ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ ప్రదర్శన-సమావేశ కేంద్రం (ఐఇసిసి) సముదాయాన్ని ప్రారంభించారు. అలాగే జి-20 స్మారక నాణెం, తపాలా బిళ్లను కూడా ఆయన ఆవిష్కరించారు. డ్రోన్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమావేశ కేంద్రానికి ‘భారత్ మండపం’గా ప్రధాని నామకరణం చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు. ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా దాదాపు రూ.2700 కోట్లతో జాతీయ ప్రాజెక్టు కింద ‘ఐఇసిసి’ సముదాయాన్ని నిర్మించారు. ప్రగతి మైదాన్‌లో రూపుదిద్దుకున్న ఈ నవ సౌధం ప్రపంచ వ్యాపార గమ్యంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో తనవంతు తోడ్పాటునిస్తుంది. ఈ సందర్భంగా జాతి హృదయాల్లో ఉప్పొంగిన ఉత్సాహాన్ని, మనోభావాల్లోని ఉత్తేజాన్ని సూచించే ఒక పద్యంతో ప్రధానమంత్రి తన ప్రసంగం ప్రారంభించారు. “భారత మండపం దేశ సామర్థ్యానికి, నవశక్తికి మారుపేరు. ఇది భారతదేశ వైభవాన్ని, సంకల్ప శక్తిని చాటే సిద్ధాంతం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ప్రాంగణ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ఇవాళ ఉదయం సత్కరించడాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు. భవన సముదాయం నిర్మాణంలో వారి కృషి, అంకితభావం యావద్దేశాన్ని ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. భారత మండపం సిద్ధం కావడంపై ఢిల్లీ వాసులతోపాటు దేశ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ చారిత్రక సందర్భం నేపథ్యంలో నాటి యుద్ధంలో దేశం కోసం అమరులైన వీరులకు భారతీయులందరి తరఫున నివాళి అర్పించారు. భగవాన్ బసవేశ్వరుని ‘అనుభవ మండపం’ ప్రేరణతోనే ‘ఐఇసిసి’ సముదాయానికి ‘భారత మండపం’గా నామకరణం చేసినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.
మన ఘనమైన చర్చా సంప్రదాయానికి, భావ వ్యక్తీకరణకు అనుభవ మండపం ఒక ప్రతిబింబమని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా భారత్ ప్రపంచ గుర్తింపు పొందిందని గుర్తుచేశారు. ఈ మేరకు అనేక చారిత్రక, పురావస్తు ఉదాహరణలను ఆయన ఉటంకించారు. దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకుంటున్న వేళ ‘భారత మండపం’ రూపంలో మన ప్రజాస్వామ్యానికి భారతీయులు అందమైన కానుక ఇచ్చారని ఆయన అభివర్ణించారు. మరికొద్ది వారాల్లో ఈ వేదికపై జి-20 సదస్సు నిర్వహించనున్న తరుణంలో భారత ప్రగతిని, ఎదుగుదలను ప్రపంచమంతా ఇక్కడి నుంచి తిలకిస్తుందని ఆయన అన్నారు.
ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయి సమావేశ కేంద్రం అవసరాన్ని వివరిస్తూ- “ప్రస్తుత 21వ శతాబ్దంలో ఈ కాలానికి తగిన నిర్మాణం మనకు అవశ్యం” అని ప్రధాని అన్నారు. ప్రపంచవ్యాప్త ప్రదర్శనల నిర్వహకులకు భారత మండపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా మన దేశంలో సమావేశ పర్యాటకానికి ఇదొక మాధ్యమం కాగలదని నొక్కిచెప్పారు. దేశంలోని అంకుర సంస్థల సామర్థ్య ప్రదర్శనతోపాటు కళాకారులు, నటీనటుల కళాప్రతిభకు సాక్షిగా, హస్త కళాకళాకారుల నైపుణ్య అభివ్యక్తికి భారత మండపం వేదికగా నిలుస్తుందన్నారు. “భారత మండపం స్వయం సమృద్ధ భారతం, స్థానిక కోసం స్వగళం సంకల్పాలకు ప్రతిబింబంగా మారుతుంది” అని ప్రధాని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ నుంచి పర్యావరణ విజ్ఞానం, వాణిజ్యం నుంచి సాంకేతిక పరిజ్ఞానాల దాకా ప్రతి రంగానికీ ఈ కేంద్రం ఒక వేదికగా ఆవిర్భవిస్తుందంటూ భారత మండటం ప్రాముఖ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
దేశంలో కొన్ని దశాబ్దాల కిందటే భారత మండపం వంటి మౌలిక సదుపాయాల కల్పన చేపట్టి ఉండాల్సిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కొన్ని స్వార్థశక్తుల నుంచి వ్యతిరేకత వచ్చినా మౌలిక సదుపాయాల కల్పన కొనసాగింపు అత్యావశ్యమని ఆయన నొక్కి చెప్పారు. అభివృద్ధి పనులు అతుకులబొంతల్లా సాగిఈతే ఏ సమాజమూ పురోగమించదని స్పష్టం చేశారు. భారత మండపం దూరదృష్టితో కూడిన సమగ్ర కార్యాచరణకు ప్రతిబింబమని వివరించారు. ప్రపంచంలోని 160కిపైగా దేశాలకు ఇ-కాన్ఫరెన్స్ వీసా సదుపాయం కల్పించడం గురించి కూడా ప్రధాని వివరించారు. ఢిల్లీ విమానాశ్రయ వార్షిక ప్రయాణిక నిర్వహణ సామర్థ్యం 2014లో 5 కోట్లు కాగా, నేడు 7.5 కోట్లకు చేరిందని తెలిపారు. ఇక జేవార్ విమానాశ్రయం సిద్ధమైతే ఇది మరింత బలోపేతం కాగలదని చెప్పారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో ఆతిథ్య (హోటల్) పరిశ్రమ కూడా గణనీయంగా విస్తరించిందని, సమావేశ పర్యాటకానికి అనువైన పర్యావరణ వ్యవస్థ మొత్తాన్నీ రూపొందించే ప్రణాళికాబద్ధ విధానానికి ఇది నిదర్శనమని ప్రధాని చెప్పారు.
రాజధాని న్యూఢిల్లీలో కొన్నేళ్లుగా మౌలిక సదుపాయాల ప్రగతిని ప్రస్తావిస్తూ- కొత్త పార్లమెంటు భవన సముదాయ ప్రారంభోత్సవం ప్రతి భారతీయుడికీ గర్వకారణంగా నిలిచిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అలాగే జాతీయ యుద్ధ స్మారకం, పోలీసు అమరుల స్మారకం, బాబా సాహెబ్ అంబేడ్కర్ స్మారకం వంటి చిహ్నాలను కూడా ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. పని సంస్కృతితోపాటు పని వాతావరణంలో మార్పు దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున కర్తవ్య పథం చుట్టూగల కార్యాలయ భవనాల అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. దేశ ప్రధానమంత్రులుగా పనిచేసిన నాయకుల జీవిత సంగ్రహావలోకనం వివరించేలా ఏర్పాటు చేసిన ‘ప్రధానమంత్రి సంగ్రహాలయం’ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. న్యూఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ‘యుగే యుగే భారత్’ నిర్మాణం కూడా శరవేగంగా సాగుతున్నదని తెలిపారు.
అభివృద్ధి పథంలో పయనించాలంటే మనం గొప్పగా ఆలోచించాలని, గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాకారం చేసుకోవాలని ప్రధాని ఉద్ఘాటించారు. ఆ మేరకు “గొప్ప ఆలోచన.. గొప్ప కలలు.. గొప్పగా కృషి” అనే తారకమంత్రంతో భారత్ ముందడుగు వేస్తోందని ఆయన అన్నారు. అందుకు అనుగుణంగా “మెరుగైన.. భారీ.. శరవేగంతో మేము మౌలిక సదుపాయాలు సృష్టిస్తున్నాం” అన్నారు. ఈ మేరకు ప్రపంచంలోనే అతిపెద్ద సౌర-పవన విద్యుత్ పార్కు, ఎత్తయిన రైలు వంతెన, పొడవైన సొరంగం, ఎత్తయిన మోటారు రహదారి, అతిపెద్ద క్రికెట్ స్టేడియం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం, ఆసియాలోనే రెండో అతిపెద్ద రైలు-రోడ్డు వంతెన తదితరాలను ఆయన ఏకరవు పెట్టారు. అలాగే హరిత ఉదజని రంగంలో పురోగతి గురించి కూడా ప్రస్తావించారు.
