ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ కింది విషయాలను చర్చించి ఆమోదం తెలిపింది..
(అ) మధ్య ప్రదేశ్ లోని సీహోర్ లో ఉన్న అమ్లాహ లో ఫూడ్ లెగ్యూమ్స్ రిసర్చ్ ప్లాట్ ఫామ్ (ఎఫ్ఎల్ఆర్ పి) స్థాపనకు; రెండో దశలో పప్పు ధాన్యాల కోసం పశ్చిమ బెంగాల్ లోను, నేచురల్ రిసోర్స్ మేనేజ్ మెంట్ కోసం రాజస్థాన్ లోను ఇంటర్ నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ రిసర్చ్ ఇన్ డ్రై ఏరియాస్ (ఐసిఎఆర్ డిఎ) ద్వారా ఏర్పాటు చేసేందుకు;
(ఆ) మధ్య ప్రదేశ్ లో ఉన్న సీహోర్ లోని అమ్లాహ ఫామ్ లో ఎఫ్ఎల్ఆర్ పి ని నెలకొల్పేందుకు ఐసిఎఆర్ డిఎ కు ఏడాదికి ఎకరానికి ఒక రూపాయి భూమి అద్దె ప్రాతిపదికన భూమి ని (70.99 హెక్టార్లు, 175.42 ఎకరాలు) 30 సంవత్సరాల పాటు కౌలుకు ఇచ్చేందుకు మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో లీజు ఒప్పందంపై సంతకాలకు;
(ఇ) ఐసిఎఆర్ డిఎ యొక్క ఫూడ్ లెగ్యూమ్స్ రిసర్చ్ ప్లాట్ ఫామ్ కు యునైటెడ్ నేషన్స్ (ప్రివిలిజెస్ అండ్ ఇమ్యూనిటీస్) యాక్ట్, 1947 లోని 3వ ఉపనిబంధనలో ఉద్దేశించిన విధంగా అంతర్జాతీయ స్థాయిని కల్పించేందుకు సూత్రప్రాయ ఆమోదం;
(ఈ) ప్లాట్ ఫామ్ స్థాపనకు సంబంధించిన అన్ని విషయాలలో భారత ప్రభుత్వం పక్షాన వ్యవసాయ పరిశోధన విభాగం (డిఎఆర్ఇ) కి అధికారమివ్వడం;
(ఉ) ఎఫ్ఎల్ఆర్ పి ఏర్పాటుకు సంబంధించి ఐసిఎఆర్ కు మరియు ఐసిఎఆర్ డిఎ కు మధ్య సంతకాలయిన అనుబంధ ఒప్పందంలో సాంకేతికపరమైన సవరణలు చేయడం అవసరపడితే అందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖకు అధికారమివ్వడం.
భారతదేశంలో ఎఫ్ఎల్ఆర్ పి ని స్థాపించడం వల్ల భారతదేశం ఆహార భద్రత విషయాలలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో మెరుగైన అంతర్జాతీయ శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించుకొనే అవకాశం భారతదేశానికి దక్కుతుంది. ఎఫ్ఎల్ఆర్ పి సాధించే పరిశోధన ఫలితాలను శీఘ్రంగాను, సమర్ధంగాను భారతదేశం వినియోగించుకోగలుగుతుంది. ఒక ప్రధానమైన పరిశోధన & అభివృద్ధి సంస్థ భారతదేశాన్ని ప్రపంచంలో మరింత పెద్ద వ్యవసాయ పరిశోధన కేంద్రంగా మార్చగలుగుతుంది. తద్వారా దేశంలో పరిశోధన & అభివృద్ధి సంబంధిత పెట్టుబడులను మరింతగా ఆకర్షించడంలోనూ ఇది సహాయపడగలదు.
ఇది ఒక అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఒక పరిశోధన కార్యక్రమం. మెట్ట భూములలో పండే పప్పుదినుసు రకాలతో సహా వాతావరణానికి తట్టుకొని ఉండగల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరచడంతో పాటు నవకల్పనలో ఐసిఎఆర్ డిఎ కు మంచి అనుభవం ఉంది. పంటల దిగుబడులను మరియు పశు గణాన్ని పెంచేందుకు పలు విభాగాలలో కృషి చేసే శాస్త్రజ్ఞుల బృందం సాయంతో ఐసిఎఆర్ డిఎ పరిశోధన చేపడుతుంది. పేదరికాన్ని తగ్గించడంలో, ఆహార భద్రతను పటిష్టపరచడంలో, పోషకాహారాన్ని మెరుగుపరచి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో, ప్రకృతి వనరుల స్థాయిని నిలబెట్టుకోవడంలో ఈ ప్లాట్ ఫామ్ గణనీయంగా తోడ్పాటును అందించగలుగుతుంది.
అన్ని ప్రాంతాలకు చెందిన వ్యవసాయదారులు, సన్నకారు రైతులు మరియు చిన్న రైతులు పరిశోధన ఫలితాల నుండి ప్రయోజనాలు పొందవచ్చు; ఎలాగంటే, ఇక్కడ అభివృద్ధిపరచే సాంకేతిక పరిజ్ఞానాలు వ్యవసాయదారులంతా వినియోగించుకొనేందుకు యోగ్యమైనవిగా ఉంటాయి. ఈ ప్రాజెక్టు సమాన అవకాశాలను కల్పిస్తుంది. దీని ఫలాలను అందరికీ పంచుతారు.