Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2023 వ సంవత్సరం జూలై 30 వ తేదీ న జరిగిన మన్ కీ బాత్ (మనసు లోమాట) కార్యక్రమం 103 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. జులై నెల అంటే వర్షాకాలం, వర్షాల నెల. ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత కొన్ని రోజులుగా బాధాకరమైన, ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యమునాతో పాటు వివిధ నదుల్లో వరదలు పోటెత్తడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండ ప్రాంతాలలో కొండచరియలు కూడా విరిగిపడ్డ సంఘటనలు జరిగాయి. మరోవైపు కొంతకాలం క్రితం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో-గుజరాత్ లోని వివిధ ప్రదేశాలలో   బిపార్జాయ్ తుఫాను వచ్చింది. మిత్రులారా!ఈ విపత్తుల మధ్య, మనమందరం దేశవాసులం మరోసారి సామూహిక కృషి శక్తిని చూపించాం. స్థానిక ప్రజలు, ఎన్. డి. ఆర్. ఎఫ్. జవాన్లతో పాటు స్థానిక అధికార యంత్రాంగం విపత్తులను ఎదుర్కోవడానికి రాత్రింబగళ్లు శ్రమించింది. ఏ విపత్తునైనా ఎదుర్కోవడంలో మన సామర్థ్యం, వనరుల పాత్ర ప్రధానమైంది. కానీ దాంతోపాటే మన స్పందన, పరస్పరం సహకరించుకునే స్ఫూర్తి కూడా అంతే ముఖ్యం. ప్రజలందరూ బాగుండాలన్న సర్వజన హితాయ భావన భారతదేశానికి గుర్తింపు, భారతదేశ బలం.

మిత్రులారా! వర్షాలొచ్చే ఈ సమయమే ‘చెట్ల పెంపకం’, ‘నీటి సంరక్షణ’లకు కూడా ప్రధానమైంది. స్వాతంత్ర్య అమృత మహోత్సవాలసందర్భంగా ఏర్పాటు చేసిన 60 వేలకు పైగా అమృత సరోవరాలు కూడా వెలుగులు వెదజల్లుతున్నాయి. ప్రస్తుతం మరో 50 వేలకు పైగా అమృత్ సరోవరాలను ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి. మన దేశప్రజలు పూర్తి చైతన్యంతో, బాధ్యతతో ‘జల సంరక్షణ’ కోసం కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది-కొద్దికాలం కిందట నేను, మధ్యప్రదేశ్ లోని షాహడోల్‌కి వెళ్ళాను. అక్కడ నేను పకరియా గ్రామంలోని గిరిజన సోదరసోదరీమణులను కలిశాను. ప్రకృతిని, నీటిని కాపాడాలని వారితో చర్చలు జరిపాను. పకరియా గ్రామంలోని గిరిజన సోదరులు, సోదరీమణులు ఈ పనిని మొదలుపెట్టినట్టు ఇప్పుడు నాకు తెలిసింది. అధికారుల సహాయంతో అక్కడి  ప్రజలు సుమారు వంద బావులను నీటి రీఛార్జ్ వ్యవస్థలుగా మార్చారు. వర్షపు నీరు ఇప్పుడు ఈ బావులలోకి వెళ్తుంది. అక్కడి నుండి భూమి లోపలికి వెళ్తుంది. దీంతో క్రమంగా ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు మెరుగవుతాయి. ఇప్పుడు గ్రామస్తులందరూ నీటి రీఛార్జ్ కోసం ఆ ప్రాంతంలోని సుమారు 800 బావులను ఉపయోగం లోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటువంటి ప్రోత్సాహకరమైన వార్త ఒకటి ఉత్తరప్రదేశ్ నుండి వచ్చింది. కొద్ది రోజుల క్రితం  ఒక్కరోజులో 30 కోట్ల మొక్కలు నాటిన రికార్డును ఉత్తరప్రదేశ్‌ సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రచారాన్ని అక్కడి ప్రజలు పూర్తి చేశారు. ఇటువంటి ప్రయత్నాలు ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రజల చైతన్యానికి గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయి. మొక్కలు నాటడం, నీటిని పొదుపు చేయడం వంటి కార్యక్రమాల్లో మనమందరం భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా!ప్రస్తుతం పవిత్ర శ్రావణ మాసం కొనసాగుతోంది. శ్రావణ మాసం సదాశివ మహాదేవుడిని ఆరాధించడంతో పాటుపచ్చదనం, ఆనందాలతో ముడిపడి ఉంటుంది. అందుకేఆధ్యాత్మిక, సాంస్కృతిక దృక్కోణం నుండి శ్రావణ మాసం చాలా ముఖ్యమైంది. శ్రావణ ఊయలలు,  శ్రావణ గోరింటాకు, శ్రావణ ఉత్సవం- శ్రావణ మాసమంటేనే ఆనందం, ఉల్లాసం.

