Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

11వ ఖేల్ మ‌హాకుంభ్ ప్రారంభిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌ ప్ర‌ధాన‌మంత్రి

11వ ఖేల్ మ‌హాకుంభ్ ప్రారంభిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌ ప్ర‌ధాన‌మంత్రి


అహ్మ‌దాబాద్  లో 11వ ఖేల్ మ‌హాకుంభ్  ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్ ఆచార్య దేవ‌వ్ర‌త్‌, ముఖ్య‌మంత్రి శ్రీ భూపేంద్ర‌భాయ్ ప‌టేల్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

స్టేడియంలో పొంగిపొర‌లుతున్న యువ స‌ముద్ర శ‌క్తి, వారిలోని ఉత్సాహం గురించి ప్ర‌స్తావిస్తూ ఇది క్రీడా మ‌హాకుంభ్ మాత్ర‌మే కాదు, యువ‌శ‌క్తి మ‌హాకుంభ్ అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగానికి ముందు భారీ వేడుక జ‌రిగింది.

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త రెండేళ్లుగా మ‌హాకుంభ్ జ‌ర‌గ‌లేద‌ని, కాని ఈ అద్భుత‌మైన వేడుక క్రీడాకారుల్లో కొత్త విశ్వాసం, శ‌క్తి అందించింద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. “12 సంవ‌త్స‌రాల క్రితం నేను నాటిన విత్త‌నం మొల‌కెత్తి ఈ రోజు ఒక మ‌హావృక్షంగా మారింది” అని అప్ప‌టి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా తాను తీసుకున్న చ‌ర్య‌ను ఆయ‌న గుర్తు చేశారు. అప్ప‌టి ముఖ్య‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ విజ‌న‌రీ నాయ‌క‌త్వంలో ఈ క్రీడా మ‌హాకుంభ్ 2010లో 16 క్రీడ‌లు, 13 ల‌క్ష‌ల మంది వీక్ష‌కుల‌తో ప్రారంభ‌మ‌యింది. ఇప్పుడు ఈ 11వ‌ ఖేల్ మ‌హాకుంభ్ 36 క్రీడ‌లు, 26 పారా క్రీడ‌లు, 45 ల‌క్ష‌ల మంది వీక్ష‌కుల మైలురాయిని చేరింది.

గ‌తంలో భార‌తీయ క్రీడా రంగం కొన్ని క్రీడ‌ల‌కే ప‌రిమితం అయ్యేది, దేశీయ క్రీడ‌ల‌ను నిర్ల‌క్ష్యం చేసే వారు అని శ్రీ మోదీ చెప్పారు. క్రీడ‌ల‌కు కూడా ఆశ్రిత  ప‌క్ష‌పాతం అనే వ్యాధి సోకిందంటూ “క్రీడాకారుల ఎంపిక‌లో పార‌ద‌ర్శ‌క‌త లేక‌పోవ‌డం పెద్ద స‌మ‌స్య‌. క్రీడాకారుల శ‌క్తి అంతా స‌మ‌స్య‌ల‌పై పోరాటానికే స‌రిపోయేది. ఆ విష‌వ‌లయం నుంచి బ‌య‌ట‌ప‌డి ఇప్పుడు క్రీడాకారులు ఆకాశానికి వార‌ధి క‌డుతున్నారు. బంగారం, వెండి ప‌త‌కాలు దేశ విశ్వాసానికి మెరుగులు దిద్దుతున్నాయి” అని ప్ర‌ధాన‌మంత్రి వ్యాఖ్యానించారు. నేడు భార‌త‌దేశం టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ వంటి అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో రికార్డు సంఖ్య‌లో ప‌త‌కాలు తెస్తున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. దేశ యువ‌తపై త‌న‌కు సంపూర్ణ విశ్వాసం ఉన్న‌ద‌ని ఆయ‌న అన్నారు. “టోక్యో ఒలింపిక్స్ లో తొలిసారిగా భార‌త‌దేశం 7 ప‌త‌కాలు సాధించింది. అదే త‌ర‌హా రికార్డును పారాలింపిక్స్ లో కూడా భ‌ర‌త‌మాత్ర పుత్రులు, పుత్రిక‌లు సాధించారు. ఈ అంత‌ర్జాతీయ పోటీల్లో 19 ప‌త‌కాలు సాధించారు. ఇది ఒక ప్రారంభం మాత్ర‌మే. భార‌త‌దేశం ఎన్న‌టికీ ఆగ‌దు లేదా అల‌సిపోదు” అని శ్రీ మోదీ నొక్కి చెప్పారు.

ఉక్రెయిన్ నుంచి తిరిగి వ‌చ్చిన విద్యార్థులు పెరుగుతున్న త్రివ‌ర్ణ ప‌తాక ప్ర‌భావానికి చిహ్న‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఈ క్రీడా ప్రాంగ‌ణంలో కూడా అదే త‌ర‌హా గ‌ర్వం, దేశ‌భ‌క్తి క‌నిపిస్తున్నాయ‌ని చెప్పారు. వివిధ రంగాల్లో యువ‌నాయ‌క‌త్వం ప్రాధాన్యాన్ని కూడా ఆయ‌న గ‌ట్టిగా ప్ర‌స్తావించారు. “నేడు స్థానికం కోసం నినాదం స‌హా స్టార్ట‌ప్ ఇండియా నుంచి స్టాండ‌ప్ ఇండియా వ‌ర‌కు, మేక్ ఇన్ ఇండియా నుంచి స్వ‌యం స‌మృద్ధ భార‌త్ వ‌ర‌కు అన్ని ర‌కాల ప్ర‌చార బాధ్య‌త‌లు యువ‌త త‌మ భుజ‌స్కంధాల పైనే వేసుకున్నారు. మ‌న యువ‌త భార‌త‌దేశం సామ‌ర్థ్యాన్ని సుస్థిరం చేశారు” అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

