఇతర పరిశ్రమల మాదిరిగానే, లాభాలు సంపాదించిన తర్వాత, ఎక్కువ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి ఈ రంగంలో తిరిగి పెట్టుబడి పెట్టబడుతుంది. లాభం మరియు తిరిగి పెట్టుబడి యొక్క మంచి చక్రం ఉద్భవించింది. వ్యవసాయ రంగంలో కూడా, ఈ చక్రం మరింత పెట్టుబడి, ఆవిష్కరణ మరియు కొత్త సాంకేతికతకు తలుపులు తెరుస్తుంది. ఈ విధంగా, ఈ సంస్కరణలు వ్యవసాయ రంగాన్ని మాత్రమే కాకుండా మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చగల అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి..
ఎంఎస్‌పిలో, ఇప్పుడే పూర్తయిన రబీ మార్కెటింగ్ సీజన్లో, కేంద్ర ప్రభుత్వం 389.9 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కొనుగోలు చేసింది, ఇది ఆల్ టైమ్ రికార్డ్, 75,055 కోట్లు రైతులకు ఎంఎస్‌పిగా వెళుతున్నాయి.
ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో 159.5 లక్షల ఎమ్ టి ల వరకు వరి ధాన్యం కొనుగోలు చేయబడింది, గత ఏడాది ఇదే సమయంలో 134.5 లక్షల ఎమ్ టిలతో పోలిస్తే ఇది 18.62% పెరిగింది. ఇప్పుడు పార్లమెంటు ఆమోదించిన మూడు ఆర్డినెన్స్ లను తీసుకొచ్చిన తర్వాత ఇదంతా జరిగింది.
ఐదేళ్ల యుపిఎ -2 (2009-10 నుండి 2013-14) తో పోల్చితే గత ఐదేళ్లలో వరి ధాన్యం కోసం రైతులకు ఎంఎస్పి చెల్లింపు 1.5 రెట్లు, గోధుమలకు 1.3 రెట్లు, పప్పుధాన్యాలకు 75 రెట్లు, నూనె గింజలకు 10 రెట్లు పెరిగాయి. ఇది MSP గురించి నిరాధారమైన వార్తలు వ్యాప్తి చేస్తున్న వారి అబద్ధాలు, నిజాయితీని నిరూపించింది.
9.కార్మిక సంస్కరణల గురించి మీ అభిప్రాయం ఏంటి?
ఈ సంస్కరణలు కార్మికులకు చాలా అనుకూలమైనవి. నిర్ణీత కాలానికి నియమించినప్పటికీ అన్ని ప్రయోజనాలు, సామాజిక భద్రతకు వారు అర్హులు. కార్మిక సంస్కరణలు గణనీయమైన ఉపాధిని సృష్టించడానికి సహాయపడతాయి. అదే సమయంలో కనీస వేతన సంస్కరణలు, అనధికారిక రంగంలో కార్మికులకు సామాజిక భద్రత కల్పించి, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం ద్వారా కార్మికుడిని రక్షించడం.. సకాలంలో వేతనాలు చెల్లించడానికి నిర్ధారిస్తుంది. కార్మికుల వృత్తి భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది.. తద్వారా మెరుగైన పని వాతావరణానికి దోహదం చేస్తుంది.
గత కొన్ని వారాల్లో, మేము ఏమి చేయాలో అది పూర్తి చేశాం. 1,200 కు పైగా సెక్షన్లు ఉన్న 44 కేంద్ర కార్మిక చట్టాలు కేవలం నాలుగు కోడ్ లుగా సమీకరించబడ్డాయి.. ఇప్పుడు కేవలం ఒక రిజిస్ట్రేషన్, ఒక మదింపు మరియు ఒక రిటర్న్ ఫైలింగ్ ఉంటుంది. సులభమైన సమ్మతితో పాటు, ఇది వ్యాపారాలకు పెట్టుబడి పెట్టడానికి మరియు ఉద్యోగి మరియు యజమానికి ఇద్దరికీ గెలిచే పరిస్థితిని సృష్టించడానికి ఒక స్థిరమైన పాలనకు దారితీస్తుంది.
“కార్మిక సంస్కరణలు సకాలంలో వేతనాలు చెల్లించేలా నిర్ధారిస్తుంది. కార్మికుల వృత్తి భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది.. తద్వారా మెరుగైన పని వాతావరణానికి దోహదం చేస్తుంది.”పిఎం మోదీ
ఉత్పాదక రంగం కోసం, గత ఆరు సంవత్సరాల్లో, కొత్త ఉత్పాదక యూనిట్ల కోసం కార్పొరేట్ పన్ను రేటును 15% కు తగ్గించడం నుండి ఎఫ్‌డిఐ పరిమితులను పెంచడం మరియు అంతరిక్షం, రక్షణ వంటి వ్యూహాత్మక రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించడం నుండి మేము అనేక సంస్కరణ చర్యలు తీసుకున్నాము. ముఖ్యంగా, ఉత్పాదక రంగానికి సంస్కరణలు, ఒక భాగం మిగిలి ఉన్నాయి, అవే – కార్మిక సంస్కరణలు. ఆ పని కూడా చేశాం. భారతదేశంలో సంఘటిత రంగంలో కార్మికుల సంఖ్య కన్నా, కార్మిక చట్టాల సంఖ్య ఎక్కువగా ఉందని తరచూ ఒక చలోక్తి వినిపిస్తూ ఉంటుంది. కార్మిక చట్టాలు ఒక కార్మికులకు తప్ప ప్రతి ఒక్కరికీ తరచుగా ఉపయోగపడుతూ వచ్చాయి. వ్యవస్థలోని లాభాలు భారతదేశ కార్మిక లోకానికి అందనిదే సంపూర్ణ వృద్ధి చోటుచేసుకోవడానికి అవకాశం లేదు.