మిత్రులారా!ఈ విశ్వాసానికి, మన సంప్రదాయాలకు మరో కోణం కూడా ఉంది. ఈ పండుగలు, సంప్రదాయాలు మనల్ని చైతన్యవంతం చేస్తాయి. చాలా మంది భక్తులు శ్రావణ మాసం శివుడిని ఆరాధించేందుకు కావడ్ యాత్రకు వెళ్తారు. చాలా మంది భక్తులు ఈ శ్రావణ మాసంలో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్నారు. బనారస్‌ ను సందర్శించే వారి సంఖ్య కూడా రికార్డు స్థాయిలో ఉందని తెలుసుకోవడం మీకు ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఏటా 10 కోట్ల మంది పర్యాటకులు కాశీని సందర్శిస్తున్నారు. అయోధ్య, మధుర, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. దీంతో లక్షలాది మంది పేదలు ఉపాధి పొందుతూ జీవితం గడుపుతున్నారు. ఇదంతా మన సాంస్కృతిక జనజాగరణ ఫలితం. దీని దర్శనం కోసం ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు తీర్థయాత్రలకు వస్తున్నారు. అమర్‌నాథ్ యాత్ర చేయడానికి కాలిఫోర్నియా నుండి ఇక్కడికి వచ్చిన ఇద్దరు అమెరికన్ మిత్రుల గురించి నాకు తెలుసు. ఈ విదేశీ అతిథులు అమర్‌నాథ్ యాత్రకు సంబంధించి స్వామి వివేకానంద అనుభవాల గురించి ఎక్కడో విన్నారు. ఆ స్ఫూర్తితో వాళ్ళు అమర్‌నాథ్ యాత్రకు వచ్చారు. దీన్ని భగవాన్ భోలేనాథ్ ఆశీర్వాదంగా వారు భావిస్తారు. ప్రతి ఒక్కరినీ తనవారిగా చేసుకోవడం, ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఇవ్వడం – ఇదే భారతదేశం ప్రత్యేకత. అలాంటి ఒక ఫ్రెంచ్ షార్లెట్ షోపా. గతంలో నేను ఫ్రాన్స్‌ వెళ్లినప్పుడు ఆమెను కలిశాను. షార్లెట్ షోపా యోగా ప్రాక్టీషనర్, యోగా గురువు. ఆమె వయస్సు 100 సంవత్సరాల కంటే ఎక్కువ. ఆమె సెంచరీ దాటింది. గత 40 ఏళ్లుగా యోగా సాధన చేస్తోంది. ఆమె తన ఆరోగ్యానికి, ఈ వంద సంవత్సరాల వయస్సుకు కారణం యోగా మాత్రమేనని ఆమె చెప్తుంది. భారతదేశ యోగా విజ్ఞాన శాస్త్రానికి, యోగా శక్తికి ఆమె ప్రపంచానికి చాటిచెప్పే ప్రముఖురాలిగా మారింది. ప్రతి ఒక్కరూ ఆమె నుండి నేర్చుకోవాలి. మన వారసత్వాన్ని స్వీకరించడమే కాకుండాప్రపంచానికి బాధ్యతాయుతంగా అందజేద్దాం. ఈ రోజుల్లో ఉజ్జయినిలో అలాంటి ప్రయత్నం జరగడం నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న 18 మంది చిత్రకారులు పురాణాల ఆధారంగా ఆకర్షణీయమైన చిత్రాలు రూపొందిస్తున్నారు. ఈ చిత్రాలు బూందీ శైలి, నాథద్వార శైలి, పహాడీ శైలి, అపభ్రంశ శైలి వంటి అనేక విలక్షణమైన రీతుల్లో తయారు అవుతున్నాయి. వీటిని ఉజ్జయినిలోని త్రివేణి మ్యూజియంలో ప్రదర్శిస్తారు. అంటే కొంత కాలం తరువాతమీరు ఉజ్జయినికి వెళ్ళినప్పుడుమీరు మహాకాల్ మహాలోక్‌తో పాటు మరొక దివ్యమైన స్థలాన్ని చూడగలుగుతారు.

