1. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి గౌరవనీయురాలు షేక్ హసీనా, 2022 సెప్టెంబర్, 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు భారతదేశంలో పర్యటించారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి గౌరవనీయురాలు షేక్ హసీనా, తమ పర్యటనలో భాగంగా, భారత రాష్ట్రపతి శ్రీమతి దౌపది ముర్ము, భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీష్ ధంకర్ లతో సమావేశమయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డా. ఎస్. జైశంకర్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి కూడా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ని కలిశారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో అమరవీరులైన మరియు తీవ్రంగా గాయపడిన 200 మంది భారతీయ సాయుధ దళాల వారసుల కోసం “బంగా బంధు షేక్ ముజిబుర్ రెహమాన్ విద్యార్థి ఉపకార వేతనాలను అందజేసే కార్యక్రమంలో కూడా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పాల్గొన్నారు. 2022 సెప్టెంబర్, 7 వ తేదీన భారత, బంగ్లాదేశ్ వ్యాపార సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన వ్యాపార సదస్సు లో కూడా ఆమె ప్రసంగించారు.
2. ప్రధాన మంత్రులిద్దరూ 2022 సెప్టెంబర్, 6వ తేదీ న ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు, అనంతరం ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. ఈ సమావేశాలు అత్యంత ఆప్యాయత, సహృదయ వాతావరణంలో జరిగాయి. సార్వభౌమాధికారం, సమానత్వం, విశ్వాసం, అవగాహన పై ఆధారపడిన వ్యూహాత్మక, ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ప్రతిబింబించే, లోతైన చారిత్రక, సోదర సంబంధాలు, ప్రజాస్వామ్య భాగస్వామ్య విలువల ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాల అద్భుతమైన స్థితిపై ఇద్దరు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
3. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలు, జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జన్మ శతాబ్ది ఉత్సవాలు, భారత్-బంగ్లాదేశ్ మధ్య 50 సంవత్సరాల దౌత్య సంబంధాల స్థాపన వేడుకల్లో పాల్గొనేందుకు 2021 మార్చి లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనను, బంగ్లాదేశ్ విజయ దినోత్సవ స్వర్ణోత్సవాల్లో గౌరవ అతిథిగా పాల్గొనేందుకు 2021 డిసెంబర్ లో భారత రాష్ట్రపతి అధికారిక పర్యటనను ఇద్దరు నేతలు గుర్తు చేసుకున్నారు.
4. వివిధ రంగాలలో సహకార పురోగతిని సాధించడంలో సహాయపడిన ఉన్నత స్థాయి పరస్పర పర్యటనల పట్ల ఇద్దరు ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు దేశాల విదేశాంగ మంత్రుల నేతృత్వంలో, 2022 జూన్ నెలలో భారతదేశం లోని న్యూ ఢిల్లీలో విజయవంతంగా జరిగిన జాయింట్ కన్సల్టేటివ్ కమిషన్ ఏడవ సమావేశాన్ని కూడా ఇరుపక్షాలు గుర్తుచేసుకున్నాయి.
5. రాజకీయ, భద్రతా సహకారం, రక్షణ, సరిహద్దు నిర్వహణ, వాణిజ్యం, అనుసంధానం, నీటి వనరులు, విద్యుత్తు, శక్తి, అభివృద్ధి సహకారం, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలతో సహా మొత్తం ద్వైపాక్షిక సహకార సరళి పై ఇద్దరు ప్రధానులు చర్చలు జరిపారు. పర్యావరణం, వాతావరణ మార్పు, సైబర్ భద్రత, ఐ.సి.టి., స్పేస్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ వంటి నూతన సహకార రంగాల్లో సహకరించు కోవడానికి కూడా వారు అంగీకరించారు.
6. ప్రాంతీయ, అంతర్జాతీయ ఆసక్తికర అంశాలకు సంబంధించిన వివిధ అంశాలపై కూడా వారు మరింత క్షుణ్ణంగా చర్చించారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం, ప్రపంచ పరిణామాల కారణంగా సరఫరా వ్యవస్థ లో నెలకొన్న అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాంత శ్రేయస్సు, అభివృద్ధి కి స్నేహం మరియు భాగస్వామ్య స్ఫూర్తితో మరింత సహకారం అవసరమని ఇరువురు నాయకులు నొక్కి చెప్పారు.