గత కొన్ని నెలల్లో చేపట్టిన ఈ సంస్కరణలు తయారీ మరియు వ్యవసాయ రంగాలలో వృద్ధి రేటు మరియు రాబడిని పెంచడానికి సహాయపడతాయని నాకు నమ్మకం ఉంది. అంతేకాకుండా,.మేము ప్రవేశపెట్టిన సంస్కరణలు ఇది ఒక న్యూ ఇండియా అని, మార్కెట్లు, మార్కెట్ శక్తుల పట్ల న్యూ ఇండియా విశ్వాసాన్ని కలిగివుందన్న సంకేతాన్ని ప్రపంచానికి ఇస్తున్నాయి.
10.ఒక విమర్శ ఏమిటంటే, ఉద్యోగులను తొలగించే సౌలభ్యం 300 మంది వరకు పనిచేసే కర్మాగారాలకు విస్తరించింది. కానీ ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు మరియు ఇతర రంగాలలో భారీ కర్మాగారాలు మరెన్నో పనిచేస్తున్నాయి. తొలగించిన వారికి పరిహారాన్ని తీవ్రంగా పెంచేటప్పుడు అన్ని కర్మాగారాలకు ఈ సౌలభ్యాన్ని ఎందుకు విస్తరించకూడదు? అలాగే, సమ్మె చేసే హక్కు కుదవకు సంబంధించి వస్తున్న విమర్శలపై మీ అభిప్రాయాలు ఏమిటి ?
భారతదేశం ఓ జంట సమస్యతో బాధపడుతోంది: మన కార్మిక చట్టాలు చాలా మంది కార్మికులకు సామాజిక భద్రత కల్పించలేనివి. కార్మిక చట్టాల భయంతో కంపెనీలు ఎక్కువ మంది కార్మికులను నియమించుకోవటానికి ఇష్టపడలేదు, ఇది కార్మిక-ఇంటెన్సివ్ ఉత్పత్తిని నిరాకరించింది. ఇన్ స్పెక్టర్-రాజ్ వ్యవస్థ, సంక్లిష్టమైన కార్మిక చట్టాలు యజమానులపై తీవ్ర ప్రభావం చూపాయి.
యజమాని–ఉద్యోగి ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు నిత్యం ఘర్షణ పడాలన్న మనస్తత్వం నుండి మనం బయటకు రావాలి. ఇద్దరూ సమానంగా ప్రయోజనం పొందే యంత్రాంగం ఎందుకు లేదు? లేబర్ అనేది ఏకకాలిక విషయం కనుక, చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకు వారి ప్రత్యేక పరిస్థితి మరియు ఆవశ్యకతలకు అనుగుణంగా కోడ్ లను మరింత సవరించడానికి వెసులుబాటు ను ఇస్తుంది.
”పరిశ్రమ కొరకు సులభతరమైన వ్యాపారాన్ని ధృవీకరించడం కొరకు, కార్మిక సంక్షేమాన్ని పరిష్కరించడం కొరకు నాలుగు లేబర్ కోడ్ లు ఉద్దేశించబడ్డాయి.”- పిఎం మోదీ
సమ్మె చేసే హక్కు ఏ మాత్రం తీసేయలేదు. వాస్తవానికి, కార్మిక సంఘాలకు కొత్త హక్కు లభించింది, వారికి చట్టబద్ధమైన గుర్తింపు లభిస్తుంది.
యజమాని-ఉద్యోగి సంబంధాన్ని మరింత క్రమబద్ధంగా మరియు సమన్వయంగా మేం రూపొందించాం. నోటీసు వ్యవధి యొక్క నిబంధన ఉద్యోగులు మరియు యజమానుల మధ్య ఏదైనా ఫిర్యాదులను సామరస్యంగా పరిష్కరించడానికి అవకాశాన్ని ఇస్తుంది.
11.కోవిడ్ 19 కారణంగా జీఎస్టీ వ్యవస్థ గణనీయమైన ఒత్తిడికి గురైంది. నేరుగా రుణాలను తీసుకోడానికి రాష్ట్రాలకు కేంద్రం అనుమతించింది.. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితిని మీరు ఎలా అంచనా వేస్తారు?
గత ఆరేళ్లుగా మేం చేపట్టిన అన్ని చర్యలు పోటీ, సహకార సమాఖ్యవాదం స్ఫూర్తిని కలిగించేవే. మనలాంటి పెద్ద దేశం కేవలం కేంద్రం అనే స్తంభంపై మాత్రమే అభివృద్ధి చెందదు.. దీనికి రాష్ట్రాల సహకారం అవసరం. ఈ విధానం వల్ల కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటం కూడా బలపడింది. సమిష్టిగా నిర్ణయాలు తీసుకున్నారు. చరిత్రలో సమాంతరంగా లేని వారి సూచనలు, సలహాలు వినడానికి ముఖ్యమంత్రులతో అనేకసార్లు వీడియో-సమావేశాలు నిర్వహించాం.
జీఎస్టీలో, ఇది అన్ని ఖాతాల ద్వారా అసాధారణమైన సంవత్సరం. చాలా ఊహలు, లెక్కలు శతాబ్దంలో ఒకసారి వచ్చే మహమ్మారిని పరిగణనలోకి తీసుకోలేదు. అయినప్పటికీ, మేము ముందుకు సాగడానికి అనేక ప్రయత్నాలు చేశాం.. చాలా రాష్ట్రాలు దీనికి అంగీకరించాయి. ఏకాభిప్రాయంతో అభివృద్ధి చెందుతోంది.
12.మీరు చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుత సందర్భంలో ఆర్థికంగా రాష్ట్రాలతో మీరు ఎలాంటి సహకారాన్ని ప్రతిపాదిస్తున్నారు?
కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఒక్క జిఎస్టి కే పరిమితం కాదని గుర్తు పెట్టుకోవడం ముఖ్యం. మహమ్మారి ప్రబలిన నేపథ్యంలోను స్థూల పన్నుల సంబంధిత ఆదాయం తగ్గినప్పటికీ మేము రాష్ట్రాలకు వనరుల బదిలీని పెంచాము. ఏప్రిల్, జులై మధ్య కాలంలో కేంద్ర ప్రాయోజిత పథకాలతో సహా, రాష్ట్రాలకు అందించిన ఆర్థిక సహాయం, అలాగే పన్నులలో వాటా బదలాయింపు.. ఇవన్నీ కలిపి కిందటి సంవత్సరంలో ఇదే కాలంలో ఇచ్చిన 3.42 లక్షల కోట్ల రూపాయల కంటే 19 శాతం అధికంగా అనగా 4.06 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే మా రాబడులు పడిపోయినప్పటికీ మేము రాష్ట్రాలకు నిధులను అందిస్తూనే వచ్చాము.
కోవిడ్-19 మహమ్మారి ని దృష్టిలో ఉంచుకుని, 2020-21 సంవత్సరానికి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో 2 శాతం వరకు అదనపు రుణాలు తీసుకునే పరిమితిని కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మొత్తం రూ. 4.27 లక్షల కోట్లు రాష్ట్రాలకు అందుబాటులో ఉంది. 2020 జూన్‌లో మొదటి 0.5 శాతం పెంచడానికి కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల అదనంగా రూ .1,06,830 కోట్లు రాష్ట్రాలకు అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్రాల అభ్యర్థన మేరకు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డిఆర్ఎఫ్) ను ఉపయోగించే పరిమితిని 35 % నుండి 50 % కి పెంచారు. కరోనాపై పోరాడటానికి రాష్ట్రాలకు మరిన్ని నిధులు సమకూరడానికి ఈ సహాయం చేయబడింది.
13. రాష్ట్రాలకు కేంద్రం ఆటంకాలను సృష్టిస్తోందని చాలా మంది వాదించారు. మీ ఆలోచనలు?
ఇంతకు ముందు ఏమి జరిగిందో ఓ ఉదాహరణ ఇస్తాను. యూపీఏ ప్రభుత్వంలో సీఎస్టీని వ్యాట్ భర్తీ చేసినప్పుడు, ఏదైనా ఆదాయ కొరత ఏర్పడితే రాష్ట్రాలకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ యూపీఏ ఏం చేసిందో మీకు తెలుసా? రాష్ట్రాలకు ఇచ్చిన హామీ ప్రకారం పరిహారం ఇచ్చేందుకు నిరాకరించారు. కేవలం ఒక సంవత్సరం మాత్రమే కాదు. ఐదేళ్లపాటు నిరంతరాయంగా. యూపీఏ హయాంలో జీఎస్టీకి రాష్ట్రాలు రాష్ట్రాలు అంగీకరించకపోవడానికి ఇది ఒక కారణం.
వేరే ప్రభుత్వం అయినప్పటికీ, ఆ నిబద్ధత ఉండటంతోనే మేము 2014 లో అధికారాన్ని చేపట్టినప్పుడు ఆ బకాయిలను తీర్చడానికి అంగీకరించాం. ఇది సమాఖ్యవాదానికి మా విధానాన్ని చూపిస్తుంది.
14.అంటువ్యాధుల సంఖ్య, ఆర్థిక సంకోచం అనే స్తంభాలపై భారత్ నిలబడిందని విమర్శకులు అంటున్నారు. వీటికి మీరు ఎలా స్పందిస్తారు?
మన రాష్ట్రాలకి సమానమైన జనాభా ఉన్న ఇతర దేశాలతో మన దేశాన్ని పోల్చడానికి ఖచ్చితమైన కేసుల సంఖ్య ను ఉపయోగించుకునేంత తెలివైన వ్యక్తులు దేశంలో ఉన్నారు.
ఏదేమైనా, ఎకనామిక్ టైమ్స్ మెరుగైన పరిశోధనలు చేస్తుందని, అలాంటి వాదనలను పునరుద్ఘాటించవద్దని నేను ఆశిస్తున్నాను.. ప్రస్తుత సంఖ్యను చూస్తున్నప్పుడు, మార్చిలో నిపుణులు ఏ రకమైన భారీ సంఖ్యలను అంచనా వేశారో కూడా చూడాలి.
”ప్రభుత్వాన్ని కించపరచడానికి కోవిడ్ -19 కి వ్యతిరేకంగా చేసిన అద్భుతమైన పోరాటం ఘనతను ప్రజలు తిరస్కరించాలని విమర్శకులు కోరుకుంటున్నారు. “- పిఎం మోదీ
15.ఆర్థిక రంగం తిరిగి పుంజుకోవడానికి స్పష్టమైన సూచికలుగా మీరు సూచించే ఐదు ఆర్థిక పారామితులు ఏమిటి? ప్రత్యేకంగా, వచ్చే ఏడాది మీరు ఎలాంటి వృద్ధి (రీబౌండ్) ఆశిస్తున్నారు?
