ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎయిడ్స్ టు నావిగేషన్ (AtoNs) అంశంపై భారత ప్రభుత్వ నౌకాయాన మంత్రిత్వ శాఖ పరిధి లోని లైట్ హౌస్ లు & లైట్ షిప్ ల డైరెక్టరేట్ జనరల్ (డిజిఎల్ ఎల్)కు, బంగ్లాదేశ్ ప్రభుత్వ నౌకాయాన శాఖకు మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు)పై సంతకాలకు ఆమోదం తెలిపింది.
ఈ ఎమ్ఒయు ఉభయ దేశాల మధ్య ఈ కింద పేర్కొన్న అంశాలలో సహకారానికి ఉద్దేశించినటువంటిది:
a. లైట్ హౌస్ లు, బీకన్ లపై సలహాలు అందించుకోవడం;
b. నౌకా రవాణా సేవలు, ఆటోమేటిక్ గుర్తింపు వ్యవస్థలపై (ఎఐఎస్) సలహాలు అందించుకోవడం; మరియు
c. బంగ్లాదేశ్ కు చెందిన అటాన్ ల మేనేజర్లు, టెక్నీషియన్లకునావిగేషణ్, లైట్ హౌస్ అధికారుల అంతర్జాతీయ మెరైన్ ఎయిడ్స్ అసోసియేషన్ (ఐఎఎల్ఎ) శిక్షణ కార్యక్రమానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వడం.
ఈ ఎమ్ఒయు ఆధారంగా ఉభయ దేశాలు ఈ కింద ప్రస్తావించిన విభాగాలలో సహకారాన్ని విస్తరించుకోగలుగుతాయి:
a. AtoNs పై సలహాలు అందించుకోవడం;
b. AtoNs సిబ్బందికి శిక్షణ ఇచ్చేం విద్యాసంస్థల మధ్య సహకారం;
c. AtoN రంగంలో నైపుణ్యాలను పెంచుకునేందుకు దోహదపడే వర్క్ షాప్ లు/సదస్సుల నిర్వహణలో సహకారం.
దక్షిణాసియా ప్రాంతంలో AtoN శిక్షణలో సామర్థ్యాల నిర్మాణానికి ఈ ఎమ్ఒయు సహాయకారిగా ఉంటుంది. ఐఎఎల్ఎ మోడల్ కోర్స్ ఇ-141/1 కు అనుగుణంగా ప్రాదేశిక జలాల్లో రవాణాకు సంబంధించిన మరీన్ ఎయిడ్స్ వినియోగంలో శిక్షణా సామర్థ్యాలు మరింతగా విస్తరిస్తాయి. దీని వల్ల ఐఎఎల్ఎ మార్గదర్శకాలకు అనుగుణంగా వృత్తిపరమైన శిక్షణను అందించడం సాధ్యమవుతుంది.
భారత, బంగ్లాదేశ్ లు దక్షిణాసియా ప్రాంతంలోని రెండు ప్రధాన వర్థమాన దేశాలు. ఉభయ దేశాల మధ్య దీర్ఘకాలంగా స్నేహబంధం, సామరస్యపూర్వక బంధం నెలకొన్నాయి. ఇటీవల ఉభయ దేశాలకు చెందిన ఉన్నత స్థాయి నాయకుల ద్వైపాక్షిక సందర్శనలు చోటుచేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
పూర్వరంగం
ఇంటర్ నేషనల్ మరీన్ ఆర్గనైజేషన్ (ఐఎమ్ఒ) అవసరాల మేరకు, అంతర్జాతీయ మార్గదర్శకాలు, సిఫారసులకు అనుగుణంగా ప్రతి ఒక్క దేశం తన ప్రాదేశిక జలాల్లో నౌకా రవాణాకు సహాయకారిగా ఉండే పరికరాలు, ఉపకరణాలు అందుబాటులో ఉంచాలి. సముద్ర జలాల్లో నౌకలు సురక్షితంగా తిరిగేందుకు లైట్ హౌస్ లు, బీకన్ లు, డిజిపిఎస్, సముద్ర జలాల్లో తేలియాడుతూ దారిని తెలియచేసే పరికరాలు సహాయకారిగా ఉంటాయి. భారతదేశంలో ఇలాంటి ఇతర నౌకామార్గదర్శక పరికరాలు, ఉపకరణాలను లైట్ హౌస్ లు & లైట్ షిప్‌ల డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ప్రాదేశిక జలాల్లో ఏర్పాటు చేస్తూ ఉంటుంది. 193 లైట్ హౌస్‌లు, 64 బీకన్ లు, 22 డీప్ సీ లైటెడ్ బాయ్ లు, 23 డిజిపిఎస్ స్టేషన్లు, 1 లైట్ షిప్, 4 టెండర్ నౌకలు, జాతీయ స్థాయిలో ఎఐఎస్ నెట్ వర్క్, కచ్ సింధు శాఖలో వెసల్ ట్రాఫిక్ సర్వీస్ ఈ శాఖ నిర్వహణలో ఉన్నాయి. వాటి నిర్వహణలో ఆ శాఖకు అపారమైన అనుభవం ఉంది.
నౌకల సురక్షిత రాకపోకలకు అవసరం అయిన ఉపకరణాల ఏర్పాటును సమన్వయపరిచి, సామరస్య సాధనకు కృషి చేసే అంతర్జాతీయ సంస్థ ఐఎఎల్ఎ. డిజిఎల్ఎల్ ద్వారా భారత్ ఐఎఎల్ఎ లో సభ్యత్వ దేశంగా ఉంది. ఈ విషయంలో ప్రాంతీయ సహకారం విస్తరించుకునే ప్రయత్నంలో భాగంగా భారత, బంగ్లాదేశ్ లు AtoN పై సహకారానికి ఒక ఎమ్ఒయు ను కుదుర్చుకున్నాయి. ఈ ఎమ్ఒయు లో భాగంగా భారత ప్రభుత్వ నౌకాయాన మంత్రిత్వ శాఖ తరఫున డిజిఎల్ఎల్ బంగ్లాదేశ్ కు చెందిన నౌకాయాన మంత్రిత్వ శాఖకు వెసల్ ట్రాఫిక్ సర్వీసు, గొలుసుకట్టు ఆటోమేటిక్ గుర్తింపు వ్యవస్థల ఏర్పాటు, నిర్వహణతో సహా AtoNs వినియోగంపై సలహాలు అందిస్తుంది. బంగ్లాదేశ్ AtoN సిబ్బందికి AtoN మేనేజర్లు, టెక్నీషియన్ ల శిక్షణకు ఐఎఎల్ఎ రూపొందించిన శిక్షణ కార్యక్రమం పరిధిలో డిజిఎల్ఎల్ శిక్షణ ఇస్తుంది. ఇందులో భాగంగా వర్క్ షాపులు/సదస్సులు కూడా నిర్వహిస్తుంది. బంగ్లాదేశ్ కు చెందిన AtoN సిబ్బంది సామర్థ్యాల విస్తరణకు ఇది సహాయకారిగా ఉంటుంది.