7.ద్వైపాక్షిక,ఉపప్రాంతీయ రైలు, రహదారి మార్గాలతో పాటు ఇతర అనుసంధాన కార్యక్రమాలను అమలు చేయడం యొక్క ప్రాముఖ్యతను ఇద్దరు నాయకులు నొక్కిచెప్పారు. టోంగీ-అఖౌరా మార్గాన్ని రెండు గేజ్ లుగా మార్చడం, రైల్వే రోలింగ్ స్టాక్ సరఫరా, బంగ్లాదేశ్ రైల్వే సిబ్బందికి సామర్థ్య పెంపుదల, బంగ్లాదేశ్ రైల్వే మెరుగైన సేవల కోసం ఐటీ పరిష్కారాలను పంచుకోవడం వంటి అంశాలపై కొనసాగుతున్న ద్వైపాక్షిక కార్యక్రమాలను ఇరుపక్షాలు స్వాగతించాయి. కౌనియా-లాల్మోనిర్ హట్-మొగల్ ఘాట్-న్యూ గీతాల్ దహా లింకు ఏర్పాటు; హిలి-బీరంపూర్ మధ్య లింకు ఏర్పాటు, బెనాపోల్-జాషోర్ లైన్ లో ట్రాక్ ఏర్పాటు, సిగ్నలింగ్ వ్యవస్థలతో పాటు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, బురిమరి-చంగ్రబంధ మధ్య లింకు పునరుద్ధరణ, సిరాజ్ గంజ్ లో కంటైనర్ డిపో నిర్మాణం వంటి కొత్త కార్యక్రమాలను కూడా ఇరుపక్షాలు స్వాగతించాయి. ద్వైపాక్షిక అభివృద్ధి సహకారం కింద అనేక ఆర్థిక సాధనాల ద్వారా ఈ ప్రాజెక్టులకు నిధులను అన్వేషించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. గ్రాంటు పై 20 బ్రాడ్-గేజ్ డీజిల్ లోకోమోటివ్ లను అందించినందుకు భారతదేశ దాతృత్వాన్ని బంగ్లాదేశ్ స్వాగతించింది.
8. ఆసియాలో బంగ్లాదేశ్ కు భారతదేశం అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఉద్భవిస్తున్న నేపథ్యంలో, ద్వైపాక్షిక వాణిజ్యం లో వృద్ధిని ఇద్దరు నాయకులు ప్రశంసించారు. భారతదేశం నుండి బియ్యం, గోధుమలు, పంచదార, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వంటి నిత్యావసర ఆహార వస్తువులను సరఫరా చేయాలని, బంగ్లాదేశ్ అభ్యర్థించింది. భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న సరఫరా పరిస్థితుల ఆధారంగా బంగ్లాదేశ్ అభ్యర్థనలను సానుకూలంగా పరిగణించి, ఈ విషయంలో సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుందని భారతదేశం హామీ ఇచ్చింది.
9.భారత్బంగ్లాదేశ్ సరిహద్దుల శాంతియుత నిర్వహణ అనేది భాగస్వామ్య ప్రాధాన్యత అని గుర్తించిన ఇరువురు నాయకులు, ప్రశాంతమైన, నేర రహిత సరిహద్దును నిర్వహించే లక్ష్యంతో త్రిపుర సెక్టార్ తో ప్రారంభమయ్యే కంచె తో సహా, జీరో లైన్ కు 150 గజాలలోపు పెండింగ్‌లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తమ తమ అధికారులను ఆదేశించారు.