మిత్రులారా!ఉజ్జయినిలో వేసిన ఈ పెయింటింగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు మరో ప్రత్యేకమైన పెయింటింగ్ గుర్తుకు వచ్చింది. ఈ పెయింటింగ్‌ను రాజ్‌కోట్‌కు చెందిన ప్రభాత్ సింగ్ మోడ్ భాయ్ బర్హాట్ అనే కళాకారుడు రూపొందించారు. ఈ పెయింటింగ్ ను ఛత్రపతి వీర్ శివాజీ మహారాజ్ జీవితంలోని ఒక సంఘటన ఆధారంగా చిత్రించారు. పట్టాభిషేకం తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ తన కులదైవం ‘తుల్జా మాత’ని దర్శించుకోబోతున్నట్టు, ఆ సమయంలో వాతావరణం ఎలా ఉందో చిత్రకారుడు ప్రభాత్ భాయ్ చిత్రించారు. మన సంప్రదాయాలను, మన వారసత్వాన్ని సజీవంగా ఉంచాలంటేవాటిని కాపాడాలి. సజీవంగా ఉంచాలి. తరువాతి తరానికి నేర్పించాలి. ఈ దిశగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా!పర్యావరణం, వృక్షజాలం, జంతుజాలం, జీవ వైవిధ్యం వంటి పదాలు విన్నప్పుడుకొంతమంది ఇవి ప్రత్యేకమైన విషయాలని, నిపుణులకు సంబంధించిన అంశాలని అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. మనం నిజంగా ప్రకృతిని ప్రేమిస్తేమన చిన్న ప్రయత్నాలతో కూడా చాలా చేయవచ్చు. సురేష్ రాఘవన్ గారు తమిళనాడులోని వాడవల్లికి చెందిన మిత్రుడు.  ఆయనకు పెయింటింగ్‌ అంటే చాలా ఇష్టం. మీకు తెలుసా!పెయింటింగ్ అనేది కళ. కాన్వాస్‌కు సంబంధించిన పని. కానీ రాఘవన్ గారు తన పెయింటింగుల ద్వారా మొక్కలు, జంతువులకు సంబంధించిన సమాచారాన్ని భద్రపరచాలని నిర్ణయించుకున్నారు. వివిధ వృక్షజాలం, జంతుజాలం ​​చిత్రాలను రూపొందించడం ద్వారా వాటికి సంబంధించిన సమాచారాన్ని ఆయన డాక్యుమెంటేషన్ చేస్తారు. అంతరించిపోయే దశలో ఉన్న డజన్ల కొద్దీ పక్షులు, జంతువులు, ఆర్కిడ్ పుష్పాల చిత్రాలను ఇప్పటి వరకు ఆయన  గీశారు. కళ ద్వారా ప్రకృతికి సేవ చేసే ఈ ఉదాహరణ నిజంగా అద్భుతమైంది.