భారత ప్రగతి ప్రయాణాన్ని ఇక ఏ శక్తీ అడ్డుకోజాలదని పేర్కొంటూ- ప్రస్తుత ప్రభుత్వ తొలి, మలిదఫాల పాలన కాలంలో ప్రగతికి మూలస్తంభాలేమిటో జాతిమొత్తం గమనిస్తోంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం 2014లో తొలిసారి అధికార పగ్గాలు చేపట్టేనాటికి భారత్ ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని శ్రీ మోదీ గుర్తుచేశారు. కానీ, నేడు ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో 5వ స్థానానికి దూసుకెళ్లిందని గుర్తుచేశారు. ఈ విజయ పరంపర ప్రకారం- తమ ప్రభుత్వం మూడో దఫా పాలనలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ- “ఈ మేరకు మోదీ హామీ ఇస్తున్నాడు” అని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. తమ మూడో దఫా పాలనలో భారత ప్రగతి వేగం ద్విగుణం.. త్రిగుణం.. బహుళం కాగలదని, తద్వారా ప్రజల కలలన్నీ సాకారం కాగలవని ఆయన పౌరులకు భరోసా ఇచ్చారు.
దేశంలో గడచిన 9 ఏళ్లుగా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.34 లక్షల కోట్లు ఖర్చు చేసిన నేపథ్యంలో భారత్ ఇవాళ పునర్నిర్మాణ విప్లవాన్ని చూస్తున్నదని ప్రధాని అన్నారు. ఇందుకు తగినట్లు ఈ ఏడాది కూడా మూలధన వ్యయం రూ.10 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. భారతదేశం అనూహ్య వేగంతో, భారీ స్థాయిలో ముందంజ వేస్తున్నదని చెప్పారు. గత 9 ఏళ్లలో 40 వేల కిలోమీటర్ల మేర రైలుమార్గాల విద్యుదీకరణ పూర్తికాగా, అంతకుముందు ఏడు దశాబ్దాల్లో ఇది కేవలం 20 వేల కిలోమీటర్లకే పరిమితమైందని గుర్తుచేశారు. అలాగే 2014కు ముందు నెలకు 600 మీటర్ల మెట్రోరైలు మార్గం నిర్మించగా, నేడు ప్రతి నెలా 6 కిలోమీటర్ల మార్గం పూర్తవుతున్నదని తెలిపారు. రహదారుల విషయంలో- దేశంలో 2014నాటికి గ్రామీణ రోడ్ల పొడవు కేవలం 4 లక్షల కిలోమీటర్లు కాగా, ఇప్పుడు 7.25 లక్షల కిలోమీటర్లకు విస్తరించినట్లు చెప్పారు. విమానాశ్రయాల సంఖ్య కూడా 70 నుంచి 150కి పెరిగిందని, నగరస్థాయిలో గ్యాస్ పంపిణీ కూడా 2014లో కేవలం 60 నగరాలకు పరిమితం కాగా, ఇవాళ 600 నగరాలకు విస్తరించినట్లు తెలిపారు.
దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలపై దృష్టి కేంద్రీకరించామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు “నవ భారతం ఇవాళ వేగంగా ముందడుగు వేస్తోంది.. ఈ పయనంలో అన్నిరకాల అడ్డంకులనూ దీటుగా అధిగమిస్తోంది” అని నొక్కిచెప్పారు. సామాజిక మౌలిక వసతులకు సంబంధించి విప్లవాత్మక ‘పిఎం గతిశక్తి’ బృహత్తర ప్రణాళికను ఉదాహరించారు. ఇందులో 1600కుపైగా అంచెల సమాచార నిధి కలిగి ఉందని, దేశం సంపద, సమయం ఆదా చేయడమే దీని లక్ష్యమని ప్రధాని అన్నారు. ఈ నేపథ్యంలో 1930లనాటి పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. భారత స్వాతంత్ర్య లక్ష్య సాధనలో గత శతాబ్దపు మూడో దశాబ్దం కీలకమైనదని గుర్తుచేశారు. అదే తరహాలో ‘సౌభాగ్య (వికసిత) భారతం’ లక్ష్యసాధనలో ఈ శతాబ్దపు మూడో దశాబ్దం అత్యంత కీలకమని ప్రధాని నొక్కిచెప్పారు.