10. సరిహద్దు వెంబడి జరిగిన సంఘటనల కారణంగా సంభవించే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆ సంఖ్య ను సున్నా కి తగ్గించేందుకు కృషి చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ అక్రమ రవాణాతో పాటు మరియు ముఖ్యంగా మహిళలు, పిల్లల అక్రమ రవాణాను నిరోధించడానికి రెండు సరిహద్దు కాపలా దళాలు ముమ్మరం చర్యలను ఇరుపక్షాలు ప్రశంసించాయి. ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలు, వ్యక్తీకరణలలో నిర్మూలించడానికి తమ బలమైన నిబద్ధతను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. తమ భూభాగం తో పాటు, దేశం వెలుపల తీవ్రవాదం, ఉగ్రవాదం, విప్లవవాదం వ్యాప్తిని నిరోధించడానికి తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరువురు నాయకులు నిర్ణయించుకున్నారు.
11. భారత-బంగ్లాదేశ్ జాయింట్ రివర్స్ కమిషన్ (23-25 ఆగస్టు 2022, న్యూఢిల్లీ) 38వ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి సరిహద్దు నది కుషి యారా నుండి భారతదేశం మరియు బంగ్లాదేశ్ నీటిని వినియోగించుకోవడం కోసం, భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వ శాఖ మధ్య ఒక అవగాహనా ఒప్పందం పై సంతకాలు చేయడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. బంగ్లాదేశ్ కు నీటిపారుదల అవసరాలను తీర్చడంతో పాటు, దక్షిణ అస్సాంకు నీటి ప్రాజెక్టులను సులభతరం చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది.
12. త్రిపుర రాష్ట్ర సాగునీటి పారుదల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, ఫెని నదిపై మధ్యంతర నీటి భాగస్వామ్య ఒప్పందం పై త్వరగా సంతకం చేయాలని భారతదేశం అభ్యర్థించింది. భారతదేశ అభ్యర్థనను బంగ్లాదేశ్ పరిగణనలోకి తీసుకుంది. త్రిపురలోని సబ్ రూమ్ పట్టణానికి తాగునీటి సరఫరా కోసం ఫెని నది నుంచి 1.82 క్యూసెక్కుల నీటిని వినియోగించుకోవడానికి రెండు దేశాల మధ్య 2019 అవగాహనా ఒప్పందాన్ని అమలు చేయడానికి వీలుగా, భారతదేశం ఇన్-టేక్ వెల్ నిర్మించడానికి వీలు కల్పించినందుకు బంగ్లాదేశ్ కు భారతదేశం కృతజ్ఞతలు తెలిపింది.
13. ద్వైపాక్షిక సంబంధాలలో నీటి నిర్వహణ ప్రాముఖ్యతను గుర్తించిన ఇరువురు నాయకులు, సమాచార మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, మధ్యంతర నీటి భాగస్వామ్య ఒప్పందాల ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడం కోసం అదనపు సంఖ్యలో నదులను చేర్చడం ద్వారా సహకార ప్రాంతాన్ని విస్తృతం చేయడం కోసం ఉమ్మడి నదుల కమిషన్ నిర్ణయాన్ని అభినందించారు. 1966-గంగా జలాల భాగస్వామ్య ఒప్పందం లోని నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ కు అందిన నీటిని సరైన రీతిలో వినియోగించుకోవడానికి వీలుగా, ఒక అధ్యయనం చేసేందుకు సంయుక్త సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు.
14. మునుపటి చర్చలను గుర్తు చేసుకుంటూ, తీస్తా నదీ జలాల భాగస్వామ్యం పై, 2011 లో ఖారారైన మధ్యంతర ఒప్పందాన్ని ముగించాలని, బంగ్లాదేశ్ తరఫున సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనను బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా పునరుద్ఘాటించారు. నదులలో కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించడానికి, ఉమ్మడి నదులకు సంబంధించి నదీతీర పర్యావరణంతో పాటు, నదిలో రవాణా సామర్ధ్యాన్ని మెరుగుపరచడం వంటి సమస్యలను పరిష్కరించడానికి కలిసి పనిచేయాలని ఇరువురు నాయకులు అధికారులను ఆదేశించారు.