మనం ఆర్థిక పునరుద్ధరణ మార్గంలో ఉన్నాము.. సూచికలు కూడా అదే విషయాన్ని సూచిస్తున్నాయి. మొదట, వ్యవసాయంలో, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, మన రైతులు అన్ని రికార్డులను బద్దలు కొట్టారు మరియు మేము కూడా MSP యొక్క అత్యధిక స్థాయిలో రికార్డు సేకరణను చేసాము. ఈ రెండు కారకాలు – రికార్డు ఉత్పత్తి మరియు రికార్డు కొనుగోలు – గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన ఆదాయాన్ని ఇవ్వబోతున్నాయి, ఇది డిమాండ్ ఉత్పత్తి యొక్క దాని స్వంత సద్గుణ చక్రం కలిగి ఉంటుంది. రెండవది, రికార్డు స్థాయిలో ప్రవాహాలు పెట్టుబడిదారులకు స్నేహపూర్వక దేశంగా భారతదేశం యొక్క పెరుగుతున్న ఇమేజ్ ను సూచిస్తున్నాయి. ఇక కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ , విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు కాలంలో 13 శాతం మేర పెరిగి 35.73 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది కూడా రికార్డు స్థాయిలో ఉంది. మూడోది, ట్రాక్టర్ అమ్మకాలతోపాటు ఆటో అమ్మకాలు మునుపటి సంవత్సర స్థాయిలను చేరుకుంటాయి లేదా అధిగమించాయి.. ఇది డిమాండ్ లో బలమైన పునరుజ్జీవాన్ని సూచిస్తుంది. నాలుగోది, ఇక తయారీ రంగంలో కూడా క్రమానుగత వృద్ధి సాగుతోంది. మనం ప్రపంచ మార్కెట్లలో చైనా , బ్రెజిల్ తర్వాతి స్థానంలో ఉన్నాం. ఉత్పాదక వృద్ధి ఏడు నెలల్లో మొదటి సంవత్సరం ఎగుమతుల పెరుగుదలలో ప్రతిబింబిస్తుంది. ఈ-వే బిల్లులు, జీఎస్టీ వసూళ్ల వృద్ధి కూడా ఆరోగ్యకరంగా ఉంది.
”పెట్టుబడి. మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే రికవరీ మరియు వృద్ధికి చోదక శక్తిగా మారుతుందని నేను భావిస్తున్నాను.”- పిఎం మోదీ
చివరగా, ఈ.పీ.ఎఫ్.వో నూతన నికర చందాదారుల విషయానికొస్తే, జూలై 2020 తో పోల్చితే ఆగస్టు 2020 నెల 34% పెరిగింది. మరో మిలియన్ కంటే ఎక్కువ మంది కొత్త చందాదారులు చేరారు. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనం.
ఇది కాకుండా, విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రైల్వే సరుకు రవాణా వంటి ఆర్థిక పునరుద్ధరణ యొక్క ముఖ్య సూచికలు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో 15% మరియు విద్యుత్ డిమాండ్ 4% పెరిగాయి. రికవరీ విస్తృత ఆధారితమైనదని ఇది చూపిస్తుంది. మరియు ,ఆత్మ నిర్భర్ భారత్ ప్రకటనలు ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు మరియు అసంఘటిత రంగానికి పెద్ద ఉద్దీపన.
16.తదుపరి ఉద్ధీపన కోసం మీ ప్రణాళిక ఏమిటి?
మొత్తం స్థూల ఆర్థిక స్థిరత్వానికి భరోసా ఇచ్చేలా ఆర్థిక వ్యవస్థను నిరంతరం ఉత్తేజపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలనూ మేము సమయానుకూలంగా తీసుకుంటాము. మహమ్మారితో మన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని గుర్తుంచుకోవాలి. అయినా, మన ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే సామర్థ్యాన్ని అసాధారణంగా చూపించింది. అది ప్రధానంగా మన ప్రజల లాఘవం కారణంగానే. ఇది ఈ సంఖ్యలకు అందని విషయం. కానీ ఆ సంఖ్యల వెనుక ఉన్న కారణం. ఓ షాపు యజమాని, ఒక వ్యాపారి, ఒక ఎంఎస్‌ఎంఇని నడిపే వ్యక్తి, ఒక కర్మాగారంలో పని చేసే వ్యక్తి, ఒక సంస్థాపకుడు…. ఇలాంటి వారంతా హీరోలు. బలమైన మార్కెట్ సెంటిమెంట్ కు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు బాధ్యులు.
17.ఇండియా ఇప్పటికీ తయారీ రంగానికి ఒక ప్రధాన ప్రపంచ కేంద్రంగా అవతరించగలదని మీరు విశ్వసిస్తున్నట్టే ఉంది. ప్రత్యేకించి, చైనాతో తమ సంబంధాల వల్ల కలిగే నష్టం నుంచి బయటపడటానికి కంపెనీలు చూస్తున్న సమయంలో ప్రపంచ సరఫరా గొలుసు కట్టులో భాగం కావడం ద్వారా… ఈ విషయంలో సాధించిన పురోగతి ఏమిటి? ఇండియా ప్రపంచ సరఫరా గొలుసులో చైనాకు విశ్వసనీయైన ప్రత్యామ్నాయంగా అవతరించగలదా?
ఇండియా ఈ మహమ్మారి వచ్చిన తర్వాత మాత్రమే తయారీ రంగం గురించి మాట్లాడటం ప్రారంభించలేదు. కొంత కాలంగా తయారీ రంగాన్ని పెంచడంపై మనం పని చేస్తూనే ఉన్నాము. ఇండియా నైపుణ్య శ్రామిక శక్తితో కూడిన ఒక యువ దేశం. అయితే, ఇతరుల నష్టం నుంచి ప్రయోజనం పొందడంలో ఇండియాకు విశ్వాసం లేదు. భారత దేశం తన సొంత బలాల పైనే ప్రపంచ తయారీ కేంద్రంగా మారుతుంది. మా ప్రయత్నాలు… ఏదో ఒక దేశానికి ప్రత్యామ్నాయంగా మారడానికి కాదు, ప్రత్యేక అవకాశాలను కల్పించే దేశంగా మార్చడానికి. మనం అందరి పురోగతినీ చూడాలనుకుంటున్నాం. భారత దేశం ముందడుగు వేస్తే, మానవాళిలో ఆరో వంతు పురోగమిస్తుంది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక కొత్త ప్రపంచ వ్యవస్థ ఎలా స్థాపితమైందో మనం చూశాం. కోవిడ్19 తర్వాత అలాంటిదే జరుగుతుంది. ఈసారి, ఇండియా తయారీ రంగపు రథానికి సారథ్యం వహిస్తుంది. ప్రపంచ సరఫరా గొలుసును అనుసంధానిస్తుంది. డెమోక్రసీ, డెమోగ్రఫీ, డిమాండ్ (ప్రజాస్వామ్యం, జనాభా మరియు డిమాండ్) రూపంలో మనకు కొన్ని సానుకూలతలు ఉన్నాయి.
