Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం


   రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత రాజ్యాంగ సభ 1949లో ఇదే రోజున భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని 2015 నుంచి ఏటా ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ‘ఇ-కోర్ట్‌’ ప్రాజెక్టు సంబంధిత కొత్త కార్యక్రమాలు- “వర్చువల్ జస్టిస్‌ క్లాక్‌, జస్టిస్‌ (JustIS) మొబైల్‌ యాప్‌ 2.0, డిజిటల్‌ కోర్ట్‌, ఎస్‌3వాస్‌ (S3WaaS) వెబ్‌సైట్‌ వంటివి ప్రారంభించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలపడంతోపాటు 1949లో ఇదే రోజున భారత దేశం తన ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకున్నదని గుర్తుచేశారు. అలాగే స్వాతంత్ర్య అమృత మహోత్సవాల వేళ రాజ్యాంగ దినోత్సవానికిగల ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌తోపాటు రాజ్యాంగ సభ సభ్యులందరికీ నివాళి అర్పించారు.

   భారత రాజ్యాంగ వికాసం, విస్తరణ దిశగా గత 7 దశాబ్దాల పయనంలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకు చెందిన అసంఖ్యాక వ్యక్తులు అందించిన సేవలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రత్యేక సందర్భంగా దేశం తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ నవంబరు 26న చిరస్మరణీయ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో మానవాళికి శత్రువులైన దుండగుల దాడిని దేశం ఎదుర్కొనాల్సి వచ్చిన దుర్దినం గురించి కూడా ఆయన గుర్తుచేశారు. ఇదే రోజున ముంబైలో ఉగ్రవాద మూక దాడిలో అమరులైన ప్రతి ఒక్కరికీ శ్రీ మోదీ నివాళి అర్పించారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థతోపాటు దాని పేరు ప్రతిష్టలు వృద్ధిపథంలో పరుగుతీస్తున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో  ప్రపంచం భారత్‌వైపు ఆశతో చూస్తున్నదని ఆమె పేర్కొన్నారు. భారత సుస్థిరతపై ఆదిలో అనుమానాలు పొడసూపినా వాటన్నిటికీ అతీతంగా దేశం పురోగమిస్తున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు తన వైవిధ్యంపై గర్విస్తూ.. శక్తిమంతంగా దూసుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ విజయానికి కారణం రాజ్యాంగమేనని చెప్పారు. రాజ్యాంగ పీఠికలోని ‘దేశ ప్రజలమైన మేము’ అనే మూడు పదాలు ఒక పిలుపు, ప్రతిన, విశ్వాసాలకు ప్రతీకలని ఆయన అభివర్ణించారు. “ఈ రాజ్యాంగ స్ఫూర్తే ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారతదేశానికి ప్రేరణ”  అని పేర్కొన్నారు. అలాగే “నేటి ఆధునిక కాలంలో రాజ్యాంగం దేశంలోని అన్ని

సాంస్కృతిక, నైతిక భావోద్వేగాలతో పెనవేసుకుంది” అని చెప్పారు.

   ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా మన దేశం రాజ్యాంగ ఆదర్శాలను బలోపేతం చేస్తోందని, ప్రజాహిత విధానాలతో దేశంలోని పేదలకు, మహిళలకు సాధికారత లభిస్తోందని ప్రధానమంత్రి హర్షం వెలిబుచ్చారు. సాధారణ పౌరులకు చట్టాలు సరళీకరించబడుతూ, అందుబాటులో ఉన్నాయని, సకాలంలో న్యాయ ప్రదానానికి న్యాయవ్యవస్థ కూడా అనేక చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలియజేశారు. తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా పిలుపునిచ్చిన కర్తవ్య నిబద్ధత రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనమని ప్రధాని అన్నారు. నేటి అమృత కాలాన్ని ‘కర్తవ్య కాలం’గా పేర్కొంటూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో స్వాతంత్ర్య అమృతకాలంసహా రాబోయే 25 ఏళ్ల అభివృద్ధి వైపు మన పయనం ఆరంభిస్తున్న తరుణంలో కర్తవ్యం అనే మంత్రాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ క్రమంలో దేశానికే ప్రథమ, అత్యంత ప్రాధాన్యమిచ్చే కర్తవ్య నిబద్ధతే ఆ లక్ష్యసాధనలో తారకమంత్రమని ఉద్బోధించారు. “ఈ స్వాతంత్ర్య అమృతకాలమే దేశం కోసం కర్తవ్యదీక్ష పూనాల్సిన తరుణం. వ్యక్తులైనా, సంస్థలైనా మన బాధ్యతలే మన ప్రథమ ప్రాథమ్యాలుగా ఉండాలి” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ‘కర్తవ్య పథం’లో ముందడుగు వేస్తే దేశ ప్రగతి సమున్నత శిఖరాలకు చేరగలదని ఆయన నొక్కిచెప్పారు.

