ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసిఎ) కు సంబంధించిన పథకాన్ని మరో మూడు ఆర్థిక సంవత్సరాల పాటు ( 2017-18 ఆర్థిక సంవత్సరం నుండి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు) కొనసాగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, ఈ సంస్థకు 18 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపింది. ఇది ఈ ఇన్‌స్టిట్యూట్ 2019-20 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికల్లా స్వయంపోషకత్వాన్ని సంతరించుకొనేందుకు తోడ్పడగలదు.
ప్రభావం:
• ప్రభుత్వ రంగం మరియు ప్రైవేటు రంగం యొక్క భాగస్వామ్యంతో కార్పొరేట్ గవర్నెన్స్ వంటి ప్రత్యేక అంశాలలో ఈ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు, పరిశోధన కార్యకలాపాలు, ఇంకా ప్రాజెక్టులు విద్యార్థుల మరియు వృత్తినిపుణుల నైపుణ్యాన్ని పెంపొందింపచేసి, తద్వారా వారిలోని ఉపాధి అర్హతలను ఇనుమడింప చేస్తాయి.
• కార్పొరేట్ చట్టాల రంగంలో ప్రతిస్టాత్మకమైన సంస్థగా ఎదగడంతో పాటు సంస్థ వనరులను , రాబడిని పెంచుకోవడం కూడా ఈ సంస్థ యొక్క లక్ష్యం.
• ఐఐసిఎ జాతీయ ప్రాధాన్యం కలిగిన సంస్థగా ప్రగతికి చోదక శక్తిగా ఉండి, ఆర్థిక కార్యకలాపాల వృద్ధికి దోహదకారి కావాలని లక్షించారు.
• వృత్తిపరమైన సామర్ధ్యాలలో మెరుగుదల వివిధ రంగాల నిపుణులకు ఆయా నూతన కార్పొరేట్ రంగాలలో ఉపాధి అవకాశాలను అందుకోవడంలో సహకరించడంతో పాటు విదేశాలలో కూడా అవకాశాలను అన్వేషించడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు.
పూర్వ రంగం:
కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలకు ఐఐసిఎ లోని నేషనల్ ఫౌండేషన్ ఫర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (ఎన్ఎఫ్ సిఎస్ఆర్)దే పూచీ. కంపెనీల చట్టం, 2013 లోని నూతన నిబంధనలకు అనుగుణంగా ఈ ఫౌండేషన్ కు రూపకల్పన చేశారు. అన్ని వర్గాలను సామాజికంగా కలుపుకొని పోయే విధంగా ఎన్ఎఫ్ సిఎస్ఆర్ వివిధ కార్పొరేట్ సంస్థలతో కలసి వేరు వేరు కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
విధాన రూపకర్తలు , కార్పొరేట్ రంగానికి సంబంధించిన నియంత్రణ సంస్థలతో పాటు ఈ రంగంలో పనిచేస్తున్న ఇతర సంబంధిత వర్గాలు హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని, జ్ఞానాన్ని అందించే ఒక భాండారం గాను, ఒక సలహాదారు గాను ఐఐసిఎ పని చేస్తుంది. కార్పొరేట్ చట్టాలు, కార్పొరేట్ పాలన, కార్పొరేట్ సామాజిక బాధ్యత, అకౌంటింగ్ ప్రమాణాలు, ఇన్ వెస్టర్ ఎజుకేశన్, తదితర రంగాలలో ఐఐసిఎ తన సేవలను సంబంధిత వర్గాలకు అందిస్తుంది. ఒకటో తరం ఔత్సాహిక పారిశ్రామికులు మరియు చిన్న వ్యాపార సంస్థల నిర్వాహకులు మేనేజ్‌మెంట్, చట్టం, అకౌంటెన్సీ ల వంటి విషయాలలో ప్రత్యేక నిపుణులను ఏర్పాటు చేసుకునేందుకు అయ్యే ఖర్చును భరించలేరు కనుక వారికి ఐఐసిఎ ఆధ్వర్యంలోని వివిధ కార్యకలాపాలు తగిన విధంగా తోడ్పడుతాయి.