15.ఉపప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకునే స్ఫూర్తితో, రెండు దేశాల విద్యుత్ గ్రిడ్ లను సమకాలికంగా అనుసంధానించడానికి ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. బంగ్లాదేశ్‌లోని పర్బతిపూర్ ద్వారా కతిహార్ (బీహార్) నుండి బోర్ నగర్ (అస్సాం) వరకు ప్రతిపాదిత అధిక సామర్థ్యం గల 765 కె.వి. ట్రాన్స్మిషన్ లైన్ తో సహా, ప్రత్యేక ప్రయోజన వాహనం కోసం తగిన నిర్మాణాత్మకమైన భారత-బంగ్లాదేశ్ జాయింట్ వెంచర్ ద్వారా తయారుచేవలసిఉంది. విద్యుత్ రంగంలో ఉప ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు అంగీకరించారు. నేపాల్ మరియు భూటాన్ నుండి భారతదేశం ద్వారా విద్యుత్ దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ అభ్యర్థించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే తమ దేశంలో అమలులో ఉన్నాయని భారతదేశం తెలియజేసింది.
16.బంగ్లాదేశ్ ఇంధన డిమాండ్లను పరిష్కరించేందుకు దోహదపడే భారత్-బంగ్లాదేశ్ సాధించిన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ప్రాజెక్టు ను త్వరితగతిన పూర్తి చేస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్రోలియం ఉత్పత్తుల కోసం దేశీయ అవసరాలను తీర్చడంలో సహాయం చేయవలసిందిగా బంగ్లాదేశ్ కూడా భారతదేశాన్ని అభ్యర్థించింది. ఇరు పక్షాల అధీకృత ఏజెన్సీల మధ్య చర్చలను సులభతరం చేసేందుకు భారతదేశం అంగీకరించింది. అస్సాం మరియు మేఘాలయలో వినాశకరమైన వరదల కారణంగా సంభవించిన అంతరాయాల నేపథ్యంలో, అస్సాం నుండి బంగ్లాదేశ్ మీదుగా త్రిపురకు పెట్రోలియం, చమురు, లూబ్రికెంట్ల రవాణాను అనుమతించడంలో బంగ్లాదేశ్ సకాలంలో అందజేసిన మద్దతును భారతదేశం ప్రశంసించింది. బంగ్లాదేశ్ కు శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా కోసం నమోదైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐ.ఓ.సి.ఎల్.) ని జి.2జి. సరఫరాదారుగా చేర్చుకోవాలనే బంగ్లాదేశ్ నిర్ణయాన్ని కూడా భారతదేశం స్వాగతించింది.
17. అభివృద్ధి భాగస్వామ్యంలో ఇరుపక్షాల మధ్య బలమైన సహకారంపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశం అభివృద్ధి నిధులు పంపిణీ చేసిన సామర్థ్యాన్ని బంగ్లాదేశ్ ప్రశంసించింది. గత ఆర్థిక సంవత్సరంలో నిధుల పంపిణీ పరంగా, భారతదేశం అగ్ర అభివృద్ధి భాగస్వామిగా అవతరించింది.
18. ఛటోగ్రామ్ మరియు మోంగ్లా పోర్ట్స్ (ఏ.సి.ఎం.పి) వినియోగంపై ఒప్పందం కింద ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తి కావడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. వీలైనంత త్వరగా దాని పూర్తి కార్యాచరణ కోసం వారు ఎదురు చూస్తున్నారు. మూడవ దేశం ఎక్సిమ్ కార్గో ను చేర్చడానికి వీలుగా 2015 నాటి ద్వైపాక్షిక కోస్టల్ షిప్పింగ్ ఒప్పందాన్ని విస్తరించడానికి కృషి చేయమని భారతదేశం తన అభ్యర్థనను పునరుద్ఘాటించింది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష షిప్పింగ్ లింకులను త్వరితగతిన అన్వేషించడానికి కూడా ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇన్ ల్యాండ్ వాటర్ ట్రాన్సిట్ అండ్ ట్రేడ్ (పి.ఐ.డబ్ల్యూ.టి.టి) రూట్లలో 5 & 6 (ధులియన్ నుండి రాజ్షాహి వరకు – అరిచా వరకు పొడిగింపు) మరియు 9 & 10 (దౌద్కండి నుండి సోనామురా వరకు) ప్రోటోకాల్ కింద నదీ జలాల సేవలను ప్రారంభించాలనే నిర్ణయాన్ని అమలు చేయడానికి కూడా వారు అంగీకరించారు. త్రిపురను బంగ్లాదేశ్ తో కలుపుతూ ఫెని నదిపై మైత్రి వంతెన నిర్వహణ కోసం మిగిలిన మౌలిక సదుపాయాలు, ఇమ్మిగ్రేషన్ తో పాటు, కస్టమ్స్ సౌకర్యాలను త్వరగా పూర్తి చేయాలని భారతదేశం బంగ్లాదేశ్‌ను అభ్యర్థించింది.