18.అలా, భారత దేశం ఈ భారీ ముందడుగు వేయడానికి వీలుగా మీరు ప్రతిపాదిస్తున్న విధానపరమైన చర్యలేమిటి?
భారతీయ ఫార్మా రంగం ఇప్పటికే పురోగమన మార్గాన్ని గత కొద్ది నెలల కాలంలో ప్రదర్శించింది. ప్రపంచ ఫార్మా సరఫరా గొలుసులో కీలక పాత్రధారిగా ఇండియా అవతరించింది. అతి తక్కువ కాలంలోనే మనం పిపిఇ కిట్లలో రెండో అతిపెద్ద తయారీదారుగా ఎదిగాము. సాంకేతికంగా అధునాతనమైన వెంటిలేటర్ల వంటి ఉత్పత్తుల తయారీలో కూడా ఇండియా తనదైన ముద్రను వేస్తోంది. ఇంతకు ముందున్న అతి తక్కువ తయారీ దశ నుంచి ఇప్పుడు మనం చాలా వేగంగా వేలాది వెంటిలేటర్లను ఉత్పత్తి చేస్తున్నాం.
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మహమ్మారి ప్రారంభం వరకు, దేశం మొత్తం మీద ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్నవి సుమారు 15-16 వేల వెంటిలేటర్లు. ఇప్పుడు ఆ ఆసుపత్రులకు మరో 50,000 వెంటిలేటర్లను జోడించే దిశగా వేగంగా కదులుతున్నాం.
ఇప్పుడు, మనం విజయవంతంగా ఈ నమూనాను ఆవిష్కరించాం. ఇతర రంగాలలో దీన్ని అనుకరించవచ్చు. మొబైల్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్ – మెడికల్ పరికరాల తయారీ కోసం మేము ఇటీవలే ప్రారంభించిన ఉత్పత్తి ఆధారిత రాయితీ (పిఎల్ఐ) పథకాలు… ఈ కేంద్రీకృత, లక్షిత విధానానికి మంచి ఉదాహరణలు. ప్రపంచ స్థాయికి, పోటీతత్వానికి తగిన సామర్థ్యాలను సృష్టించి… భారత దేశాన్ని వారి ఎగుమతులకు కేంద్రబిందువుగా మార్చుకునేందుకుగాను అంతర్జాతీయంగా పేరున్న పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఇవి దోహదపడతాయి. ఒక్క మొబైల్ ఫోన్ల విభాగంలోనే వచ్చే ఐదేళ్లలో రూ. 10 లక్షల కోట్లకు పైగా విలువైన ఉత్పత్తి జరుగుతుందని ఆశిస్తున్నాం. అందులో 60 శాతం ఎగుమతులు ఉంటాయి.
‘మూడీస్’ ప్రకారం 2020లో అమెరికా నుంచి 154 గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు ఇండియాకు వచ్చాయి. పోల్చి చూస్తే చైనాలో 86, వియత్నాంలో 12, మలేషియాలో 15 ఏర్పాటయ్యాయి. భారత దేశ అభివృద్ధి పురోగమనంలో ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి ఇదొక స్పష్టమైన సంకేతం. ఇండియాను మొట్టమొదటి తయారీ గమ్యస్థానంగా రూపొందించడానికి మేము బలమైన పునాదులు వేశాం.
కార్పొరేట్ పన్ను తగ్గించడం, బొగ్గు రంగంలో వాణిజ్య మైనింగ్ ను ప్రవేశపెట్టడం, అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరవడం, విమాన రూట్లలో పౌర విమాన యానానికి ఉన్న రక్షణపరమైన ఆంక్షలను తొలగించడం… వృద్ధిని పెంచడంలో సుదీర్ఘ ప్రయాణానికి దోహదపడే కొన్ని చర్యలు.
‘‘ఇండియా ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్య పెట్టుబడుల గమ్యస్థానంగా మారేలా నిశ్చయపరచడానికి మా సంస్కరణల కృషిని కొనసాగిస్తాము’’ – పిఎం మోదీ
కానీ, మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే… మన రాష్ట్రాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయో ఇండియా అంతే ఎదగగలదు. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ అవసరం ఉంది. రాష్ట్రాలు వ్యాపార సరళీకరణ (EODB) ర్యాంకుల కోసం కూడా పోటీపడుతున్నాయి. భారీ పెట్టుబడులను పొందడానికి రాయితీలు మాత్రమే చాలవు. రాష్రాలు మౌలిక సదుపాయాలను నిర్మించవలసిన అవసరం ఉంది. అభివృద్ధికి సంబంధించి మంచి విధానాలను అవలంభించాల్సి ఉంది.
19.‘ఆత్మనిర్భర్’ ప్రయత్నం మళ్ళీ ‘స్వీయ ఆధారిత’ వ్యవస్థ రోజులకు తీసుకెళ్తుందనే భయం కొన్ని వర్గాల్లో ఉంది. ఇండియా దిగుమతులను నియంత్రిస్తూ ప్రపంచ సరఫరా గొలుసు కట్టులో భాగం కావాలనుకోవడంలో వైరుధ్యం ఉందని కొందరు అంటున్నారు. మీ అభిప్రాయం ఏమిటి?
సంకుచిత దృష్టి లేదా స్వీయ-కేంద్రిత ఆలోచన భారత దేశ లేదా భారతీయుల స్వభావంలో లేదు. మనది ప్రగతిశీల నాగరికత, శక్తివంతమైన ప్రజాస్వామ్యం. మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి ఇతర దేశాలతో సంబంధాలను నెరుపుతుంది. ఆత్మనిర్భర్ భారత్ కేవలం పోటీ గురించి మాత్రమే కాదు… సమర్థత గురించి కూడా, ఇది ఆధిపత్యం గురించి కాదు… ఆధారయోగ్యత గురించి. ఇది లోపలికి చూడటానికి కాదు… ప్రపంచం వెలుపలికి చూడటానికి.
