Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ అంబేడ్కర్ జాతీయ స్మారకానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి; డాక్టర్ అంబేడ్కర్ స్మారకోపన్యాసమిచ్చారు.

డాక్టర్ అంబేడ్కర్ జాతీయ స్మారకానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి; డాక్టర్ అంబేడ్కర్ స్మారకోపన్యాసమిచ్చారు.


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీ లోని అంబేడ్కర్ మహాపరినిర్వాణ స్థలమైన 26, అలీపూర్ రోడ్డు ప్రాంతంలో నిర్మాణం జరుగనున్న డాక్టర్ అంబేడ్కర్ జాతీయ స్మారకానికి పునాది రాయి వేశారు.

శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రధాన మంత్రి విజ్ఞాన్ భ‌వ‌న్ లో ఆవిష్కరించారు. ఆ తరువాత, డాక్టర్ అంబేడ్కర్ ఆరో స్మారక ఉపన్యాసమిచ్చిన ప్రధాన మంత్రి సమాజంలోని బలహీన వర్గాలకు హాని చేసే విధంగానో, వారికి ఇప్పుడున్న హక్కులకు భంగకరంగానో కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ విధానంలో ఎటువంటి మార్పులను చేయబోమని నిర్ద్వంద్వంగా స్పష్టం చేశారు. ఈ విషయంలో అసత్యాలను వ్యాప్తి లోకి తెస్తున్న వారిని, దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిని ఆయన తీవ్రంగా ఖండించారు. శ్రీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా అటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి లోకి వచ్చిందంటూ శ్రీ నరేంద్ర మోదీ జ్ఞాప‌కానికి తెచ్చుకొన్నారు.

డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ జాతికి చేసిన సేవ‌ల‌ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ – డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ జాతీయ స్మార‌కం త్వ‌ర‌లోనే ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భ‌వ‌నాల‌లో ఒకటి అవుతుంద‌ని చెప్పారు. అంతే కాకుండా, ఈ భ‌వ‌నాన్ని బాబాసాహెబ్ పుట్టిన రోజైన 2018 ఏప్రిల్ 14 న స్వ‌యంగా తానే ప్రారంభిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ గౌర‌వార్థం ఐదు ప్రాంతాల‌ను “పంచ తీర్థాలు” గా తీర్చి దిద్దుతున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. వీటిలో మౌ లోని ఆయ‌న జ‌న్మ స్థ‌లం, విద్యాభాసం స‌మ‌యంలో యునైటెడ్ కింగ్ డ‌మ్ లోని లండన్ లో ఆయ‌న బ‌స చేసిన ప్రాంతం, నాగ్ పూర్ లోని దీక్షా భూమి, ఢిల్లీ లోని మ‌హాప‌రినిర్వాణ స్థ‌లం, ముంబయి లోని చైత్య భూమి ఉన్నాయి. దీనికి తోడు న్యూ ఢిల్లీ లోని జ‌న్‌ప‌థ్ ప్రాంతంలో డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ ఫౌండేష‌న్ కోసం మ‌రొక భ‌వ‌నాన్ని కూడా నిర్మిస్తున్న సంగ‌తిని ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు.

దేశానికి డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ అందించిన సేవ‌ల‌ను గురించి వివ‌రిస్తూ – స‌ర్దార్ ప‌టేల్ దేశాన్ని రాజ‌కీయంగా ఒక్క‌టి చేస్తే, డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ రాజ్యాంగం ద్వారా దానిని సామాజికంగా ఒక్క‌టి చేశార‌న్నారు. మ‌హిళ‌ల‌కు స‌మాన హ‌క్కులు ఉండాల‌ని డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ వాదించార‌ని, అప్ప‌ట్లో ఈ ఆలోచ‌నకు రాజ‌కీయ వర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ సేవ‌ల‌ను ఒక్క ద‌ళితుల‌కో, లేక కేవ‌లం భార‌త దేశానికో ప‌రిమితం చేయ‌డం అంటే అది ఆయ‌న‌ను అవ‌మానించ‌డ‌మే అవుతుందని శ్రీ మోదీ అన్నారు. అన్యాయం బారిన ప‌డి న‌లిగిపోయిన వారంద‌రి కోసం డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ త‌న వాణిని వినిపించార‌ని, ఆయ‌న‌ది అమెరికాలో మార్టిన్ లూథ‌ర్ కింగ్ మాదిరిగానే ప్ర‌పంచ శ్రేణి వ్య‌క్తిత్వ‌మ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. ప‌ని వేళ‌ల‌ను 8 గంట‌ల‌కు ప‌రిమితం చేసేందుకు డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ ఎలా పాటు ప‌డ్డారో ప్రధాన మంత్రి వివ‌రిస్తూ, ఒక్క ద‌ళిత శ్రామికుల‌కు మాత్ర‌మే కాకుండా శ్రామికులంద‌రికీ ఆయ‌న ఒక ర‌క్ష‌కుడు అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

ఇటీవ‌ల చేప‌ట్టిన విధాన ప‌ర‌మైన‌, శాస‌న ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, భార‌తదేశ సముద్ర సంబంధిత శ‌క్తి యుక్తుల‌ను మ‌రింత ప‌టిష్టం చేయ‌డానికి ఉద్దేశించిన దార్శ‌నిక‌త‌.. ఆ మాట‌కొస్తే అంత‌ర్దేశీయ జ‌ల మార్గాల ప్ర‌ణాళిక..ను మొట్ట మొద‌ట‌గా ఆలోచించింది డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ అని వివ‌రించారు. అదే మాదిరిగా 2018 క‌ల్లా కేంద్ర ప్ర‌భుత్వం వాగ్దానం చేసిన విధంగా అనుసంధానానికి దూరంగా ఉన్న అన్ని ప‌ల్లెల‌కూ విద్యుత్తు సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌డమన్నది సైతం డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ దృక్ప‌థం వైపు పయనించే ల‌క్ష్యంతో కూడుకున్న‌దేన‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

ద‌ళిత ఔత్సాహిక పారిశ్రామికుల‌తో ఇటీవ‌ల తాను జ‌రిపిన సంప్ర‌దింపులు, స‌మావేశాల సంద‌ర్భంగా వారు వెలిబుచ్చిన సూచ‌న‌ల‌ను ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు. ఈ స‌ల‌హాల‌నన్నింటినీ కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లి కేంద్ర బ‌డ్జెటు లో పొందుపరచిందన్నారు.

వ్య‌వ‌సాయ‌దారులు వారు పండించిన పంట‌ల‌కు వీలైనంత మెరుగైన ధ‌రలను పొందేందుకు ఉప‌యోగ‌ప‌డే ఇ-ఫ్లాట్ ఫామ్ “నేష‌న‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ మార్కెట్” ను ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రారంభించనున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి తెలియ‌జేశారు.

***