Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈజిప్టు అధ్యక్షడితో ప్రధానమంత్రి సమావేశం

ఈజిప్టు అధ్యక్షడితో ప్రధానమంత్రి సమావేశం


   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మోదీకి 2023 జూన్‌ 25న అరబ్ గణతంత్ర ఈజిప్టులోని అల్-ఇత్తెహాదియా రాచభవనంలో దేశాధ్యక్షుడు మాననీయ అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈ ఏడాది (2023) జనవరిలో భారత గణతంత్ర దినోత్సవాలకు అధ్యక్షుడు సిసి ముఖ్య అతిథిగా హాజరు కావడాన్ని నాయకులిద్దరూ సౌహార్దపూర్వకంగా గుర్తు చేసుకున్నారు. ఈ ఘట్టంతో ద్వైపాక్షిక సంబంధాలు వేగం పుంజుకోవడంపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు నడపడంలో ఇటీవల ఈజిప్టు మంత్రిమండలిలో ఏర్పాటైన ‘భారత యూనిట్‌’ ప్రయోజనకర ఉపకరణం కాగలదని వారు పేర్కొన్నారు.

   ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, సమాచార సాంకేతికత, రక్షణ-భద్రత, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతిసహా ఉభయదేశాల ప్రజల మధ్య సంబంధాలు తదదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అనుసరించాల్సిన విధివిధానాలపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. అలాగే జి-20లో ఆహారం, ఇంధన అభద్రత, వాతావరణ మార్పు సంక్షోభం వంటి అంశాలపై లోతైన సహకారం గురించి కూడా ప్రధానమంత్రి, అధ్యక్షుడు సిసి చర్చించారు. ఈ దిశగా దక్షిణార్థ గోళ దేశాలు సమష్టి గళం వినిపించాల్సిన అవసరంపై ప్రముఖంగా సంభాషించారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో  2023 సెప్టెంబరులో నిర్వహించే జి-20 కూటమి నాయకుల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అధ్యక్షుడు సిసికి స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు.

   ద్వైపాక్షిక సంబంధాన్ని “వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి ఉన్నతీకరించే ఒప్పందంపై నాయకులిద్దరూ సంతకం చేశారు. దీంతోపాటు ‘వ్యవసాయం, పురావస్తు శాస్త్రం-ప్రాచీన కళాఖండాలు, పోటీతత్వ చట్టం’ రంగాలలో మూడు అవగాహన ఒప్పందాలు కూడా కుదిరాయి. ఈజిప్టు ప్రధానమంత్రి గౌరవనీయ ముస్తఫా మద్బౌలీ సహా మంత్రిమండలి సభ్యులు పలువురు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే భారత్‌ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, జాతీయ భద్రత సలహాదారు తదితర సీనియర్‌ అధికారులు కూడా హాజరయ్యారు.

*****