జాతీయ ఖనిజాన్వేషణ విధానానికి (ఎన్ ఎమ్ ఇ పి) మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ప్రైవేటు రంగానికి ఇదివరకటి కన్న అధికంగా పాలు పంచడం ద్వారా దేశంలో ఖనిజాన్వేషణను వేగిరం చేయాలన్నది ఎన్ ఎమ్ ఇ పి ప్రధాన లక్ష్యంగా ఉంది. దేశ ఖనిజ వనరులను (ఇంధనేతర వనరులతో పాటు నాన్- కోల్ వనరులను కూడా) పూర్తి స్థాయిలో వెలికితీసేందుకు సమగ్రమైన ఖనిజాన్వేషణ చేపట్టవలసిన అవసరం ఉంది. తద్వారా ఆ వనరులను ఉత్తమమైన పద్ధతిలో వినియోగించుకొంటూ, భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఖనిజాల రంగం తాలూకు గరిష్ఠ భాగస్వామ్యాన్ని సమకూర్చగలిగినట్లు కూడా కాగలదు.
ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో కూడిన జియో-సైంటిఫిక్ డాటాను పబ్లిక్ డొమైన్ లో అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నాణ్యమైన పరిశోధనలను కొనసాగించడం, భూమిలో బాగా లోతుగా దాగి ఉన్న నిక్షేపాలను వెదకేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం, దేశంలో ఏరోజియోఫిజికల్ సర్వే లను వేగవంతంగా పూర్తి చేయడం, డెడికేటెడ్ జియోసైన్స్ డాటాబేస్ ను సిద్ధం చేయడం.. ఇవీ ఈ విధానం ముఖ్యాంశాలు.
దేశంలో ఖనిజాన్వేషణకు ఎన్ ఎమ్ ఇ పి ఈ కింది వాటిని ప్రధాన అంశాలుగా ఎంచుతున్నది:-
1. గుర్తించిన ఎక్స్ ప్లొరేషన్ బ్లాక్ లను ప్రైవేటు రంగం ద్వారా అన్వేషణ నిమిత్తం గనుల మంత్రిత్వ శాఖ వేలం వేస్తుంది. ఈ క్షేత్రాలలో ప్రైవేటు రంగం అన్వేషణను.. ఒకవేళ అన్వేషణ వేలం వేయదగిన వనరులు బయటపడటానికి దారితీసే పక్షంలో ఆదాయాన్ని పంచుకొనే పద్ధతిలో.. చేపట్టాల్సివుంటుంది.
2. ఒకవేళ అన్వేషక సంస్థలకు ఎటువంటి వేలం వేయదగ్గ వనరులను అన్వేషణలో కనుగొనని పక్షంలో ఆ సంస్థలు అన్వేషణ నిమిత్తం పెట్టిన ఖర్చులను నార్మేటివ్ కాస్ట్ ప్రాతిపదికన తిరిగి చెల్లిస్తారు.
3. బేస్‌లైన్ జియోసైంటిఫిక్ డాటాను ప్రజలందరి హితం కోసం ఉచితంగా అందుబాటులో ఉంచుతారు.
4. గోప్య ఖనిజ నిక్షేపాలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం నేషనల్ ఏరోజియోఫిజికల్ ప్రోగ్రామును చేపడుతుంది. ఈ కార్యక్రమం ధ్యేయం అధునాతన బేస్ లైన్ డాటాను సమకూర్చుకోవడమే అయి ఉంటుంది.
5. ఖనిజాన్వేషణకు సంబంధించి ప్రభుత్వ, సంబంధిత సంస్థలన్నీ సేకరించే సమాచారాన్ని సరిచూడడానికి నేషనల్ జియోసైంటిఫిక్ డాటా రిపోజిటరీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
6. దేశంలో ఖనిజాన్వేషణ సంబంధిత సవాళ్ళను పరిష్కరించడం కోసం శాస్త్ర విజ్ఞాన, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల రంగం సమన్వయంతో నేషనల్ సెంటర్ ఫర్ మినరల్ టార్గెటింగ్ (ఎన్ సి ఎమ్ టి) అనే లాభాపేక్ష రహిత స్వయంప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది.
7. ఆకర్షణీయమైన ఆదాయ పంపకం నమూనాలను అనుసరించడం ద్వారా అన్వేషణ కార్యకలాపాలలోకి ప్రైవేట్ పెట్టుబడిని ఆహ్వానించేటట్లుగా నిబంధనలను రూపొందించారు.
8. ఆస్ట్రేలియాలో చేపట్టిన UNCOVER ప్రాజెక్టు తరహాలో, ప్రభుత్వం దేశంలోని గుప్త ఖనిజాలను అన్వేషించడానికి నేషనల్ జియోఫిజికల్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్, ఇంకా ప్రతిపాదిత ఎన్ సి ఎమ్ టి మరియు జియోసైన్స్ ఆస్ట్రే లియా లతో కలసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించే ఉద్దేశం కూడా ఉంది.
ఎన్ ఎమ్ ఇ పి సిఫార్సులను అమలు చేయడానికి, ఐదేళ్ళ కాలం లోపల దాదాపు రూ.2,116 కోట్లు అవసరమవుతాయి. ఇది గనుల శాఖ అధీనంలోని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వార్షిక ప్రణాళిక బడ్జెట్‌కు అదనం. ఎన్ ఎమ్ ఇ పి దేశవ్యాప్తంగా యావత్తు ఖనిజ రంగానికి ప్రయోజనకరం కాగలదు.
ఎన్ ఎమ్ ఇ పి ముఖ్య ప్రభావం ఇలా ఉంటుంది:-
1. బేస్‌లైన్ జియోసైంటిఫిక్ డాటా ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులోకి రాగలదు. ఇది ఇటు ప్రజలకు, అటు ప్రైవేటు ఖనిజాన్వేషణ సంస్థలకు మేలు చేకూర్చగలదని భావిస్తున్నారు.
2. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో అన్వేషణకు శాస్త్ర, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల సహకారం అవసరమవుతుంది.
3. గుప్తంగా ఉన్న ఖనిజ వనరులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ఇందుకోసం నేషనల్ ఏరోజియోఫిజికల్ మ్యాపింగ్ ప్రోగ్రామును చేపడతారు.
4. గుర్తించిన బ్లాకుల్లో ఖనిజాన్వేషణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. వచ్చే లాభంలో కొంతమేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాటా ఉంటుంది.
5. ఖనిజాన్వేషణపై ప్రజాధనాన్ని వ్యయం చేయడాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించి, నిర్ణయాలు తీసుకుంటారు.
ఇటీవలి కాలంలో గనుల మంత్రిత్వ శాఖ 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం లాంటి చర్యల ద్వారా గనుల రంగం వృద్ధికి ముందడుగు వేస్తోంది. అయితే ఇవి కొంత మేరకే ఫలితాలనిస్తున్నాయి. అందుకే ఈ రంగంలోని కొత్త డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని, దేశంలో ఖనిజాన్వేషణకు నడుం బిగించింది. పారదర్శకంగా ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేసుకొని ఈ పనిని చేపడుతారు.
National Mineral Exploration Policy approved by the Cabinet will spearhead sectoral growth & accelerate development. https://t.co/VG7iqslqGc
— Narendra Modi (@narendramodi) June 29, 2016