నా ప్రియమైన దేశప్రజలారా!ఈరోజు నేను మీకు మరో ఆసక్తికరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో అద్భుతమైన క్రేజ్ కనిపించింది. అమెరికా మనకు వందకు పైగా అరుదైన, పురాతన కళాఖండాలను తిరిగి ఇచ్చింది. ఈ వార్త తెరపైకి రావడంతో, ఈ కళాఖండాల గురించి సామాజిక మాధ్యమాల్లో చాలా చర్చ జరిగింది. యువత తమ వారసత్వంపై గర్వాన్ని చాటుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన ఈ కళాఖండాలు 2500 నుండి 250 సంవత్సరాల నాటి కిందటివి. ఈ అరుదైన కళాఖండాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించినవని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. వీటిని టెర్రకోటను,రాతిని, లోహాలను, చెక్కలను ఉపయోగించి తయారు చేశారు. వీటిలో కొన్ని మీలో ఆశ్చర్యాన్ని నింపే విధంగా ఉంటాయి. వాటిని చూస్తే- అలాగే చూస్తూ ఉండిపోతారు. మీరు వీటిలో 11వ శతాబ్దానికి చెందిన అందమైన ఇసుకరాతి శిల్పాన్ని కూడా చూడవచ్చు. ఇది నృత్యం చేసే అప్సరకళాకృతి. ఇది మధ్యప్రదేశ్‌కు చెందింది. చోళుల కాలం నాటి అనేక విగ్రహాలు కూడా వీటిలో ఉన్నాయి. దేవత, భగవాన్ మురుగన్ విగ్రహాలు 12వ శతాబ్దానికి చెందినవి. తమిళనాడు సంస్కృతికి సంబంధించినవి. దాదాపు వెయ్యి సంవత్సరాల నాటి గణేశుడి కాంస్య విగ్రహం కూడా భారతదేశానికి తిరిగి వచ్చింది. లలితాసనంలో కూర్చున్న ఉమా-మహేశ్వర విగ్రహం 11వ శతాబ్దానికి చెందినదని చెబుతారు. అందులో ఉమామహేశ్వరులిద్దరూ నందిపై కూర్చున్నారు. జైన తీర్థంకరుల రెండు రాతి విగ్రహాలు కూడా భారతదేశానికి తిరిగి వచ్చాయి. సూర్య భగవానుడి రెండు విగ్రహాలు కూడా మిమ్మల్ని ఆకర్షిస్తాయి. వీటిలో ఒకటి ఇసుకరాతితో తయారైంది. తిరిగి వచ్చిన వస్తువులలో కలపతో చేసిన ప్యానెల్ ఉంది. ఇది సాగరమథనం కథను మనకు గుర్తుకు తెస్తుంది. 16వ-17వ శతాబ్దానికి చెందిన ఈ ప్యానెల్ దక్షిణ భారతదేశానికి సంబంధించింది.

మిత్రులారా!నేను ఇక్కడ చాలా కొన్నింటినే చెప్పాను. అయితేఈ జాబితా చాలా పొడవుగా ఉంది. మన విలువైన ఈ వారసత్వ సంపదను తిరిగి అందించిన అమెరికా ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను 2016లోనూ 2021లోనూ అమెరికాను సందర్శించినప్పుడు కూడా చాలా కళాఖండాలు భారతదేశానికి తిరిగి వచ్చాయి. ఇలాంటి ప్రయత్నాలతో మన సాంస్కృతిక వారసత్వ సంపద దొంగతనాన్ని అరికట్టడానికి దేశవ్యాప్తంగా చైతన్యం పెరుగుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మన సుసంపన్నమైన వారసత్వంతో  దేశప్రజల అనుబంధాన్ని ఇది మరింతగా పెంచుతుంది.

నా ప్రియమైన దేశప్రజలారా!దేవభూమి ఉత్తరాఖండ్‌లోని కొంతమంది తల్లులు, సోదరీమణులు నాకు రాసిన లేఖలు హృదయాన్ని కదిలించాయి. వారు తమ కుమారునికి, తమ సోదరునికి అనేక దీవెనలు ఇచ్చారు. మన సాంస్కృతిక వారసత్వమైన ‘భోజపత్రం’ తమ జీవనోపాధిగా మారుతుందని తాము  ఎప్పుడూ ఊహించలేదని వారు రాశారు. మొత్తం విషయం ఇంతేనా అని మీరనుకుంటూ ఉండవచ్చు.