కాబట్టి, మనం ‘ఆత్మనిర్భర్ భారత్’ అంటున్నప్పుడు, మన ఉద్ధేశ్యం మొదటిగా స్వయంసమృద్ధి గల భారతందేశం అని. ఒక స్వయంసమృద్ధ భారత దేశం ప్రపంచానికి ఓ విశ్వసనీయమైన మిత్రుడు కూడా. స్వయంసమృద్ధ భారత దేశం అంటే అర్థం స్వీయ- కేంద్రిత భారత దేశం అని కాదు. పిల్లలు 18 ఏళ్ళ వయసుకు రాగానే, వారి తల్లిదండ్రులు కూడా తమ కుమారుడు లేదా కుమార్తెకు స్వీయ ఆధారితం కావాలని చెబుతారు. ఇది సహజం.
ఈరోజు మనం ఆరోగ్య రంగంలో ప్రపంచానికి సాయం చేయడానికి స్వయంసమృద్ధ భారతాన్ని ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకు, ఖరీదు పెంచకుండానే లేదా నియంత్రణలు విధించకుండానే మనం టీకాలు, మందులను ఉత్పత్తి చేస్తున్నాం. మనలాంటి ఒక పేద దేశం డాక్టర్లకు విద్యగరపడం కోసం పెద్ద మొత్తంలో వ్యయాలను భరిస్తోంది. వారు ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించి మానవాళికి సాయం చేస్తున్నారు. మనం ఎప్పుడూ వారు వలస వెళ్లడాన్ని ఆపలేదు.
ఇండియా ఒక రంగంలో స్వయంసమృద్ధి సాధించినప్పుడు, అది ఎల్లప్పుడూ ప్రపంచానికి సాయపడుతుంది. ఇండియా విలువలను, స్ఫూర్తిని అర్ధం చేసుకోనివారు ఈ భావనను కూడా అర్ధం చేసుకోలేరు.
‘‘ఆత్మనిర్భర్ భారత్ కేవలం పోటీ గురించి మాత్రమే కాదు… సమర్థత గురించి కూడా, ఇది ఆధిపత్యం గురించి కాదు… ఆధారయోగ్యత గురించి, ఇది లోపలికి చూడటానికి కాదు… ప్రపంచం వెలుపలికి చూడటానికి… ఒక స్వయంసమృద్ధ భారత దేశం ప్రపంచానికి ఓ విశ్వసనీయమైన మిత్రుడు కూడా’’ – పిఎం మోదీ
20.అంటే, ఇక్కడ వైరుధ్యం లేదంటారు?
నిపుణుల మధ్య గందరగోళం ఉంటే తప్పనిసరిగా మా విధానంలో వైరుధ్యం ఉన్నట్టు కాదు. వ్యవసాయం, లేబర్, బొగ్గు రంగాలలో మీరు చూసిన సంస్కరణల ద్వారా మేము ఎఫ్.డి.ఐ.కి పరిమితులను సడలించాము. అంతర్జాతీయ వాణిజ్యానికి ఉన్న శక్తిని విశ్వసించే దేశం మాత్రమే ప్రపంచంతో కలసి పనిచేయడానికి మరిన్ని మార్గాలను తెరిచే దిశగా సాగుతుంది. అదే సమయంలో, భారతదేశం తనకు స్వాభావికంగా తులనాత్మకంగా సానుకూలతలు ఉన్న రంగాల్లో అవకాశానికి తగినట్టు ఫలితాలను పొందలేకపోయిందన్నది కూడా నిజం. ఉదాహరణకు బొగ్గును తీసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వల్లో ఒకటి కలిగిన ఇండియా 2019-20లో లక్షన్నర కోట్ల రూపాయల విలువైన బొగ్గును దిగుమతి చేసుకుంది. దిగుమతులపై ఆధాపడిన మరో రంగం రక్షణ. ఎఫ్.డి.ఐ. పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతూనే, వచ్చే ఐదేళ్లలో మూడున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన 101 పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించాం.
భారత దేశంలో పెట్టుబడులు పెట్టినవారికి, వారి సామర్ధ్యాలను విస్తరించి ప్రపంచవ్యాప్తంగా పోటీపడగలిగేలా మారడానికి విశ్వాసం చూపించినవారికి మేము ఓ సరైన అవకాశం ఇచ్చాము. భారత దేశపు నిగూఢ సామర్ధ్యాన్ని వెలికి తీయడం కోసమే ఆత్మనిర్భర్ భారత్ చొరవ. తద్వారా మన సంస్థలు దేశీయ మార్కెట్లకు మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లకు కూడా సేవలు అందించగలవు.
21.ఎఫ్.టి.ఎ.లు ఇండియాకు అనుకూలంగా పని చేయలేదని ప్రభుత్వ అంచనాను బట్టి అర్ధమవుతోంది. మనం ఆర్.సి.ఇ.పి. నుంచి కూడా బయటకు వచ్చాం. ఈ అంశంలో మీ ఆలోచన ఎలా ఉంది? అసలు మనం ఎఫ్.టి.ఎ.లను అనుసరించాలని మీరు అనుకుంటున్నారా?
అంతర్జాతీయ వాణిజ్యం వెనుక ఉన్న మార్గదర్శక సూత్రం… భాగస్వాములైన అన్ని దేశాలకు పరస్పర ప్రయోజనకర పరిష్కారాలను సృష్టించడం. నిపుణులు నాకు చెప్పిందేమిటంటే… వాణిజ్య ఒప్పందాలు డబ్ల్యుటిఒ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లేదా బహుళపక్షంగా ఉండాలి. భారత దేశం ఎప్పుడూ ప్రపంచ వాణిజ్య నియమాలకు కట్టుబడి ఉంది. స్వేచ్ఛాయుత, సరసమైన, సమానమైన, పారదర్శక, నియమాల ఆధారిత అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థకోసం నిలబడింది. ఇది డబ్ల్యుటిఒ కింద లక్షించిన విధంగా అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి లక్ష్యాలు – ఆకాంక్షలను నెరవేర్చాలి.