స్వరాజ్య ఉద్యమం ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని పునరుద్ఘాటిస్తూ- “ఈ మూడో దశాబ్దపు రాబోయే 25 ఏళ్ల వ్యవధిలో ‘వికసిత భారతం’ స్వప్న సాకారమే మన లక్ష్యం” అని స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రతి స్వాతంత్ర్య సమరయోధుడి కలను నెరవేర్చేదిశగా ప్రజలను ఉత్తేజితులను చేశారు. తన జీవితానుభవాన్ని ఉటంకిస్తూ- తన కళ్లెదుటే దేశం అనేక విజయాలను సాధించిందని, ఆ మేరకు జాతి బలమేమిటో తనకు తెలుసునని ప్రధాని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి “మన దేశం కచ్చితంగా వికసిత భారతం కాగలదు! భారతదేశంలో పేదరిక నిర్మూలన తథ్యం” అని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ నివేదికను ఉటంకిస్తూ- దేశంలో కేవలం 5 సంవత్సరాల వ్యవధిలోనే 13.5 కోట్ల మంది పేదరిక విముక్తులయ్యారని ప్రధాని తెలిపారు. అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం- భారత్‌లో నిరుపేదల సంఖ్య తగ్గిపోతున్నదని ఆయన చెప్పారు. గడచిన 9 సంవత్సరాల్లో ప్రభుత్వం అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలే ఇందుకు దోహదం చేశాయని ఆయన పునరుద్ఘాటించారు.
సదుద్దేశాలు, సముచిత విధానాల అవసరాన్ని నొక్కిచెబుతూ… జి-20 సంబంధిత నిర్ణయాలను ప్రధానమంత్రి ఉదాహరించారు. ఈ మేరకు “జి-20 సమావేశాలను మేము ఏదో ఒక నగరానికి లేదా ప్రదేశానికి పరిమితం చేయకుండా దేశంలోని 50కిపైగా నగరాల్లో నిర్వహించాం. తద్వారా భారతదేశ వైవిధ్యాన్ని ప్రతిబింబించే భారత సాంస్కృతిక శక్తి, వారసత్వం ఎలాంటివో ప్రపంచానికి చూపాం” అని గుర్తుచేశారు. జి-20 అధ్యక్ష బాధ్యతల గురించి మరింత వివరిస్తూ- “జి-20 సమావేశాల కోసం అనేక నగరాల్లో కొత్త సదుపాయాలు కల్పించడంతోపాటు పాత సౌకర్యాలు ఆధునికీకరించబడ్డాయి. దీనివల్ల దేశానికి, ప్రజలకు మేలు కలిగింది… సుపరిపాలన అంటే ఇదే. ‘దేశమే ప్రథమం… పౌరులకే ప్రాధాన్యం’ అనే స్ఫూర్తికి అనుగుణంగా మేము దేశాన్ని అభివృద్ధి చేస్తాం” అని ప్రకటిస్తూ ప్రధాని తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సహా పలువురు కేబినెట్, సహాయ మంత్రులు, పరిశ్రమ రంగ నిపుణులు పాల్గొన్నారు.
నేపథ్యం
దేశంలో సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనల నిర్వహణకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు అవసరమన్న ప్రధానమంత్రి దృక్కోణం మేరకు ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (ఐఇసిసి) రూపుదిద్దుకుంది. దీనిద్వారా సుమారు రూ. 2700 కోట్లతో ఇక్కడి పాత-శిథిలావస్థకు చేరిన సౌకర్యాల పునరుద్ధరణసహా జాతీయ ప్రాజెక్టు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు 123 ఎకరాల విస్తీర్ణంగల ప్రాంగణంలో సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు నిర్వహించే ‘జాతీయ భవన సముదాయం’గా ‘ఐఇసిసి’ నిర్మించబడింది. కార్యక్రమాల నిర్వహణకు అందుబాటులోగల వైశాల్యం రీత్యా ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదర్శన-సమావేశ సముదాయాల జాబితాలో ‘ఐఇసిసి’కి స్థానం లభిస్తుంది. ఈ మేరకు ఇక్కడ సమావేశాలు-సదస్సుల నిర్వహణ కేంద్రం, ఎగ్జిబిషన్ హాళ్లు, యాంఫీథియేటర్ వగైరా అనేక అత్యాధునిక సౌకర్యాలున్నాయి.