   రో వారంలో భారతదేశం జి20 కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రపంచంలో భారత పేరుప్రతిష్ఠలు ఇనుమడించేలా మనమంతా ఒక జట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇది మన సమష్టి కర్తవ్యం” అంటూ- “ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా భారతదేశానికిగల గుర్తింపు మరింత బలపేతం కావాలి” అని ఆకాంక్షించారు. యువతరం కేంద్రకంగాగల రాజ్యాంగ స్ఫూర్తిని ప్రస్తావిస్తూ దాని నిష్కాపట్యం, భవిష్యత్‌ దార్శనికత, ఆధునిక దృక్పథాలకు అది పేరెన్నికగన్నదని ప్రధాని వ్యాఖ్యానించారు. భారత ప్రగతి గాథలోని అన్ని అంశాలలో యువశక్తి పాత్ర, భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు. సమానత్వం, సాధికారత వంటి అంశాలపై మరింత మెరుగైన అవగాహన దిశగా భారత రాజ్యాంగంపై యువతరంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతయిననా ఉందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. మన రాజ్యాంగం రూపొందిన సమయం, ఆనాడు దేశం ముందున్న పరిస్థితులను ఆయన గుర్తుచేసుకున్నారు. “అప్పట్లో రాజ్యాంగ పరిషత్‌లో చర్చల వేళ జరిగిందేమిటో తెలియాలంటే ఈ అంశాలన్నిటిపైనా మన యువతకు అవగాహన ఉండాలి” అని ఆయన సూచించారు. తద్వారా రాజ్యాంగంపై వారికి ఆసక్తి పెరుగుతుందని ఆయన అన్నారు.

   భారత రాజ్యాంగ పరిషత్‌లో 15 మంది మహిళా సభ్యులు ఉండటాన్ని ప్రస్తావిస్తూ వెనుకబడిన వర్గాల నుంచి ఆ స్థాయికి చేరుకున్న దాక్షాయణి వేలాయుధన్ వంటి మహిళలను ఉదాహరణగా తీసుకోవాలన్నారు. దాక్షాయణి వేలాయుధన్ వంటి మహిళల రచనలపై చర్చ చాలా అరుదుగా జరుగుతుండటం విచారకరమన్నారు. దళితులు, కార్మికుల సంబంధిత అనేక అంశాలపై ఆమె చూపిన చొరవను చేశారని తెలియజేసారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్, హంసా మెహతా, రాజ్‌కుమారి అమృత్ కౌర్ తదితరులతోపాటు మహిళా సమస్యల పరిష్కారం తమవంతుగా గణనీయ కృషిచేసిన ఇతర మహిళా సభ్యుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. “మన యువతరం ఈ వాస్తవాలను తెలుసుకున్నప్పుడు, తమ సందేహాలకు సమాధానాలను వారు కనుగొనగలరు” అన్నారు. తద్వారా “మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని, దేశ భవిష్యత్తును బలోపేతం చేసేవిధంగా రాజ్యాంగంపై విధేయత పెరుగుతుంది” అని ప్రధాని అన్నారు. చివరగా- “స్వాతంత్ర్య అమృత మహోత్సవ సమయంలో దేశానికి ఈ స్ఫూర్తి ఎంతో అవసరం. ఈ దిశగా మన సంకల్పాలకు ప్రస్తుత రాజ్యాంగ దినోత్సవం మరింత శక్తినిస్తుందని ఆశిస్తున్నాను” అంటూ ఆయన తన ప్రసంగం ముగించారు.

   భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డి.వై.చంద్రచూడ్, కేంద్ర చట్ట-న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, సహాయమంత్రి ప్రొఫెసర్‌ ఎస్‌.బాఘెల్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, భారత అటార్నీ జనరల్ శ్రీ ఆర్.వెంకటరమణి, భారత సొలిసిటర్ జనరల్ శ్రీ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ వికాస్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

   న్యాయస్థానాలకు ‘ఐసీటీ’ సామర్థ్య కల్పనద్వారా కక్షిదారులు, న్యాయవాదులతోపాటు

న్యాయవ్యవస్థకూ మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపొందించబడింది. ఇందులో భాగమైన “వర్చువల్‌ జస్టిస్‌ క్లాక్‌, జస్టిస్‌ (JustIS) మొబైల్‌ యాప్‌ 2.0, డిజిటల్‌ కోర్ట్‌, ఎస్‌3వాస్‌ (S3WaaS) వెబ్‌సైట్లను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ మేరకు:

వర్చువల్ జస్టిస్ క్లాక్: ఇది న్యాయ సేవాప్రదాన వ్యవస్థకు సంబంధించి కోర్టు స్థాయిలో

రోజు/వారం/నెల ప్రాతిపదికన వివిధ కేసుల విచారణ స్వీకరణ, పరిష్కారం, పెండింగ్‌

వివరాలను వెల్లడించే వినూత్న విధానం. నిర్దిష్ట న్యాయస్థానం ద్వారా కేసుల పరిష్కార

స్థితిగతులను ప్రజలతో పంచుకోవడం ద్వారా కోర్టుల పనితీరును జవాబుదారీతనం,

పారదర్శకతతో కూడినవి రూపొందించడమే దీని లక్ష్యం. జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లోగల ఏ కోర్టు

పరిధిలోని కేసుల వివరాలనైనా ఈ ‘వర్చువల్ జస్టిస్ క్లాక్‌’ద్వారా ప్రజలు తెలుసుకోవచ్చు.

జస్టిస్‌ మొబైల్‌ అనువర్తనం 2.0: ఇది న్యాయాధికారులకు తమ కోర్టులోనే కాకుండా

తమ పరిధిలోగల న్యాయమూర్తులకు సంబంధించిన పరిష్కృత, పెండింగ్‌ కేసుల పర్యవేక్షణ

ద్వారా కోర్టుల సమర్థ నిర్వహణకు తోడ్పడే ఉపకరణం. హైకోర్టు, సుప్రీంకోర్టు

న్యాయమూర్తులకూ ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. దీని సాయంతో వారు ఇకపై తమ

అధికార పరిధిలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో పరిష్కృత, పెండింగ్‌ కేసులను పర్యవేక్షించగలరు.

డిజిటల్‌ కోర్ట్‌: ఇది కోర్టులను కాగితరహితం చేయడంలో భాగంగా కోర్టు రికార్డులను

డిజిటలీకరించి, న్యాయమూర్తికి అందుబాటులో ఉంచడానికి ఉద్దేశించిన విధానం.

ఎస్‌3వాస్‌ వెబ్‌సైట్లు: ఇది జిల్లా న్యాయవ్యవస్థ సంబంధిత నిర్దిష్ట సమాచారం, సేవల

ప్రచురణకు ఉద్దేశించిన వెబ్‌సైట్‌ల రూపకల్పన, నిర్దిష్టం చేయడం, అమలు, నిర్వహణలకు

ఉద్దేశించిన ఒక చట్రం.

ఎస్‌3వాస్‌ (S3WaaS) అనేది సురక్షిత, అందుబాటు, సౌలభ్యంతో కూడిన వెబ్‌సైట్‌ల రూపకల్పన దిశగా ప్రభుత్వ సంస్థల కోసం అభివృద్ధి చేయబడిన క్లౌడ్ సేవ. ఇది బహుభాషా సహితం, పౌర-దివ్యాంగహితమైనదిగా ఉంటుంది.

 

 

పీఐబీ భాండాగారం నుంచి: రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి ఉపన్యాసాలు:

2021

సుప్రీం కోర్టు నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగం ఆంగ్లంసహా వివిధ భాషల పాఠం

పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం ఆంగ్లంసహా వివిధ భాషల పాఠం

2020

అఖిలభారత నిర్వహణాధికారుల 80వ సమావేశం ముగింపు సభలో ప్రధానమంత్రి ప్రసంగం ఆంగ్లంసహా వివిధ భాషల పాఠం

2019

పార్లమెంటు సంయుక్త సమావేశంలో 70వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం ఆంగ్లంసహా వివిధ భాషల పాఠం

2017

జాతీయ న్యాయ దినోత్సవం2017లో ప్రధానమంత్రి ప్రసంగ ముఖ్యాంశాలు ఆంగ్లంసహా వివిధ భాషల పాఠం

******