మిత్రులారా!ఈ ఉత్తరాన్ని చమోలి జిల్లా నీతీ -మాణా లోయలోని మహిళలు నాకు రాశారు. గత సంవత్సరం అక్టోబర్‌లో భోజపత్రంలో నాకు ఒక ప్రత్యేకమైన కళాఖండాన్ని అందించిన మహిళలు వీరే. ఈ బహుమతి అందుకున్న తర్వాత నేను చాలా పొంగిపోయాను. అన్నింటికంటే ముఖ్యంగా పురాతన కాలం నుండిమన గ్రంథాలు, పుస్తకాలను ఈ భోజపత్రాలపై భద్రపర్చారు. మహాభారతం కూడా ఈ భోజపత్రాలపై రాశారు. నేడుదేవభూమికి చెందిన ఈ మహిళలు ఈ భోజ పత్రం నుండి చాలా అందమైన కళాఖండాలను, స్మృతి చిహ్నాలను తయారు చేస్తున్నారు. నేను మాణా గ్రామాన్ని సందర్శించినప్పుడువారి ప్రత్యేక ప్రయత్నాన్ని మెచ్చుకున్నాను. దేవభూమిని సందర్శించే పర్యాటకులు తమ సందర్శన సమయంలో వీలైనన్ని ఎక్కువ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నేను విజ్ఞప్తి చేశాను. అది అక్కడ చాలా ప్రభావం చూపింది. నేడుభోజపత్ర ఉత్పత్తులను ఇక్కడికి వచ్చే యాత్రికులు చాలా ఇష్టపడుతున్నారు. మంచి ధరలకు కొనుగోలు చేస్తున్నారు. పురాతన భోజపత్ర వారసత్వం ఉత్తరాఖండ్‌లోని మహిళల జీవితాల్లో కొత్త ఆనందాన్ని నింపుతోంది. భోజపత్రాల నుండి కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శిక్షణ కూడా ఇస్తోందని తెలిసి నేను సంతోషిస్తున్నాను.

రాష్ట్ర ప్రభుత్వం కూడా అరుదైన భోజపత్ర జాతిని సంరక్షించేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఒకప్పుడు దేశానికి చిట్టచివరి ప్రాంతాలుగా భావించేpradeశాలను ఇప్పుడు దేశంలోనే తొలి గ్రామాలుగా పరిగణిస్తూ అభివృద్ధి చేస్తున్నారు. మన సంప్రదాయం, సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు ఆర్థిక ప్రగతికి ఈ ప్రయత్నం సాధనంగా మారుతోంది.

నా ప్రియమైన దేశవాసులారా!ఈసారి ‘మన్ కీ బాత్’లో మనసుకు ఎంతో సంతోషాన్నిచ్చే ఉత్తరాలు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఇటీవల హజ్ యాత్రకు వెళ్ళివచ్చిన ముస్లిం మహిళలు ఈ లేఖలు రాశారు. వారి ఈ ప్రయాణం చాలా రకాలుగా చాలా ప్రత్యేకమైంది. మగ సహచరుడు-మెహ్రం- లేకుండా హజ్ యాత్ర పూర్తి చేసిన మహిళలు వీరు. వీరి సంఖ్య వందో, యాభయ్యో కాదు- నాలుగు వేల కంటే ఎక్కువ – ఇది భారీ మార్పు. ముస్లిం మహిళలు మెహ్రం లేకుండా ‘హజ్’ యాత్ర చేయడానికి ఇంతకుముందు అనుమతి లేదు. ‘మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా సౌదీ అరేబియా ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెహ్రం లేకుండా ‘హజ్’కు వెళ్లే మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమన్వయకర్తలను నియమించారు.

మిత్రులారా!గత కొన్నేళ్లుగా హజ్ విధానంలో చేసిన మార్పులకు ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. మన ముస్లిం తల్లులు, సోదరీమణులు దీని గురించి నాకు చాలా రాశారు. ఇప్పుడు ఎక్కువ మంది ‘హజ్’కి వెళ్లే అవకాశం లభిస్తోంది. హజ్ యాత్ర నుండి తిరిగి వచ్చిన ప్రజలు-ముఖ్యంగా మన తల్లులు, సోదరీమణులు ఉత్తరాల ద్వారా అందజేసిన ఆశీర్వాదాలు చాలా స్ఫూర్తినిస్తాయి.