సదస్సుల నిర్వహణ కేంద్రాన్ని ప్రగతిమైదాన్ ప్రాంగణం నడిబొడ్డున ఉండేవిధంగా నిర్మించారు. వాస్తుశిల్పం పరంగా ఇదొక అద్భుత నిర్మాణం. భారీ అంతర్జాతీయ ప్రదర్శనలు, వాణిజ్య ఉత్సవాలు, సమావేశాలు, సదస్సులు, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఇది రూపొందింది. ఇందులో అనేక సమావేశ గదులు, లాంజ్‌లు, ఆడిటోరియంలు, ఒక యాంఫిథియేటర్, వ్యాపార కేంద్రం కూడా ఉన్నాయి. ఇది విస్తృత శ్రేణి కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వగలదు. విశాలమైన బహుళ ప్రయోజన హాల్, ప్లీనరీ హాల్ ఏడు వేలమంది హాజరయ్యేందుకు అనువుగా ఉంటాయి. ఆ మేరకు ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ సిడ్నీ ఒపెరా హౌస్ కన్నా ఇది పెద్దది. ఇక్కడి అద్భుత యాంఫీథియేటర్‌లో 3,000 మంది కూర్చునే వీలుంది.
కన్వెన్షన్ సెంటర్ భవన నిర్మాణ శైలికి భారత వాస్తుశిల్ప సంప్రదాయాలే స్ఫూర్తి. ఆ మేరకు భారత ప్రాచీన చరిత్రపై దేశానికిగల విశ్వాసం, నిబద్ధతలను ప్రతిబింబించడమేగాక ఆధునిక సౌకర్యాలు-జీవన విధానాన్ని కూడా ఈ నిర్మాణం ప్రదర్శిస్తుంది. భవనం శంఖాకృతిలో ఉండగా, సమావేశ కేంద్రం, వివిధ గోడలు, ముఖద్వారాలు అనేక భారత సంప్రదాయ కళా-సంస్కృతులను ప్రతిబింబిస్తాయి. ఈ మేరకు ‘సూర్య శక్తి’ వినియోగంలో భారత్ కృషి, ‘శూన్యం నుంచి ఆకాశంలోకి ఇస్రో’ రూపంలో అంతరిక్ష రంగంలో మనం సాధించిన విజయాలను ప్రస్ఫుటం చేస్తుంది. అలాగే అనంత విశ్వ నిర్మాణంలో భాగమైన పంచ మహాభూతాలు ఆకాశం, వాయువు, అగ్ని, జలం, మట్టి (భూమి)ని సూచిస్తుంది. మరో్వైపు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ రకాల చిత్రలేఖనాలు, గిరిజన కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఈ కేంద్రంలోని ఇతర సౌకర్యాలలో 5జి సదుపాయంతో వైఫై, 10జి ఇంట్రానెట్ సంధానం, 16 భాషలకు మద్దతిచ్చే అత్యాధునిక సాంకేతికతగల ఇంటర్ప్రెటర్ గది, భారీ-పరిమాణంగల వీడియో గోడలతో అధునాతన దృశ్య-శ్రవణ వ్యవస్థలు, భవన నిర్వహణ వ్యవస్థ ఉన్నాయి. ఇవన్నీ గరిష్ఠ పనితీరు, విద్యుత్ పొదుపు, కాంతి హెచ్చుతగ్గుల నియంత్రణ, జనసమ్మర్ద జాడ తెలిపే సెన్సర్లు వగైరాలతో కూడిన లైట్ల నిర్వహణ వ్యవస్థ, అత్యాధునిక ‘డిసిఎన్’ (డేటా కమ్యూనికేషన్ నెట్వర్క్) వ్యవస్థ, సమీకృత నిఘా వ్యవస్థ, తక్కువ విద్యుత్తుతో పనిచేసే కేంద్రీకృత ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ వగైరాలు ఈ భవన సముదాయానికి అదనపు హంగులు సమకూరుస్తున్నాయి.