గతంలో మన మార్కెట్లను ఓపెన్ చేసేటప్పుడు 10 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్.టి.ఎ.లు), 6 ప్రాధాన్య వాణిజ్య ఒప్పందాల (పి.టి.ఎ.ల)కు సంతకాలు చేశాం. ప్రస్తుత ఎఫ్.టి.ఎ.లపై మదింపు… అవి ఇండియాకు ఏ విధంగా ప్రయోజనం కలిగించాయన్నదే కొలమానంగా జరగాలి తప్ప, ఆదర్శాల ప్రాతిపదికన కాదు.
ప్రపంచ సరఫరా వ్యవస్థలలో భాగం కావడానికి, వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి భారత దేశం ఆసక్తిగానే ఉంది. అయితే, అవి న్యాయంగా వివక్షా రహితంగా ఉండాలి. అంతేకాకుండా, ఇండియా ఓ పెద్ద మార్కెట్ కు అవకాశం ఇస్తున్నందున ఒప్పందాలు ఇచ్చిపుచ్చుకునేలా సమతులంగా ఉండాలి.
మనం ఎఫ్.టి.ఎ.ల కింద మన పెద్ద మార్కెట్ కు ప్రాధాన్యతా ప్రాతిపదికన అవకాశం ఇచ్చాము. అయినా మన వాణిజ్య భాగస్వాములు అదే పద్ధతిలో మనకు అన్ని సందర్భాల్లో ప్రతిఫలం కల్పించలేదు. మన ఎగుమతిదారులు తరచూ దురుద్దేశపూరితమైన పన్నేతర అవరోధాలను ఎదుర్కొన్నారు. ఉదాహరణకు… మన వాణిజ్య భాగస్వాముల్లో కొంతమంది ఇండియాకు ఉక్కును ఎగుమతి చేస్తూనే, ఇండియన్ ఉక్కు దిగుమతికి మాత్రం అనుమతించలేదు. అలాగే, భారతీయ టైర్ల ఉత్పత్తిదారులు సాంకేతిక అవరోధాల కారణంగా ఎగుమతి చేయలేకపోతున్నారు. ఇండియా వాణిజ్యంలో బహిరంగత, పారదర్శకతకు కట్టుబడుతూనే… తన ఎగుమతిదారులకు స్వేచ్ఛాయుత, న్యాయమైన అవకాశానికి భరోసా ఇచ్చేలా అవసరమైనప్పుడు తన చేతిలో ఉన్న చర్యలను, సాధనాలను ఉపయోగిస్తుంది.
ఆర్.సి.ఇ.పి. విషయంలో తుది తీర్మానం కోసం భారత దేశం గొప్ప ప్రయత్నాలు చేసింది. మనం సరసమైన వాణిజ్య పద్ధతులు, పారదర్శకత ప్రాతిపదికన సమాన అవకాశాలను కోరాం. కొన్ని ఆర్.సి.ఇ.పి. దేశాల్లో పన్నేతర అవరోధాలు, సబ్సిడీ విధానాల్లో పారదర్శకత లోపించడంపై మనం తీవ్రమైన ఆందోళనను వ్యక్తం చేశాం. ప్రస్తుత నిర్మాణం ఆర్.సి.ఇ.పి. మార్గదర్శక సూత్రాలను ప్రతిబింబించలేదని, ప్రస్తుత సమస్యలను పరిష్కరించనూ లేదనే వాస్తవాన్ని ఎత్తిచూపుతూ… ఆర్.సి.ఇ.పి.లో చేరకూడదని భారత్ భావించింది.
22.ఇండియా పిపిఇలు, మాస్కుల ప్రధాన ఉత్పత్తిదారుగా అవతరించింది. ఫార్మా ఒక వ్యూహాత్మక రంగంగా మారింది. ముందుకు వెళ్ళేందుకు, ఈ రంగంలో మన సానుకూలతలను మీరు ఎలా బలోపేతం చేస్తారు?
పిపిఇ కిట్ల కోసం మనం దిగుమతులపై ఆధారపడుతున్నామని మహమ్మారి ప్రారంభ దశలో గుర్తించాము. దేశాలు లాక్ డౌన్ విధించడంతో ఆ సమస్య తీవ్రమైంది. ఉత్పత్తి ప్రభావితమైంది. ఫలితంగా ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడింది. దీని అనివార్యమైన అర్ధం, సంక్షోభ సమయంలో దేశం స్వయంసమృద్ధిని సాధించే మార్గాల గురించి వేగంగా ఆలోచించవలసి వచ్చింది.
మేము అత్యంత కేంద్రీకరణతో ప్రత్యక్ష పాత్ర పోషించే విధానాన్ని అవలంబించాం. ఈ ప్రయోజనం కోసం ప్రతి ఒక్క ముడి సరుకునూ గుర్తించి, మూలం నుంచి తెప్పించాం. పిపిఇ కిట్లు, ఎన్-95 మాస్కులు, వెంటిలేటర్లు, డయాగ్నొస్టిక్ కిట్లు తదితరాలను తయారు చేసే, సేకరించే లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము పరిశ్రమతోనూ, రాష్ట్ర ప్రభుత్వాలతోనూ 24×7 పని చేశాం. ఒకసారి ఈ అంశాలను క్రమబద్ధీకరించాక, దేశీయంగా ఉత్పత్తి ప్రారంభమైంది. సేకరణ కోసం దేశీయ ఉత్పత్తిదారులకు ఆర్డర్లు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఇండియా కేవలం దేశీయ అవసరాలను అధిగమించడమే కాకుండా ఇతర దేశాల అవసరాలను కూడా తీర్చగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది.
