Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యుగాండా లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుగాండా లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించారు. కంపాలా లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యుగాండా అధ్యక్షుడు శ్రీ ముసెవెనీ కూడా హాజరయ్యారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగంలో, తాను యుగాండా లోని భారతీయ సముదాయానికి చెందిన వాడినన్న అనుభూతి కి లోనైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు శ్రీ ముసెవెనీ హాజరు కావడం యుగాండా లోని భారతీయ సముదాయమన్నా, భారతదేశంలోని ప్రజలన్నా ఆయనకు ఎంతటి ప్రేమ ఉందో చాటిచెప్తోందని శ్రీ మోదీ అన్నారు. బుధవారం నాడు యుగాండా పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించే గౌరవాన్ని తనకు కట్టబెట్టినందుకుగాను యుగాండా ప్రజలకు, అధ్యక్షుడు శ్రీ ముసెవెనీ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

భారతదేశానికి, యుగాండా కు మధ్య ఉన్నటువంటి సంబంధం శతాబ్దాల నాటిదని ప్రధాన మంత్రి అన్నారు. యుగాండా లో వలసవాదం పై జరిగిన పోరాటం, రైలు మార్గ నిర్మాణ పనులు సహా ఉభయ దేశాల మధ్య ఉన్నటువంటి చారిత్రక లంకెలను గురించి ఆయన జ్ఞ‌ప్తికి తెచ్చారు. అనేక మంది భారతీయులు యుగాండా రాజకీయాలలో సైతం ఒక కీలక భూమిక ను పోషించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిబింబించిన విధంగా భారతీయత ను పరిరక్షిస్తున్నందుకుగాను భారతీయ సముదాయానికి ఆయన అభినందనలు తెలియజేశారు.

యుగాండా తో పాటు ఆఫ్రికా లోని అన్ని దేశాలు భారతదేశానికి ముఖ్యమైనవే అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన సమరం తాలూకు ఉమ్మడి చరిత్ర, విశాలమైనటువంటి ప్రవాసి భారతీయులు, ఇంకా అభివృద్ధి పరంగా ఉమ్మడి సవాళ్లు.. ఇవన్నీ ఇందుకు కారణాలు అయ్యాయంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా వర్ధిల్లుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కార్లను మరియు స్మార్ట్ ఫోన్ లను భారతదేశం ఎగుమతి చేస్తోందని ఆయన అన్నారు. డిజిటల్ టెక్నాలజీ భారతదేశ ప్రజలకు సాధికారితను కల్పించేటటువంటి ఒక సాధనంగా మారుతోందని, స్టార్ట్ అప్ ల కు ఒక ముఖ్యమైన కేంద్రంగా దేశం రూపుదిద్దుకొంటోందని ఆయన వివరించారు.

భారతదేశ విదేశాంగ విధానంలో ఆఫ్రికా కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి విశదీకరించారు. ఈ సందర్భంలో, ఆయన 2015వ సంవత్సరం లో న్యూ ఢిల్లీ లో జరిగిన ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమిట్ ను గురించి ప్రస్తావించారు. అలాగే భారతదేశానికి మరియు ఆఫ్రికా లోని ఇతర దేశాలకు మధ్య చోటు చేసుకొన్న ఇతర ఉన్నత స్థాయి ద్వైపాక్షిక కార్యక్రమాలను గురించి సైతం ఆయన ఏకరువు పెట్టారు.

ప్రధాన మంత్రి 3 బిలియన్ డాలర్లకు పైగా విలువైనటువంటి లైన్స్ ఆఫ్ క్రెడిట్ తో అమలవుతున్న ప్రాజెక్టులను, ఉపకార వేతనాలను, ఇంకా ఇ-వీజ వంటి కార్యక్రమాలను గురించి తన ప్రసంగంలో వివరించారు. ఇంటర్ నేశనల్ సోలర్ అలయెన్స్ లో సభ్యత్వం పొందిన దేశాలలో సగం దేశాలు ఆఫ్రికా లోనివే అని ఆయన అన్నారు.

ఆఫ్రికా మరియు ఏశియా దేశాలు నవీన ప్రపంచ వ్యవస్థ లో ఒక బలమైన పాత్ర ను పోషిస్తున్నాయని ప్రధాన మంత్రి తెలిపారు.