అలాగే ఈ భవన సముదాయంలో ఏడు ఎగ్జిబిషన్ హాళ్లున్నాయి. వీటిలో ఎగ్జిబిషన్లు, వాణిజ్య ప్రదర్శనలు, ఇతర వాణిజ్య కార్యక్రమాల నిర్వహణకు తగినంత విశాలమైన స్థలం అందుబాటులో ఉంటుంది. విభిన్న శ్రేణి పరిశ్రమలతోపాటు ప్రపంచవ్యాప్త ఉత్పత్తులు-సేవల ప్రదర్శనకు అనువుగా ఈ హాళ్లు రూపొందించబడ్డాయి. ఆధునిక ఇంజనీరింగ్-నిర్మాణ నైపుణ్యానికి ఈ అత్యాధునిక నిర్మాణాలు నిదర్శనంగా నిలుస్తాయి. మరోవైపు ‘ఐఇసిసి’ వెలుపలి పరిసరాల అభివృద్ధి పనులు కూడా ఆలోచనాత్మకంగా చేపట్టబడ్డాయి. దీంతో ప్రధాన ప్రాంగణం అందాలు ఇనుమడిస్తున్నాయి. ఎంతో జాగ్రత్తగా, శ్రద్ధగా ప్రణాళికబద్ధంగా చేపట్టిన అభివృద్ధి పనులకు ఇదొక నిదర్శనం. శిల్పాలు, ఇతర అమరికలు, కుడ్యచిత్రాలు వంటివన్నీ భారతదేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని కళ్లకు కడతాయి. మ్యూజికల్ ఫౌంటైన్లు, దృశ్యాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. చెరువులు, సరస్సులు, కృత్రిమ ప్రవాహాలు వంటి జల వనరులు ఈ ప్రాంత ప్రశాంతతను, సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తాయి.
‘ఐఇసిసి’లో సందర్శకుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వబడింది. ఈ మేరకు ఇక్కడ 5,500 వాహనాలను నిలిపేందుకు తగినంత స్థలం ఉంటుంది. సిగ్నల్-రహిత రోడ్ల సౌలభ్యం వల్ల సందర్శకులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వేదిక వద్దకు చేరుకోవచ్చు. అలాగే హాజరైనవారి సౌలభ్యం, సౌకర్యాలకు రూపనిర్మాణంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. ప్రాంగణ ప్రాంతంలో నిరంతరాయ చలనశీలత సౌలభ్యం ఉంటుంది. ‘ఐఇసిసి’ సముదాయ నిర్మాణం భారతదేశాన్ని అంతర్జాతీయ వ్యాపార గమ్యస్థానంగా ప్రపంచం ముందుంచడంలో తోడ్పడుతుంది. ఇది వర్తక-వాణిజ్యాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థిక వృద్ధికి, ఉద్యోగ కల్పనకు బాటలు వేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ ఉత్పత్తులు-సేవల ప్రదర్శనకు వేదికను సమకూర్చడం ద్వారా చిన్న-మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి ఇది తోడ్పడుతుంది. ఇది విజ్ఞాన ఆదానప్రదాన సౌలభ్యం కల్పిస్తుంది. ఉత్తమ పద్ధతులు, సాంకేతిక ప్రగతి, పారిశ్రామిక ధోరణుల వ్యాప్తిని ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా ప్రగతి మైదాన్‌లోని ‘ఐఇసిసి’… స్వయం సమృద్ధ భారతం స్ఫూర్తితో భారత ఆర్థిక-సాంకేతిక ఆధిపత్యం కొనసాగడాన్ని ప్రతిబింబిస్తుంది. మొత్తంమీద ఇది నవ భారతదేశ నిర్మాణం దిశగా ఒక ముందడుగు.
