Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోవిడ్-19 పరిస్థితిపై జాతినుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

కోవిడ్-19 పరిస్థితిపై జాతినుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం


దేశంలో కోవిడ్-19 పరిస్థితులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇటీవలి కాలంలో మహమ్మారివల్ల ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని సంతాపం ప్రకటించారు. ‘‘ఈ విషాద సమయంలో మీ కుటుంబంలో ఒక సభ్యుడిలా మీకు తోడుగా నేనున్నాను. మనముందున్న సవాలు చాలా పెద్దది… దాన్ని పూర్తి సంసిద్ధత, మనోధైర్యం,  పట్టుదలతో సామూహికంగా మాత్రమే అధిగమించగలం’’ అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. కరోనాపై యుద్ధంలో వైద్యులు.. వైద్య సిబ్బంది.. సహాయ వైద్యసిబ్బంది.. పారిశుధ్య కార్మికులు.. అంబులెన్స్ డ్రైవర్లు.. భద్రత దళాలు.. పోలీసు బలగాల సేవలను ఆయన ఎంతగానో కొనియాడారు.

   దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ కోసం పెరుగుతున్న డిమాండును తీర్చేలా వేగంగా.. అవగాహనతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రధాని స్పష్టం చేశారు. అవసరమున్న ప్రతి వ్యక్తికీ ప్రాణవాయువు సరఫరా అయ్యేవిధంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం శాయశక్తుల కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రాణవాయువు ఉత్పత్తి, సరఫరాలను మరింత పెంచడం కోసం వివిధ స్థాయులలో అన్నివిధాలా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా కొత్త ప్రాణవాయువు ఉత్పత్తి కర్మాగారాల ఏర్పాటు, లక్ష కొత్త సిలిండర్ల లభ్యత, పారిశ్రామిక వినియోగం నుంచి ఆస్పత్రులకు ఆక్సిజన్ మళ్లింపు, ఆక్సిజన్ సరఫరా రైళ్లు నడపడం వంటి అనేక చర్యలు తీసుకుంటున్నమని ప్రధాని విశదీకరించారు.

   మన శాస్త్రవేత్తలు అత్యంత తక్కువ సమయంలో, టీకాను అభివృద్ధి చేశారని, ప్రపంచం మొత్తంమీద నేడు అత్యంత చౌకగా లభించేది భారతదేశంలో తయారైన టీకాయేనని ఆయన చెప్పారు. అంతేకాకుండా దేశీయంగా అందుబాటులోగల శీతల గిడ్డంగుల వ్యవస్థలో నిల్వకు వీలున్న టీకా కావడం గమనార్హమని పేర్కొన్నారు. ఈ సమష్టి కృషి ఫలితంగానే స్థానికంగా తయారుచేసిన రెండు రకాల టీకాలతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు. టీకాలిచ్చే కార్యక్రమం తొలిదశ ప్రారంభం నుంచీ గరిష్ఠ ప్రాంతాలకు, అవసరమైన మేరకు అత్యధికంగా ప్రజలకు టీకా చేరేలా జాగ్రత్త వహించినట్లు తెలిపారు. ఆ మేరకు ప్రపంచంలో 10 కోట్లు, 11 కోట్లు, 12 కోట్ల మైలురాళ్లను చేరడంలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు.

   టీకాలిచ్చే కార్యక్రమానికి సంబంధించి నిన్న తీసుకున్న నిర్ణయం గురించి వివరిస్తూ- మే 1వ తేదీ తర్వాత దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా ఇవ్వబడుతుందని ప్రధానమంత్రి చెప్పారు. దేశీయంగా తయారయ్యే టీకాలలో సగం వివిధ రాష్ట్రాలకు.. ఆస్పత్రులకు నేరుగా సరఫరా అవుతాయన్నారు. ప్రజల ప్రాణరక్షణసహా ఆర్థిక కార్యకలాపాలకు వెసులుబాటుతో జన జీవనోపాధిపై ప్రతికూలతను కనిష్ఠ స్థాయికి తగ్గించేలా చర్యలు చేపట్టామని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో 18 ఏళ్లు దాటినవారందరికీ టీకా ఇవ్వనున్నందున నగరాల్లోని కార్మికశక్తికి త్వరగా టీకా అందుబాటులోకి వస్తుందన్నారు. ఆయా రాష్ట్రాల్లోని కార్మికులు ఎక్కడున్నవారు అక్కడే ఉండేలా ప్రభుత్వాలు వారిలో విశ్వాస కల్పన చర్యలు చేపట్టాలని ప్రధాని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విధంగా వారిలో నమ్మకం కల్పించడం ద్వారా కార్మికులకు, వలస కూలీలకు ఎక్కడున్నవారికి అక్కడ టీకా ఇవ్వడంలో దోహదపడగలదని చెప్పారు. దీనివల్ల వారి జీవనోపాధికీ భంగం కలగకుండా ఉంటుందని పేర్కొన్నారు.

   మహమ్మారి తొలిదశ ఆరంభంలో ఎదుర్కొన్న సవాళ్లతో పోలిస్తే, ఈ సవాలును ఎదుర్కొనగల స్థాయిలో మనకు మరింత మెరుగైన ప‌రిజ్ఞానంతోపాటు వనరులు కూడా ఉన్నాయని ప్రధానమంత్రి చెప్పారు. చక్కని రీతిలో ఓరిమితో మహమ్మారిపై పోరు సాగించిన ఘనత ప్రజలదేనని శ్రీ మోదీ ప్రశంసించారు. ప్రజా భాగస్వామ్యం ఇచ్చిన బలంతో రెండోదశలోనూ కరోనా మహమ్మారిని ఓడించగలమని ఆయన చెప్పారు. ప్రజలకు అవసరమైన ప్రతి సమయంలోనూ సేవలందిస్తున్న సామాజిక సంస్థల కృషికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేతరహాలో ప్రతి ఒక్కరూ ఇతరులకు సాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువతరం తమతమ ప్రాంతాల్లోని ఇరుగుపొరుగు కోవిడ్ అనుగుణ ప్రవర్తనను పాటించడంలో అందరికీ తోడ్పాటునివ్వాలని ప్రధానమంత్రి సూచించారు. దీనివల్ల నియంత్రణ మండళ్లు, కర్ఫ్యూలు, దిగ్బంధాలు లేకుండా చూసుకోవచ్చునని పేర్కొన్నారు. ఇళ్లలోని పెద్దలు అనవసరంగా బయటకు వెళ్లకుండా ఆయా కుటుంబాల్లోని పిల్లలు తగు వాతావరణాన్ని సృష్టించాలని ఆయన కోరారు.

   నేటి పరిస్థితులలో దేశాన్ని మనం దిగ్బంధం నుంచి రక్షించాలని ప్రధానమంత్రి చెప్పారు. దిగ్బంధాన్ని చిట్టచివరి పరిష్కారంగా మాత్రమే పరిగణించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సూక్ష్మ నియంత్రణ మండళ్ల ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి సారిస్తూ దిగ్బంధాన్ని తప్పించడానికే మనమంతా వీలైనంతగా కృషి చేయాలని ప్రధాని చెప్పారు.

 

***