నా ప్రియమైన దేశప్రజలారా!జమ్మూ కాశ్మీర్‌లో మ్యూజికల్ నైట్‌లు అయినా, ఎత్తైన ప్రదేశాలలో బైక్ ర్యాలీలు అయినా, చండీగఢ్‌లో స్థానిక క్లబ్‌లు అయినా, పంజాబ్‌లో క్రీడా సమూహాలు అయినా ఇవన్నీ వింటే మనం వినోదం, సాహసం గురించి మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ విషయం వేరు. ఈ కార్యక్రమం ఉమ్మడి ప్రయోజనానికి సంబంధించింది.ఆ ఉమ్మడి కారణం – డ్రగ్స్‌పై అవగాహన ప్రచారం. జమ్మూ కాశ్మీర్ యువతను డ్రగ్స్ నుండి రక్షించడానికి అనేక వినూత్న ప్రయత్నాలు జరిగాయి. మ్యూజికల్ నైట్, బైక్ ర్యాలీల వంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. చండీగఢ్‌లో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి స్థానిక క్లబ్‌లను దీనికి అనుసంధానించారు. వారు వీటిని ‘వాదా  (VADA)క్లబ్బులు’ అంటారు. VADA అంటే విక్టరీ అగైన్స్ట్ డ్రగ్స్ అబ్యూజ్. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా విజయం. పంజాబ్‌లో అనేక స్పోర్ట్స్ గ్రూపులు ఏర్పడ్డాయి. ఇవి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడానికి, మాదకద్రవ్యాల వ్యసనం నుండి బయటపడటానికి అవగాహన ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. మాదక ద్రవ్యాల  వ్యతిరేక ప్రచారంలో యువత ఎక్కువగా పాల్గొనడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ ప్రయత్నాలు భారతదేశంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారానికి చాలా బలాన్ని ఇస్తున్నాయి. దేశంలోని భవిష్యత్తు తరాలను కాపాడాలంటే డ్రగ్స్‌కు దూరంగా ఉంచాలి. ఈ ఆలోచనతో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ 2020 ఆగస్టు 15వ తేదీన  ప్రారంభమైంది. ఈ ప్రచారంతో 11 కోట్ల మందికి పైగా అనుసంధానమయ్యారు. రెండు వారాల కిందట మాదక ద్రవ్యాలపై భారత్ పెద్ద ఎత్తున చర్య తీసుకుంది. సుమారు 1.5 లక్షల కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేశారు. 10 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసిన అద్వితీయ రికార్డును కూడా భారత్‌ సృష్టించింది. ఈ మాదక ద్రవ్యాల ధర 12 వేల కోట్లరూపాయలకు పైగానే ఉంది. మాదక ద్రవ్యాల నుండి విముక్తి కలిగించే ఈ గొప్ప ఉద్యమం సహకరిస్తున్న వారందరినీ నేను అభినందిస్తున్నాను. మాదకద్రవ్య వ్యసనం కుటుంబానికే కాదు-మొత్తం సమాజానికి పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం శాశ్వతంగా అంతం కావాలంటే మనమందరం ఏకమై ఈ దిశగా ముందుకు సాగడం అవసరం.

నా ప్రియమైన దేశప్రజలారా! మాదకద్రవ్యాల గురించి, యువ తరం గురించి మాట్లాడుతున్నప్పుడుమధ్యప్రదేశ్ నుండి ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది మినీ బ్రెజిల్ స్ఫూర్తిదాయక ప్రయాణం. మధ్యప్రదేశ్‌లోకి మినీ బ్రెజిల్ ఎక్కడి నుంచి వచ్చిందని  మీరు అనుకుంటూ ఉంటారు. ఇదే ట్విస్ట్. మధ్యప్రదేశ్ లోని శహడోల్ లో ఒక ఊరు  బిచార్‌పూర్. బిచార్‌పూర్‌ ను మినీ బ్రెజిల్ అంటారు. మినీ బ్రెజిల్ ఎందుకంటే ఈ రోజు ఈ గ్రామం ఫుట్‌బాల్ లో వర్ధమాన తారలకు కంచుకోటగా మారింది. కొన్ని వారాల క్రితం శహడోల్ కి వెళ్ళినప్పుడునేను చాలా మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లను కలిశాను. మన దేశప్రజలు-ముఖ్యంగా మన యువ మిత్రులు దీని గురించి తెలుసుకోవాలని నాకనిపించింది.