జీవితంలో షార్ట్ క‌ట్ లు ఎప్పుడూ తీసుకోవ‌ద్ద‌ని ప్ర‌ధాన‌మంత్రి యువ‌త‌కు స‌ల‌హా ఇచ్చారు. ఇలాంటి షార్ట్ క‌ట్ ల మ‌నుగ‌డ‌ ఎప్పుడూ స్వ‌ల్పంగానే ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. “విజ‌య మంత్రం ఒక్క‌టే – దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌, నిరంత‌ర క‌ట్టుబాటు,. ఏ విజ‌యం లేదా ప‌రాజ‌యం కూడా ఎప్ప‌టికీ మ‌న తుది గ‌మ్యం కాకూడ‌దు” అని ఆయ‌న ఉద్బోధించారు.

క్రీడ‌ల్లో విజ‌యం అనేది ఎప్పుడూ ప‌రిపూర్ణంగానే ఉండాలి, దేశంలో క్రీడ‌ల ప్రోత్సాహానికి భార‌త‌దేశం సంపూర్ణ దృక్ప‌థం అనుస‌రిస్తోంది అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఖేలో ఇండియా కార్య‌క్ర‌మం అలాంటి ఆలోచ‌న‌కు చ‌క్క‌ని  ఉదాహ‌ర‌ణ అని కూడా ఆయ‌న చెప్పారు. “దేశంలోని ప్ర‌తిభ‌ను గుర్తించి వారికి అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు ఇవ్వ‌డం మేం ప్రారంభించాం. ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ స‌రైన శిక్ష‌ణ లేని కార‌ణంగా మ‌న యువ‌త వెనుక‌బ‌డిపోయే వారు. నేడు క్రీడాకారుల‌కు మెరుగైన శిక్ష‌ణ వ‌స‌తులు అందిస్తున్నాం” అని ఆయ‌న తెలిపారు. గ‌త 7-8 సంవ‌త్స‌రాల కాలంలో క్రీడా బ‌డ్జెట్ 70 శాతం పెరిగింద‌ని, క్రీడాకారుల‌కు, కోచ్ ల‌కు కూడా ప్రోత్సాహం, ప్రోత్సాహ‌కాలు గ‌ణ‌నీయంగా పెరిగాయి అని ఆయ‌న చెప్పారు. క్రీడ‌ల‌ను ఒక లాభ‌సాటి ఉపాధిగా మార్చుకోవ‌డంలో సాధించిన పురోగ‌తి గురించి ప్ర‌స్తావించారు. కోచింగ్‌, మేనేజ్ మెంట్‌, శిక్ష‌కులు, డైటీషియ‌న్లు, క్రీడా ర‌చ‌న‌లు వంటి ఎన్నో రంగాల నుంచి త‌మ‌కు ఇష్ట‌మైన రంగాన్ని యువ‌త ఎంచుకోవ‌చ్చున‌ని ఆయ‌న అన్నారు. మ‌ణిపూర్‌, మీర‌ట్ ల‌లో క్రీడా విశ్వ‌విద్యాల‌యాలు ఏర్పాట‌య్యాయి, ప‌లు సంస్థ‌ల్లో క్రీడా కోర్సులు కూడా వ‌స్తున్నాయ‌ని చెప్పారు. మ‌న‌కి ఉన్న విస్తార‌మైన కోస్తా దృష్ట్యా బీచ్ క్రీడ‌లు, జ‌ల క్రీడ‌ల‌పై కూడా ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల‌ని ఆయ‌న సూచించారు. సంతానంలో క్రీడాస‌క్తికి ప్రోత్సాహం అందించాల‌ని త‌ల్లిదండ్రుల‌ను కోరారు.

ఖేల్ మ‌హాకుంభ్ గుజ‌రాత్ లోని క్రీడా వాతావ‌ర‌ణాన్ని విప్ల‌వాత్మ‌కం చేసింది. వ‌య‌సుతో నిమిత్తం లేకుండా రాష్ట్రం మొత్తం నుంచి ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చి నెల రోజుల పాటు జ‌రిగే ఈ క్రీడ‌ల్లో పోటీ ప‌డుతున్నారు.  సాంప్ర‌దాయిక క్రీడ‌లైన క‌బ‌డ్డీ, ఖోఖో, ట‌గ్ ఆఫ్ వార్‌, యోగాస‌న‌, మ‌ల్ల‌ఖంభ్ తో పాటు ఆధునిక క్రీడ‌లైన ఆర్టిస్టిక్ స్కేటింగ్‌, టెన్నిస్‌, ఫెన్సింగ్ వంటి క్రీడ‌ల‌కు ఇది వేదిక‌గా ఉంది. గ్రామీణ స్థాయిలో ప‌చ్చి ప్ర‌తిభను గుర్తించ‌డంలో ఇది కీల‌క పాత్ర పోషిస్తోంది. గుజ‌రాత్ లో పారా క్రీడ‌ల‌కు కూడా ప్రోత్సాహం అందిస్తోంది.

***