19. బి.బి.ఐ.ఎన్. మోటార్ వెహికల్ అగ్రిమెంట్ యొక్క ముందస్తు కార్యాచరణ ద్వారా ద్వైపాక్షిక, ఉప-ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రయత్నాలను వేగవంతం చేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. పశ్చిమ బెంగాల్ లోని హిలి నుండి బంగ్లాదేశ్ మీదుగా మేఘాలయలోని మహేంద్రగంజ్ వరకు హైవే తో సహా కొత్త ఉప-ప్రాంతీయ కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించడానికి భారతదేశం సహకారం కోసం బంగ్లాదేశ్ ను అభ్యర్థించింది. ఇందుకోసం ఒక వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని ప్రతిపాదించడం జరిగింది. అదే స్ఫూర్తితో, భారత్ – మయన్మార్ – థాయ్‌లాండ్ త్రైపాక్షిక హైవే ప్రాజెక్టు కోసం కొనసాగుతున్న కృషి లో భాగస్వామి కావడానికి బంగ్లాదేశ్ తన ఆసక్తిని పునరుద్ఘాటించింది.
20. నిర్దేశిత ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు / విమానాశ్రయాలు / ఓడరేవుల ద్వారా మూడో దేశానికి తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు బంగ్లాదేశ్ కు తమ భూభాగం ద్వారా ఉచిత రవాణాను అందించినట్లు భారతదేశం తెలియజేసింది. తన ఉత్పత్తులను నేపాల్ మరియు భూటాన్ లకు ఎగుమతి చేయడానికి బంగ్లాదేశ్ కు ఉచిత రవాణాను కూడా భారదేశం అందిస్తోంది. కొత్తగా ప్రారంభించబడిన చిలహతి – హల్దీబారి మార్గం ద్వారా భూటాన్ తో రైలు కనెక్టివిటీ కావాలని కూడా, బంగ్లాదేశ్ అభ్యర్థించింది. అభ్యర్థనను దాని సాధ్యాసాధ్యాల ఆధారంగా పరిగణించేందుకు భారతదేశం అంగీకరించింది. దీనితో పాటు, ఇతర క్రాస్ బోర్డర్ రైలు లింకులను ఆచరణీయంగా చేయడానికి, చిలహతి – హల్దిబారి క్రాసింగ్ లో ఇతర ప్రాంతాల మధ్య ఓడరేవు పరిమితులను తొలగించాలని బంగ్లాదేశ్ ను భారతదేశం అభ్యర్థించింది.
21. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సి.ఈ.పి.ఏ) రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని సిఫార్సు చేసిన ఉమ్మడి సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని ఇటీవల ఖరారు చేయడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. 2022 క్యాలెండర్ సంవత్సరంలో చర్చలు ప్రారంభించాలని, ఎల్.డి.సి. హోదా నుంచి బంగ్లాదేశ్ చివరి గ్రాడ్యుయేషన్ కోసం వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేయాలని ఇరు దేశాల వాణిజ్య అధికారులను వారు ఆదేశించారు.
22. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడం యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ, ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు / ల్యాండ్ పోర్ట్ లలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల ఆధునీకరణతో పాటు, గుర్తించబడిన ల్యాండ్ కస్టమ్ స్టేషన్ల వద్ద ఓడరేవు పరిమితులు, ఇతర నాన్-టారిఫ్ అడ్డంకులను తొలగించవలసిన తక్షణ అవసరాన్ని ఇరువురు నాయకులు నొక్కి చెప్పారు. ఐ.సి.పి. అగర్తల-అఖౌరా తో ప్రారంభించి, సులభంగా మార్కెట్ అందుబాటులో ఉండడం కోసం, ఈశాన్య భారత రాష్ట్రాల సరిహద్దుల్లో, పోర్ట్ పరిమితులు లేదా ప్రతికూల పరిమితుల జాబితా లేకుండా కనీసం ఒక ప్రధాన ల్యాండ్ పోర్ట్ కోసం భారతదేశం తన అభ్యర్థనను పునరుద్ఘాటించింది. పెట్రాపోల్-బెనాపోల్ ఐ.సి.పి. వద్ద రెండవ సరుకు రవాణా గేట్ అభివృద్ధికి నిధులు సమకూర్చే భారతదేశ ప్రతిపాదనపై సాధించిన పురోగతిని ఇరువురు నాయకులు స్వాగతించారు. ఆ పనులు త్వరగా పూర్తి చేయాలని వారు అధికారులను ఆదేశించారు.
23. ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడం పట్ల కూడా ఇద్దరు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండే రక్షణ కోసం లైన్-ఆఫ్-క్రెడిట్ కింద ప్రాజెక్టులను త్వరగా ఖరారు చేసేందుకు కూడా వారు అంగీకరించారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ సాయుధ దళాల కోసం వాహనాల ప్రారంభ సేకరణ ప్రణాళికలను ఖరారు చేయడాన్ని భారతదేశం స్వాగతించింది. తద్వారా, ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను పెంపొందించుకోవాలని భారతదేశం ఎదురుచూస్తోంది. మరింత సముద్ర భద్రత కోసం, తీరప్రాంత రాడార్ వ్యవస్థను అందించడానికి, 2019-అవగాహన ఒప్పందాన్ని సాధ్యమైనంత తొందరగా అమలు చేయాలన్న తన అభ్యర్థనను భారతదేశం పునరుద్ఘాటించింది.
24. కోవిడ్-19 మహమ్మారి సమయంలో బంగ్లాదేశ్ కు వ్యాక్సిన్ మైత్రి, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సహా, భారతదేశానికి బంగ్లాదేశ్ ఔషధాలను బహుమతిగా ఇవ్వడం ద్వారా, రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారాన్ని ఇరువురు నాయకులు స్వాగతిస్తూ, ప్రజల మధ్య సంబంధాలను మరింత గా పెంచుకోవాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు నొక్కి చెప్పారు. రైలు, రోడ్డు, వాయు, నీటి సంబంధిత కనెక్టివిటీ పునరుద్ధరణపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో, తమ దేశం వైపు చాలా రహదారి మరియు రైలు మార్గాలలో ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్‌లలో సౌకర్యాలను భారతదేశం తిరిగి ప్రారంభించడాన్ని బంగ్లాదేశ్ స్వాగతించింది. అదేవిధంగా, సాధ్యమైనంత తొందరలో కదలికను సులభతరం చేయడానికి అన్ని ల్యాండ్ పోర్టులు / ఐ.సి.పి. ల వద్ద ఇమ్మిగ్రేషన్ సౌకర్యాలను కోవిడ్ ముందు ఉన్న స్థాయికి పునరుద్ధరించాలని కూడా బంగ్లాదేశ్ అభ్యర్థించింది. భారత-బంగ్లాదేశ్ మధ్య మూడవ ప్రయాణీకుల రైలు – మిథాలీ ఎక్స్ ప్రెస్ యొక్క సాధారణ సేవలను 2022 జూన్ నెల నుంచి ప్రారంభించడాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు.
25. బంగబంధు (ముజీబ్: ది-మేకింగ్-ఆనేషన్)పై సంయుక్తంగా నిర్మించిన చిత్రం ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నట్టు ఇద్దరు నాయకులు తెలిపారు. బంగ్లాదేశ్ లోని ముజీబ్ నగర్ నుండి పశ్చిమ బెంగాల్ లోని నాడియా లోని భారత-బంగ్లాదేశ్ సరిహద్దు వరకు ఉన్న చారిత్రాత్మక రహదారి “షాధినోటా షోరోక్” నిర్వహణతో పాటు, 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం పై డాక్యుమెంటరీ ని రూపొందించడం వంటి ఇతర కార్యక్రమాలను కూడా వారు అంగీకరించారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం పై అరుదైన వీడియో చిత్రాన్ని సంయుక్తంగా సంకలనం చేయాలని బాంగ్లాదేశ్ ప్రతిపాదించింది. భారతదేశం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బంగా బంధు పీఠాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, బంగ్లాదేశ్ పేర్కొంది.
