యువర్ హైనెస్,
ఎక్స్ లెన్సీస్
నమస్కారం!
140 కోట్ల మంది భారతీయుల తరఫున, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 3.0 కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గత రెండు శిఖరాగ్ర సమావేశాల్లో, మీలో చాలా మందితో సన్నిహితంగా కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. ఈ సంవత్సరం భారత సార్వత్రిక ఎన్నికల తరువాత, ఈ వేదికపై మీ అందరితో సంభాషించే అవకాశం నాకు మరోసారి లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.
మిత్రులారా..
2022లో భారత్ జీ20 అధ్యక్ష పదవిని చేపట్టే సమయంలో జీ20కి కొత్త రూపం ఇవ్వాలని తీర్మానించాం. వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ అభివృద్ధి సంబంధిత సమస్యలు, ప్రాధాన్యతల గురించి బహిరంగంగా చర్చించడానికి ఒక వేదికగా మారింది.
గ్లోబల్ సౌత్ ఆశలు, ఆకాంక్షలు, ప్రాధాన్యతల ఆధారంగా జీ20 ఎజెండాను భారత్ రూపొందించింది. సమ్మిళిత, అభివృద్ధి కేంద్రీకృత విధానంతో జీ20ని ముందుకు నడిపించారు. ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) జీ20లో శాశ్వత సభ్యత్వం పొందిన చారిత్రాత్మక ఘట్టమే దీనికి అతిపెద్ద ఉదాహరణ.
మిత్రులారా.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ రోజు మనం కలుస్తున్నాం. కొవిడ్ ప్రభావం నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా బయటపడలేదు. అదే సమయంలో యుద్ధ పరిస్థితులు మన అభివృద్ధి ప్రయాణానికి సవాళ్లు విసురుతున్నాయి. మనం ఇప్పటికే వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటుంటే.. ఇప్పుడు ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, ఇంధన భద్రత గురించి కూడా ఆందోళన చెందుతున్నాం.
ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం మన సమాజానికి పెను ముప్పుగా పరిణమించాయి. సాంకేతిక విభజన, సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడిన కొత్త ఆర్థిక, సామాజిక సవాళ్లు కూడా ఉద్భవిస్తున్నాయి. గత శతాబ్దంలో ఏర్పడిన గ్లోబల్ గవర్నెన్స్, ఆర్థిక సంస్థలు ఈ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోలేకపోయాయి.
మిత్రులారా.
అందువలన, గ్లోబల్ సౌత్ లోని దేశాలు ఏకం కావడం, ఒకే స్వరంతో కలిసి నిలబడటం, ఒకరికొకరు బలంగా మారడం ప్రస్తుత అవసరం. ఒకరి అనుభవాల నుంచి మరొకరు పాఠాలు నేర్చుకుందాం, మన సామర్థ్యాలను పంచుకుందాం, కలిసి మన తీర్మానాలను విజయంగా మార్చుదాం.
మూడింట రెండొంతుల మానవాళికి గుర్తింపు తెచ్చేందుకు అందరం కలిసి పనిచేద్దాం. భారత్ తన అనుభవాలను, సామర్థ్యాలను గ్లోబల్ సౌత్ లోని అన్ని దేశాలతో పంచుకోవడానికి కట్టుబడి ఉంది. పరస్పర వాణిజ్యం, సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతి, మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించాలని మేం కోరుకుంటున్నాం. ఇటీవలి సంవత్సరాల్లో, మౌలిక సదుపాయాలు, డిజిటల్, ఇంధన కనెక్టివిటీ ద్వారా మన పరస్పర సహకారాన్ని పెంపొందించుకున్నాము.