ప్రపంచ ఔషధశాల అన్న పేరుకు తగినట్టుగా భారతదేశం గత కొద్ది నెలల్లో అంచనాలను పూర్తి స్థాయిలో అందుకుంది. సుమారు 150 దేశాలకు మందులు, వైద్య పరికరాలను సరఫరా చేస్తోంది. భారతీయ ఫార్మా రంగం 38 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంది. ఈ సానుకూలతను బలోపేతం చేసేందుకు, వైద్య పరికరాలు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్ గ్రేడియంట్స్ (ఎపిఐలు) తయారు చేయడం కోసం రూ. 14,000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రపంచ నాయకత్వ స్థానం సంపాదించడం కోసం బల్క్ డ్రగ్ పార్కులు, వైద్య పరికరాల పార్కులు సృష్టించబడుతున్నాయి.
23.ఒక టీకా వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పంపిణీ పైన, ఎవరికి వ్యాక్సిన్ వేయాలన్న విషయంలో ప్రాధాన్యతలపైనా ఏమైనా ఆలోచన ఉందా?
ప్రప్రథమంగా నేను దేశానికి భరోసా ఇవ్వదలచుకున్నాను. టీకా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ వేయడం జరుగుతుంది. ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. సహజంగానే, తొలుత మేము ఎక్కువగా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నవారిని, ముందు వరుసలో ఉండి పని చేస్తున్నవారిని కాపాడుకోవడంపై దృష్టి పెట్టవచ్చు. కోవిడ్ 19 టీకా విషయంలో ముందుకు వెళ్లే మార్గాన్ని రూపొందించడం కోసం జాతీయ నిపుణుల బృందం ఏర్పాటైంది.
టీకా అభివృద్ధి ఇంకా పురోగతిలో ఉందని కూడా మనం గ్రహించాలి. ప్రయోగాలు కొనసాగుతున్నాయి. టీకా ఏమిటో, ఒక్కో వ్యక్తికి ఎంత మోతాదో, ఎలా అమలు చేయాలో నిపుణులు చెప్పలేకపోతున్నారు. నిపుణులు ఖరారు చేసిన తర్వాత, టీకాను పౌరులకు అందించడంలో మా విధానానికి ఈ అంశాలన్నీ మార్గనిర్దేశనం చేస్తాయి.
లాజిస్టిక్స్ విషయానికి వస్తే, 28 వేలకు పైగా కోల్డ్ చైన్ పాయింట్లు కోవిడ్19 టీకాను నిల్వ చేసి చివరి ప్రాంతం వరకు కచ్చితంగా చేరేలా పంపిణీకి దోహదపడతాయి. రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిలలో ఉండే ప్రత్యేక బృందాలు టీకా పంపిణీ- అమలు క్రమబద్ధంగా, జవాబుదారీతనంతో జరిగేలా చూస్తాయి. లబ్దిదారుల నమోదుకు, అన్వేషణకు, వారిని చేరుకోవడానికి ఒక డిజిటల్ వేదిక సిద్ధమవుతోంది.
24.కోవిడ్-19 రూపంలో ఎదురుదెబ్బ తర్వాత, 2024 నాటికి మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరాలన్న లక్ష్యం విషయంలో మనం ఎక్కడ ఉంటాం?
నిరాశావాదులు చాలామంది సందేహంతోనే ఉంటారు. మీరు వారి మధ్య కూర్చుంటే, నిరాశ- నిరుత్సాహంతో కూడిన విషయాలనే వింటారు.
అయితే, మీరు ఆశావహ దృక్పథం ఉన్నవారితో చర్చిస్తే, ఎలా మెరుగుపడాలన్న అంశంపై ఆలోచనలు సలహాలను వింటారు. ఈరోజు మన దేశం భవిష్యత్ పట్ల ఆశాజనకంగా ఉంది. 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్న చేరుకోవడం పట్ల ఆశాజనకంగా ఉంది. ఈ ఆశావాదం మాకు నమ్మకం కలిగిస్తోంది. ఈరోజు, మన కరోనా యోధులు రోగులకు సేవ చేయడం కోసం 18 నుంచి 20 గంటలు పని చేస్తుండటం, మరింత కష్టపడి పని చేసేలా మాకు స్ఫూర్తిని ఇస్తోంది.
మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం మనం అనుకున్నంత వేగంతో వెళ్లలేకపోయాము. ఈ నష్టాన్ని పూడ్చడానికి మేము వచ్చే ఏడాది మరింత వేగంగా పరుగెత్తుతాము. మన మార్గంలో ఎదురయ్యే అడ్డంకులతో ఆగిపోతే గొప్పగా ఏమీ చేయలేము. కోరుకోకపోవడం ద్వారా మనం వైఫల్యాన్ని ఖాయం చేసుకుంటాము. కొనుగోలు శక్తి ప్రాతిపదికన ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుత అమెరికా డాలర్ ధరల్లో కూడా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావాలని కోరుకుంటున్నాము. దాన్ని సాధించడానికి 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దోహదపడుతుంది.
అలాగే, లక్ష్యాలను సాధించడంలో మా ప్రభుత్వానికి ఒక ట్రాక్ రికార్డు ఉంది. నిర్దేశిత గడువు కంటే ముందే గ్రామీణ పారిశుధ్య లక్ష్యాన్ని అధిగమించాం. గడువు కంటే ముందే గ్రామాల విద్యుదీకరణ లక్ష్యాన్నీ చేరుకున్నాం. గడువు కంటే చాలా ముందే 8 కోట్ల ఉజ్వల కనెక్షన్ల లక్ష్యాన్ని కూడా ఛేదించాం. మా ట్రాక్ రికార్డు, నిరంతర సంస్కరణల కారణంగా… లక్ష్యాన్ని చేరుకోవడంలో మాకు ఉన్న సామర్ధ్యాలపై ప్రజలు కూడా నమ్మకంతో ఉన్నారు.