      మిత్రులారా!బిచార్‌పూర్ గ్రామం మినీ బ్రెజిల్‌గా మారడం రెండు- రెండున్నర దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. ఆ సమయంలోబిచార్‌పూర్ గ్రామం అక్రమ మద్యానికి పేరు పొందింది-మత్తులో ఉంది. దానివల్ల అక్కడి యువకులకు ఎక్కువగా నష్టం జరిగేది. మాజీ జాతీయ క్రీడాకారుడు, కోచ్ రయీస్ అహ్మద్ ఈ యువకుల ప్రతిభను గుర్తించారు. రయీస్ గారి దగ్గర పెద్దగా వనరులు లేవు. కానీ ఆయన పూర్తి అంకితభావంతో యువతకు ఫుట్‌బాల్ నేర్పడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలలో ఫుట్‌బాల్ ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే బిచార్‌పూర్ గ్రామం కూడా ఫుట్‌బాల్‌తో గుర్తింపు పొందింది. ఇప్పుడు ఇక్కడ ఫుట్‌బాల్ క్రాంతి  అనే కార్యక్రమం కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద యువతను ఈ గేమ్‌తో అనుసంధానం చేసి, వారికి శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందంటే బిచార్‌పూర్ నుండి 40 మందికి పైగా జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు తయారయ్యారు. ఈ ఫుట్‌బాల్ విప్లవం ఇప్పుడు మెల్లమెల్లగా ఆ ప్రాంతం అంతటా విస్తరిస్తోంది. శహడోల్, దాని పరిసర ప్రాంతాల్లో 1200 కంటే ఎక్కువ ఫుట్‌బాల్ క్లబ్బులు ఏర్పడ్డాయి. జాతీయ స్థాయిలో ఆడుతున్న క్రీడాకారులు ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్నారు. చాలా మంది ఉన్నత స్థాయి మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారులు, శిక్షకులు ఇక్కడ యువతకు శిక్షణ ఇస్తున్నారు. మీరు ఆలోచించండి. అక్రమ మద్యానికి పేరుపొంది, మాదకద్రవ్యాల వ్యసనానికి పేరుగాంచిన ఆదివాసీ ప్రాంతం ఇప్పుడు దేశానికి ఫుట్‌బాల్ నర్సరీగా మారింది. అందుకే మనసుంటే మార్గముంటుందంటారు. మన దేశంలో ప్రతిభావంతులకు కొదవలేదు. అవసరమైతేవారిని కనుగొనండి. మరింత సానబెట్టి, తీర్చి దిద్దండి.  దీని తరువాతఈ యువత దేశం పేరును ప్రకాశవంతం చేస్తుంది. దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుంది.

నా ప్రియమైన దేశప్రజలారా!స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగామనమందరం అమృత మహోత్సవాలను పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటున్నాము. అమృత మహోత్సవాలసందర్భంగా దేశంలో దాదాపు రెండు లక్షల కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఒక దానికి మించి ఒకటి జరిగాయి. విభిన్నంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు వన్నె తెచ్చిన విషయం ఏమిటంటే వాటిలో రికార్డు స్థాయిలో యువత పాల్గొనడం. ఈ సమయంలోమన యువత దేశంలోని గొప్ప వ్యక్తుల గురించి చాలా తెలుసుకున్నారు. మొదటి కొన్ని నెలల గురించి మాత్రమే మాట్లాడుకుంటే ప్రజల భాగస్వామ్యానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కార్యక్రమాలను చూడగలిగాం. అలాంటి ఒక కార్యక్రమం దివ్యాంగ రచయితల కోసం ‘రైటర్స్ మీట్’ నిర్వహణ. రికార్డు స్థాయిలో ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ‘జాతీయ సంస్కృత సదస్సు’ జరిగింది. మన చరిత్రలో కోటల ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. దీన్ని ప్రదర్శించే కార్యక్రమం ‘కోటలు-కథలు’. కోటలకు సంబంధించిన కథలు కూడా ప్రజలకు నచ్చాయి.