మిషన్ లైఫ్ కింద భారత్ లోనే కాకుండా భాగస్వామ్య దేశాల్లో కూడా రూఫ్ టాప్ సోలార్, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్నాం. ఆర్థిక సమ్మిళితం, చివరి మైల్ డెలివరీలో మా అనుభవాలను పంచుకున్నాం; యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్, అనగా యుపిఐతో గ్లోబల్ సౌత్ లోని వివిధ దేశాలను అనుసంధానించడానికి చొరవలు తీసుకున్నాం. విద్య, సామర్థ్యం పెంపు, నైపుణ్య రంగాల్లో మా భాగస్వామ్యంలో గణనీయమైన పురోగతి ఉంది.
గత ఏడాది గ్లోబల్ సౌత్ యంగ్ డిప్లొమేట్ ఫోరంను కూడా ప్రారంభించారు. ‘దక్షిణ్‘ అంటే గ్లోబల్ సౌత్ ఎక్సలెన్స్ సెంటర్ మన మధ్య సామర్థ్య పెంపు, నైపుణ్యం, జ్ఞాన భాగస్వామ్యంపై పనిచేస్తోంది.
మిత్రులారా.
సమ్మిళిత వృద్ధికి డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అంటే డీపీఐ సహకారం ఒక విప్లవానికి ఏ మాత్రం తీసిపోదు. మా జి 20 అధ్యక్షతన సృష్టించబడిన గ్లోబల్ డిపిఐ రిపోజిటరీ, డిపిఐపై మొట్టమొదటి బహుళపక్ష ఏకాభిప్రాయం.
గ్లోబల్ సౌత్ కు చెందిన 12 భాగస్వాములతో “ఇండియా స్టాక్” ను పంచుకునేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉంది. గ్లోబల్ సౌత్ లో డిపిఐని వేగవంతం చేయడానికి మేము సోషల్ ఇంపాక్ట్ ఫండ్ ను సృష్టించాము. దీనికి భారత్ 25 మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వనుంది.
మిత్రులారా,
వన్ వరల్డ్ వన్ హెల్త్ అనేది ఆరోగ్య భద్రత కోసం మా మిషన్; మా విజన్ – “ఆరోగ్య మైత్రి” అంటే “ఆరోగ్యం కోసం స్నేహం“. ఆఫ్రికా, పసిఫిక్ ద్వీప దేశాలకు ఆసుపత్రులు, డయాలసిస్ యంత్రాలు, ప్రాణాలను కాపాడే మందులు, ‘జన ఔషధి కేంద్రాలు‘ అందించడం ద్వారా ఈ స్నేహాన్ని కొనసాగించాం.
పపువా న్యూ గినియాలో అగ్నిపర్వత విస్ఫోటనం లేదా కెన్యాలో వరద సంక్షోభం వంటి మానవతా సంక్షోభ సమయాల్లో, భారతదేశం తన మిత్ర దేశాలకు మొదటి ప్రతిస్పందనగా సహాయం చేస్తోంది. గాజా, ఉక్రెయిన్ వంటి ఘర్షణాత్మక ప్రాంతాల్లో మానవతా సహాయం అందించాం.
మిత్రులారా.
ఇప్పటి వరకు వినని ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ వేదికైంది. మన బలం మన ఐక్యతలోనే ఉందని, ఈ ఐక్యత బలంతో మనం కొత్త దిశలో పయనిస్తామని నేను నమ్ముతున్నాను. వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితిలో ఫ్యూచర్ సమ్మిట్ జరగనుంది. దీనిలో భాగంగా భవిష్యత్తు కోసం ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ ఒప్పందంలో గ్లోబల్ సౌత్ స్వరాన్ని బలోపేతం చేయడానికి మనమందరం కలిసి సానుకూల వైఖరిని అవలంభించగలమా? ఈ ఆలోచనలతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఇప్పుడు మీ ఆలోచనలు వినడానికి ఎదురుచూస్తున్నాను.
చాలా ధన్యవాదాలు.
***
Sharing my opening remarks at the Voice of Global South Summit. https://t.co/NZgAbuR7ym
— Narendra Modi (@narendramodi) August 17, 2024