26. రెండు దేశాల మధ్య ఆవిష్కరణలో భాగస్వామ్యాన్ని ఉత్తేజపరిచే బంగ్లాదేశ్ నుంచి అంకుర సంస్థల ప్రతినిధి బృందం యొక్క మొదటి పర్యటన కోసం ఎదురు చూస్తున్నట్లు ఇద్దరు నాయకులు పేర్కొన్నారు. రాబోయే నెలల్లో యువజన బృందాల మార్పిడిని పునః ప్రారంభించడం పై ఇరుపక్షాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. భారత దేశంలోని వైద్య సదుపాయాలతో బంగ్లాదేశ్ కు చెందిన స్వాతంత్య్ర సమర యోధులకు వైద్య చికిత్స అందించడానికి భారతదేశం చూపిస్తున్న చొరవకు బంగ్లాదేశ్ ప్రశంసల వర్షం కురిపించింది.
27. జె.డబ్ల్యూ.జి. ని వీలైనంత త్వరగా సమావేశపరచడం ద్వారా, ‘సుందర్బన్స్ పరిరక్షణ’ పై 2011 అవగాహన ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఇరువురు నాయకులు నొక్కి చెప్పారు. తద్వారా ఈ మైదాన అటవీ పర్యావరణ వ్యవస్థతో పాటు ఈ పర్యావరణ వ్యవస్థ పై ఆధారపడిన ప్రజలు స్థిరంగా జీవించే అవకాశం ఉంటుంది.
28. నూతన మరియు అభివృద్ధి చెందుతున్న సహకార రంగాల సంభావ్యతను ఉపయోగించుకోవాల్సిన ప్రాముఖ్యతను ఇరుపక్షాలు గుర్తించాయి . బాహ్య అంతరిక్షాన్ని శాంతియుతంగా ఉపయోగించడం, గ్రీన్ ఎనర్జీ, అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడం, ఆర్థిక, ఆరోగ్య, విద్యారంగాల్లో సాంకేతికతతో కూడిన సేవలను శాంతియుతంగా ఉపయోగించడంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరుదేశాల అధికారులను ఆదేశించడం జరిగింది.
29. ప్రాంతీయ పరిస్థితికి సంబంధించి, మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రం నుండి బలవంతంగా నిర్వాసితులైన ఒక మిలియన్ మందికి పైగా ప్రజలకు ఆశ్రయంతో పాటు, మానవతా సహాయం అందించడం లో బంగ్లాదేశ్ దాతృత్వాన్ని భారతదేశం ప్రశంసించింది. బలవంతంగా స్థాన భ్రంశం చెందిన ఈ ప్రజలను వారి స్వదేశానికి సురక్షితమైన, స్థిరమైన, త్వరితగతిన తిరిగి చేరవేసే ప్రయత్నంలో భాగంగా, రెండింటికీ పొరుగు దేశం గా ఉన్న ఏకైక దేశమైన మయన్మార్ తో పాటు, బంగ్లాదేశ్ కి కూడా మద్దతు ఇవ్వడానికి భారతదేశం తన నిరంతర నిబద్ధతను నొక్కి చెప్పింది.
30. ప్రాంతీయ సంస్థల ద్వారా బలోపేతమైన ప్రాంతీయ సహకారం కోసం పని చేయవలసిన అవసరాన్ని ఇరుపక్షాలు నొక్కి చెప్పాయి. బిమ్-స్టెక్ సచివాలయానికి ఆతిథ్యమివ్వడంలో, దాని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో బంగ్లాదేశ్ సహకారాన్ని భారతదేశం ప్రశంసించింది. ఇండియన్-ఓషన్-రిమ్-అసోసియేషన్ (ఐ.ఓ.ఆర్.ఏ) అధ్యక్ష హోదాలో ఉన్న బంగ్లాదేశ్ కు, భారతదేశం తన పూర్తి మద్దతును పునరుద్ఘాటించింది.