మిత్రులారా!దేశం నలు దిశలా అమృత మహోత్సవప్రతిధ్వనులు వినిపిస్తున్న వేళ- ఆగస్ట్ 15 సమీపిస్తోన్న ప్రస్తుత సందర్భంలో దేశంలో మరో పెద్ద ఉద్యమం ప్రారంభమవుతోంది. అమరులైన వీరులను, వీరాంగనలను సన్మానించేందుకు ‘మేరీ మాటీ – మేరా దేశ్’ ఉద్యమం మొదలవుతోంది. దీని కింద మన అమరవీరుల జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. వారి గుర్తుగా దేశంలోని లక్షలాది గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శిలా శాసనాలు కూడా ఏర్పాటవుతాయి. ఈ ప్రచారం కింద దేశవ్యాప్తంగా ‘అమృత కలశ యాత్ర’ కూడా జరుగుతుంది. ఈ ‘అమృత కలశ యాత్ర’ దేశంలోని నలుమూలల్లోని గ్రామ గ్రామాన 7500 కలశాల్లో మట్టిని మోసుకుని దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ యాత్ర దేశంలోని వివిధ ప్రాంతాల నుండి మొక్కలను కూడా తీసుకువస్తుంది. 7500 కలశాల్లో వచ్చిన మట్టిని, మొక్కలను కలిపి జాతీయ యుద్ధ స్మారక ప్రాంత  సమీపంలో ‘అమృత వాటిక’ నిర్మిస్తారు. ఈ అమృత వాటిక ‘ఏక్ భారత్ శ్రేష్ఠ  భారత్ ‘కు కూడా గొప్ప ప్రతీక అవుతుంది.  నేను గత ఏడాది ఎర్రకోట నుండి వచ్చే 25 సంవత్సరాల అమృతకాలంలో  ‘పంచ ప్రాణ’ గురించి మాట్లాడాను. ‘మేరీ మాటీ – మేరా దేశ్’ ప్రచారంలో పాల్గొనడం ద్వారాఈ పంచ ప్రాణకర్తవ్యాలను  నెరవేర్చడానికి మనం ప్రమాణం కూడా చేస్తాం.  దేశంలోని పవిత్రమైన మట్టిని చేతిలోకి తీసుకుని ప్రమాణం చేస్తున్నప్పుడు మీరందరూ మీ సెల్ఫీని యువ డాట్ గవ్ డాట్ ఇన్ లో అప్‌లోడ్ చేయాలి. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘హర్‌ఘర్‌ తిరంగా అభియాన్‌’ కోసం దేశం మొత్తం ఒక్కతాటిపైకి వచ్చినట్టే ఈసారి కూడా ప్రతి ఇంటిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలి. ఈ ప్రయత్నాలతో మనం మన కర్తవ్యాలను గుర్తిస్తాం. దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన అసంఖ్యాక త్యాగాలను మనం గ్రహిస్తాం. స్వేచ్ఛ విలువను తెలుసుకుంటాం.  కాబట్టి ప్రతి దేశవాసీ ఈ ప్రయత్నాలలో తప్పకుండా  పాలుపంచుకోవాలి.

      నా ప్రియమైన దేశప్రజలారా!ఈ రోజు ‘మన్ కీ బాత్’లో ఇంతే.  మరికొద్ది రోజుల్లో ఆగస్టు 15వ తేదీన జరిగే గొప్ప స్వాతంత్య్ర పండుగలో మనం భాగమవుతున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు కోల్పోయినవారిని నిత్యం స్మరించుకోవాలి. వారి కలలను సాకారం చేయడానికి మనం రాత్రింబగళ్లు  కష్టపడాలి. దేశప్రజల ఈ కృషిని, సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువచ్చే మాధ్యమమే ‘మన్ కీ బాత్’. వచ్చేసారి మరికొన్ని కొత్త అంశాలతో కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

 

*****