Inaugurating the International Exhibition-cum-Convention Centre in Delhi. The Complex will serve as a gateway to global opportunities. https://t.co/O3TO1yRTvr
— Narendra Modi (@narendramodi) July 26, 2023
‘भारत मंडपम’ देखकर हर भारतीय आनंदित है, गौरव से भरा हुआ है। pic.twitter.com/XDoLNkSVnS
— PMO India (@PMOIndia) July 26, 2023
‘भारत मंडपम’ के निर्माण से जुड़े हर श्रमिक भाई-बहन की मेहनत देख, पूरा भारत विस्मित है, चकित है। pic.twitter.com/rb1fkOjveE
— PMO India (@PMOIndia) July 26, 2023
कारगिल युद्ध में अपना बलिदान देने वाले प्रत्येक वीर को मैं कृतज्ञ राष्ट्र की तरफ से श्रद्धांजलि देता हूं: PM @narendramodi pic.twitter.com/etcm7QQVhY
— PMO India (@PMOIndia) July 26, 2023
21वीं सदी के भारत में हमें 21वीं सदी की आवश्यकताओं को पूरा करने वाला निर्माण करना ही होगा। pic.twitter.com/FWZp0F7rbu
— PMO India (@PMOIndia) July 26, 2023
कोई भी देश हो, कोई भी समाज हो, वो टुकड़ों में सोचकर, टुकड़ों में काम करके आगे नहीं बढ़ सकता। pic.twitter.com/dI7XZD7q2Z
— PMO India (@PMOIndia) July 26, 2023
आज पूरी दुनिया भारत की ओर देख रही है।
— PMO India (@PMOIndia) July 26, 2023
भारत आज वो हासिल कर रहा है जो पहले अकल्पनीय था। pic.twitter.com/6BcZpVuizD
हम पहले से बड़ा निर्माण कर रहे हैं,
— PMO India (@PMOIndia) July 26, 2023
हम पहले से बेहतर निर्माण कर रहे हैं,
हम पहले से तेज गति से निर्माण कर रहे हैं। pic.twitter.com/QdB7f9RH8Y
आज से सौ साल पहले, जब भारत आजादी की जंग लड़ रहा था, तो वो पिछली शताब्दी का तीसरा दशक था। वो दशक भारत की आजादी के लिए बहुत अहम था।
— PMO India (@PMOIndia) July 26, 2023
इसी प्रकार 21वीं सदी का ये तीसरा दशक भी उतना ही महत्वपूर्ण है। pic.twitter.com/ikhlWa1FWz
नया प्रात है, नई बात है,
— Narendra Modi (@narendramodi) July 26, 2023
नई किरण है, ज्योति नई।
नई उमंगें, नई तरंगें,
नई आस है, सांस नई।
उठो धरा के अमर सपूतों,
पुनः नया निर्माण करो।
जन-जन के जीवन में फिर से,
नई स्फूर्ति, नव प्राण भरो। pic.twitter.com/bEOXeOnByv
‘भारत मंडपम’ के रूप में हम भारतवासियों ने अपने लोकतंत्र को एक खूबसूरत उपहार दिया है। यहां होने वाले G-20 के आयोजन से दुनिया जल्द ही भारत के बढ़ते हुए कदमों को करीब से देखेगी। pic.twitter.com/IHSu61VV59
— Narendra Modi (@narendramodi) July 26, 2023
‘भारत मंडपम’ का निर्माण 21वीं सदी में देश की आवश्यकताओं के अनुरूप किया गया है। इकोनॉमी से इकोलॉजी और ट्रेड से टेक्नोलॉजी तक के लिए यह एक बहुत बड़ा मंच बनने वाला है। pic.twitter.com/ll1mLXcop1
— Narendra Modi (@narendramodi) July 26, 2023
देश को यह दिव्य और भव्य परिसर कई बाधाओं को पार करने के बाद मिला है। pic.twitter.com/9YgYBZ7sJe
— Narendra Modi (@narendramodi) July 26, 2023
ये कन्वेंशन सेंटर इस बात का भी गवाह है कि हमारी सरकार कैसे होलिस्टिक अप्रोच और बहुत आगे की सोच के साथ काम कर रही है। pic.twitter.com/IYNxUANYhR
— Narendra Modi (@narendramodi) July 26, 2023