31. ఈ పర్యటన సందర్భంగా ఈ క్రింది అవగాహన ఒప్పందాలు, ఒడంబడికల పై సంతకాలు చేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది.
ఏ) భారత, బంగ్లాదేశ్ ఉమ్మడి సరిహద్దు లోని కుషి యారా నది నీటిని వినియోగించుకోవడంపై భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ, బంగ్లాదేశ్ నీటి వనరుల మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం;
బి) బంగ్లాదేశ్ రైల్వే సిబ్బందికి భారతదేశంలో శిక్షణపై భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం;
సి) బంగ్లాదేశ్ రైల్వే కోసం ఎఫ్.ఓ.ఐ.ఎస్., ఇతర ఐ.టి. అప్లికేషన్లు వంటి ఐ.టి. వ్యవస్థలలో సహకారం పై భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం;
డి) శాస్త్ర, సాంకేతిక సహకారం పై భారతదేశానికి చెందిన కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సి.ఎస్.ఐ.ఆర్) మరియు బంగ్లాదేశ్ కు చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (బి.సి.ఎస్.ఐ.ఆర్), మధ్య అవగాహన ఒప్పందం;
ఇ) స్పేస్ టెక్నాలజీ రంగాల్లో సహకారం పై న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మరియు బంగ్లాదేశ్ శాటిలైట్ కంపెనీ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం;
ఎఫ్) ప్రసారంలో సహకారంపై ప్రసార భారతి మరియు బంగ్లాదేశ్ టెలివిజన్ (బి.టి.వి) మధ్య అవగాహన ఒప్పందం;
జి) బంగ్లాదేశ్ జ్యుడీషియల్ అధికారులకు భారతదేశంలో శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమంపై భారతదేశం లోని జాతీయ జ్యుడీషియల్ అకాడమీ మరియు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మధ్య అవగాహన ఒప్పందం.
32. సందర్శన సందర్భంగా ఈ క్రింది అంశాలను ఆవిష్కరించారు / ప్రకటించారు / విడుదల చేశారు:
ఎ) బంగ్లాదేశ్ లోని రాంపాల్ లోని మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క యూనిట్-1 ఆవిష్కరణ;
బి) రూప్షా రైల్వే వంతెన ప్రారంభోత్సవం;
సి) ఖుల్నా – దర్శన రైల్వే లైన్ మరియు పర్బోతిపూర్ – కౌనియా రైల్వే లైన్ కోసం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఒప్పందాలపై సంతకం చేసినట్లు ప్రకటన;
డి) బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ ‘మార్చి, 7వ తేదీన చేసిన చారిత్రాత్మక ప్రసంగం’ యొక్క అనువాదాన్ని 23 భారతీయ భాషలతో పాటు ఇతర దక్షిణాసియా దేశాలలోని 5 భాషలలో ప్రచురించిన పుస్తకాన్ని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా బహూకరించడం;
ఇ) బంగ్లాదేశ్ రైల్వేకు గ్రాంట్ ప్రాతిపదికన 20 బ్రాడ్ గేజ్ లోకోమోటివ్ ల ఆఫర్ కు సంబంధించిన ప్రకటన.
ఎఫ్) బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందిన రోడ్డు మరియు హైవేస్ విభాగానికి రహదారి నిర్మాణ సామగ్రి, యంత్రాల సరఫరాకు సంబంధించిన ప్రకటన.
33. భారత ప్రభుత్వం, భారత ప్రజల ఆప్యాయత, ఉదారమైన ఆతిథ్యానికి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్ ను సందర్శించాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా, భారత ప్రధానమంత్రి మోదీ కి హృదయపూర్వక ఆహ్వానం పలికారు. అన్ని స్థాయిలు మరియు వేదికలలో పరస్పర చర్చలు కొనసాగించాలని ఇరువురు నాయకులు ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు.
*****